ప్రసంగి 6:1-12

ప్రసంగి 6:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సూర్యుని కింద ఒక అన్యాయం నేను చూశాను. అది మనుషులకు గొప్ప దురవస్థగా ఉంది. అదేంటంటే, దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధిని, ఘనతను అనుగ్రహిస్తాడు. అతడేం కోరినా అది కొరత లేకుండా ఇస్తాడు. అయితే దాన్ని అనుభవించే శక్తి మాత్రం దేవుడు అతనికి ఇవ్వడు. వేరే వ్యక్తి దాన్ని అనుభవిస్తాడు. ఇది నిష్ప్రయోజనంగా, గొప్ప అన్యాయంగా కనిపిస్తున్నది. ఒకడు వంద మంది పిల్లలను కని, దీర్ఘాయువుతో ఎల్లకాలం జీవించినా, అతడు హృదయంలో సంతృప్తి అంటే తెలియకుండా, చనిపోయిన తరవాత తగిన రీతిలో సమాధికి నోచుకోకపోతే వాడికంటే పుట్టగానే చనిపోయిన పిండం మేలని నేను తలుస్తున్నాను. అది నిర్జీవంగా వచ్చి చీకటి లోకి వెళుతుంది. దాని పేరు ఎవరికీ తెలియదు. అది సూర్యుణ్ణి చూడలేదు, దానికేమీ తెలియదు. అతనికి లేని విశ్రాంతి దానికి ఉంది. అలాటి వ్యక్తి రెండు వేల సంవత్సరాలు బతికినా సంతోషించలేక పోతే అతడు కూడా మిగిలిన అందరూ వెళ్ళే స్థలానికే వెళ్తాడు కదా! మనుషుల కష్టం అంతా తమ నోరు నింపుకోడానికే. అయితే వారి మనస్సుకు తృప్తి కలగదు. మూర్ఖుల కంటే జ్ఞానుల గొప్పతనం ఏమిటి? ఇతరుల ముందు ఎలా జీవించాలో తెలిసిన బీదవాడి గొప్పతనం ఏమిటి? మనస్సు పొందలేని దాని గురించి ఆశపడడం కంటే కంటికి ఎదురుగా ఉన్నదానితో తృప్తి పడడం మంచిది. ఇది కూడా నిష్ప్రయోజనమే, గాలిని పట్టుకోడానికి ప్రయత్నించడమే. ఇప్పుడు ఉన్నది చాలా కాలం క్రితం తెలిసిందే. మనుషులు ఎవరు ఎలా ఉంటారో అది పూర్వం తెలిసిన విషయమే. తమకంటే బలవంతుడైన వ్యక్తితో వారు వాదన పెట్టుకోలేరు. పలికిన మాటల్లో వ్యర్థమైనవి చాలా ఉంటాయి. వాటివలన మనుషులకేం ప్రయోజనం? నీడలాగా తమ జీవితాలను వ్యర్థంగా గడిపేసే మనుషులకు తమకేది మంచిదో ఎవరికి తెలుసు? వారు పోయిన తరువాత ఏమి జరుగుతుందో వారికి ఎవరు చెప్పగలరు?

షేర్ చేయి
Read ప్రసంగి 6

ప్రసంగి 6:1-12 పవిత్ర బైబిల్ (TERV)

