దానియేలు 6:3-5
దానియేలు 6:3-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దానియేలు శ్రేష్ఠమైన జ్ఞాన వివేకాలు కలిగి ఉండి అధికారుల్లో, ప్రధానమంత్రుల్లో ప్రఖ్యాతి పొందాడు, కనుక అతణ్ణి రాజ్యమంతటిలో ముఖ్యుడుగా నియమించాలని రాజు నిర్ణయించుకున్నాడు. అందువల్ల ప్రధానమంత్రులు, అధికారులు రాజ్య పరిపాలన వ్యవహారాల్లో దానియేలుపై ఏదైనా ఒక నేరం ఆరోపించడానికి ఏదైనా కారణం కోసం వెదుకుతూ ఉన్నారు. దానియేలు ఎలాంటి తప్పు, పొరపాటు చేయకుండా రాజ్య పరిపాలన విషయంలో నమ్మకంగా పనిచేస్తూ ఉండడంవల్ల అతనిలో ఎలాంటి దోషం కనిపెట్టలేకపోయారు. అప్పుడు వాళ్ళు “దానియేలు తన దేవుణ్ణి పూజించే పద్ధతి విషయంలో తప్ప మరి ఏ విషయంలోనైనా అతనిలో దోషం కనిపెట్టలేము” అనుకున్నారు.
దానియేలు 6:3-5 పవిత్ర బైబిల్ (TERV)
రాజు దానియేలును మెచ్చుకొన్నాడు. తన మంచి ప్రవర్తన వల్లను, తన సామర్థ్యం వల్లను దానియేలుకు రాజు అలా చేయగలిగాడు. రాజు దానియేలు వశుడయ్యాడు. రాజ్యమంతటికీ దానియేలును పరిపాలకునిగా చెయ్యాలని తలంచాడు. కాని ఈ విషయాన్ని వినగానే ఇతర ప్రధానులు, రాజ్యాధికారులు అసూయ చెందారు. దానియేలులో తప్పుపట్టేందుకు వారు కారణాలు వెదకసాగారు. కనుక రాజ్యంగురించి దానియేలు చేసే పనుల్ని వారు గమనించ సాగారు. కాని దానియేలులో ఏ తప్పూ వారు కనుగొనలేకపోయారు. ప్రజలు విశ్వసించదగిన వ్యక్తి దానియేలు. అతను రాజును మోసగించలేదు. కష్టించి పని చేసాడు. చివరికి వారు, “దానియేలుపై తప్పు పట్టేందుకు తగిన కారణం మనమెన్నటికీ కనుగొనలేము. అందువల్ల అతని దేవునికి సంబంధించిన ధర్మం గురించి మనం ఫిర్యాదు చేసేందుకు ఏదో ఒకటి కనుగొనాలి” అని అనుకొన్నారు.
దానియేలు 6:3-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఈ దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతని నియమింపవలెనని రాజు ఉద్దే శించెను. అందుకా ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయి నను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకా మనుష్యులు–అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమను కొనిరి.
దానియేలు 6:3-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అయితే దానియేలు తనకున్న గొప్ప లక్షణాలను బట్టి అధిపతులకంటే, నిర్వాహకులకంటే ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి రాజు తన రాజ్యమంతటి మీద అతన్ని నియమించాలని అనుకున్నాడు. అందువల్ల నిర్వాహకులు, అధిపతులు దానియేలు మీద నేరం మోపడానికి అతని ప్రభుత్వ నిర్వహణలో లోట్ల కోసం వెదికారు కాని, అతడు నమ్మకస్థుడు, నేరం లేనివాడు. వారు అతనిలో ఎలాంటి నేరం కనుగొనలేకపోయారు. చివరికి ఈ మనుష్యులు, “ఈ దానియేలు మీద నేరం మోపడానికి ఎలాంటి కారణం ఎన్నడు మనకు దొరకదు, దొరికితే తన దేవుని ధర్మశాస్త్రం విషయంలో దొరకవచ్చు” అని అనుకున్నారు.