ఎఫెసీయులకు 2:14-19
ఎఫెసీయులకు 2:14-19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
రెండు సమూహాలను ఒకటిగా చేసి, శత్రుత్వం యొక్క అడ్డు గోడను నాశనం చేసిన ఆయనే మన సమాధానం. అదెలాగంటే, యేసు క్రీస్తు తన శరీరంలో మోషే ఇచ్చిన ధర్మశాస్రంలోని ఆజ్ఞలను నియమాలను కొట్టివేసారు. ఆయన ఉద్దేశమేమంటే ఈ ఇద్దరిని కలిపి తనలో ఒక నూతన మానవత్వాన్ని సృజించడం, ఆ విధంగా సమాధానపరచడం. ఈ ఇరువురిని తన సిలువ ద్వారా ఏక శరీరులుగా దేవునితో సమాధానపరచి, వారి మధ్య ఉన్న శత్రుత్వాన్ని చంపేశారు. ఆయన వచ్చి, దూరంగా ఉన్న మీకు, దగ్గరగా ఉన్నవారికి సమాధాన సువార్తను ప్రకటించారు. ఆయన ద్వారానే మనం ఇద్దరం ఒక్క ఆత్మలో తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము. దీన్ని బట్టి మీరు ఇక మీదట పరాయి వారు లేక పరదేశులు కారు, కానీ దేవుని ప్రజలతో తోటి పౌరులుగా ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నారు.
ఎఫెసీయులకు 2:14-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయనే మన శాంతి. ఆయన యూదులనూ యూదేతరులనూ ఏకం చేశాడు. మన ఉభయులనూ విడదీస్తున్న విరోధమనే అడ్డుగోడను తన శరీరం ద్వారా కూలగొట్టాడు. అంటే, ఆ ఇద్దరి నుండి ఒక కొత్త ప్రజను సృష్టించడానికి విధులూ ఆజ్ఞలూ గల ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు. వారి మధ్య ఉన్న వైరాన్ని సిలువ ద్వారా నిర్మూలించి, వీరిద్దరినీ దేవునితో ఏకం చేసి శాంతి నెలకొల్పాలని ఇలా చేశాడు యేసు వచ్చి దూరంగా ఉన్నవారికి సువార్తను, శాంతిని ప్రకటించాడు. దగ్గరగా ఉన్నవారికి శాంతిసమాధానాలు ప్రకటించాడు. యేసు ద్వారానే మీరూ మేమూ ఒకే ఆత్మ ద్వారా తండ్రిని చేరగలం. కాబట్టి యూదేతరులైన మీరు ఇకమీదట అపరిచితులూ పరదేశులూ కారు. పరిశుద్ధులతో సాటి పౌరులు, దేవుని కుటుంబ సభ్యులు.
ఎఫెసీయులకు 2:14-19 పవిత్ర బైబిల్ (TERV)
మనకు సంధి కలిగించిన వ్యక్తి క్రీస్తు. ఆయన యిద్దరినీ ఒకటిగా చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు. ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేసాడు. ఇద్దరినీ కలిపి తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని ఆయన ఉద్దేశ్యం. ఈ విధంగా సిలువ ద్వారా వాళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి ఒకటిగా ఉన్న ఆ క్రొత్త మనిషికి, దేవునికి సంధి కుదర్చాలని ఆయన ఉద్దేశ్యం. క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు, మరియు దగ్గరగా ఉన్న వాళ్ళకు శాంతి సువార్తను ప్రకటించాడు. ఆయన కారణంగా మన యిద్దరికి, తండ్రి దగ్గరకు ఒక ఆత్మ ద్వారా వెళ్ళే అవకాశం కలిగింది. అందువల్ల మీరిక మీదట పరులు కారు. పరదేశీయులు కారు. పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు. దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు.
ఎఫెసీయులకు 2:14-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.
ఎఫెసీయులకు 2:14-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
రెండు సమూహాలను ఒకటిగా చేసి, శత్రుత్వం యొక్క అడ్డు గోడను నాశనం చేసిన ఆయనే మన సమాధానం. అంటే, యేసు క్రీస్తు తన శరీరంలో మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను నియమాలను కొట్టివేసారు. ఈ ఇద్దరిని కలిపి తనలో ఒక నూతన మానవున్ని సృజించి ఆ విధంగా సమాధానపరచడం ఆయన ఉద్దేశము. ఈ ఇరువురిని తన సిలువ ద్వారా ఏక శరీరులుగా దేవునితో సమాధానపరచి, వారి మధ్య ఉన్న శత్రుత్వాన్ని చంపేశారు. ఆయన వచ్చి, దూరంగా ఉన్న మీకు, దగ్గరగా ఉన్నవారికి సమాధాన సువార్తను ప్రకటించారు. ఆయన ద్వారానే మనం ఇద్దరం ఒక్క ఆత్మలో తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము. దీన్ని బట్టి మీరు ఇకమీదట పరాయి వారు లేదా విదేశీయులు కారు, దేవుని ప్రజలతో తోటి పౌరులుగా ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నారు.