ద్వితీయోపదేశకాండము 7:1-6

ద్వితీయోపదేశకాండము 7:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలోకి మిమ్మల్ని రప్పించి అనేక జాతుల ప్రజలను, అంటే సంఖ్యలో గాని, బలంలో గాని మిమ్మల్ని మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే ఏడు జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టాడు. తరువాత, మీ యెహోవా దేవుడు యుద్ధంలో వారిపై మీకు విజయం అనుగ్రహించినప్పుడు మీరు వారిని చంపి పూర్తిగా నాశనం చేయాలి. వారితో ఒప్పందాలు చేసుకోకూడదు. వారిపై దయ చూపకూడదు. మీరు వారితో పెళ్ళి సంబంధాలు కలుపుకోకూడదు. వారి కొడుకులకు మీ కూతుళ్ళను ఇవ్వకూడదు. మీ కొడుకులకు వారి కూతుళ్ళను పుచ్చుకోకూడదు. ఎందుకంటే వారు నన్ను కాకుండా ఇతర దేవుళ్ళను పూజించేలా మీ కొడుకులను తిప్పివేస్తారు. దాని కారణంగా యెహోవా కోపం మీమీద రేగి ఆయన మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తాడు. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, వారి బలిపీఠాలు కూలదోసి, వారి విగ్రహాలు పగలగొట్టి, వారి దేవతా స్తంభాలు నరికేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయాలి. మీరు మీ యెహోవా దేవునికి ప్రతిష్ఠితమైన ప్రజలు. ఆయన భూమి మీద ఉన్న అన్ని జాతుల కంటే మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని తన స్వంత ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు.

ద్వితీయోపదేశకాండము 7:1-6 పవిత్ర బైబిల్ (TERV)

“మీరు స్వాధీనం చేసుకొనేందుకు ప్రవేశించబోతున్న దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్ములను తీసుకొని వస్తాడు. అనేక రాజ్యాలవాళ్లను – హిత్తీయులు, గిర్గాషీయులు, ఆమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు – మీకంటె బలంగల ఏడు గొప్ప రాజ్యాల వాళ్లను మీకోసం యెహోవా బలవంతంగా బయటకు వెళ్లగొడ్తాడు. ఈ రాజ్యాలను మీ దేవుడైన యెహోవా మీ అధికారం క్రింద ఉంచుతాడు. మీరు వారిని ఓడిస్తారు. మీరు వాళ్లను సర్వనాశనం చేయాలి. వాళ్లతో ఏ ఒడంబడిక చేసుకోవద్దు. వాళ్లకు దయ చూపించవద్దు. ఆ ప్రజల్లో ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు, ఆ ఇతర రాజ్యాలకు చెందిన ఎవరినీ మీ కుమారులనుగాని కుమారైలనుగాని పెళ్లి చేసుకోనివ్వవద్దు. ఎందుకంటే మీ పిల్లలు నన్ను వెంబడించకుండా ఆ ఇతరులు వారిని మళ్లిస్తారు. అప్పుడు మీ పిల్లలు ఇతర దేవుళ్లను సేవిస్తారు. కనుక యెహోవా మీ మీద కోపగిస్తాడు. వెంటనే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు. “ఈ రాజ్యలకు మీరు చేయాల్సింది యిదే, మీరు వారి బలిపీఠాలను విరుగగొట్టి, వాళ్ల స్మారక శిలలను ముక్కలుగా చేయాలి. వారి ఆషేరు స్తంభాలను నరికి వేసి, వారి విగ్రహాలను కాల్చివేయండి. ఎందుకంటే మీరు యెహోవాకు స్వంత ప్రజలు. భూమిమీద మొత్తం ప్రజలందరిలో మీరు ఆయనకు ప్రత్యేక ప్రజగా ఉండేందుకు – కేవలం ఆయనకు మాత్రమే చెందిన వారుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొన్నాడు.

ద్వితీయోపదేశకాండము 7:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవావారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను.

ద్వితీయోపదేశకాండము 7:1-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకువచ్చి, మీ ఎదుట నుండి అనేక జనాంగాలను అనగా మీకన్నా విస్తారమైన, బలమైన ఏడు జనాంగాలను హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వెళ్లగొట్టి, మీ దేవుడైన యెహోవా వారిని మీకు అప్పగించగా, మీరు వారిని ఓడించినప్పుడు, వారిని పూర్తిగా నాశనం చేయాలి. వారితో సంధి చేసుకోకూడదు వారిని కరుణించకూడదు. వారితో పెళ్ళి సంబంధాలు పెట్టుకోవద్దు. వారి కుమారులకు మీ కుమార్తెలను ఇవ్వకూడదు, మీ కుమారులకు వారి కుమార్తెలను పుచ్చుకోకూడదు, ఎందుకంటే వారు నన్ను అనుసరించకుండా ఇతర దేవుళ్ళను సేవించేలా మీ పిల్లలను త్రిప్పివేస్తారు, అప్పుడు యెహోవా కోపం మీమీద రగులుకొని మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తుంది. మీరు వారికి ఇలా చేయాలి: వారి బలిపీఠాలను పడగొట్టండి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టండి, వారి అషేరా స్తంభాలను ముక్కలు చేయండి, వారి విగ్రహాలను అగ్నితో కాల్చివేయండి. ఎందుకంటే, మీరు మీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ ప్రజలు. ఈ భూమి మీద ప్రజలందరిలో నుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తన సొంత ప్రజలుగా, విలువైన ఆస్తిగా ఎన్నుకున్నారు.