ద్వితీయోపదేశకాండము 2:1-7
ద్వితీయోపదేశకాండము 2:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యెహోవా నాతో చెప్పిన విధంగా మనం తిరిగి ఎర్రసముద్రం దారిలో ఎడారి గుండా చాలా రోజులు శేయీరు కొండ చుట్టూ తిరిగాం. యెహోవా నాకు ఇలా చెప్పాడు. “మీరు ఈ కొండ చుట్టూ తిరిగింది చాలు, ఉత్తరం వైపుకు వెళ్ళండి. నువ్వు ప్రజలతో ఇలా చెప్పు. ‘శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మీ సోదరుల సరిహద్దులు దాటి వెళ్లబోతున్నారు, వారు మీకు భయపడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వారితో కలహం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏశావుకు శేయీరును స్వాస్థ్యంగా ఇచ్చింది నేనే. వారి భూమిలోనిది ఒక్క అడుగైనా మీకియ్యను. మీరు డబ్బులిచ్చి వారి దగ్గర ఆహారం కొని తినవచ్చు. డబ్బులిచ్చి నీళ్లు కొని తాగవచ్చు.’ ఎందుకంటే మీ చేతి పని అంతటినీ మీ యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. ఈ గొప్ప ఎడారిలో నువ్వు ఈ నలభై సంవత్సరాలు తిరిగిన సంగతి ఆయనకు తెలుసు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు, మీకేమీ తక్కువ కాదు.”
ద్వితీయోపదేశకాండము 2:1-7 పవిత్ర బైబిల్ (TERV)
“అప్పుడు మనం తిరిగి ఎర్రసముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణం చేసాము. మనం చేయవలెనని యెహోవా నాతో చెప్పింది అదే. చాలా రోజుల వరకు మనం శేయారు కొండ దేశం గుండా వెళ్లాము. అప్పుడు నాతో యెహోవా అన్నాడు: ‘మీరు ఈ కొండ దేశంగుండా చాలా తిరిగారు. ఉత్తర దిశగా తిరగండి. మరియు మీకు ఇలా చెప్పమని ఆయన నాతో చెప్పాడు: మీరు శేయీరు దేశం గుండా దాటిపోతారు. ఈ దేశం మీ బంధువులైన ఏశావు సంతతివారికి చెందినది. వారు మీకు భయపడతారు. చాలా జాగ్రతగా ఉండండి. వారితో యుద్ధం చేయకండి. వారి దేశంలో ఏమాత్రం ఒక్క అడుగు కూడ నేను మీకు యివ్వను. ఎందుకంటే శేయీరు కొండ దేశాన్ని ఏశావుకు స్వంతంగా ఉండేందుకు నేను యిచ్చాను. అక్కడ మీరు తినే భోజనానికిగాని, త్రాగే నీటికిగాని మీరు ఏశావు ప్రజలకు వెల చెల్లించాలి. మీరు చేసిన ప్రతిదానిలోనూ మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మహా ఎడారిలో మీరు నడవటం ఆయనకు తెలుసు. ఈ 40 సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు గనుక మీకు అవసరమైనవి అన్నీ ఎల్లప్పుడూ మీకు దొరికాయి’
ద్వితీయోపదేశకాండము 2:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎఱ్ఱసముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పోయి బహు దినములు శేయీరు మన్నెము చుట్టు తిరిగి తిమి. అంతట యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను –మీరు ఈ మన్నెముచుట్టు తిరిగినకాలము చాలును; ఉత్తరదిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము –శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను. మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. నీచేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమియు తక్కువకాదు.
ద్వితీయోపదేశకాండము 2:1-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా నాతో చెప్పిన ప్రకారం మనం వెనుకకు తిరిగి ఎర్ర సముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణమై వెళ్లి చాలా రోజులు శేయీరు కొండ ప్రాంతం చుట్టూ తిరిగాము. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “మీరు ఈ కొండ ప్రాంతం చుట్టూ తిరిగింది చాలు; ఉత్తరం వైపు తిరగండి. ప్రజలకు ఈ ఆదేశాలు ఇవ్వు: ‘శేయీరులో నివసిస్తున్న ఏశావు సంతానమైన మీ బంధువుల భూభాగం గుండా వెళ్లబోతున్నారు. వారు మీకు భయపడతారు, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. వారితో ఘర్షణ పడకండి, ఎందుకంటే నేను వారి భూమిలో ఒక్క అడుగు కూడా మీకు ఇవ్వను. నేను ఏశావుకు స్వాస్థ్యంగా శేయీరు కొండ ప్రాంతాన్ని ఇచ్చాను. మీరు వారికి వెండి ఇచ్చి తినడానికి ఆహారం, త్రాగడానికి నీరు కొనుక్కోవాలి.’ ” మీ దేవుడైన యెహోవా మీ చేతి పనులన్నిటిని ఆశీర్వదించారు, ఈ గొప్ప అరణ్యం గుండా మీ ప్రయాణాన్ని ఆయన చూసుకున్నారు. ఈ నలభై సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నారు, మీకు ఏది తక్కువ కాలేదు.