ప్రసంగి 3:1-22

ప్రసంగి 3:1-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు, చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు; ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు; రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగ లించుటకు కౌగలించుట మానుటకు; వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు; చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు; ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు. కష్టపడినవారికి తమ కష్టమువలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు. కావున సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసి కొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చు కొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని. దేవుడుచేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని; దాని కేదియు చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు; మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును; జరుగబోవునది పూర్వమందు జరిగి నదే; జరిగిపోయినదానిని దేవుడు మరల రప్పించును. మరియు లోకమునందు విమర్శస్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని. కాగా తాము మృగములవంటివారని నరులు తెలిసికొనునట్లును, దేవుడు వారిని విమర్శించునట్లును ఈలాగు జరుగుచున్నదని అనుకొంటిని. నరులకు సంభవించునది యేదో అదే మృగములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము. సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో యెవరికి తెలియును? కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపి కొనిపోవువాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటె వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలిసికొంటిని; ఇదే వారి భాగము.

షేర్ చేయి
Read ప్రసంగి 3

ప్రసంగి 3:1-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికీ ప్రతి ఉద్దేశానికీ ఒక సమయం ఉంది. పుట్టడానికీ, చనిపోడానికీ నాటడానికీ, నాటిన దాన్ని పెరకడానికీ చంపడానికీ, స్వస్థపరచడానికీ కూలదోయడానికీ, కట్టడానికీ ఏడవడానికీ, నవ్వడానికీ, దుఃఖించడానికీ, నాట్యం చేయడానికీ రాళ్లను పారవేయడానికీ, వాటిని పోగు చేయడానికీ ఎదుటి వారిని కౌగలించుకోడానికీ, మానడానికీ వస్తువులను వెదకడానికీ, పోగొట్టుకోడానికీ దాచుకోడానికీ, పారవేయడానికీ వస్త్రాలను చింపడానికీ, కుట్టడానికీ మౌనం వహించడానికీ, మాటలాడడానికీ ప్రేమించడానికీ, ద్వేషించడానికీ యుద్ధం చేయడానికీ, సంధి చేసుకోడానికీ ఇలా ప్రతిదానికీ ఒక సమయం ఉంది. కష్టపడి పని చేసిన వారికి దాని వలన వచ్చిన లాభమేముంది? మానవులు చేయడానికి దేవుడు వారికి ఇచ్చిన పని ఏమిటో నేను చూశాను. దేవుడు ప్రతి దానినీ దాని కాలానికి సరిపడినట్టుగా చేశాడు. ఆయన నిత్యమైన జ్ఞానాన్ని మానవుల హృదయాల్లో ఉంచాడు. దేవుని కార్యాలను మొదటి నుండి చివరి వరకూ పూర్తిగా గ్రహించడానికి అది చాలదు. కాబట్టి మానవులకు బతికినంత కాలం సంతోషంగా, మంచి జరిగిస్తూ ఉండడం కంటే శ్రేష్ఠమైనదేదీ లేదని నేను గ్రహించాను. ప్రతి ఒక్కరూ అన్నపానాలు పుచ్చుకుంటూ తన కష్టార్జితాన్ని అనుభవించడం దేవుడిచ్చే బహుమానమే అని కూడా గ్రహించాను. దేవుడు చేసే పనులన్నీ నిత్యమైనవి అని నాకు తెలుసు. దానికి మరి దేనినీ కలపలేము, దానినుండి దేనినీ తీయలేము. మానవులు తనలో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడే ఈ విధంగా నియమించాడు. గతంలో జరిగిందే ఇప్పుడూ జరుగుతుంది. తరవాత జరగబోయేది కూడా ఇంతకు ముందు జరిగిందే. మానవులు మర్మమైన సంగతులు వెదికేలా దేవుడు చేస్తాడు. అంతేగాక ఈ లోకంలో న్యాయతీర్పు జరిగించే స్థలాల్లో, నీతి ఉండాల్సిన స్థలాల్లో నాకు దుష్టత్వం కనిపించింది. “మంచివారికీ చెడ్డవారికీ వారి ప్రతి ప్రయత్నానికీ, పనికీ తగిన సమయంలో దేవుడే తీర్పు తీరుస్తాడు” అని నా హృదయంలో అనుకున్నాను. తాము జంతువుల్లాటి వారని మానవులు తెలుసుకోవాలని దేవుడు అలా చేస్తున్నాడని నేను అనుకున్నాను. ఎందుకంటే జంతువులకు జరుగుతున్నట్టే మనుషులకీ జరుగుతూ ఉంది. ఇద్దరి గతీ ఒక్కటే. జంతువులు చనిపోతాయి, మనుషులూ చనిపోతారు. జీవులన్నిటికీ ఒక్కటే ప్రాణం. జంతువుల కంటే మనుషులకు ఎక్కువేమీ లేదు. అంతా ఆవిరిలాగా నిష్ప్రయోజనం కదా! అంతా ఒక్క చోటికే వెళతారు. అంతా మట్టిలోనుండి పుట్టింది, ఆ మట్టిలోకే తిరిగి పోతుంది. మనుషుల ఆత్మ పరలోకానికి ఎక్కిపోతుందనీ జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందనీ ఎవరికి తెలుసు? మనిషికి తన తరువాత ఏం జరగబోతున్నదో చూపించడానికి వారిని తిరిగి వెనక్కి తెచ్చేవాడు ఎవరున్నారు? కాబట్టి వారు తమ పనిలో సంతోషించడం కంటే శ్రేష్టమైంది వారికేమీ లేదని నేను తెలుసుకున్నాను. అదే వారు చేయవలసింది.

షేర్ చేయి
Read ప్రసంగి 3

ప్రసంగి 3:1-22 పవిత్ర బైబిల్ (TERV)

ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది. ఈ భూమి మీద ప్రతీది సరైన సమయంలో సంభవిస్తుంది. పుట్టేందుకొక సమయం వుంది, చనిపోయేందుకొక సమయం వుంది. మొక్కలు నాటేందుకొక సమయం వుంది, మొక్కలు పెరికేందుకొక సమయం వుంది. చంపేందుకొక సమయం వుంది, గాయం మాన్పేందుకొక సమయం వుంది. నిర్మూలించేందుకొక సమయం వుంది, నిర్మించేందుకొక సమయం వుంది. ఏడ్చేందుకొక సమయం వుంది, నవ్వేందుకొక సమయం వుంది. దుఃఖించేందుకొక సమయం వుంది. సంతోషంతో నాట్య మాడేందుకొక సమయం వుంది. ఆయుధాలు పడవేసేందుకొక సమయం వుంది, వాటిని తిరిగి చేపట్టేందుకొక సమయం వుంది. ఒకరిని కౌగిలించు కొనేందుకొక సమయం వుంది, ఆ కౌగిలిని సడలించేందుకొక సమయం ఉంది. దేన్నయినా వెదికేందుకొక సమయం వుంది, అది పోగొట్టుకొనేందుకొక సమయం వుంది. వస్తువులు పదిలపర్చు కొనే సమయం వుంది, వాటిని పారవేసే సమయం వుంది. వస్త్రం చింపేందుకొక సమయం వుంది, దాన్ని కుట్టేందుకొక సమయం వుంది. మౌనానికొక సమయం వుంది. మాట్లాడేందు కొక సమయం వుంది. ప్రేమించేందుకొక సమయం వుంది, ద్వేషించేందుకొక సమయం వుంది. సమరానికొక సమయం వుంది, శాంతికొక సమయం వుంది. మనిషి చేసే కష్ట భూయిష్టమైన పనికిగాను అతనికి నిజంగా ఏమైనా లభిస్తుందా? (లేదు!) చేసేందుకు దేవుడు మనకిచ్చే కష్ట భూయిష్టమైన పనులన్నీ ఏమిటో నేను గుర్తించాను. తన జగత్తును గురించి ఆలోచించే సామర్థ్యాన్ని దేవుడు మనకి యిచ్చాడు. అయితే దేవుడు చేసే వాటన్నింటినీ మనం ఎన్నడూ పూర్తిగా తెలుసు కోలేము. అయితేనేమి, దేవుడు అన్ని పనుల్నీ సరిగ్గా సరైన సమయంలోనే చేస్తాడు. తాము బతికినంత కాలము సంతోషంగా ఉండటం, తనివితీరా సుఖాలు అనుభవించడం ఇవి మనుష్యులు చేయవలసిన అత్యుత్తమమైన పని అన్న విషయం నేను గ్రహించాను. ప్రతి మనిషి తినాలి, తాగాలి, తాను చేసే పనిని ఆహ్లాదంగా చెయ్యాలి ఇది దేవుడు కోరుకునేది. ఇవి దేవుడిచ్చిన వరాలు. దేవుడు చేసేది