ఎఫెసీయులకు 5:6-17
ఎఫెసీయులకు 5:6-17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వ్యర్థమైన మాటలతో ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, ఎందుకంటే వీటిని బట్టి అవిధేయులైనవారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది. గనుక అలాంటి వారితో మీరు భాగస్వాములుగా ఉండకండి. ఒకప్పుడు మీరు చీకటియై యున్నారు, కానీ ఇప్పుడు ప్రభువులో మీరు వెలుగై యున్నారు. కనుక వెలుగు బిడ్డలుగా జీవించండి, ఎందుకంటే వెలుగు ఫలం సమస్త మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని కలిగివుంటుంది. కనుక ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి. నిష్ఫలమైన చీకటి క్రియల్లో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి. అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానమే. కాని వెలుగుచేత చూపించబడే ప్రతీది స్పష్టంగా ఉంటుంది, ప్రకాశించే ప్రతీది వెలుగు అవుతుంది. అందుకే వాక్యంలో, “నిద్రిస్తున్నవాడా, మేల్కో, మృతులలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తారు,” అని వ్రాయబడింది. చాలా జాగ్రత్తగా ఉండండి, అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల్లా జీవించండి. దినాలు చెడ్డవి గనుక ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కాబట్టి మీరు అవివేకులుగా ఉండకండి, అయితే ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి.
ఎఫెసీయులకు 5:6-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి వారికి దూరంగా ఉండండి. గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి. ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం. కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ, పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి. ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం. ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా? బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, నిద్రిస్తున్న నువ్వు మేలుకో. చనిపోయిన వారిలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది. బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి. సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి. అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.
ఎఫెసీయులకు 5:6-17 పవిత్ర బైబిల్ (TERV)
వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్నవాళ్ళను గురించి అందరికీ చెప్పండి. అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం. వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది. వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయబడింది: “నిద్రిస్తున్న ఓ మనిషీ, మేలుకో! బ్రతికి లేచిరా! క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.” మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లాకాక, బుద్ధిగలవారిలా జీవించండి. ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి.
ఎఫెసీయులకు 5:6-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి. మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి నిష్ఫలమైన అంధకారక్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులనుగూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా అందుచేత –నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు. దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.
ఎఫెసీయులకు 5:6-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
వ్యర్థమైన మాటలతో ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, ఎందుకంటే వీటిని బట్టి అవిధేయులైనవారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి అలాంటి వారితో మీరు భాగస్వాములుగా ఉండకండి. ఒకప్పుడు మీరు చీకటియై ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభువులో మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు బిడ్డలుగా జీవించండి, ఎందుకంటే వెలుగు ఫలం సమస్త మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి. నిష్ఫలమైన చీకటి క్రియలలో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి. అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానమే. కాని వెలుగుచేత చూపించబడే ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది, ప్రకాశించే ప్రతిదీ వెలుగు అవుతుంది. అందుకే వాక్యంలో, “నిద్రిస్తున్నవాడా, మేల్కో, మృతులలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తారు” అని వ్రాయబడింది. చాలా జాగ్రత్తగా ఉండండి, అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల్లా జీవించండి. దినాలు చెడ్డవి కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కాబట్టి మీరు అవివేకులుగా ఉండకండి, అయితే ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి.