ద్వితీయోపదేశకాండము 6:20-24
ద్వితీయోపదేశకాండము 6:20-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
భవిష్యత్తులో, “మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన నిబంధనలు, శాసనాలు, చట్టాలకు అర్థం ఏంటి?” అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు వారితో, “మనం ఈజిప్టులో ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు, యెహోవా బలమైన హస్తంతో మనలను ఈజిప్టులో నుండి బయటకు తీసుకువచ్చారు. మన కళ్లముందు యెహోవా ఈజిప్టు మీద, ఫరో మీద, అతని ఇంటివారందరి మీద గొప్ప, భయంకరమైన అసాధారణ గుర్తులను, అద్భుతాలను చేశారు. ఆయన మన పూర్వికులతో ప్రమాణం చేసిన దేశంలోనికి మనలను తీసుకువచ్చి దానిని మనకు ఇవ్వడానికి అక్కడినుండి మనలను బయటకు తీసుకువచ్చారు. మనం ఎల్లప్పుడు వర్ధిల్లుతూ, నేడు ఉన్నట్లుగా మనం బ్రతికి ఉండడానికి ఈ శాసనాలన్నిటికి లోబడి మన దేవుడైన యెహోవాకు భయపడమని యెహోవా మనకు ఆజ్ఞాపించారు.
ద్వితీయోపదేశకాండము 6:20-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇక ముందు మీ కొడుకులు, మన యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించిన శాసనాలు, కట్టడలు, విధులు ఏవి? అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వారితో ఇలా చెప్పాలి, మనం ఐగుప్తులో ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు యెహోవా తన బాహుబలంతో మనలను విడిపించాడు. యెహోవా ఐగుప్తు మీదా ఫరో మీదా అతని ఇంటివారందరి మీదా బాధాకరమైన, గొప్ప సూచకక్రియలూ అద్భుతాలూ మన కళ్ళ ఎదుట కనపరచి, తాను మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టడానికి అక్కడ నుండి మనలను రప్పించాడు. మనం ఎప్పుడూ సుఖశాంతులు కలిగి ఈ రోజు ఉన్నట్టు మనం జీవించేలా మన యెహోవా దేవునికి భయపడి ఈ కట్టడలనన్నిటినీ పాటించాలని మనకు ఆజ్ఞాపించాడు.
ద్వితీయోపదేశకాండము 6:20-24 పవిత్ర బైబిల్ (TERV)
“భవిష్యత్తులో ‘మన దేవుడైన యెహోవా మనకు ప్రబోధాలు, ఆజ్ఞలు, నియమాలు యిచ్చాడు గదా వాటి అర్థం ఏమిటి?’ అని నీ కుమారుడు నిన్ను అడగవచ్చును. అప్పుడు నీవు నీ కుమారునితో ఇలా చెప్పాలి, ‘మనం ఈజిప్టులో ఫరోకు బానిసలం, అయితే యెహోవా మహా బలంతో ఈజిప్టునుండి మనలను బయటకు తీసుకొని వచ్చాడు. మహాగొప్ప, ఆశ్చర్యకరమైన నిదర్శనాలు, అద్భుతాలు యెహోవా మనకు చూపించాడు. ఈజిప్టు ప్రజలకు, ఫరోకు, ఫరో ఇంటివాళ్లకు ఆయన ఈ సంగతులు జరిగించటం మనం చూశాము. మరియు యెహోవా మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకు ఇచ్చేందుకు ఆయన మనలను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఈ ప్రబోధాలన్నీ పాటించాలని యెహోవా మనకు ఆజ్ఞాపించాడు. అప్పుడు, మనం ఇప్పుడు ఉన్నట్టుగా ఎల్లప్పుడూ క్షేమంగా సజీవులంగా ఉండేటట్లు మన దేవుడైన యెహోవా మనలను కాపాడతాడు.
ద్వితీయోపదేశకాండము 6:20-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇకమీదట నీ కుమారుడు–మన దేవుడైన యెహోవా మీకాజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనుము–మనము ఐగుప్తులో ఫరోకు దాసులమైయుండగా యెహోవా బాహుబలముచేత ఐగుప్తులోనుండి మనలను రప్పించెను. మరియు యెహోవా ఐగుప్తుమీదను ఫరో మీదను అతని యింటివారందరి మీదను బాధకరములైన గొప్ప సూచకక్రియలను అద్భుతములను మన కన్నుల యెదుట కనుపరచి, తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశ పెట్టుటకు అక్కడనుండి మనలను రప్పించెను. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలె మనలను బ్రదికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడలనన్నిటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను.