ద్వితీయోపదేశకాండము 8:11-20
ద్వితీయోపదేశకాండము 8:11-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త పడండి. మీరు కడుపారా తిని, మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తారు. మీ పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి చెంది, మీ వెండి బంగారాలు విస్తరించి, మీకు కలిగినదంతా వర్ధిల్లుతుంది. అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో. బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు. చివరికి మీకు మేలు చేయాలని ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని మీ పూర్వీకులు గాని ఎప్పుడూ ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించాడు. అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో. కాబట్టి మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈ రోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యం సంపాదించుకోడానికి మీకు సామర్ధ్యం కలిగించేవాడు ఆయనే. మీరు మీ యెహోవా దేవుణ్ణి మరచిపోయి ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని పూజించి నమస్కరిస్తే మీరు తప్పకుండా నశించి పోతారని ఈ రోజు మీ విషయంలో నేను సాక్ష్యం పలుకుతున్నాను. యెహోవా మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తున్న ఇతర జాతుల ప్రజలు విననట్టు మీ దేవుడైన యెహోవా మాట వినకపోతే మీరు కూడా వారిలాగానే నాశనమౌతారు.”
ద్వితీయోపదేశకాండము 8:11-20 పవిత్ర బైబిల్ (TERV)
“జాగ్రత్తగా ఉండండి మీ దేవుడైన యెహోవాను మరచిపోవద్దు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు. చట్టాలు, నియమాలు జాగ్రత్తగా పాటించండి. మీరు తినేందుకు ఆహారం సమృద్ధిగా మీకు ఉంటుంది, మీరు మంచి యిళ్లు కట్టుకొని వాటిలో నివాసం చేస్తారు. మీ పశువులు, మందలు విస్తారంగా పెరుగుతాయి. మీకు మరింత ఎక్కువ వెండి బంగారం ఉంటుంది. మీకు విస్తారంగా వస్తుసామగ్రి ఉంటుంది. అలా జరిగి నప్పుడు మీరు గర్వించకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ దేవుడైన యెహోవాను మీరు మరచిపోకూడదు. మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు దేశంనుండి ఆయనే మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు. భయంకర మైన మహాగొప్ప అరణ్యంలో మిమ్మల్ని యెహోవా నడిపించాడు. ఆ అరణ్యంలో విషసర్పాలు, తేళ్లు ఉండినవి. నేల ఎండిపోయి, ఎక్కడా నీళ్లు లేవు. కానీ యెహోవా మీకు బండలో నుండి నీళ్లు ఇచ్చాడు. మీ పూర్వీకులు ఎన్నడూ ఎరుగని మన్నాతో ఆయన మిమ్మల్ని అరణ్యంలో పోషించాడు. యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని దీనులుగా చేయాలను కొన్నాడు. అంతంలో మీకు అంతా మంచి జరగాలని ఆయన కోరాడు. ‘ఈ ఐశ్వర్యం అంతా నా శక్తి సామర్థ్యాలతో సంపాదించాను’ అని ఎన్నడూ మీలో మీరు అనుకోవద్దు. మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఐశ్వర్యం సంపాదించుకొనేందుకు శక్తిని యిచ్చేవాడు ఆయనే అని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవా ఎందుకు ఇలా చేస్తాడు? ఎందుకంటే మీ పూర్వీకులతో ఆయన చేసిన ఒడంబడికను ఈ వేళ ఆయన నిలబెట్టుకొంటున్నాడు గనుక. “ఎన్నటికీ మీ దేవుడైన యెహోవాను మరువకండి. ఇతర దేవుళ్లను పూజించి సేవించేందుకు ఎన్నడూ వాటిని అనుసరించవద్దు. మీరు అలా గనుక చేస్తే, ఈ వేళే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను; నిశ్చయంగా మీరు నాశనం చేయబడతారు. దేశాలను మీరు నాశనం చేసేటట్టు యెహోవా చేసాడు. మీ ఎదుట దేశాలను యెహోవా నాశనం చేస్తున్నట్టుగానే మీరూ నాశనం చేయబడతారు. మీ దేవుడైన యెహోవాకు మీరు విధేయులు కాలేదు గనుక ఇలా జరుగుతుంది.
ద్వితీయోపదేశకాండము 8:11-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు నీ గొఱ్ఱె మేకలును వృద్ధియై నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి, దాసులగృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర చెదవేమో. తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను, తుదకు నీకు మేలుచేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరు–మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి యితరదేవతల ననుసరించి పూజించి నమస్కరించినయెడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మునుగూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను. నీ యెదుటనుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయినయెడల మీరును వారివలెనే నశించెదరు.
ద్వితీయోపదేశకాండము 8:11-20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆయన ఆజ్ఞలను, చట్టాలను శాసనాలను పాటించడంలో విఫలమై మీ దేవుడనైన యెహోవాను మరచిపోకుండ జాగ్రత్తపడండి. లేకపోతే మీరు తిని తృప్తి చెందినప్పుడు, మీరు మంచి ఇళ్ళు కట్టుకుని వాటిలో స్థిరపడినప్పుడు, మీ పశువుల మందలు విస్తరించి, వెండి బంగారాలు విస్తరించి, మీకు ఉన్నదంతా వృద్ధి చెందినప్పుడు, మీ హృదయం గర్వించి, బానిస దేశమైన ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన మీ దేవుడైన యెహోవాను మరచిపోతారు. ఆయన మిమ్మల్ని విషసర్పాలు, తేళ్లు ఉన్న నీళ్లు లేని భయంకరమైన పెద్ద అరణ్యంలో నుండి నడిపించారు. రాతి బండ నుండి మీకు నీళ్లు ఇచ్చారు. ఆయన అరణ్యంలో మీ పూర్వికులకు ఎన్నడూ తెలియని మన్నాను మీకు తినడానికి ఇచ్చారు, మిమ్మల్ని తగ్గించడానికి మిమ్మల్ని పరీక్షించడానికి మీ మంచి కోసం ఇచ్చారు. “నా శక్తి, నా చేతుల బలం ఈ సంపదను నాకు సంపాదించాయి” అని మీలో మీరు అనుకోవచ్చు. కాని, మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, ఆయన మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లు, తన నిబంధన ఈ రోజు ఉన్నట్లుగా స్థిరపరచడానికి మీరు సంపదను సంపాదించే సామర్థ్యం ఇచ్చేవారు ఆయనే. మీరు మీ దేవుడనైన యెహోవాను మరచిపోయి, ఇతర దేవుళ్ళను వెంబడించి పూజించి వాటిని సేవిస్తే, మీరు ఖచ్చితంగా నశించిపోతారని మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నాను. మీ దేవుడైన యెహోవాకు లోబడకపోతే, మీ ఎదుట ఉండకుండా యెహోవా నాశనం చేసిన దేశాల్లా మీరు నాశనమవుతారు.