ప్రసంగి 2:20-26
ప్రసంగి 2:20-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి సూర్యుని కింద నేను పడిన కష్టమంతటి విషయంలో నేను నిస్పృహ చెందాను. ఒకడు జ్ఞానంతో, తెలివితో, నైపుణ్యంతో కష్టపడి ఒక పని చేస్తాడు. అయితే అతడు దాని కోసం పని చేయని వేరొకడికి దాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తున్నది. ఇది కూడా నిష్ప్రయోజనంగా, గొప్ప విషాదంగా ఉంది. సూర్యుని కింద మానవుడు పడే కష్టానికీ చేసే పనులకూ అతడికేం దొరుకుతున్నది? అతడు రోజులో చేసే పనులన్నీ కష్టంతో, వత్తిడితో నిండి ఉన్నాయి. కాబట్టి రాత్రి పూట కూడా అతడి మనస్సుకు నెమ్మది దొరకదు. ఇది కూడా నిష్ప్రయోజనమే. అన్నపానాలు పుచ్చుకోవడం కంటే, తన కష్టంతో సంపాదించిన దానితో తృప్తి చెందడం కంటే మానవునికి శ్రేష్టమైంది లేదు. అది దేవుని వల్లనే కలుగుతుందని నేను గ్రహించాను. ఆయన అనుమతి లేకుండా భోజనం చేయడం, సంతోషించడం ఎవరికి సాధ్యం? ఎందుకంటే ఎవరైతే దేవుణ్ణి సంతోషింప జేస్తారో వాడికి దేవుడు జ్ఞానం, తెలివి, ఆనందం ఇస్తాడు. అయితే తనకిష్టమైన వాడికి ఇవ్వడానికి కష్టపడి పోగుచేసే పనిని ఆయన పాపాత్మునికి అప్పగిస్తాడు. ఇది కూడా నిష్ప్రయోజనం, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా ఉంది.
ప్రసంగి 2:20-26 పవిత్ర బైబిల్ (TERV)
అందుకని, నేను చేసిన శ్రమ అంతా నాకు విచారమే కలిగించింది. తన వివేకం, జ్ఞానం, నైపుణ్యం వీటన్నింటినీ వినియోగించి ఒకడు బాగా కష్టించి పని చేయవచ్చు. కాని, అతను మరణిస్తాడు, అతని శ్రమ ఫలితాలన్నింటిని ఇతరులు పొందుతారు. వాళ్లు ఏ శ్రమా చెయ్యలేదు. కాని, వాళ్లకి అన్నీ లభ్యమవుతాయి. ఇది నాకు చాలా విచారం కలిగిస్తుంది. ఇది అన్యాయమే కాదు, అర్థరహితం కూడా. ఒక మనిషి ఈ జీవితంలో నానా తంటాలూపడి, ఎంతో శ్రమ చేస్తాడు. చివరికి అతని చేతికి చిక్కేదేమిటి? చచ్చేదాకా అతను అనుభవించేది బాధలు, నిరాశా నిస్పృహలు, చేసేది (గొడ్డు) చాకిరీ. రాత్రి పూటకూడా మనిషి మనస్సు విశ్రాంతికి నోచు కోదు. ఇది కూడా అర్థరహితమైనదే. జీవితంలో సుఖాలు అనుభవించేందుకు నాకంటె ఎక్కువగా ప్రయత్నించిన మనషి మరొకడెవడైనా ఉన్నాడా? లేడు! నేను గ్రహించిన దేమిటంటే: మనిషి చెయ్యగలిగిన అత్యుత్తమమైన పని యేమిటంటే, తినడం, తాగడం, తాను చేసి తీరవలసిన పనిని సరదాగా చెయ్యడం. దేవుని ఆదేశం కూడా ఇదేనని నేను గ్రహించాను. మనిషి మంచి చేసి, దేవుణ్ణి సంతృప్తి పరిస్తే, అప్పుడిక దేవుడు ఆ మనిషికి వివేకాన్నీ, జ్ఞానాన్నీ, సుఖసంతోషాలనీ అనుగ్రహిస్తాడు. అయితే, పాపాలు చేసేవాడికి దేవుడు ప్రయాసపడే పని, పోగు చేసే పని, కుప్పలుగా పోసే పని మాత్రమే ఇస్తాడు. దేవుడు చెడ్డవానినుంచి తీసుకొని మంచివానికి ఇస్తాడు. అయితే, ఈ పని అంతా వ్యర్థమైనదిగానూ, గాలిని పట్టుకొనే ప్రయత్నంగానూ కనిపిస్తుంది.
ప్రసంగి 2:20-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస మంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయ వలసి వచ్చును; ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై యున్నది. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస మంతటిచేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది? వాని దినములన్నియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రియందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు; ఇదియువ్యర్థమే. అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జి తముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు. ఇదియును దేవునివలన కలుగునని నేను తెలిసి కొంటిని. ఆయన సెలవులేక భోజనముచేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టు డగువాని కిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయుపనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది.
ప్రసంగి 2:20-26 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి సూర్యుని క్రింద నేను పడిన కష్టమంతటి గురించి నేను నిరాశ చెందాను. ఒకరు జ్ఞానంతో తెలివితో నైపుణ్యంతో శ్రమించి పని చేస్తారు, కాని తర్వాత వారు దానిని శ్రమించని మరొకరికి వదిలేయాల్సి వస్తుంది. ఇది కూడా అర్థరహితమే, గొప్ప దురదృష్టకరమే. సూర్యుని క్రింద మనుష్యులు కష్టపడి చేస్తున్న పనులకు వారి శ్రమకు పొందుతున్నది ఏంటి? వారి రోజులన్నిటిలో వారు చేసే పనులన్నీ దుఃఖంతో బాధతో నిండి ఉన్నాయి; రాత్రి కూడా వారి మనస్సులు విశ్రాంతి తీసుకోవు. ఇది కూడా అర్థరహితమే. మనుష్యులు అన్నపానాలు పుచ్చుకుని తమ కష్టార్జితంతో మేలుపొందడం కంటే క్షేమం ఇంకేముంది? అయినా ఇది కూడా దేవుని వలనే కలుగుతుందని నేను తెలుసుకున్నాను. ఆయన అనుమతి లేకుండా, ఎవరు తినగలరు ఆనందాన్ని పొందగలరు? తనను సంతోషపెట్టే వారికి దేవుడు జ్ఞానం, తెలివి, సంతోషాన్ని ఇస్తారు, కాని దేవున్ని సంతోషపెట్టే వారికి కోసం సంపదను పోగుచేసే పని ఆయన పాపికి ఇస్తారు. ఇది కూడా అర్థరహితమే, గాలికి ప్రయాసపడడమే.