ద్వితీయోపదేశకాండము 5:6-21
ద్వితీయోపదేశకాండము 5:6-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
‘బానిసల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఉన్న ఆకాశంలో గాని, కింద ఉన్న భూమిపైనే గాని, భూమి కింద ఉన్న నీళ్లలోనే గాని ఉండే దేని పోలికలోనైనా విగ్రహాన్ని చేసుకోకూడదు. వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. మీ దేవుడైన యెహోవా అనే నేను రోషం గల దేవుణ్ణి. నన్ను ద్వేషించేవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకూ తండ్రులు చేసిన దోషాన్ని కొడుకులపైకి రప్పిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారి విషయంలో వెయ్యి తరాల వరకూ కరుణిస్తాను. మీ దేవుడు యెహోవా పేరును అనవసరంగా పలకకూడదు, యెహోవా తన పేరును అనవసరంగా పలికేవాణ్ణి దోషిగా ఎంచుతాడు. మీ యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని చేయాలి. ఏడో రోజు మీ యెహోవా దేవునికి విశ్రాంతి దినం. ఆ రోజు మీరు, మీ కొడుకు, కూతురు, దాసుడు లేక దాసి, మీ ఎద్దు లేక గాడిద, మీ పశువుల్లో ఏదైనా సరే, మీ ఇంట్లో ఉన్న పరదేశితో సహా, ఏ పనీ చేయకూడదు. ఎందుకంటే మీకులాగా మీ దాసుడు, మీ దాసి కూడా విశ్రాంతి తీసుకోవాలి. మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవా తన బాహుబలంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడ నుండి రప్పించాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి, విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆయన మీకు ఆజ్ఞాపించాడు. మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీరు దీర్ఘాయువుతో, సుఖశాంతులు కలిగి ఉండేలా ఆయన మీకు ఆజ్ఞాపించినట్టు మీ తల్లి తండ్రులను గౌరవించండి. హత్య చేయకూడదు. వ్యభిచారం చేయకూడదు. దొంగతనం చేయకూడదు. మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. మీ పొరుగువాడి భార్యపై ఆశపడకూడదు. మీ పొరుగువాడి ఇంటిని, పొలాన్ని, పనివాణ్ణి, పనికత్తెని, ఎద్దును, గాడిదను, ఇంకా అతనికి చెందిన దేనినీ ఆశించకూడదు.’
ద్వితీయోపదేశకాండము 5:6-21 పవిత్ర బైబిల్ (TERV)
“మీరు బానిసలుగా జీవించిన ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుణ్ణి యెహోవాను నేనే. కనుక మీరు ఈ ఆజ్ఞలకు విధేయలుగా ఉండండి. “నన్ను తప్ప మరి ఏ దేవుళ్లనూ ఆరాధించవద్దు. “పైన ఆకాశంలోగాని, క్రింద భూమిమీదగాని, ఆ క్రింద సముద్రంలోగాని దేని విగ్రహమైనా, రూపం అయినా చేసుకోవద్దు. ఎలాంటి విగ్రహాలను కూడా పూజించవద్దు, సేవించవద్దు. ఎందుకంటే నేనే మీ దేవుడైన యెహోవాను. మరియు వాళ్ల పిల్లలను, పిల్లల పిల్లలను, ఆ పిల్లల పిల్లలను నేను శిక్షిస్తాను. అయితే నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలకు విధేయు లయ్యే ప్రజలయెడల నేను చాలా దయ చూపిస్తాను. అలాంటివారి వంశీయుల్లో వెయ్యితరాల వారివరకు నేను దయ చూపిస్తాను. “మీ దేవుడైన యెహోవా పేరును వ్యర్థంగా పలుకవద్దు. ఒక వ్యక్తి యెహోవా పేరును వ్యర్థంగా పలికితే ఆతడు దోషి. యెహోవా ఆతణ్ణి నిర్దోషిగా ఎంచడు. “సబ్బాతు రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇచ్చేందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి. వారం లోని ఇతర దినాలకంటే విశ్రాంతి దినాన్ని వేరుగా ఉంచమని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞ యిచ్చాడు. మొదటి ఆరు రోజులు మీ పని చేసుకొనేందుకు. అయితే ఏడో రోజు మీ దేవుడైన యెహోవా గౌరవార్థం విశ్రాంతి రోజు అవుతుంది. కనుక విశ్రాంతి రోజున ఏ వ్యక్తీ పనిచేయకూడదు. అంటే మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ ఆడ, మగ బానిసలు, మీ ఆవులు, మీ గాడిదలు, ఏ ఇతర జంతువులు, మీ పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులు, మీ బానిసలు కూడ మీవలెనే విశ్రాంతి తీసుకోగలగాలి. ఈజిప్టులో ఉన్నప్పుడు మీరూ బానిసలే అని మరచిపోవద్దు. మీ దేవుడైన యెహోవా తన మహా శక్తితో ఈజిప్టునుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేసాడు. అందుచేతనే ఎల్లప్పుడూ సబ్బాతు రోజును ఒక ప్రత్యేక రోజుగా ఆచరించాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. “నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. నీవు యిలా చేయాలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞ యిచ్చాడు. నీవు ఈ ఆజ్ఞను పాటిస్తే, నీవు చాలాకాలం బ్రతుకుతావు. నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో అంతా శుభం అవుతుంది. “ఎవరినీ హత్య చేయవద్దు. “వ్యభిచార పాపం చేయవద్దు. “ఏమీ దొంగిలించకు. “మరో వ్యక్తి చేసిన దాన్నిగూర్చి అబద్ధసాక్ష్యము చెప్పకు. “మరొకరికి చెందినవి నీవై యుంటే బాగుండునని ఆశించకు. ఇంకో వ్యక్తి భార్యను, అతని యింటిని, అతని పొలాలను, అతని మగ లేక ఆడ పనివారిని, అతని ఆవులను, అతని గాడిదలనుగాని ఇతరులకు చెందిన దేనినిగాని నీవు ఆశించకూడదు.”
ద్వితీయోపదేశకాండము 5:6-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి యందేగాని భూమి క్రిందనున్న నీళ్లయందేగాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు; వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనువారి విషయములో వేయితరములవరకు కరుణించువాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుము. ఆరుదినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిద యైనను నీ పశువులలో ఏదైనను నీ యిండ్లలోనున్న పర దేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తుదేశమందు దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడనుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందు చేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువానిమీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు; నీ పొరుగువాని యింటినైనను వాని పొలమునైనను వాని దాసినైనను వాని దాసినినైనను వాని యెద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.
ద్వితీయోపదేశకాండము 5:6-21 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే. “నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని భూమి క్రింద నీళ్లలో గాని ఉన్న దేని రూపంలో మీరు మీకోసం ప్రతిమను చేసుకోకూడదు. మీరు వాటికి నమస్కరించకూడదు పూజింపకూడదు; ఎందుకంటే నేను, మీ దేవుడనైన యెహోవాను, రోషం గల దేవుడను, నన్ను ద్వేషించినవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల పాపం యొక్క శిక్షను వారి పిల్లల మీదికి రప్పిస్తాను. అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించే వారికి వెయ్యి తరాల వరకు కరుణను చూపిస్తాను. మీ దేవుడైన యెహోవా నామాన్ని అనవసరంగా ఉపయోగించకూడదు, ఎందుకంటే తన నామాన్ని అనవసరంగా ఉపయోగించే వారిని యెహోవా నిర్దోషులుగా వదిలేయరు. యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించడం జ్ఞాపకముంచుకోండి. ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని అంతటిని చేసుకోవాలి, కాని ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, మీరు గాని, మీ కుమారుడు లేదా కుమార్తె గాని, మీ దాసదాసీలు గాని, మీ ఎద్దు గాని, మీ గాడిద గాని, మీ పశువులు గాని, మీ పట్టణాల్లో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు తద్వార మీలా మీ దాసదాసీలు విశ్రాంతి తీసుకుంటారు. మీరు ఈజిప్టులో బానిసత్వంలో ఉన్నప్పుడు, మీ దేవుడైన యెహోవా బలమైన హస్తంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడినుండి బయటకు తీసుకువచ్చారని జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి సబ్బాతు దినాన్ని పాటించమని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులై మీకు క్షేమం కలిగేలా మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారం, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి. మీరు హత్య చేయకూడదు. మీరు వ్యభిచారం చేయకూడదు. మీరు దొంగతనం చేయకూడదు. మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు. మీ పొరుగువాని భార్యను మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని ఇంటిని గాని స్థలాన్ని గాని అతని దాసుని గాని, దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”