నేను ఈ ప్రపంచంలో అసమంజసమైన మరో విషయాన్ని గమనించాను. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవుడు ఒక మనిషికి గొప్ప సంపద, ఆస్తి మరియు గౌరవమూ ప్రసాదిస్తాడు. అతనికి కావలసినవన్నీ, అతను కోరుకోగలిగిన సమస్తం వుంటాయి. అయితే, ఆ వ్యక్తి వాటిని అనుభవించకుండా చేస్తాడు దేవుడు. ఒక అపరిచితుడు వస్తాడు, వాటన్నింటినీ చేజిక్కించుకుంటాడు. ఇది కూడా అర్థరహితమైన చాలా చెడ్డ విషయమే. ఒక వ్యక్తి దీర్ఘకాలం జీవించవచ్చు. అతనికి వంద మంది సంతానం ఉండవచ్చు. అయితే, ఈ మంచి విషయాలు అతనికి తృప్తి కలిగించలేదనీ, అతని మరణానంతరం ఏ ఒక్కరూ అతన్ని జ్ఞాపకం ఉంచుకోరనీ అనుకోండి, అప్పుడు అతనికంటె పురిట్లోనే చనిపోయే శిశువు మెరుగని నేనంటాను. మృత శిశువుగా పుట్టడం నిజంగానే అర్థరహితం. పేరైనా లేని ఆ శిశువుని వెంటనే తీసుకుపోయి సూర్యరశ్మి చొరని చీకటి సమాధిలో పూడ్చేస్తారు. సూర్యరశ్మినైనా చూడని ఆ శిశువుకి బొత్తిగా ఏది ఏమాత్రం తెలియదు. కాని, దేవుడు తనకిచ్చిన మంచివాటిని అనుభవించని ఆ మనిషికంటె ఆ శిశువు ఎక్కువ ప్రశాంతిని అనుభవిస్తుంది. ఆ మనిషి రెండు వేల సంవత్సరాలు బతకవచ్చు. అయినా అతను తనకు ఇచ్చిన జీవితాన్ని అనుభవించక పోతే అతనికంటె గర్భంలో చనిపోయిన శిశువు సులభమయిన మార్గంలో ఆ అంత్యదశను పొందిందనవచ్చు. తిండి కోసం మనిషి చచ్చేలా పాటుపడతాడు. అయితే, అతను ఎన్నడూ తృప్తి చెందడు. వివేకవంతుడు అవివేకికంటె విశేషమైనవాడు కాడు. అంతకంటె, ఉన్నవి ఉన్నట్లు జీవితాన్ని స్వీకరించడం తెలిసిన బీదవాడు మేలు. ఎప్పుడూ ఇంకా ఇంకా ఏదో కావాలని ఆశించడంకంటె, ఉన్నదానితో తృప్తి చెంది సంతోషంగా ఉండటంమేలు. ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకోవడం వృధా ప్రయాసం. అది గాలిని పట్టుకొనేందుకు చేసే ప్రయత్నమే. మనిషి ఎందుకు సృష్టింపబడ్డాడు? మనిషిగా ఉండేందుకు మాత్రమే. దీన్ని గురించి చర్చించడం వృధా ప్రయాసమే. దీన్ని గురించి మనిషి దేవునితో చర్చించలేడు. ఎందుకంటే, మనిషికంటె దేవుడు శక్తిమంతుడు. సుదీర్ఘంగా వాదించినంత మాత్రాన ఈ వాస్తవం మారిపోదు. భూమిమీద స్వల్ప కాలం జీవించే మనిషికి, ఆ స్వల్ప కాలంలో అతనికి ఏది అత్యుత్తమమైనదో ఎవరికి తెలుస్తుంది? అతని జీవితం నీడలా గడిచిపోతుంది. తర్వాత ఏమి జరుగుతుందో ఎవరూ అతనికి చెప్పలేరు.

