ప్రసంగి 4:7-12

ప్రసంగి 4:7-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నేను ఆలోచిస్తున్నపుడు సూర్యుని కింద నిష్ప్రయోజనమైంది ఇంకొకటి కనిపించింది. ఒకడు ఒంటరిగా ఉన్నాడు. అతనికి జతగాడు గాని, కొడుకు గాని, సోదరుడు గాని లేడు. అయినా అతడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. ఐశ్వర్యం అతనికి తృప్తి కలిగించదు. సుఖమనేది లేకుండా ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాను అనుకుంటాడు. ఇది కూడా ఆవిరిలాగా నిష్ప్రయోజనం, విచారకరం. ఇద్దరు కష్టపడితే ఇద్దరికీ మంచి జరుగుతుంది. కాబట్టి ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది. ఒకడు కింద పడినా మరొకడు లేపుతాడు. అయితే ఒక్కడే ఉంటే అతడు పడినప్పుడు లేపేవాడు లేనందువలన అతనికి కష్టమే మిగులుతుంది. ఇద్దరు కలిసి పండుకొంటే వారికి వెచ్చగా ఉంటుంది. ఒక్కడే ఉంటే వీలు కాదు కదా! ఒంటరిగా ఉన్నవాణ్ణి పడదోయడం తేలిక. అయితే ఇద్దరు కలిసి ఉంటే తమపై దాడిని ఎదుర్కోగలరు. మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు గదా?

షేర్ చేయి
Read ప్రసంగి 4

ప్రసంగి 4:7-12 పవిత్ర బైబిల్ (TERV)

మతిమాలిన మరో విషయం నేను గమనించాను, ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి కుటుంబం ఉండకపోవచ్చు. ఒక కొడుకో, ఒక సోదరుడో ఉండక పోవచ్చు. అయితేనేమి, అతను రెక్కలు విరుచుకొని అతిగా పని చేస్తూనే ఉంటాడు. తనకి ఉన్నదానితో అతను ఎన్నడూ తృప్తిచెందడు. అతను నిర్విరామంగా కష్టించి పనిచేసి, “నేనిలా ఎందుకు రెక్కలు విరుచుకొని పనిచేస్తున్నట్లు? నేను నా జీవితాన్ని హాయిగా ఎందుకు గడపకూడదు?” అని అనుకో. ఇది కూడా చెడ్డదే అర్థరహితమైనదే. ఒకరికంటె ఇద్దరు మెరుగు. ఇద్దరు కలిసి పనిచేస్తే, తాము చేసే పనికి ఎక్కువ ప్రతిఫలం పొందుతారు. ఒకడు పడిపోతే రెండోవాడు అతనికి సహాయం చెయ్యగలుగుతాడు. ఒంటరిగాడు పడి పోయినప్పుడు అతను నిస్సహాయుడవుతాడు. అక్కడ అతనికి సాయపడేవాడు ఎవడూ వుండడు. ఇద్దరు జంటగా పడుకుంటే, వాళ్లకి వెచ్చగా ఉంటుంది. ఒంటిగా నిద్రించేవాడికి వెచ్చదనం ఉండదు. ఒంటరి వ్యక్తిని శత్రువు ఓడించగలుగుతాడు. అయితే, అదే శత్రువు ఇద్దర్ని ఓడించలేడు. అదే ముగ్గురుంటే, ఇంకా ఎక్కువ బలం కలిగివుంటారు. ముప్పేట తాడును తెంచలేనట్లే, వాళ్లని దెబ్బతియ్యడం చాలా కష్టసాధ్యమవుతుంది.

షేర్ చేయి
Read ప్రసంగి 4

ప్రసంగి 4:7-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నేనాలోచింపగా వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడు– సుఖమను నది నేనెరుగక ఎవరినిమిత్తము కష్టపడుచున్నానని అను కొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును. ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలముకలుగును గనుక ఒంటిగాడైయుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేక పోవును. ఇద్దరు కలిసి పండుకొనినయెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును? ఒంటరియగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?

షేర్ చేయి
Read ప్రసంగి 4

ప్రసంగి 4:7-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

నేను సూర్యుని క్రింద మళ్ళీ అర్థరహితమైన దానిని చూశాను: ఒక ఒంటరివాడు ఉండేవాడు; అతనికి కుమారుడు కాని సోదరుడు కాని లేరు. కాని అతడు నిత్యం కష్టపడుతూనే ఉన్నాడు, అయినప్పటికీ అతని సంపద అతని కళ్లను తృప్తిపరచలేకపోయింది. “నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను? నేను ఎందుకు ఆనందంగా లేను?” అని ప్రశ్నించుకున్నాడు, ఇది కూడా అర్థరహితమే విచారకరమైన క్రియ! ఒకరికంటే ఇద్దరు మేలు, ఎందుకంటే ఇద్దరూ కష్టపడితే మంచి రాబడి ఉంటుంది: ఒకవేళ ఇద్దరిలో ఒకరు పడితే రెండవవాడు ఇతడిని లేవనెత్తగలడు. ఒంటరివాడు పడితే లేవనెత్తేవాడెవడూ ఉండడు. అలాగే, ఇద్దరు కలిసి పడుకుంటే, వారు వెచ్చగా ఉంటారు. అయితే ఒంటరివారు ఎలా వెచ్చగా ఉండగలరు? ఒంటరి వారిని పడద్రోయడం తేలిక, ఇద్దరు కలిసి తమను తాము రక్షించుకోగలరు. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు.

షేర్ చేయి
Read ప్రసంగి 4