ఎఫెసీయులకు 2:1-22
ఎఫెసీయులకు 2:1-22 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీరైతే, మీ అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారిగా ఉండి, మీరు వీటిలో జీవిస్తున్నప్పుడు ఈ లోక మార్గాలను, అవిధేయులైన వారిలో ఇప్పుడు పని చేస్తున్న ఆత్మ అయిన వాయుమండల అధిపతిని అనుసరించేవారు. మనమందరం కూడా ఒకప్పుడు లోకస్థులతో కలిసి జీవిస్తూ శరీరేచ్ఛలను మనస్సులోని కోరికలను నెరవేర్చుకొంటూ, ఇతరుల్లా మన శరీరాశలను అనుసరించి ప్రవర్తిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులంగా ఉండేవారం. అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి మనం మన అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనలను బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు. దేవుడు క్రీస్తుతో పాటు మనలను కూడా లేపి, పరలోకం మండలాల్లో క్రీస్తు యేసుతో పాటు కూర్చోబెట్టారు. రాబోయే యుగాలలో ఆయన తన కృప యొక్క సాటిలేని ఐశ్వర్యాన్ని చూపించటానికి, క్రీస్తు యేసునందు మన పట్ల ఆయన దయలో వ్యక్తపరిచారు. మీరు మీ విశ్వాసం ద్వారా కృపను చేత రక్షించబడి యున్నారు. ఇది మీ నుండి వచ్చింది కాదు, గాని ఇది దేవుడు మీకిచ్చిన బహుమానం. అది క్రియల వలన కలిగింది కాదు, కనుక ఎవరు గొప్పలు చెప్పుకోలేరు. ఎందుకంటే దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై యున్నాము. కనుక, పుట్టుకతోనే యూదేతరులైన మీరు, తమను తాము “సున్నతి” అంటే మానవ హస్తాలతో శరీరంలో చేయబడేది అని పిలుచుకునే వారి చేత “సున్నతి చేయబడని వారు” అని గతంలో ఎలా పిలువబడ్డారో జ్ఞాపకం చేసుకోండి. ఆ సమయంలో మీరు క్రీస్తు నుండి వేరుగా ఉన్నారు, ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారిగా, వాగ్దాన నిబంధనలకు పరదేశులుగా, నిరీక్షణ లేనివారిగా, లోకంలో దేవుడు లేనివారిగా ఉండేవారు. ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తాన్ని బట్టి దేవునికి దగ్గరయ్యారు. రెండు సమూహాలను ఒకటిగా చేసి, శత్రుత్వం యొక్క అడ్డు గోడను నాశనం చేసిన ఆయనే మన సమాధానం. అదెలాగంటే, యేసు క్రీస్తు తన శరీరంలో మోషే ఇచ్చిన ధర్మశాస్రంలోని ఆజ్ఞలను నియమాలను కొట్టివేసారు. ఆయన ఉద్దేశమేమంటే ఈ ఇద్దరిని కలిపి తనలో ఒక నూతన మానవత్వాన్ని సృజించడం, ఆ విధంగా సమాధానపరచడం. ఈ ఇరువురిని తన సిలువ ద్వారా ఏక శరీరులుగా దేవునితో సమాధానపరచి, వారి మధ్య ఉన్న శత్రుత్వాన్ని చంపేశారు. ఆయన వచ్చి, దూరంగా ఉన్న మీకు, దగ్గరగా ఉన్నవారికి సమాధాన సువార్తను ప్రకటించారు. ఆయన ద్వారానే మనం ఇద్దరం ఒక్క ఆత్మలో తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము. దీన్ని బట్టి మీరు ఇక మీదట పరాయి వారు లేక పరదేశులు కారు, కానీ దేవుని ప్రజలతో తోటి పౌరులుగా ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి యున్నారు. ఆ కట్టడమంతా ఆయనలో ఒకటిగా అమర్చబడి ప్రభువులో పరిశుద్ధమైన మందిరంగా వృద్ధిపొందుతూ ఉంది. ఈ విధంగా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలంగా కట్టబడుతున్నారు.
