ప్రసంగి 4:4-8
ప్రసంగి 4:4-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కష్టంతో, నైపుణ్యంగా చేసే ప్రతి పనీ వేరొకరి అసూయకి కారణం అవుతున్నదని నేను చూశాను. ఇది కూడా నిష్ప్రయోజనంగా, ఒకడు గాలిని పట్టుకోడానికి చేసే ప్రయత్నంలాగా ఉంది. బుద్ధిహీనుడు పని చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం వల్ల తనను తనే నాశనం చేసుకుంటున్నాడు. రెండు చేతులతో కష్టం, గాలి కోసం ప్రయత్నాలు చేసేకంటే ఒక చేతిలో నెమ్మది కలిగి ఉండడం మంచిది. నేను ఆలోచిస్తున్నపుడు సూర్యుని కింద నిష్ప్రయోజనమైంది ఇంకొకటి కనిపించింది. ఒకడు ఒంటరిగా ఉన్నాడు. అతనికి జతగాడు గాని, కొడుకు గాని, సోదరుడు గాని లేడు. అయినా అతడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. ఐశ్వర్యం అతనికి తృప్తి కలిగించదు. సుఖమనేది లేకుండా ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాను అనుకుంటాడు. ఇది కూడా ఆవిరిలాగా నిష్ప్రయోజనం, విచారకరం.
ప్రసంగి 4:4-8 పవిత్ర బైబిల్ (TERV)
తర్వాత నేనిలా అనుకున్నాను, “మనుష్యులు మరింత కష్టపడి పనిచేస్తారెందుకు?” కొందరు విజయం సాధించి ఇతరులకంటె మెరుగవాలని ప్రయత్నించడం నేను చూశాను. ఎందుకంటే, వాళ్లలో ఈర్ష్య ఉంది. తమకి ఉన్నదానికంటె ఇతరులు అధికంగా కలిగివుండటం వాళ్లకి ఇష్టం లేదు. ఇది కూడా బుధ్ది హీనత. ఇది గాలిని పట్టుకొనే ప్రయత్నం. కొందరు ఇలా అంటారు: “ఏమీ చెయ్యకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం మూర్ఖత్వం. మీరు పనిచెయ్యకపోతే పస్తులుండి చస్తారు.” బహుశాః ఈ మాట నిజమే కావచ్చు. మరికొన్ని సంపాదించు కోవాలని సదా తంటాలు పడటం కంటె, ఉన్న కొద్దివాటితో తృప్తి చెందడం మెరుగని నా ఉద్దేశం. మతిమాలిన మరో విషయం నేను గమనించాను, ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి కుటుంబం ఉండకపోవచ్చు. ఒక కొడుకో, ఒక సోదరుడో ఉండక పోవచ్చు. అయితేనేమి, అతను రెక్కలు విరుచుకొని అతిగా పని చేస్తూనే ఉంటాడు. తనకి ఉన్నదానితో అతను ఎన్నడూ తృప్తిచెందడు. అతను నిర్విరామంగా కష్టించి పనిచేసి, “నేనిలా ఎందుకు రెక్కలు విరుచుకొని పనిచేస్తున్నట్లు? నేను నా జీవితాన్ని హాయిగా ఎందుకు గడపకూడదు?” అని అనుకో. ఇది కూడా చెడ్డదే అర్థరహితమైనదే.
ప్రసంగి 4:4-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు కష్టమంతయు నేర్పుతోకూడిన పను లన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకైచేయు ప్రయత్నమువలెనున్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. శ్రమయును గాలికైన యత్నములును రెండు చేతులనిండ నుండుటకంటె ఒక చేతినిండ నెమ్మదికలిగి యుండుట మేలు. నేనాలోచింపగా వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడు– సుఖమను నది నేనెరుగక ఎవరినిమిత్తము కష్టపడుచున్నానని అను కొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును.
ప్రసంగి 4:4-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కష్టమంతటితో సాధించినవన్నీ ఒకరిపట్ల ఒకరికి అసూయ కలిగిస్తున్నాయని నేను చూశాను. ఇది కూడా అర్థరహితమే, గాలికి శ్రమ పడినట్లే. మూర్ఖులు చేతులు ముడుచుకుని తమను తాము పతనం చేసుకుంటారు. రెండు చేతులతో గాలి కోసం శ్రమించడం కంటే ఒక చేతినిండ నెమ్మది ఉంటే అది ఎంతో మేలు. నేను సూర్యుని క్రింద మళ్ళీ అర్థరహితమైన దానిని చూశాను: ఒక ఒంటరివాడు ఉండేవాడు; అతనికి కుమారుడు కాని సోదరుడు కాని లేరు. కాని అతడు నిత్యం కష్టపడుతూనే ఉన్నాడు, అయినప్పటికీ అతని సంపద అతని కళ్లను తృప్తిపరచలేకపోయింది. “నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను? నేను ఎందుకు ఆనందంగా లేను?” అని ప్రశ్నించుకున్నాడు, ఇది కూడా అర్థరహితమే విచారకరమైన క్రియ!