ద్వితీయోపదేశకాండము 31:9-13
ద్వితీయోపదేశకాండము 31:9-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాబట్టి మోషే ఈ ధర్మశాస్త్రాన్ని వ్రాసి, లేవీయులైన యాజకులకు అంటే యెహోవా నిబంధన మందసాన్ని మోసేవారికి, ఇశ్రాయేలీయుల పెద్దలందరికి ఇచ్చాడు. తర్వాత మోషే, “ప్రతి ఏడు సంవత్సరాల చివరిలో, అప్పులు రద్దు చేసే సంవత్సరంలో, గుడారాల పండుగ సమయంలో, ఇశ్రాయేలీయులందరు మీ దేవుడైన యెహోవా ఎదుట ఆయన ఎంచుకున్న స్థలంలో కనబడినప్పుడు, మీరు వారందరికి ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాలి. మీ పట్టణాల్లో నివసిస్తున్న పురుషులు, స్త్రీలు, పిల్లలు, విదేశీయులను సమకూర్చండి. అప్పుడు వారు విని మీ దేవుడైన యెహోవాకు భయపడటం, ఈ ధర్మశాస్త్రంలోని అన్ని మాటలను జాగ్రత్తగా పాటించడం నేర్చుకుంటారు. ఈ ధర్మశాస్త్రం తెలియని వారి పిల్లలు తప్పక విని, మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటి వెళ్లబోయే దేశంలో మీరు నివసించినంత కాలం మీ దేవుడైన యెహోవాకు భయపడటం నేర్చుకోవాలి.”
ద్వితీయోపదేశకాండము 31:9-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మోషే ఈ ధర్మశాస్త్రాన్ని రాసి, యెహోవా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులకూ ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ ఇచ్చాడు. మోషే వారికిలా ఆజ్ఞాపించాడు, “ప్రతి ఏడవ సంవత్సరంలో అంటే అప్పులు రద్దు చేసే ఆ నిర్ణీత గడువు సంవత్సరంలో పర్ణశాలల పండగ సమయంలో మీ దేవుడైన యెహోవా ఎన్నుకున్న స్థలంలో ఇశ్రాయేలు ప్రజలంతా ఆయన ఎదుట కనబడాలి. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వారికి వినిపించాలి. మీ యెహోవా దేవునికి భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ విని, వాటి ప్రకారం నడుచుకునేలా ప్రజలను సమకూర్చాలి. పురుషులనూ స్త్రీలనూ పిల్లలనూ మీ పట్టణాల్లో ఉన్న పరదేశులను పోగు చెయ్యాలి. అలా చేస్తే, ఆ వాక్యాలు ఎరగనివారి పిల్లలు వాటిని విని, మీరు స్వాధీనం చేసుకోడానికి యొర్దాను నది దాటబోతున్న దేశంలో మీరు జీవించే రోజులన్నీ మీ యెహోవా దేవునికి భయపడడం నేర్చుకుంటారు.”
ద్వితీయోపదేశకాండము 31:9-13 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు మోషే ఈ ధర్మశాస్త్రం వ్రాసి, లేవీ సంతానపు యాజకులకు ఇచ్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టె మోసే పని వాళ్లదే. ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు నాయకులందరికి కూడా మోషే యిచ్చాడు. తర్వాత మోషే నాయకులకు ఆజ్ఞాపించాడు. అతను ఇలా చెప్పాడు: “ప్రతి ఏడు సంవత్సరాల ఆఖరిలో, స్వాతంత్ర్యపు సంవత్సరంలో, పర్ణశాలల పండుగ సమయములో ఈ ధర్మశాస్త్రం చదవండి. ఆ సమయంలో మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే ప్రత్యేక స్థలంలో ఆయనను కలుసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలంతా వస్తారు. అప్పుడు ప్రజలు వినగలిగేటట్టు నీవు వారికి ఈ ధర్మశాస్త్రం చదివి వినిపించాలి. పురుషులు, స్త్రీలు చిన్నపిల్లలు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు అందరిని సమావేశ పర్చాలి. వాళ్లు ధర్మశాస్త్రాన్ని విని, మీ దేవుడైన యెహోవాను గౌరవించంటం నేర్చుకుంటారు. ఈ ధర్మశాస్త్రంలోని ఆదేశాలకు వారు జాగ్రత్తగా విధేయులవుతారు. ధర్మశాస్త్రం ఎరుగనివారి సంతానంవాళ్లంతా దానిని వింటారు. వాళ్లు మీ దేవుడైన యెహోవాను గౌరవించటం నేర్చుకుంటారు. యొర్దాను నది ఆవలి ప్రక్క మీరు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో మీరు జీవించినంత కాలం వారు ఆయనను గౌరవిస్తారు.”
ద్వితీయోపదేశకాండము 31:9-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధనమందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికిని దాని నప్పగించి వారితో ఇట్లనెను–ప్రతి యేడవ సంవత్సరాంతమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరు ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించునప్పుడు ఇశ్రాయేలీయులందరి యెదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను. ఆలాగు నేర్చుకొనినయెడల దాని నెరుగని వారి సంతతివారు దానిని విని, మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశమున మీరు బ్రదుకు దినములన్నియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చు కొందురు.