ప్రసంగి 2:12-26

ప్రసంగి 2:12-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నేను జ్ఞానం, పిచ్చితనం, బుద్ధిహీనతల గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. రాజు ఇంతకుముందే చేసిన దానికంటే, రాజు తర్వాత వచ్చేవాడు అధికంగా ఇంకేమి చేయగలడు? అనుకున్నాను. చీకటి కంటే వెలుగు మేలు అని, బుద్ధిహీనత కంటే జ్ఞానం మేలు అని నేను చూశాను. జ్ఞానికి తలలో కళ్లు ఉంటాయి. మూర్ఖుడు చీకటిలో నడుస్తాడు. అయినా అందరి విధి ఒకటే అని నేను గ్రహించాను. నాలో నేను అనుకున్నాను మూర్ఖుడికి సంభవించేదే నాకూ సంభవిస్తుంది. నేను ఇంత జ్ఞానం సంపాదించి నాకేం లాభం? “ఇది కూడా అర్థరహితం” అని నాలో నేననుకున్నాను. ఎందుకంటే మూర్ఖుల్లాగే జ్ఞానులు కూడా ఎక్కువకాలం జ్ఞాపకం ఉండరు; ఇరువురిని మరచిపోయే రోజులు ఇప్పటికే వచ్చాయి. మూర్ఖుల్లాగే జ్ఞానులు కూడ చస్తారు. ఇదంతా చూస్తూ ఉంటే సూర్యుని క్రింద జరుగుతున్న దాన్ని బట్టి నాకెంతో విచారం కలిగింది, కాబట్టి నేను నా జీవితాన్ని అసహ్యించుకున్నాను. అంతా అర్థరహితమే గాలికి ప్రయాసపడడమే. సూర్యుని క్రింద నేను కష్టపడి సాధించినవన్నీ నా తర్వాత వచ్చే వారికి చెందుతాయని తెలుసుకొని నేను వాటన్నిటిని అసహ్యించుకున్నాను. నా తర్వాత వచ్చేవాడు ఎలాంటివాడో ఎవరికి తెలుసు? అతడు జ్ఞాని కావచ్చు, మూర్ఖుడు కావచ్చు. ఎలాంటి వాడైనా సూర్యుని క్రింద నా శ్రమతో నైపుణ్యతతో సంపాదించినదంతా అతని స్వాధీనమౌతుంది. ఇది కూడా అర్థరహితమే. కాబట్టి సూర్యుని క్రింద నేను పడిన కష్టమంతటి గురించి నేను నిరాశ చెందాను. ఒకరు జ్ఞానంతో తెలివితో నైపుణ్యంతో శ్రమించి పని చేస్తారు, కాని తర్వాత వారు దానిని శ్రమించని మరొకరికి వదిలేయాల్సి వస్తుంది. ఇది కూడా అర్థరహితమే, గొప్ప దురదృష్టకరమే. సూర్యుని క్రింద మనుష్యులు కష్టపడి చేస్తున్న పనులకు వారి శ్రమకు పొందుతున్నది ఏంటి? వారి రోజులన్నిటిలో వారు చేసే పనులన్నీ దుఃఖంతో బాధతో నిండి ఉన్నాయి; రాత్రి కూడా వారి మనస్సులు విశ్రాంతి తీసుకోవు. ఇది కూడా అర్థరహితమే. మనుష్యులు అన్నపానాలు పుచ్చుకుని తమ కష్టార్జితంతో మేలుపొందడం కంటే క్షేమం ఇంకేముంది? అయినా ఇది కూడా దేవుని వలనే కలుగుతుందని నేను తెలుసుకున్నాను. ఆయన అనుమతి లేకుండా, ఎవరు తినగలరు ఆనందాన్ని పొందగలరు? తనను సంతోషపెట్టే వారికి దేవుడు జ్ఞానం, తెలివి, సంతోషాన్ని ఇస్తారు, కాని దేవున్ని సంతోషపెట్టే వారికి కోసం సంపదను పోగుచేసే పని ఆయన పాపికి ఇస్తారు. ఇది కూడా అర్థరహితమే, గాలికి ప్రయాసపడడమే.

