ఎఫెసీయులకు 4:11-17
ఎఫెసీయులకు 4:11-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మనం విశ్వాసంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఐక్యతను పొందేవరకు, క్రీస్తు యొక్క పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గల వారం అయ్యేవరకు క్రీస్తు శరీరమైన సంఘం కట్టబడేలా తన ప్రజలను పరిచర్య కోసం సిద్ధపరచడానికి, క్రీస్తే అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, బోధకులను అనుగ్రహించారు. మనం ఇంకా పసిపిల్లలం కాదు కాబట్టి, మనుష్యులు మోసపూరిత యోచనలతో వంచనలతో కుయుక్తితో చేసే బోధలు అనే ప్రతీ గాలికి ఇటు అటు ఎగిరిపోతూ, అలలచే ముందుకు వెనుకకు కొట్టుకొనిపోయేవారంగా ఉండకూడదు. ప్రేమ కలిగి సత్యం మాట్లాడుతూ క్రీస్తును శిరస్సుగా కలిగిన పరిపూర్ణ శరీరంలా ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము. ఆయన సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతీ అవయవం దాని పనిని చేస్తుండగా, ప్రతి కీలు సహాయంతో ఒకటిగా అతుకబడి ప్రేమలో తనకు అభివృద్ధి కలుగునట్లు శరీరాన్ని వృద్ధి చేసుకుంటుంది. కాబట్టి మీరు, ఇకమీదట దేవుని భయంలేని యూదేతరులు నడుచుకొనునట్లు వ్యర్థమైన ఆలోచనలతో నడుచుకొనకూడదని ప్రభువు ఇచ్చిన అధికారంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
ఎఫెసీయులకు 4:11-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు. మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుడి గురించిన జ్ఞానంలో ఏకీభావం కలిగి ఉండాలనీ క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణ పరిణతికి సమానమైన పరిణతి చెందాలనీ ఆయన ఇలా నియమించాడు. అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము. ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం. ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పని చేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను.
ఎఫెసీయులకు 4:11-17 పవిత్ర బైబిల్ (TERV)
పవిత్రుల్ని సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ, దాని వల్ల క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశ్యం. అప్పుడు మనము విశ్వాసంతో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంలో ఒకటిగా ఉంటాము. క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను పొందేదాకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము. కొందరు అపొస్తలులు కావాలని, కొందరు ప్రవక్తలు కావాలని, కొందరు సువార్తికులు కావాలని, కొందరు సంఘ కాపరులు కావాలని, మరి కొందరు బోధకులు కావాలని ఆదేశించి వాళ్ళకు తగిన వరాలిచ్చాడు. అప్పుడు మనము పసిపిల్లల వలె ఉండము. అలలకు ఇటు అటు కొట్టుకొనిపోము. గాలిలాంటి ప్రతి బోధనకు కదిలిపోము. కపటంతో, కుయుక్తితో పన్నిన మాయోపాయాలకు మోసపోకుండా ఉంటాము. మనము ప్రేమతో నిజం చెబుతూ అన్ని విధాల అభివృద్ధి చెంది శిరస్సైన క్రీస్తును చేరుకోవాలి. శరీరంలోని అన్ని భాగాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. చక్కగా అమర్చబడిన ఆ భాగాలన్నీ కలిసి శరీరానికి ఆధారమిస్తాయి. ఇలా ప్రతీ భాగం తన పని చెయ్యటంవల్ల శరీరం ప్రేమతో పెరిగి అభివృద్ధి చెందుతుంది. ప్రభువు పేరిట నేను ఈ విషయం చెప్పి వారిస్తున్నాను. ఇక మీదట యూదులు కానివాళ్ళవలే జీవించకండి. వాళ్ళ ఆలోచనలు నిరుపయోగమైనవి.
ఎఫెసీయులకు 4:11-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మనమందరము విశ్వాసవిష యములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభి వృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక, ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చ బడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.