ఎఫెసీయులకు 2:11-18
ఎఫెసీయులకు 2:11-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాబట్టి, పుట్టుకతోనే యూదేతరులైన మీరు, తమను తాము “సున్నతి” అంటే మానవ హస్తాలతో శరీరంలో చేయబడేది అని పిలుచుకునే వారి చేత “సున్నతి చేయబడనివారు” అని గతంలో ఎలా పిలువబడ్డారో జ్ఞాపకం చేసుకోండి. ఆ సమయంలో మీరు క్రీస్తు నుండి వేరుగా ఉన్నారు, ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారిగా, వాగ్దాన నిబంధనలకు విదేశీయులుగా, నిరీక్షణ లేనివారిగా, లోకంలో దేవుడు లేనివారిగా ఉండేవారు. ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తాన్ని బట్టి దేవునికి దగ్గరయ్యారు. రెండు సమూహాలను ఒకటిగా చేసి, శత్రుత్వం యొక్క అడ్డు గోడను నాశనం చేసిన ఆయనే మన సమాధానం. అంటే, యేసు క్రీస్తు తన శరీరంలో మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను నియమాలను కొట్టివేసారు. ఈ ఇద్దరిని కలిపి తనలో ఒక నూతన మానవున్ని సృజించి ఆ విధంగా సమాధానపరచడం ఆయన ఉద్దేశము. ఈ ఇరువురిని తన సిలువ ద్వారా ఏక శరీరులుగా దేవునితో సమాధానపరచి, వారి మధ్య ఉన్న శత్రుత్వాన్ని చంపేశారు. ఆయన వచ్చి, దూరంగా ఉన్న మీకు, దగ్గరగా ఉన్నవారికి సమాధాన సువార్తను ప్రకటించారు. ఆయన ద్వారానే మనం ఇద్దరం ఒక్క ఆత్మలో తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము.
ఎఫెసీయులకు 2:11-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి పూర్వం మీరు శారీరికంగా అన్యులు. “శరీరంలో మనుషుల చేతితో సున్నతి పొందిన యూదులు” మిమ్మల్ని “సున్నతి లేనివారు” అని పిలిచేవారు. ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారుగా వాగ్దాన నిబంధనలకు పరాయివారుగా, నిరీక్షణ లేనివారుగా, లోకంలో దేవుడు లేనివారుగా ఉన్నారు. అయితే పూర్వం దేవునికి దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసులో క్రీస్తు రక్తం వలన దేవునికి దగ్గరయ్యారు. ఆయనే మన శాంతి. ఆయన యూదులనూ యూదేతరులనూ ఏకం చేశాడు. మన ఉభయులనూ విడదీస్తున్న విరోధమనే అడ్డుగోడను తన శరీరం ద్వారా కూలగొట్టాడు. అంటే, ఆ ఇద్దరి నుండి ఒక కొత్త ప్రజను సృష్టించడానికి విధులూ ఆజ్ఞలూ గల ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు. వారి మధ్య ఉన్న వైరాన్ని సిలువ ద్వారా నిర్మూలించి, వీరిద్దరినీ దేవునితో ఏకం చేసి శాంతి నెలకొల్పాలని ఇలా చేశాడు యేసు వచ్చి దూరంగా ఉన్నవారికి సువార్తను, శాంతిని ప్రకటించాడు. దగ్గరగా ఉన్నవారికి శాంతిసమాధానాలు ప్రకటించాడు. యేసు ద్వారానే మీరూ మేమూ ఒకే ఆత్మ ద్వారా తండ్రిని చేరగలం.
ఎఫెసీయులకు 2:11-18 పవిత్ర బైబిల్ (TERV)
మీరు యూదులుగా పుట్టలేదు. కనుక యూదులు మిమ్మల్ని “సున్నతి చేయించుకోనివాళ్ళు” అని అంటారు. తాము సున్నతి పొందినవాళ్ళైనందుకు వాళ్ళు గర్విస్తూవుంటారు. వీళ్ళ సున్నతి శారీరకమైనది. ఆత్మవల్ల పొందింది కాదు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అంతేకాక ఒకప్పుడు మీరు క్రీస్తుతో కాక విడిగా ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు దేశంలో మీకు పౌరసత్వం లేదు. దేవుడు వాగ్దానం చేసిన ఒడంబడికలో మీకు భాగం లేదు. మీరు రక్షణ లభిస్తుందన్న ఆశలేకుండా, ఈ ప్రపంచంలో దేవుడనేవాడు లేకుండా జీవించారు. ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. కాని ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు క్రీస్తు రక్తం వల్ల దేవునికి దగ్గర అయ్యారు. మనకు సంధి కలిగించిన వ్యక్తి క్రీస్తు. ఆయన యిద్దరినీ ఒకటిగా చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు. ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేసాడు. ఇద్దరినీ కలిపి తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని ఆయన ఉద్దేశ్యం. ఈ విధంగా సిలువ ద్వారా వాళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి ఒకటిగా ఉన్న ఆ క్రొత్త మనిషికి, దేవునికి సంధి కుదర్చాలని ఆయన ఉద్దేశ్యం. క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు, మరియు దగ్గరగా ఉన్న వాళ్ళకు శాంతి సువార్తను ప్రకటించాడు. ఆయన కారణంగా మన యిద్దరికి, తండ్రి దగ్గరకు ఒక ఆత్మ ద్వారా వెళ్ళే అవకాశం కలిగింది.
ఎఫెసీయులకు 2:11-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టిమునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి. అయిననుమునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.