ప్రసంగి 2:12-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తరువాత రాబోయే రాజు, ఇప్పటిదాకా జరిగిన దానికంటే ఎక్కువ ఏం చేయగలడు? అనుకుని, నేను జ్ఞానాన్ని, వెర్రితనాన్ని, బుద్ధిహీనతను గురించి ఆలోచించడం ప్రారంభించాను. అప్పుడు చీకటి కంటే వెలుగెంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరం అని నేను తెలుసుకున్నాను. జ్ఞాని కళ్ళు అతని తలలో ఉన్నాయి. బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తాడు. అయినా అందరి గమ్యం ఒక్కటే అని నేను గ్రహించాను. కాబట్టి బుద్ధిహీనుడికి జరిగేదే నాకూ జరుగుతుంది, మరి నేను ఇంత జ్ఞానం ఎందుకు సంపాదించాను అని నా హృదయంలో అనుకున్నాను. కాబట్టి ఇదీ నిష్ప్రయోజనమే. బుద్ధిహీనులకు జరిగినట్టే జ్ఞానులను కూడా ఎవరూ జ్ఞాపకం ఉంచుకోరు. రాబోయే రోజుల్లో వారందరినీ మర్చిపోతారు. బుద్ధిహీనుడు ఎలా చనిపోతాడో, జ్ఞాని కూడా అలాగే చనిపోతాడు. ఇదంతా చూస్తే సూర్యుని కింద జరిగేదంతా నన్ను కుంగదీసింది. అంతా నిష్ప్రయోజనంగా, ఒకడు గాలిని పట్టుకోడానికి బాధ పడినట్టుగా కనిపించింది. నాకు జీవితం మీద అసహ్యం వేసింది. సూర్యుని కింద నేను ఎంతో బాధపడి సాధించిన వాటన్నిటినీ నా తరవాత వచ్చేవాడికి విడిచిపెట్టాలని గ్రహించి నేను వాటిని అసహ్యించుకున్నాను. వాడు తెలివైనవాడో, బుద్ధిహీనుడో ఎవరికి తెలుసు? అయితే సూర్యుని కింద నేను బాధతో, జ్ఞానంతో సంపాదించినదంతా వాడి అధికారం కిందకు వెళ్తుంది. ఇదీ నిష్ప్రయోజనమే. కాబట్టి సూర్యుని కింద నేను పడిన కష్టమంతటి విషయంలో నేను నిస్పృహ చెందాను. ఒకడు జ్ఞానంతో, తెలివితో, నైపుణ్యంతో కష్టపడి ఒక పని చేస్తాడు. అయితే అతడు దాని కోసం పని చేయని వేరొకడికి దాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తున్నది. ఇది కూడా నిష్ప్రయోజనంగా, గొప్ప విషాదంగా ఉంది. సూర్యుని కింద మానవుడు పడే కష్టానికీ చేసే పనులకూ అతడికేం దొరుకుతున్నది? అతడు రోజులో చేసే పనులన్నీ కష్టంతో, వత్తిడితో నిండి ఉన్నాయి. కాబట్టి రాత్రి పూట కూడా అతడి మనస్సుకు నెమ్మది దొరకదు. ఇది కూడా నిష్ప్రయోజనమే. అన్నపానాలు పుచ్చుకోవడం కంటే, తన కష్టంతో సంపాదించిన దానితో తృప్తి చెందడం కంటే మానవునికి శ్రేష్టమైంది లేదు. అది దేవుని వల్లనే కలుగుతుందని నేను గ్రహించాను. ఆయన అనుమతి లేకుండా భోజనం చేయడం, సంతోషించడం ఎవరికి సాధ్యం? ఎందుకంటే ఎవరైతే దేవుణ్ణి సంతోషింప జేస్తారో వాడికి దేవుడు జ్ఞానం, తెలివి, ఆనందం ఇస్తాడు. అయితే తనకిష్టమైన వాడికి ఇవ్వడానికి కష్టపడి పోగుచేసే పనిని ఆయన పాపాత్మునికి అప్పగిస్తాడు. ఇది కూడా నిష్ప్రయోజనం, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా ఉంది.