ఎఫెసీయులకు 2:1-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం. అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది. దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనపరచడానికి ఆయన ఇలా చేశాడు. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు. కాబట్టి పూర్వం మీరు శారీరికంగా అన్యులు. “శరీరంలో మనుషుల చేతితో సున్నతి పొందిన యూదులు” మిమ్మల్ని “సున్నతి లేనివారు” అని పిలిచేవారు. ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారుగా వాగ్దాన నిబంధనలకు పరాయివారుగా, నిరీక్షణ లేనివారుగా, లోకంలో దేవుడు లేనివారుగా ఉన్నారు. అయితే పూర్వం దేవునికి దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసులో క్రీస్తు రక్తం వలన దేవునికి దగ్గరయ్యారు. ఆయనే మన శాంతి. ఆయన యూదులనూ యూదేతరులనూ ఏకం చేశాడు. మన ఉభయులనూ విడదీస్తున్న విరోధమనే అడ్డుగోడను తన శరీరం ద్వారా కూలగొట్టాడు. అంటే, ఆ ఇద్దరి నుండి ఒక కొత్త ప్రజను సృష్టించడానికి విధులూ ఆజ్ఞలూ గల ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు. వారి మధ్య ఉన్న వైరాన్ని సిలువ ద్వారా నిర్మూలించి, వీరిద్దరినీ దేవునితో ఏకం చేసి శాంతి నెలకొల్పాలని ఇలా చేశాడు యేసు వచ్చి దూరంగా ఉన్నవారికి సువార్తను, శాంతిని ప్రకటించాడు. దగ్గరగా ఉన్నవారికి శాంతిసమాధానాలు ప్రకటించాడు. యేసు ద్వారానే మీరూ మేమూ ఒకే ఆత్మ ద్వారా తండ్రిని చేరగలం. కాబట్టి యూదేతరులైన మీరు ఇకమీదట అపరిచితులూ పరదేశులూ కారు. పరిశుద్ధులతో సాటి పౌరులు, దేవుని కుటుంబ సభ్యులు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డారు. ఆయన వల్లనే తన కుటుంబమనే కట్టడం చక్కగా అమరి, ప్రభువు కోసం పరిశుద్ధ దేవాలయంగా రూపొందుతూ ఉంది. ఆయనలో మీరు కూడా ఆత్మలో దేవునికి నివాసస్థలంగా ఉండడానికి వృద్ది చెందుతూ ఉన్నారు.
ఎఫెసీయులకు 2:1-22 పవిత్ర బైబిల్ (TERV)
ఇక మీ విషయమా! ఇదివరలో మీరు మీ పాపాల్లో, అతిక్రమాల్లో మరణించారు. అప్పుడు మీరు ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. వాయుమండలాధికారిని అనుసరించే వాళ్ళు. ఆ వాయుమండలాధికారి ఆత్మ దేవునికి అవిధేయతగా ఉన్నవాళ్ళలో ఇప్పుడూ పని చేస్తుంది. నిజానికి మనం కూడా మన మానవ స్వభావంవల్ల కలిగే వాంఛల్ని, శారీరక వాంచల్ని, మన ఆలోచనల వల్ల కలిగే వాంఛల్ని తృప్తి పరుచుకుంటున్నవాళ్ళలా జీవించాము. కాబట్టి వాళ్ళలా మనము కూడా దేవుని కోపానికి గురి అయ్యాము. కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందినా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షించింది. మనకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత వల్ల పరలోకంలో తనతో కలిసి రాజ్యం చెయ్యటానికి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. యేసు క్రీస్తు ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేసి, తన అపారమైన దయ మనపై చిరకాలం ఉంటుందని నిరూపించాడు. మీరు ఆయన అనుగ్రహం వల్ల రక్షింపబడ్డారు. మీలో విశ్వాసం ఉండటంవల్ల మీకా అనుగ్రహం లభించింది. అది మీరు సంపాదించింది కాదు. దాన్ని దేవుడు మీకు ఉచితంగా యిచ్చాడు. అది మీ కృషివల్ల లభించింది కాదు. కనుక గొప్పలు చెప్పుకోవటానికి అవకాశం లేదు. దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసు క్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు. మీరు యూదులుగా పుట్టలేదు. కనుక యూదులు మిమ్మల్ని “సున్నతి చేయించుకోనివాళ్ళు” అని అంటారు. తాము సున్నతి పొందినవాళ్ళైనందుకు వాళ్ళు గర్విస్తూవుంటారు. వీళ్ళ సున్నతి శారీరకమైనది. ఆత్మవల్ల పొందింది కాదు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అంతేకాక ఒకప్పుడు మీరు క్రీస్తుతో కాక విడిగా ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు దేశంలో మీకు పౌరసత్వం లేదు. దేవుడు వాగ్దానం చేసిన ఒడంబడికలో మీకు భాగం లేదు. మీరు రక్షణ లభిస్తుందన్న ఆశలేకుండా, ఈ ప్రపంచంలో దేవుడనేవాడు లేకుండా జీవించారు. ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. కాని ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు క్రీస్తు రక్తం వల్ల దేవునికి దగ్గర అయ్యారు. మనకు సంధి కలిగించిన వ్యక్తి క్రీస్తు. ఆయన యిద్దరినీ ఒకటిగా చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు. ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేసాడు. ఇద్దరినీ కలిపి తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని ఆయన ఉద్దేశ్యం. ఈ విధంగా సిలువ ద్వారా వాళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి ఒకటిగా ఉన్న ఆ క్రొత్త మనిషికి, దేవునికి సంధి కుదర్చాలని ఆయన ఉద్దేశ్యం. క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు, మరియు దగ్గరగా ఉన్న వాళ్ళకు శాంతి సువార్తను ప్రకటించాడు. ఆయన కారణంగా మన యిద్దరికి, తండ్రి దగ్గరకు ఒక ఆత్మ ద్వారా వెళ్ళే అవకాశం కలిగింది. అందువల్ల మీరిక మీదట పరులు కారు. పరదేశీయులు కారు. పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు. దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు. మీరు కూడా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి. ఆయనవల్ల ఈ ఇల్లు సక్రమంగా నిర్మింపబడి అభివృద్ధి చెందుతుంది. అది ప్రభువు పవిత్ర దేవాలయము. ఆయనలో ఐక్యత పొందిన మిమ్మల్ని కూడా యితర్లతో చేర్చి ఈ ఇల్లు నిర్మింపబడుతుంది. ఈ యింటిలో దేవుని ఆత్మ నివసిస్తాడు.
