ద్వితీయోపదేశకాండము 6:6-9
ద్వితీయోపదేశకాండము 6:6-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి. మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి. అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.
ద్వితీయోపదేశకాండము 6:6-9 పవిత్ర బైబిల్ (TERV)
ఈవేళ నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని మీ పిల్లలకు నేర్పించేందుకు జాగ్రత్త వహించండి. మీరు మీ యింట్లో కూర్చున్నప్పుడు, మార్గంలో నడుస్తున్నప్పుడు ఈ ఆజ్ఞలను గూర్చి మాట్లాడుతూ ఉండండి. మీరు పడుకొనేప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుతూ ఉండండి. నా ప్రబోధాలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు సహాయకరంగా ఈ ఆజ్ఞలను మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంలా ధరించండి. మీ ఇండ్ల ద్వార బంధాలమీద, గవునుల మీద వాటిని వ్రాయండి.”
ద్వితీయోపదేశకాండము 6:6-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను. నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.
ద్వితీయోపదేశకాండము 6:6-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు మీ హృదయాల్లో నిలిచి ఉండాలి. వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వాటి గురించి మాట్లాడాలి. వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి. మీ ఇళ్ళ ద్వారబంధాల మీద, ద్వారాల మీద వాటిని వ్రాయండి.