ప్రసంగి 2:12-26 పవిత్ర బైబిల్ (TERV)

ఒక రాజు చేయగలినదానికంటె ఎక్కువ మరొకడెవడూ చేయలేడు. నీవీనాడు చేయాలని కోరుకో గలవాటన్నింటినీ ఏదో ఒక రాజు ఎన్నడో చేసేవున్నాడు. (రాజు చేసేపనులు కూడా వ్యర్థమేనని నేను గ్రహించాను.) అందుకని జ్ఞానార్జన గురించీ, మూర్ఖపు పనులు, మతిలేని పనులు చేయడం గురించీ నేను మరోసారి ఆలోచించ నారంభించాను. చీకటి కంటే వెలుగు మెరుగైనట్లే, మూర్ఖత్వంకంటె జ్ఞానం మెరుగైనదని నేను గ్రహించాను. అదెలాగంటే: తెలివైనవాడు తానెక్కడికి వెళ్తున్నది గ్రహించేందుకు తన మనస్సును కళ్లలా ఉపయోగించుకుంటాడు. కాగా, ఒక మూర్ఖుడు అంధకారంలో నడుస్తున్న వ్యక్తి వంటివాడు. అయితే, బుద్ధిమంతుడిది, బుద్ధిహీనుడిది కూడా ఒకటే గతి అని నేను గ్రహించాను. (ఇద్దరూ మరణిస్తారు) నాలో నేను ఇలా అనుకున్నాను, “ఒక బుద్ధిహీనుడికి పట్టే గతే నాకూ పడుతుంది. మరి జ్ఞానార్జన కోసం నేనెందుకు అంతగా తంటాలు పడినట్లు?” నేనింకా ఇలా అనుకున్నాను: “జ్ఞానార్జనకూడా ప్రయోజనం లేనిదే.” జ్ఞానవంతుడూ, అజ్ఞానీ ఇద్దరూ మరణిస్తారు! మరి జనం వివేకినీ శాశ్వతంగా గుర్తుంచుకోరు, అవివేకినీ శాశ్వతంగా గుర్తుంచుకోరు. భవిష్యత్తులో, వాళ్లు చేసిన పనులన్నింటినీ మరచిపోతారు. కాగా వాస్తవంలో వివేకికీ, అవివేకికీ మధ్య తేడా యేమీ లేదు. దీనితో నాకు జీవితం పట్ల ద్వేషం కలిగింది. ఈ జీవితంలో అన్నీ వ్యర్థమైనవే, గాలిని పట్టుకొన ప్రయత్నించడం వంటివే అనిపించి, నాకు విచారం కలిగింది. దానితో, నేను వెనక చేసిన గట్టి శ్రమ అంతటినీ ద్వేషించనారంభించాను. నేను గట్టి కృషిచేశాను. అయితే, నా కృషిఫలితాలను నా తర్వాత తరాలవాళ్లు అనుభవిస్తారని గ్రహించాను. నేను వాటిని నాతో తీసుకుపోలేను. నేను వేటికోసం అధ్యయనం చేశానో, వేటి కోసం పాటుపడ్డానో, వాటన్నింటిపైనా మరొకడెవడో అదుపు కలిగివుంటాడు. అతడు వివేకి అవుతాడో, అవివేకి అవుతాడో నాకు తెలియదు. ఇది కూడ తెలివి లేనిది. అందుకని, నేను చేసిన శ్రమ అంతా నాకు విచారమే కలిగించింది. తన వివేకం, జ్ఞానం, నైపుణ్యం వీటన్నింటినీ వినియోగించి ఒకడు బాగా కష్టించి పని చేయవచ్చు. కాని, అతను మరణిస్తాడు, అతని శ్రమ ఫలితాలన్నింటిని ఇతరులు పొందుతారు. వాళ్లు ఏ శ్రమా చెయ్యలేదు. కాని, వాళ్లకి అన్నీ లభ్యమవుతాయి. ఇది నాకు చాలా విచారం కలిగిస్తుంది. ఇది అన్యాయమే కాదు, అర్థరహితం కూడా. ఒక మనిషి ఈ జీవితంలో నానా తంటాలూపడి, ఎంతో శ్రమ చేస్తాడు. చివరికి అతని చేతికి చిక్కేదేమిటి? చచ్చేదాకా అతను అనుభవించేది బాధలు, నిరాశా నిస్పృహలు, చేసేది (గొడ్డు) చాకిరీ. రాత్రి పూటకూడా మనిషి మనస్సు విశ్రాంతికి నోచు కోదు. ఇది కూడా అర్థరహితమైనదే. జీవితంలో సుఖాలు అనుభవించేందుకు నాకంటె ఎక్కువగా ప్రయత్నించిన మనషి మరొకడెవడైనా ఉన్నాడా? లేడు! నేను గ్రహించిన దేమిటంటే: మనిషి చెయ్యగలిగిన అత్యుత్తమమైన పని యేమిటంటే, తినడం, తాగడం, తాను చేసి తీరవలసిన పనిని సరదాగా చెయ్యడం. దేవుని ఆదేశం కూడా