ద్వితీయోపదేశకాండము 5:27-33
ద్వితీయోపదేశకాండము 5:27-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నువ్వే వెళ్ళి మన దేవుడు యెహోవా చెప్పేదంతా విను. ఆయన నీతో చెప్పిన దానంతటినీ నువ్వే మాతో చెబితే మేము విని దాన్ని పాటిస్తాం అని చెప్పారు.’ మీరు నాతో చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు. ‘ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను. వారు చెప్పినదంతా మంచిదే. వారికీ వారి సంతానానికీ ఎప్పుడూ సుఖశాంతులు కలిగేలా వారు నాపట్ల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని పాటించే మనస్సు వారికి ఉండడం మంచిది. “వారి వారి గుడారాల్లోకి తిరిగి వెళ్ళమని” వారితో చెప్పు. నువ్వు మాత్రం ఇక్కడ నా దగ్గర ఉండు. నువ్వు వారికి బోధించాల్సిన కట్టడలనూ విధులనూ నేను నీతో చెబుతాను.’ వారు స్వాధీనం చేసుకోడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఆ విధంగా ప్రవర్తించాలి. మీరు కుడికి ఎడమకి తిరగకుండా మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన విధంగా చేయడానికి జాగ్రత్తపడాలి. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నివసిస్తూ సుఖశాంతులతో దీర్ఘాయుష్మంతులయ్యేలా మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిటిలో నడుచుకోవాలి.”
ద్వితీయోపదేశకాండము 5:27-33 పవిత్ర బైబిల్ (TERV)
మోషే, నీవు దగ్గరగా వెళ్లి, మన దేవుడైన యెహోవా చెబుతున్న సంగతులన్నీ విను. తర్వాత, యెహోవా నీకు చెప్పే విషయాలన్నీ నీవు మాకు చెప్పు. మేము నీ మాట వింటాము, నీవు చెప్పేది అంతా చేస్తాము.’ “మీరు నాతో చెప్పిన సంగతులను యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో అన్నాడు, ‘ఈ ప్రజలు చెప్పిన విషయాలు నేను విన్నాను. వారు చెప్పింది అంతా మంచిదే. వారు ఎల్లప్పుడూ వారి హృదయాల్లో నన్ను గౌరవించి, నా ఆజ్ఞలన్నింటికీ విధేయులైతే బాగుండును అని మాత్రమే నా కోరిక. అప్పుడు వాళ్లకు, వాళ్ల సంతతివారికి సర్వం శుభం అవుతుంది. “‘వెళ్లి, ప్రజలందరినీ వారి గుడారాలకు వెళ్లి పొమ్మని చెప్పు. అయితే మోషే, నీవు యిక్కడ నాకు దగ్గరగా నిలబడు. నీవు వాళ్లకు నేర్పించాల్సిన ఆజ్ఞలు, చట్టాలు, నియమాలు అన్నీ నీకు నేను చెబుతాను. వారు జీవించేందుకు నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఈ పనులు చేయాలి’. “అందుచేత యెహోవా మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసేందుకు మీరు జాగ్రత్తగా వుండాలి. మీరు దేవుణ్ణి అనుసరించటం మానకూడదు. మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన విధంగా మీరు జీవించాలి. అప్పుడు మీరు జీవించడం కొనసాగుతుంది, మీకు అంతా శుభ ప్రదం అవుతుంది. మరియు మీది కాబోతున్న ఆ దేశంలో మీ జీవితం పొడిగించబడుతుంది.
ద్వితీయోపదేశకాండము 5:27-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పినయెడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి. మీరు నాతో మాటలాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను–ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని యున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లువారు నాయందు భయభక్తులుకలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు. –మీ గుడా రములలోనికి తిరిగి వెళ్లుడని నీవు వారితో చెప్పుము. అయితే నీవు ఇక్కడ నాయొద్ద నిలిచియుండుము. నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని, అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను. వారు స్వాధీనపరచు కొనునట్లు నేను వారికిచ్చుచున్న దేశమందువారు ఆలాగు ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికేగాని యెడమకేగాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్తపడవలెను. మీరు స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలుకలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను.
ద్వితీయోపదేశకాండము 5:27-33 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నీవే దగ్గరకు వెళ్లి మన దేవుడైన యెహోవా చెప్పినదంతా విను. తర్వాత మన దేవుడైన యెహోవా నీకు చెప్పినదంతా నీవు మాకు చెప్పు, మేము వింటాము, లోబడతాము.” మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు విన్నారు, యెహోవా నాతో ఇలా అన్నారు, “ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను. వారు చెప్పిందంతా మంచిదే. వారికి వారి సంతతికి నిరంతరం క్షేమం కలిగేలా వారు నా పట్ల భయం కలిగి, నా ఆజ్ఞలన్నిటిని అనుసరించే హృదయం వారికుంటే ఎంతో మంచిది. “నీవు వెళ్లి, వారి గుడారలకు వారిని తిరిగి వెళ్లమని చెప్పు. అయితే నీవు ఇక్కడ నాతో ఉండు, ఎందుకంటే వారు స్వాధీనం చేసుకోవడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో పాటించేలా నీవు బోధించాల్సిన ఆజ్ఞలు, శాసనాలు చట్టాలు నీకు ఇస్తాను.” కాబట్టి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన వాటిని చేయడంలో జాగ్రత్త వహించండి; కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు జీవిస్తూ, అభివృద్ధి పొందుతూ, ఎక్కువకాలం జీవించేలా, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలో నడవండి.