ఎఫెసీయులకు 2:1-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతోకూడ బ్రదికించెను. మీరు వాటినిచేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పునమునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించిమునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృప చేత మీరు రక్షింపబడియున్నారు. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము, క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. కాబట్టిమునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి. అయిననుమునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది. ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.
ఎఫెసీయులకు 2:1-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీరైతే, మీ అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండి, మీరు వీటిలో జీవిస్తున్నప్పుడు ఈ లోక మార్గాలను, అవిధేయులైన వారిలో ఇప్పుడు పని చేస్తున్న ఆత్మయైన వాయుమండల అధిపతిని అనుసరించేవారు. మనమందరం కూడా ఒకప్పుడు లోకస్థులతో కలిసి జీవిస్తూ శరీరేచ్ఛలను మనస్సులోని కోరికలను నెరవేర్చుకొంటూ, ఇతరుల్లా మన శరీరాశలను అనుసరించి ప్రవర్తిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులంగా ఉండేవారము. అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి మనం మన అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు. దేవుడు క్రీస్తుతో పాటు మనల్ని కూడా లేపి, పరలోకం మండలాల్లో క్రీస్తు యేసుతో పాటు కూర్చోబెట్టారు. రాబోయే యుగాలలో ఆయన తన కృప యొక్క సాటిలేని ఐశ్వర్యాన్ని చూపించటానికి, క్రీస్తు యేసునందు మన పట్ల ఆయన దయలో వ్యక్తపరిచారు. మీరు మీ విశ్వాసం ద్వారా కృపను చేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ నుండి వచ్చింది కాదు, గాని ఇది దేవుడు మీకిచ్చిన బహుమానము. అది క్రియల వలన కాదు, కాబట్టి ఎవరు గొప్పలు చెప్పుకోలేరు. ఎందుకంటే దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై ఉన్నాము. కాబట్టి, పుట్టుకతోనే యూదేతరులైన మీరు, తమను తాము “సున్నతి” అంటే మానవ హస్తాలతో శరీరంలో చేయబడేది అని పిలుచుకునే వారి చేత “సున్నతి చేయబడనివారు” అని గతంలో ఎలా పిలువబడ్డారో జ్ఞాపకం చేసుకోండి. ఆ సమయంలో మీరు క్రీస్తు నుండి వేరుగా ఉన్నారు, ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారిగా, వాగ్దాన నిబంధనలకు విదేశీయులుగా, నిరీక్షణ లేనివారిగా, లోకంలో దేవుడు లేనివారిగా ఉండేవారు. ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తాన్ని బట్టి దేవునికి దగ్గరయ్యారు. రెండు సమూహాలను ఒకటిగా చేసి, శత్రుత్వం యొక్క అడ్డు గోడను నాశనం చేసిన ఆయనే మన సమాధానం. అంటే, యేసు క్రీస్తు తన శరీరంలో మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను నియమాలను కొట్టివేసారు. ఈ ఇద్దరిని కలిపి తనలో ఒక నూతన మానవున్ని సృజించి ఆ విధంగా సమాధానపరచడం ఆయన ఉద్దేశము. ఈ ఇరువురిని తన సిలువ ద్వారా ఏక శరీరులుగా దేవునితో సమాధానపరచి, వారి మధ్య ఉన్న శత్రుత్వాన్ని చంపేశారు. ఆయన వచ్చి, దూరంగా ఉన్న మీకు, దగ్గరగా ఉన్నవారికి సమాధాన సువార్తను ప్రకటించారు. ఆయన ద్వారానే మనం ఇద్దరం ఒక్క ఆత్మలో తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము. దీన్ని బట్టి మీరు ఇకమీదట పరాయి వారు లేదా విదేశీయులు కారు, దేవుని ప్రజలతో తోటి పౌరులుగా ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు. ఆ కట్టడమంతా ఆయనలో ఒకటిగా అమర్చబడి ప్రభువులో పరిశుద్ధాలయంగా వృద్ధిపొందుతూ ఉంది. ఈ విధంగా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలంగా కట్టబడుతున్నారు.