ఇదేనని నేను గ్రహించాను. మనిషి మంచి చేసి, దేవుణ్ణి సంతృప్తి పరిస్తే, అప్పుడిక దేవుడు ఆ మనిషికి వివేకాన్నీ, జ్ఞానాన్నీ, సుఖసంతోషాలనీ అనుగ్రహిస్తాడు. అయితే, పాపాలు చేసేవాడికి దేవుడు ప్రయాసపడే పని, పోగు చేసే పని, కుప్పలుగా పోసే పని మాత్రమే ఇస్తాడు. దేవుడు చెడ్డవానినుంచి తీసుకొని మంచివానికి ఇస్తాడు. అయితే, ఈ పని అంతా వ్యర్థమైనదిగానూ, గాలిని పట్టుకొనే ప్రయత్నంగానూ కనిపిస్తుంది.

ప్రసంగి 2:12-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రాజు తరువాత రాబోవువాడు, ఇదివరకు జరిగిన దాని విషయము సయితము ఏమి చేయునో అనుకొని, నేను జ్ఞానమును వెఱ్ఱితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అంతట చీకటికంటె వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనతకంటె జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలిసికొంటిని. జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటియందు నడుచుచున్నాడు; అయినను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని. కావున–బుద్ధిహీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందనుకొంటిని. ఇదియు వ్యర్థమే. బుద్ధిహీనులనుగూర్చినట్లుగానే జ్ఞానులనుగూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని యుంచబడదు; రాబోవు దినములలో వారందరును మరువబడినవారై యుందురు; జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతి నొందు విధమట్టిదే. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను–అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రదుకుట నా కసహ్యమాయెను. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడైయుండునో బుద్ధిహీనుడైయుండునో అది ఎవ నికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాస పడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస మంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయ వలసి వచ్చును; ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై యున్నది. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస మంతటిచేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది? వాని దినములన్నియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రియందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు; ఇదియువ్యర్థమే. అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జి తముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు. ఇదియును దేవునివలన కలుగునని నేను తెలిసి కొంటిని. ఆయన సెలవులేక భోజనముచేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టు డగువాని కిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయుపనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది.

ప్రసంగి 2:12-26 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)