ద్వితీయోపదేశకాండము 8:1-20
ద్వితీయోపదేశకాండము 8:1-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు బ్రదికి అభివృద్ధినొంది యెహోవా మీపితరులతో ప్రమాణముచేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకొనునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము. ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ జేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలోనుండియు కొండలలోనుండియు పారు ఊటలును అగాధజలములునుగల దేశము. అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లునుగల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము; అందులో నీకు ఏ లోపముండదు. అది యినుపరాళ్లు గల దేశము; దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవుతిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు నీ గొఱ్ఱె మేకలును వృద్ధియై నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి, దాసులగృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర చెదవేమో. తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను, తుదకు నీకు మేలుచేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరు–మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి యితరదేవతల ననుసరించి పూజించి నమస్కరించినయెడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మునుగూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను. నీ యెదుటనుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయినయెడల మీరును వారివలెనే నశించెదరు.
ద్వితీయోపదేశకాండము 8:1-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“మీరు జీవించి, ఫలించి యెహోవా మీ పితరులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకునేలా ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని పాటించాలి. మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోడానికీ, మిమ్మల్ని లోబరచుకోడానికీ మీ యెహోవా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు. ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడిపోలేదు, మీ కాళ్ళు బరువెక్కలేదు. ఒక వ్యక్తి తన సొంత కొడుకుని ఏవిధంగా శిక్షిస్తాడో అదే విధంగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడని మీరు తెలుసుకోవాలి. ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనకు భయపడుతూ మీ యెహోవా దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఆయన నిన్ను ప్రవేశపెడుతున్న ఈ మంచి దేశం నీటి వాగులు, లోయలు కొండల నుండి పారే ఊటలు, అగాధ జలాలు గల దేశం. దానిలో గోదుమలు, బార్లీ, ద్రాక్షచెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు ఉంటాయి. అది ఒలీవ నూనె, తేనె లభించే దేశం. మీరు తినడానికి ఆహారం పుష్కలంగా లభించే దేశం. అందులో మీకు దేనికీ కొదువ ఉండదు. అది ఇనపరాళ్లు గల దేశం. దాని కొండల్లో మీరు రాగిని తవ్వి తీయవచ్చు. మీరు తిని తృప్తి పొంది మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మంచి దేశాన్నిబట్టి ఆయన్ను స్తుతించాలి. ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త పడండి. మీరు కడుపారా తిని, మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తారు. మీ పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి చెంది, మీ వెండి బంగారాలు విస్తరించి, మీకు కలిగినదంతా వర్ధిల్లుతుంది. అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో. బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు. చివరికి మీకు మేలు చేయాలని ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని మీ పూర్వీకులు గాని ఎప్పుడూ ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించాడు. అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో. కాబట్టి మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈ రోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యం సంపాదించుకోడానికి మీకు సామర్ధ్యం కలిగించేవాడు ఆయనే. మీరు మీ యెహోవా దేవుణ్ణి మరచిపోయి ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని పూజించి నమస్కరిస్తే మీరు తప్పకుండా నశించి పోతారని ఈ రోజు మీ విషయంలో నేను సాక్ష్యం పలుకుతున్నాను. యెహోవా మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తున్న ఇతర జాతుల ప్రజలు విననట్టు మీ దేవుడైన యెహోవా మాట వినకపోతే మీరు కూడా వారిలాగానే నాశనమౌతారు.”
ద్వితీయోపదేశకాండము 8:1-20 పవిత్ర బైబిల్ (TERV)
“ఈ వేళ నేను మీకు యిచ్చే ఆజ్ఞలు అన్నింటినీ మీరు విని, విధేయులు కావాలి. అప్పుడు మీరు జీవిస్తారు. మీరు యింకా యింకా అనేకమందిగా పెరిగి పోతారు. మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసిన దేశంలో మీరు ప్రవేశించి, జీవిస్తారు. ఈ 40 సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అరణ్యంలో నడిపించిన ఈ ప్రయాణం మొత్తం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. మిమ్మల్ని ఆయన దీనులుగా చేయాలి అనుకొన్నాడు. మీరు ఆయన ఆజ్ఞలకు విధేయులవుతున్నారో లేదో, మీ హృదయంలోని సంగతి ఆయన తెలుసుకోవాలి అనుకొన్నాడు. యెహోవా మిమ్మల్ని అణచి వేసి, ఆకలితో ఉండనిచ్చాడు. తర్వాత మీ పూర్వీకులు ఎన్నడూ చూడని, మీకు యింతకు ముందు తెలియని మన్నాతో మిమ్మల్ని ఆయన పోషించాడు. యెహోవా ఎందుకు ఈ సంగతులు జరిగించాడు? ఎందుకంటే మనుష్యుల్ని ఆహరం మాత్రమే బ్రతికించదు అని మీరు తెలుసుకోవాలని ఆయన కోరాడు గనుక. మనుష్యులు యెహోవా నోటనుండి వచ్చే ప్రతి మాటవలన బద్రుకుతారు. గడచిన ఈ 40 సంవత్సరాల్లో మీ బట్టలు చినిగిపోలేదు. మరియు మీ పాదాలు వాచిపోకుండ యెహోవా మిమ్మల్ని కాపాడాడు. ఒక తండ్రి తన కుమారునికి ప్రబోధం చేసినట్టే. మీకు ప్రబోధంచేసి, మిమ్మును సరిదిద్దేందుకే మీ దేవుడైన యెహోవా ఈ సంగతులన్నీ జరిగించాడని మీరు తెలుసుకోవాలి. “మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటికీ మీరు విధేయులు కావాలి. ఆయన మార్గాలలో నడుచుకొని, ఆయనను గౌరవించాలి. నదులు, నీటి మడుగులు ఉండి, కొండల్లో, లోయల్లో నీటి ఊటలు ప్రవహించే మంచి దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మును తీసుకొని వస్తున్నాడు. అది గోధుమ, యవలు, ద్రాక్షాతోటలు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లతో నిండిన దేశం. ఒలీవ నూనె, తేనెగల దేశం అది. అక్కడ మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు ఏమీ లేకుండా ఉండరు. ఆ దేశంలో మీరు ఆ కొండలు తవ్వి రాళ్లు, యినుము, రాగి తీయవచ్చును. మీరు తినాలని ఆశించేవి అన్నీ మీకు దొరుకుతాయి. అప్పుడు మీకు ఆయన యిచ్చిన మంచి దేశం కోసం మీరు మీ దేవుడైన యెహోవాను స్తుతిస్తారు. “జాగ్రత్తగా ఉండండి మీ దేవుడైన యెహోవాను మరచిపోవద్దు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు. చట్టాలు, నియమాలు జాగ్రత్తగా పాటించండి. మీరు తినేందుకు ఆహారం సమృద్ధిగా మీకు ఉంటుంది, మీరు మంచి యిళ్లు కట్టుకొని వాటిలో నివాసం చేస్తారు. మీ పశువులు, మందలు విస్తారంగా పెరుగుతాయి. మీకు మరింత ఎక్కువ వెండి బంగారం ఉంటుంది. మీకు విస్తారంగా వస్తుసామగ్రి ఉంటుంది. అలా జరిగి నప్పుడు మీరు గర్వించకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ దేవుడైన యెహోవాను మీరు మరచిపోకూడదు. మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు దేశంనుండి ఆయనే మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు. భయంకర మైన మహాగొప్ప అరణ్యంలో మిమ్మల్ని యెహోవా నడిపించాడు. ఆ అరణ్యంలో విషసర్పాలు, తేళ్లు ఉండినవి. నేల ఎండిపోయి, ఎక్కడా నీళ్లు లేవు. కానీ యెహోవా మీకు బండలో నుండి నీళ్లు ఇచ్చాడు. మీ పూర్వీకులు ఎన్నడూ ఎరుగని మన్నాతో ఆయన మిమ్మల్ని అరణ్యంలో పోషించాడు. యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని దీనులుగా చేయాలను కొన్నాడు. అంతంలో మీకు అంతా మంచి జరగాలని ఆయన కోరాడు. ‘ఈ ఐశ్వర్యం అంతా నా శక్తి సామర్థ్యాలతో సంపాదించాను’ అని ఎన్నడూ మీలో మీరు అనుకోవద్దు. మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఐశ్వర్యం సంపాదించుకొనేందుకు శక్తిని యిచ్చేవాడు ఆయనే అని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవా ఎందుకు ఇలా చేస్తాడు? ఎందుకంటే మీ పూర్వీకులతో ఆయన చేసిన ఒడంబడికను ఈ వేళ ఆయన నిలబెట్టుకొంటున్నాడు గనుక. “ఎన్నటికీ మీ దేవుడైన యెహోవాను మరువకండి. ఇతర దేవుళ్లను పూజించి సేవించేందుకు ఎన్నడూ వాటిని అనుసరించవద్దు. మీరు అలా గనుక చేస్తే, ఈ వేళే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను; నిశ్చయంగా మీరు నాశనం చేయబడతారు. దేశాలను మీరు నాశనం చేసేటట్టు యెహోవా చేసాడు. మీ ఎదుట దేశాలను యెహోవా నాశనం చేస్తున్నట్టుగానే మీరూ నాశనం చేయబడతారు. మీ దేవుడైన యెహోవాకు మీరు విధేయులు కాలేదు గనుక ఇలా జరుగుతుంది.
