ఎఫెసీయులకు 4:17-27

ఎఫెసీయులకు 4:17-27 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

కాబట్టి మీరు, ఇకమీదట దేవుని భయంలేని యూదేతరులు నడుచుకొనునట్లు వ్యర్థమైన ఆలోచనలతో నడుచుకొనకూడదని ప్రభువు ఇచ్చిన అధికారంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. వారు తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి తమలో ఉన్న అజ్ఞానం కారణంగా దేవుని నుండి వచ్చే జీవం నుండి వేరుపరచబడి గ్రహించుటలో గ్రుడ్డివారిగా ఉన్నారు. వారు సిగ్గును వదిలి అత్యాశతో నానా విధాలైన అపవిత్ర కార్యాలను జరిగిస్తూ, తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు. అయితే మీరు క్రీస్తు గురించి విన్నప్పుడు యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా ఆయనలో బోధించబడినప్పుడు మీరు నేర్చుకున్న జీవన విధానం ఇది కాదు. మీ పాత స్వభావాన్ని, మీకు బోధించబడిన ప్రకారం, మీ ఆలోచనా వైఖరి నూతనపరచబడటానికి, మీ మోసపూరిత కోరికలతో చెడిపోతున్న, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి; నిజమైన నీతి, పరిశుద్ధత గల దేవుని పోలికగా ఉండడానికి సృజించబడిన క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడడం మాని సత్యమే మాట్లాడాలి. ఎందుకంటే, మనమందరం ఒకే శరీరంలోని అవయవాలమై ఉన్నాము. “మీ కోపంలో పాపం చేయకండి”: సూర్యుడు అస్తమించే వరకు మీరు ఇంకా కోపంతో ఉండకండి. అలాగే అపవాదికి అడుగుపెట్టే అవకాశం ఇవ్వకండి.

ఎఫెసీయులకు 4:17-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు. వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు. అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు. యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు. కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది. మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం. కాబట్టి మీరు అబద్ధాలు మానేసి మీ సాటిమనిషితో సత్యమే పలకాలి. కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు. సాతానుకు అవకాశం ఇవ్వకండి.

ఎఫెసీయులకు 4:17-27 పవిత్ర బైబిల్ (TERV)

ప్రభువు పేరిట నేను ఈ విషయం చెప్పి వారిస్తున్నాను. ఇక మీదట యూదులు కానివాళ్ళవలే జీవించకండి. వాళ్ళ ఆలోచనలు నిరుపయోగమైనవి. వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళలో ఉన్న మూర్ఖత కారణంగా వాళ్ళ హృదయాలు కఠినంగా ఉండటం వల్ల వాళ్ళకు దేవుడిచ్చిన జీవితంలో భాగం లభించలేదు. వాళ్ళు మంచిగా ఉండటం మానుకొన్నారు. అంతులేని ఆశతో శారీరక సుఖాలు అనుభవిస్తూ అన్ని రకాల అపవిత్రమైన సుఖాలకు మరిగారు. కాని మీరు క్రీస్తును గురించి నేర్చుకొన్నది యిది కాదు. మీరు యేసును గురించి విన్నారు. ఆయనలో ఉన్న సత్యాన్ని ఆయన పేరిట నేర్చుకొన్నారు. మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసింది. దాన్ని మరిచిపొండి. మీ మోసపు తలంపులు మిమ్మల్ని తప్పు దారి పట్టించాయి. తద్వారా మీ గత జీవితం మిమ్మల్ని నాశనం చేసింది. మీ బుద్ధులు, మనస్సులు మారి మీలో నూతనత్వం రావాలి. దేవుడు తన పోలికలతో సృష్టించిన క్రొత్త మనిషిగా మీరు మారాలి. ఆ క్రొత్త మనిషిలో నిజమైన నీతి, పవిత్రత ఉన్నాయి. మనమంతా ఒకే శరీరానికి చెందిన వాళ్ళము కనుక అబద్ధం చెప్పటం మానుకోవాలి. సత్యమే మాట్లాడాలి. మీరు మీ కోపంలో పాపం చెయ్యకండి. ఒకవేళ కోప్పడినా సూర్యాస్తమయం కాకముందే మీ కోపం తగ్గిపోవాలి. సాతానుకు అవకాశమివ్వకండి.

ఎఫెసీయులకు 4:17-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసునుగూర్చి విని, ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయనయందు ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు. కావునమునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి; దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.