ద్వితీయోపదేశకాండము 10:1-5

ద్వితీయోపదేశకాండము 10:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు యెహోవా “నువ్వు మొదటి పలకల వంటివి రెండు రాతిపలకలు చెక్కి, కొండ ఎక్కి నా దగ్గరికి రా. అలాగే చెక్కతో ఒక పెట్టె చేసుకో. నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరవాత వాటిని నువ్వు ఆ పెట్టెలో ఉంచాలి” అని నాతో చెప్పాడు. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక పెట్టె చేయించి మొదటి పలకలవంటి రెండు రాతి పలకలను చెక్కి వాటిని పట్టుకుని కొండ ఎక్కాను. మీరు సమావేశమైన రోజున ఆయన ఆ కొండ మీద అగ్నిలో నుండి మీతో పలికిన పది ఆజ్ఞలనూ మొదట రాసినట్టే ఆ పలకల మీద రాశాడు. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను కొండ దిగి వచ్చి నేను చేసిన మందసంలో ఆ పలకలు ఉంచాను. అదుగో, యెహోవా నాకాజ్ఞాపించినట్టు వాటిని దానిలో ఉంచాను.

ద్వితీయోపదేశకాండము 10:1-5 పవిత్ర బైబిల్ (TERV)

“ఆసమయంలో యెహోవా నాతో యిలా చెప్పాడు: ‘మొదటి పలకల్లాంటివే రెండు పలకలు రాతితో నీవు చెక్కాలి. అప్పుడు నీవు కొండ ఎక్కి నా దగ్గరకు రావాలి. అలాగే వీటి కోసం ఒక చెక్క పెట్టెకూడా చేయాలి. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే ఆ రాతి పలకలమీద నేను వ్రాస్తాను. అప్పుడు నీవు కొత్త పలకలను ఆ పెట్టెలో పెట్టాలి.’ “కనుక నేను తుమ్మ కర్రతో ఒక పెట్టె చేసాను. మొదటి రెండు పలకల్లాంటివే మరి రెండు పలకలు రాతినుండి నేను తొలిచాను. అప్పుడు నేను కొండ మీదికి వెళ్లాను. ఆ రెండు రాతి పలకలు నా చేతిలో ఉన్నాయి. అప్పుడు యెహోవా యింతకు ముందు ఆ పలకల మీద వ్రాసిన ఆ మాటలనే, అంటే ఆ కొండ దగ్గర మీరు సమావేశమైనప్పుడు అగ్నిలోనుండి ఆయన మీతో చెప్పిన ఆ పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాడు. అప్పుడు యెహోవా ఆ రాతి పలకలను నాకు ఇచ్చాడు. నేను వెనక్కు తిరిగి, కొండ దిగి వచ్చేసాను. ఆ పలకలను నేను చేసిన పెట్టెలో ఉంచాను. వాటిని అందులో పెట్టుమని నాకు యెహోవా ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ ఆ పలకలు ఆ పెట్టెలోనే ఉన్నాయి.”

ద్వితీయోపదేశకాండము 10:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ కాలమందు యెహోవా–మునుపటి వాటి వంటి రెండు రాతిపలకలను నీవు చెక్కుకొని కొండ యెక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కఱ్ఱమందసమును చేసికొనవలెను. నీవు పగులగొట్టిన మొదటి పలకలమీదనున్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను. కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించిమునుపటివాటివంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేతపట్టుకొని కొండ యెక్కితిని. ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలనుమునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.

ద్వితీయోపదేశకాండము 10:1-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అప్పుడు యెహోవా నాతో అన్నారు, “నీవు మొదటి పలకలవంటి మరో రెండు రాతిపలకలను చెక్కి పర్వతమెక్కి నా దగ్గరకు రా. అలాగే ఒక కర్ర మందసాన్ని తయారుచేయు. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే నేను వాటిపై వ్రాస్తాను. తర్వాత నీవు వాటిని ఆ మందసంలో ఉంచాలి.” కాబట్టి నేను తుమ్మకర్రతో మందసం చేసి, మొదటి వాటిలా రెండు రాతిపలకలను చెక్కి, నా చేతులతో ఆ రెండు రాతిపలకలు పట్టుకుని నేను పైకి వెళ్లాను. సమావేశమైన రోజున, పర్వతం మీద, అగ్ని మధ్యలో నుండి మీకు ప్రకటించిన పది ఆజ్ఞలను మొదట వ్రాసినట్లుగానే, యెహోవా ఆ పలకల మీద వ్రాశారు. యెహోవా వాటిని నాకు ఇచ్చారు. తర్వాత నేను పర్వతం దిగివచ్చి, యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారం, నేను చేసిన మందసంలో ఆ పలకలను ఉంచాను. ఇప్పుడవి దానిలో ఉన్నాయి.