ద్వితీయోపదేశకాండము 28:11-14
ద్వితీయోపదేశకాండము 28:11-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా మీకిస్తానని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా మీ గర్భఫలాన్నీ మీ పశువులనూ మీ పంటనూ సమృద్ధిగా వర్ధిల్లజేస్తాడు. యెహోవా మీ దేశం మీద దాని కాలంలో వాన కురిపించడానికీ మీరు చేసే పనంతటినీ ఆశీర్వదించడానికీ ఆకాశ గిడ్డంగులను తెరుస్తాడు. మీరు అనేక రాజ్యాలకు అప్పిస్తారు కాని అప్పు చెయ్యరు. ఇవ్వాళ నేను మీకాజ్ఞాపించే మాటలన్నిటిలో ఏ విషయంలోనూ కుడివైపుకు గాని, ఎడమవైపుకు గాని తొలగిపోకుండా వేరే దేవుళ్ళను పూజించడానికి వాటి వైపుకు పోకుండా మీరు అనుసరించి నడుచుకోవాలని ఇవ్వాళ నేను మీ కాజ్ఞాపిస్తున్నాను. మీ యెహోవా దేవుని ఆజ్ఞలు విని, వాటిని పాటిస్తే యెహోవా మిమ్మల్ని తలగా చేస్తాడు గానీ తోకగా చెయ్యడు. మీరు పైస్థాయిలో ఉంటారు గానీ కిందిస్థాయిలో ఉండరు.
ద్వితీయోపదేశకాండము 28:11-14 పవిత్ర బైబిల్ (TERV)
“మరియు యెహోవా దేవుడు మీకు ఎన్నో మంచి వాటిని ఇస్తాడు. ఆయన మీకు ఎంతోమంది పిల్లల్ని ఇస్తాడు. మీ పశువులకు ఆయన ఎన్నో దూడ పిల్లలను ఇస్తాడు. మీకు ఇస్తానని యెహోవా మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ఆయన మీకు మంచి పంట ఇస్తాడు. యెహోవా తన గొప్ప ఆశీర్వాదాల్ని దాచి ఉంచిన ఆకాశాన్ని తెరచి. సరైన సమయంలో మీ భూమిమీద ఆయన వర్షం కురిపిస్తాడు. మీరు చేసే పనులన్నింటినీ యెహోవా ఆశీర్వదిస్తాడు. అనేక రాజ్యాలకు అప్పు ఇచ్చేంత ధనం మీ దగ్గర ఉంటుంది. కానీ మీరు వారి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. యెహోవా మిమ్మల్ని తలగానే ఉంచు తాడుగాని తోకగాకాదు. మీరు పైవారు గానే ఉంటారు కాని క్రిందవారుగా ఉండరు. ఈ వేళ నేను మీకు చెబుతున్న మీ దేవుడైన యెహోవా ఆదేశాలకు మీరు విధేయులైతే ఇదంతా జరుగుతుంది. ఈ ఆజ్ఞలకు మీరు జాగ్రత్తగా విధేయులు కావాలి. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ప్రభోధాల్లో దేనినుండీ మీరు తప్పి పోకూడదు. మీరు కుడి ప్రక్కకు గాని ఎడమ ప్రక్కకు గాని తొలగిపోకూడదు. మీరు ఇతర దేవుళ్లను సేవించడానికి వారిని వెంబడించ కూడదు.
ద్వితీయోపదేశకాండము 28:11-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవుచేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనములకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు నేడు నేను మీకాజ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికిగాని యెడమకుగాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.
ద్వితీయోపదేశకాండము 28:11-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భ ఫలంలో, మీ పశువుల పిల్లల్లో, మీ నేల పంటల్లో మీకు సమృద్ధిగా వృద్ధిని ఇస్తారు. కాలానుగుణంగా మీ భూమిపై వర్షం కురిపించడానికి, మీ చేతి పనులన్నింటినీ దీవించడానికి యెహోవా తన ఆకాశ గిడ్డంగులను తెరుస్తారు. మీరు అనేక దేశాలకు అప్పు ఇస్తారు, కానీ ఎవరినుండి అప్పు తీసుకోరు. యెహోవా మిమ్మల్ని తలగా చేస్తారు, తోకగా కాదు. ఈ రోజు నేను మీకు ఇచ్చే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు శ్రద్ధగా గమనించి, వాటిని జాగ్రత్తగా పాటిస్తే, మీరు పై వారిగా ఉంటారు, క్రింది వారిగా ఉండరు. ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, వారిని సేవిస్తూ, ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆజ్ఞల నుండి కుడికి గాని ఎడమకు గాని తిరగవద్దు.