ప్రతీది శాశ్వతంగా కొనసాగుతుందని నేను తెలుసుకున్నాను. దేవుడు చేసినదానికి మనుష్యులు దేన్నీ ఎంతమాత్రం జోడించలేరు మరియు దేవుడు చేసే పనినుండి దేనినీ తీసుకొనలేరు. మనుష్యులు తనని గౌరవించేందుకే దేవుడు ఇదంతా చేశాడు. గతంలో జరిగినవేవో జరిగాయి, (మరి మనం వాటిని మార్చలేము.) భవిష్యత్తులో జరగ బోయేవేవో జరుగుతాయి. (మనం వాటిని మార్చలేము) అయితే, ఎవరైతే చెడ్డగా చూడబడ్డారో, వారికి దేవుడు మంచి చెయ్యాలని కోరుకుంటాడు. ఈ ప్రపంచములో యీ విషయాలన్నీ నేను చూశాను. న్యాయ స్థానాల్లో మంచితనము, న్యాయము నిండుగా ఉండాలి, అయితే అక్కడ మనం కనుగొంటుంది చెడుగు. అందుకని, నాలో నేను ఇలా అనుకున్నాను: “దేవుడు ప్రతి పనికి ఒక కాలాన్ని ఎంచుకున్నాడు. అంతేకాదు, మనుష్యులు చేసే పనులన్నింటిని విచారించేందుకు దేవుడు ఒక ప్రత్యేక కాలాన్ని ఎంచుకున్నాడు. దేవుడు మంచివాళ్లని విచారిస్తాడు, చెడ్డవాళ్లని విచారిస్తాడు.” మనుష్యులు ఒకరిపట్ల మరొకరు వ్యవహరించే తీరును గమనించిన నేను నాలో నేనిలా అనుకున్నాను, “తాము జంతువుల మాదిరిగా వున్నామన్న విషయాన్ని మనుష్యులు గమనించాలని దేవుడు కోరుకున్నాడు. మనిషి జంతువుకంటే మెరుగైనవాడా? (కాడు) ఎందుకని? ఎందుకంటే, అన్ని నిష్ర్పయోజనం కనుక. మనుష్యులూ మరణిస్తారు. జంతువులూ మరణిస్తాయి. ఒకే ‘ఊపిరి’ మనుష్యుల్లోనూ, జంతువుల్లోనూ ఉన్నది. చనిపోయిన జంతువుకి, మనిషికి మధ్య తేడా ఏమైనా ఉందా? అన్ని ఒక్క చోటుకే పోతాయి. అవి ఏ మట్టినుంచి పుట్టాయో చివరికి ఆ మట్టిలోకే పోతాయి. మనిషి ఆత్మకి ఏమి జరుగుతుందో ఎవరికెరుక? జంతువు ఆత్మ పాతాళానికి పోతే, మనిషి ఆత్మ పైకి దేవుని దగ్గరికి వెళ్తుందేమో ఎవరికి తెలుసు?” అందుకని, మనిషి తాను చేసే పనిలో ఆనందం పొందడమే అత్యుత్తమమైనదని నేను గ్రహించాను. అదే వాళ్ల భాగ్యం. (మరో విషయంయేమంటే, భవిష్యత్తు గురించి మనిషి దిగులు పెట్టుకోకూడదు.) ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు మనిషికి ఎవ్వరూ తోడ్పడలేరు.

