ద్వితీయోపదేశకాండము 6:4-14
ద్వితీయోపదేశకాండము 6:4-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను. నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమునుబట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యములచేత నింప బడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీ కిచ్చిన తరువాత నీవుతిని తృప్తిపొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్తపడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను, అనగా మీ చుట్టునున్న జనముల దేవతలను సేవింపకూడదు.
ద్వితీయోపదేశకాండము 6:4-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు. నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి. మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి. అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి. మీ దేవుడు యెహోవా మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆ దేశంలోకి తీసుకెళ్ళి, మీరు కట్టని గొప్ప, మంచి పట్టణాలను మీకు ఇస్తున్నాడు. మీరు నింపని మంచి వస్తువులతో నిండిన ఇళ్ళనూ, మీరు తవ్వని బావులనూ, మీరు నాటని ద్రాక్షతోటలనూ ఒలీవ తోటలనూ మీకిస్తున్నాడు. అక్కడ మీరు తిని, తృప్తి పొందినప్పుడు, బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త వహించాలి. మీ యెహోవా దేవునికే భయపడాలి, ఆయననే పూజించాలి, ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి. మీరు ఇతర దేవుళ్ళను, అంటే మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల ప్రజల దేవుళ్ళను పూజింపకూడదు.
ద్వితీయోపదేశకాండము 6:4-14 పవిత్ర బైబిల్ (TERV)
“ఇశ్రాయేలు ప్రజలారా వినండి: యెహోవా ఒక్కడు మాత్రమే మన దేవుడు. మరియు మీరు మీ నిండు హృదయంతోను, మీ నిండు ఆత్మతోను, మీ నిండు బలంతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈవేళ నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని మీ పిల్లలకు నేర్పించేందుకు జాగ్రత్త వహించండి. మీరు మీ యింట్లో కూర్చున్నప్పుడు, మార్గంలో నడుస్తున్నప్పుడు ఈ ఆజ్ఞలను గూర్చి మాట్లాడుతూ ఉండండి. మీరు పడుకొనేప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుతూ ఉండండి. నా ప్రబోధాలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు సహాయకరంగా ఈ ఆజ్ఞలను మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంలా ధరించండి. మీ ఇండ్ల ద్వార బంధాలమీద, గవునుల మీద వాటిని వ్రాయండి.” “మీకు యిస్తానని చెప్పి మీ పూర్వీకులైన అబ్రాహాము ఇస్సాకు, యాకోబులకు ఆయన వాగ్దానం చేసిన ఆ దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకొనివస్తాడు. అప్పుడు మీరు నిర్మించని గొప్ప, ధనిక పట్టణాలను ఆయన మీకు ఇస్తాడు. మీరు సమకూర్చని మంచి వస్తువులతో నిండిపోయిన గృహాలను ఆయన మీకు ఇస్తాడు. మీరు త్రవ్వని బావులను యెహోవా మీకు ఇస్తాడు. మీరు నాటని ద్రాక్షాతోటలను, ఒలీవ చెట్లను యెహోవా మీకు ఇస్తాడు. భోజనానికి మీకు సమృద్ధిగా ఉంటుంది. “కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు బానిసలుగా జీవించిన ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చిన యెహోవాను మరచిపోకండి. మీ దేవుడైన యెహోవాను గౌరవించి ఆయనను మాత్రమే సేవించండి. ఆయన పేరు మీద మాత్రమే ప్రమాణాలు చేయాలి. (బూటకపు దేవుళ్ల పేర్లు ఉపయోగించవద్దు). మీరు యితర దేవుళ్లను అనుసరించకూడదు. మీ చుట్టూ నివసించే ప్రజల దేవుళ్లను మీరు అనుసరించకూడదు.
ద్వితీయోపదేశకాండము 6:4-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఓ ఇశ్రాయేలీయులారా, వినండి: మన దేవుడైన యెహోవా, యెహోవా ఒక్కరే. మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణబలంతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు మీ హృదయాల్లో నిలిచి ఉండాలి. వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వాటి గురించి మాట్లాడాలి. వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి. మీ ఇళ్ళ ద్వారబంధాల మీద, ద్వారాల మీద వాటిని వ్రాయండి. మీ దేవుడైన యెహోవా మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన రీతిగా మిమ్మల్ని ఆ దేశంలోనికి తీసుకువచ్చి మీరు కట్టని విశాలమైన మంచి పట్టణాలను, మీరు సమకూర్చని అన్ని రకాల మంచి వస్తువులతో నిండిన ఇళ్ళను, మీరు తవ్వని బావులను, మీరు నాటని ద్రాక్షతోటలు, ఒలీవల తోటలను మీకు ఇస్తారు; మీరు తిని తృప్తిపొందిన తర్వాత, బానిస దేశమైన ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్తగా ఉండండి. మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను మాత్రమే సేవించి, ఆయన పేరిట మాత్రమే మీరు ప్రమాణం చేయాలి. ఇతర దేవుళ్ళను అనగా మీ చుట్టూ ఉన్న ప్రజల దేవుళ్ళను అనుసరించకూడదు