షేర్ చేయి
Read ప్రసంగి 6

ప్రసంగి 6:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

సూర్యుని క్రింద దురవస్థ యొకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువకాకుండును; అయినను దాని ననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహింపడు, అన్యుడు దాని ననుభవించును; ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండముయొక్క గతి మేలని నేననుకొనుచున్నాను అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటిచేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతికంటె దాని గతి నెమ్మదిగలది. అట్టివాడు రెండువేల సంవత్సరములు బ్రదికియు మేలు కానకయున్నయెడల వానిగతి అంతే; అందరును ఒక స్థలమునకే వెళ్లుదురు గదా. మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా; అయినను వారి మనస్సు సంతుష్టినొందదు. బుద్ధిహీనులకంటె జ్ఞానుల విశేషమేమి? సజీవులయెదుట బ్రదుకనేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాశలుకలిగి తిరుగు లాడుటకన్న ఎదుట నున్నదానిని అనుభవించుట మేలు; ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ముందుండినది బహుకాలముక్రిందనే తెలియబడెను; ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయ మాయెను; తమకంటె బలవంతుడైనవానితో వారు వ్యాజ్యెమాడజాలరు. పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాల ఉండును; వాటివలన నరులకేమి లాభము? నీడవలె తమ దినములన్నియు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రదుకునందు ఏది వారికి క్షేమకరమైనదో యెవరికి తెలియును? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు?

షేర్ చేయి
Read ప్రసంగి 6

ప్రసంగి 6:1-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

నేను సూర్యుని క్రింద మరొక చెడు చూశాను, అది మనుష్యజాతి మీద ఎంతో భారంగా ఉంది. దేవుడు కొందరికి ధనం, ఆస్తి, గౌరవం ఇస్తారు, తద్వార వారి హృదయాలు కోరుకున్నవేవి వారికి కొదువగా ఉండవు. కాని వాటిని అనుభవించే సామర్థ్యాన్ని వారికి దేవుడు ఇవ్వరు, అపరిచితులు వాటిని అనుభవిస్తారు. ఇదంతా అర్థరహితమే, చెడ్డ విషయమే. ఒకడు వందమంది పిల్లలను కని అనేక సంవత్సరాలు జీవించినప్పటికీ, అతడు బ్రతికినంత కాలం తన అభివృద్ధిని అనుభవించకపోతే, సరియైన రీతిలో సమాధి చేయబడకపోతే, అతనికంటే గర్భస్రావమైపోయిన పిండమే నయము. గర్భస్రావమైన పిండం నిరుపయోగంగా వచ్చి చీకటిలోకి వెళ్లిపోతుంది, చీకటిలో దాని పేరు కప్పబడుతుంది. అది ఎన్నడు సూర్యుని చూడకపోయినా దానికి ఏమి తెలియకపోయినా, ఆ మనిషి కన్నా దానికే ఎక్కువ విశ్రాంతి ఉంది. అతడు రెండువేల సంవత్సరాలు బ్రతికినా తన అభివృద్ధిని అనుభవించలేడు. అందరు వెళ్లేది ఒకే చోటికే కదా? మనుష్యులు పడే శ్రమ అంతా కడుపు కోసమే, అయినా వారి ఆశకు తృప్తి కలగదు. మూర్ఖుల కంటే జ్ఞానులకున్న ప్రయోజనం ఏముంది? ఇతరుల ఎదుట ఎలా జీవించాలో తెలుసుకున్న బీదవారికి లాభం ఏంటి? కోరిక వెంట పడడం కంటే కళ్లకు కనిపించేది మేలు. అయినా ఇది కూడా అర్థరహితమే. గాలికి ప్రయాసపడడమే. ఉనికిలో ఉన్నవన్నీ ఇంతకు ముందు తెలిసినవే. మనుష్యులు ఎలా ఉంటారో పూర్వం నుండి తెలిసిందే; తనకంటే బలవంతుడితో ఎవరు పోరాడలేరు. మాటలు ఎక్కువ అర్థం తక్కువ, దానివల్ల ఎవరికి ప్రయోజనం? నీడలా తమ జీవితకాలాన్ని అర్థరహితంగా గడిపే మనుష్యుల బ్రతుకులో వారికి ఏది క్షేమమో ఎవరికి తెలుసు? వారు గతించాక సూర్యుని క్రింద భూమి మీద ఏం జరుగుతుందో వారికి ఎవరు చెప్తారు?

షేర్ చేయి
Read ప్రసంగి 6