ద్వితీయోపదేశకాండము 8:1-20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీరు జీవించి అభివృద్ధిచెంది, యెహోవా మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశానికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకునేలా, ఈ రోజు నేను మీకిచ్చే ప్రతి ఆజ్ఞను జాగ్రత్తగా అనుసరించాలి. మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో అని మిమ్మల్ని పరీక్షించి మీ హృదయంలో ఏమున్నదో తెలుసుకోవడానికి మిమ్మల్ని దీనులుగా చేయడానికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అరణ్యంలో ఈ నలభై సంవత్సరాలు ఎలా నడిపించారో జ్ఞాపకం చేసుకోండి. మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు కాని యెహోవా నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు అని మీకు నేర్పించడానికి ఆయన మిమ్మల్ని అణచి మీకు ఆకలి కలిగించి మీకు గాని మీ పూర్వికులకు గాని ఇంతకుముందు తెలియని మన్నాతో మిమ్మల్ని పోషించారు. ఈ నలభై సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడలేదు, మీ కాళ్లు వాయలేదు. ఒకరు తన కుమారుని ఎలా క్రమశిక్షణలో పెడతారో, అలాగే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని మీ హృదయంలో మీరు గ్రహించాలి. మీరు మీ దేవుడైన యెహోవాయందు భయం కలిగి, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన ఆజ్ఞలను పాటించాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మంచి దేశంలోకి తీసుకెళ్తారు; అది నదులు నీటిప్రవాహాలు లోయల నుండి కొండల నుండి ఉబికే లోతైన నీటి ఊటలు ఉండే దేశం; అంతేకాదు గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూర చెట్లు దానిమ్మపండ్లు ఒలీవనూనె తేనె దొరికే దేశం; ఆ దేశంలో రొట్టెలకు కొరత ఉండదు మీకు ఏది తక్కువకాదు; ఇనుప రాళ్లు గల దేశం, దాని కొండల్లో మీరు రాగి త్రవ్వితీయవచ్చు. మీరు తిని తృప్తి చెందిన తర్వాత, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయనను స్తుతించండి. ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆయన ఆజ్ఞలను, చట్టాలను శాసనాలను పాటించడంలో విఫలమై మీ దేవుడనైన యెహోవాను మరచిపోకుండ జాగ్రత్తపడండి. లేకపోతే మీరు తిని తృప్తి చెందినప్పుడు, మీరు మంచి ఇళ్ళు కట్టుకుని వాటిలో స్థిరపడినప్పుడు, మీ పశువుల మందలు విస్తరించి, వెండి బంగారాలు విస్తరించి, మీకు ఉన్నదంతా వృద్ధి చెందినప్పుడు, మీ హృదయం గర్వించి, బానిస దేశమైన ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన మీ దేవుడైన యెహోవాను మరచిపోతారు. ఆయన మిమ్మల్ని విషసర్పాలు, తేళ్లు ఉన్న నీళ్లు లేని భయంకరమైన పెద్ద అరణ్యంలో నుండి నడిపించారు. రాతి బండ నుండి మీకు నీళ్లు ఇచ్చారు. ఆయన అరణ్యంలో మీ పూర్వికులకు ఎన్నడూ తెలియని మన్నాను మీకు తినడానికి ఇచ్చారు, మిమ్మల్ని తగ్గించడానికి మిమ్మల్ని పరీక్షించడానికి మీ మంచి కోసం ఇచ్చారు. “నా శక్తి, నా చేతుల బలం ఈ సంపదను నాకు సంపాదించాయి” అని మీలో మీరు అనుకోవచ్చు. కాని, మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, ఆయన మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లు, తన నిబంధన ఈ రోజు ఉన్నట్లుగా స్థిరపరచడానికి మీరు సంపదను సంపాదించే సామర్థ్యం ఇచ్చేవారు ఆయనే. మీరు మీ దేవుడనైన యెహోవాను మరచిపోయి, ఇతర దేవుళ్ళను వెంబడించి పూజించి వాటిని సేవిస్తే, మీరు ఖచ్చితంగా నశించిపోతారని మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నాను. మీ దేవుడైన యెహోవాకు లోబడకపోతే, మీ ఎదుట ఉండకుండా యెహోవా నాశనం చేసిన దేశాల్లా మీరు నాశనమవుతారు.