ద్వితీయోపదేశకాండము 16:1-8

ద్వితీయోపదేశకాండము 16:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱె మేకలలోగాని గోవులలోగాని బలి అర్పింపవలెను. పస్కా పండు గలో పొంగినదేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తుదేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశములోనుండి వచ్చిన దినమును నీ జీవితమంతటిలో జ్ఞాపకము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను. నీ ప్రాంతములన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేది సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయమువరకు మిగిలియుండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవేళను, అనగా సూర్యుడు అస్త మించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి, ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్లవలెను. ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము, అందులో నీవు జీవనోపాధియైన యేపనియు చేయకూడదు.

ద్వితీయోపదేశకాండము 16:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“మీరు ఆబీబు నెలలో పండగ ఆచరించి మీ యెహోవా దేవునికి పస్కా పండగ జరిగించాలి. ఎందుకంటే ఆబీబు నెలలో రాత్రివేళ మీ యెహోవా దేవుడు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించాడు. యెహోవా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే మీ యెహోవా దేవునికి పస్కా ఆచరించి, గొర్రెలను, మేకలను, ఆవులను బలి అర్పించాలి. పస్కా పండగలో కాల్చినప్పుడు పొంగకుండా ఉన్న రొట్టెలను తినాలి. మీరు ఐగుప్తు దేశం నుండి త్వరత్వరగా వచ్చారు గదా. మీరు వచ్చిన రోజును మీ జీవితం అంతటిలో జ్ఞాపకం ఉంచుకునేలా పొంగని రొట్టెలు ఏడు రోజులపాటు తినాలి. మీ పరిసరాల్లో ఏడు రోజులపాటు పొంగినది ఏదీ కనిపించకూడదు. అంతేకాదు, మీరు మొదటి రోజు సాయంత్రం వధించిన దాని మాంసంలో కొంచెం కూడా ఉదయం వరకూ మిగిలి ఉండకూడదు. మీ దేవుడు యెహోవా మీకిస్తున్న పట్టణాల్లో ఏదో ఒక దానిలో పస్కా పశువును వధించకూడదు. మీ దేవుడు యెహోవా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకునే స్థలం లోనే, మీరు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన సమయంలో, అంటే సూర్యుడు అస్తమించే సాయంత్రం వేళలో పస్కా పశువును వధించాలి. అదే స్థలం లో దాన్ని కాల్చి, తిని, ఉదయాన్నే తిరిగి మీ గుడారాలకు వెళ్ళాలి. ఆరు రోజులపాటు మీరు పొంగని రొట్టెలు తినాలి. ఏడవరోజు మీ దేవుడైన యెహోవాను ఆరాధించే రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఎలాంటి పనీ చేయకూడదు.

ద్వితీయోపదేశకాండము 16:1-8 పవిత్ర బైబిల్ (TERV)

“అబీబు నెలలో మీరు మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలి. ఎందుకంటే అబీబు నెలలోనే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రాత్రిపూట ఈజిప్టునుంటి బయటకు రప్పించాడు. యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఏర్పరచుకొనే చోటుకు మీరు వెళ్లాలి. అక్కడ మీ దేవుడైన యెహోవాను గౌరవించేందుకు, పస్కా పండుగ భోజనానికి ఒక ఆవును లేక మేకను మీరు బలి యివ్వాలి. ఈ బలితోపాటు పొంగినది ఏదీ తినవద్దు. ఏడు రోజులపాటు పొంగని రొట్టెలు మీరు తినాలి. ఇది “బాధరొట్టె అని పిలువబడుతుంది.” ఈజిప్టు దేశంలో మీ బాధలను జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది సహాయపడుతుంది. ఎంత త్వరగా మీరు ఆ దేశం విడిచిపెట్టాల్సి వచ్చిందో జ్ఞాపకం ఉందా! మీరు బ్రదికినంత కాలం ఆ రోజును జ్ఞాపకం ఉంచుకోవాలి. దేశవ్యాప్తంగా ఏడు రోజులపాటు ఎక్కడా ఎవరి యింటిలో పులిసిన రొట్టెలు ఉండకూడదు. మరియు మొదటి రోజు సాయంత్రం మీరు బలి అర్పించే మాంసం అంతా తెల్లవారక ముందే తినటం అయిపోవాలి. “మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే పట్టణాలు దేనిలోనైనా పస్కా పండుగ జంతువును మీరు బలి అర్పించకూడదు. మీ దేవుడైన యెహోవా తనకోసం ప్రత్యేక ఆలయంగా ఏర్పాటు చేసుకొన్న స్థలంలో మాత్రమే పస్కా పండుగ జంతువును మీరు బలిగా అర్పించాలి. అక్కడ సాయంకాలం సూర్యుడు అస్తమించినప్పుడు పస్కా పండుగ జంతువును మీరు బలి అర్పించాలి. యెహోవా మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొనివచ్చిన సందర్భము ఇది. మరియు మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనే స్థలంలోనే పస్కా పండుగ మాంసం మీరు వండుకొని తినాలి. అప్పుడు ఉదయాన్నే మీరు తిరిగి మీ గుడారాలకు వెళ్లిపోవాలి. పులియని రొట్టెలను ఆరు రోజులు మీరు తినాలి. ఏడో రోజున మీరు ఏ పనీ చేయకూడదు. ఆ రోజు, మీ దేవుడైన యెహోవా కోసం ప్రత్యేక సమావేశంగా ప్రజలంతా కూడు కొంటారు.

ద్వితీయోపదేశకాండము 16:1-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అబీబు నెలను ఆచరించి మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగించాలి, ఎందుకంటే అబీబు నెలలో రాత్రివేళ మీ దేవుడైన యెహోవా ఈజిప్టులో నుండి మిమ్మల్ని తీసుకువచ్చారు. యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించి పశువుల్లో నుండి గాని మందలో నుండి గాని ఒక జంతువును బలి ఇవ్వాలి. పులిసిన దానితో చేసిన రొట్టెలు తినకూడదు, కాని మీరు ఈజిప్టులో నుండి త్వరగా బయలుదేరి వచ్చారు కాబట్టి, ఈజిప్టు దేశం నుండి వచ్చిన ఆ రోజును జీవితకాలమంతా జ్ఞాపకముంచుకోడానికి ఏడు రోజులు మీరు బాధను సూచించే రొట్టె అనగా పులియని రొట్టెలు తినాలి. ఆ ఏడు రోజులు మీ దేశంలో ఎక్కడా పులిసిన పదార్థమేదీ కనిపించకూడదు. మీరు మొదటి రోజు సాయంకాలం వధించిన బలి మాంసంలో ఏదీ ఉదయం వరకు మిగలకూడదు. మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాసంగా ఏర్పరచుకొనే స్థలంలో తప్ప ఆయన మీకు ఇచ్చే ఏ పట్టణాల్లో పస్కా పశువును అర్పించకూడదు. ఈజిప్టు నుండి మీరు బయలుదేరిన సందర్భంగా, సూర్యుడు అస్తమించే సమయంలో, సాయంకాలంలో ఆ స్థలంలోనే మీరు పస్కా పశువును బలి ఇవ్వాలి. మీ దేవుడైన యెహోవా ఎన్నుకునే స్థలంలో దానిని కాల్చి తినాలి. ఉదయం మీ గుడారాలకు తిరిగి వెళ్లాలి. ఆరు రోజులు పులియని రొట్టెలు తినాలి, ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు ఒక సభను నిర్వహించాలి, అప్పుడు మీరు ఏ పని చేయకూడదు.