షేర్ చేయి
Read ప్రసంగి 3

ప్రసంగి 3:1-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ప్రతిదానికీ ఒక సమయం ఉంది, ఆకాశాల క్రింద ప్రతీ కార్యకలాపానికి ఒక కాలం ఉంది: పుట్టడానికి సమయం చావడానికి సమయం, నాటడానికి సమయం, పెరికివేయడానికి సమయం, చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం, పడగొట్టడానికి, కట్టడానికి. ఏడ్వడానికి, నవ్వడానికి దుఃఖపడడానికి, నాట్యమాడడానికి, రాళ్లు పారవేయడానికి, కుప్పవేయడానికి, కౌగిలించుకోడానికి, కౌగిలించడం మానడానికి. వెదకడానికి సమయం, పోగొట్టుకోడానికి సమయం, దాచిపెట్టడానికి, పారవేయడానికి, చింపివేయడానికి, కుట్టడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి, ప్రేమించడానికి, ద్వేషించడానికి, యుద్ధం చేయడానికి, సమాధానపడడానికి సమయం ఉంటుంది. కష్టపడేవారికి తమ కష్టానికి పొందే లాభమేంటి? మనుష్యజాతి మీద దేవుడు మోపిన భారం నేను చూశాను. ఆయన ప్రతిదాన్ని దాని సమయానికి తగినట్లుగా ఉండేలా చేశారు. ఆయన మానవ హృదయంలో నిత్యమైన జ్ఞానాన్ని ఉంచారు; దేవుడు చేసిన వాటిని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా ఎవరూ గ్రహించలేరు. మనుష్యులు జీవించినంత కాలం సంతోషంగా ఉంటూ, మంచి చేయడం కంటే ఉత్తమమైనది ఏదీ లేదని నేను తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరు తిని త్రాగుతూ తన కష్టార్జితాన్ని ఆస్వాదించడమే దేవుని వరమని నేను తెలుసుకున్నాను. దేవుడు చేసే ప్రతిదీ శాశ్వతంగా ఉంటుందని నాకు తెలుసు; దానికి ఏమీ జోడించలేము దాని నుండి ఏమీ తీసివేయలేము. ప్రజలు ఆయనకు భయపడేలా దేవుడు అలా నియమించారు. ఇప్పుడు జరుగుతున్నది ఇంతకుముందు జరిగిందే. ఇకముందు జరగబోయేది, పూర్వం జరిగి ఉన్నదే. మునుపున్నదాన్నే మళ్ళీ దేవుడు రప్పిస్తారు, జరిగిస్తారు. సూర్యుని క్రింద ఈ భూమి మీద మరో విషయం నేను చూశాను. న్యాయస్థానంలో దుర్మార్గం జరుగుతూ ఉంది. న్యాయానికి బదులు దుర్మార్గమే ప్రబలుతోంది. నేనిలా అనుకున్నాను, “నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడు తీర్పు తీరుస్తారు, ఎందుకంటే ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది ప్రతి పనికి తీర్పు తీర్చడానికి సమయం ఉంది.” నేను ఇంకా ఇలా అనుకున్నాను, “మనుష్యుల తాము జంతువుల్లాంటివారని గ్రహించేలా దేవుడు వారిని పరీక్షిస్తారు. ఖచ్చితంగా జంతువులకు జరిగినట్లే మనుష్యులకు జరుగుతుంది. వారిద్దరి విధి ఒక్కటే; జంతువులు చనిపోతాయి మనుష్యులు చనిపోతారు. అంతా అర్థరహితమే. అంతా వెళ్లేది ఒక చోటికే; సమస్తం మట్టిలో నుండి వచ్చింది, తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది. ఒకవేళ మానవ ఆత్మ పైకి లేస్తుందో లేదో, జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందో లేదో ఎవరికి తెలుసు?” కాబట్టి మనుష్యులు తమ పనిని ఆస్వాదించడం కంటే మెరుగైనది ఏదీ లేదని నేను గ్రహించాను, ఎందుకంటే అదే వారు చేయవలసింది. వారి తర్వాత ఏమి జరుగుతుందో చూడటానికి వారిని ఎవరు వెనక్కి తీసుకురాగలరు?

షేర్ చేయి
Read ప్రసంగి 3