దానియేలు 6:19-24
దానియేలు 6:19-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తెల్లవారగానే రాజు లేచి త్వర త్వరగా సింహాల గుహ దగ్గరికి వెళ్ళాడు. అతడు గుహ దగ్గరికి వచ్చి, దుఃఖ స్వరంతో దానియేలును పిలిచాడు. “జీవం గల దేవుని సేవకుడివైన దానియేలూ, నిత్యం నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా?” అని అతణ్ణి అడిగాడు. అందుకు దానియేలు “రాజు చిరకాలం జీవించు గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. కాబట్టి ఆయన తన దూతను పంపాడు. సింహాలు నాకు ఎలాంటి హానీ చేయకుండ వాటి నోళ్లు మూతపడేలా చేశాడు. రాజా, నీ దృష్టిలో నేను ఎలాంటి నేరం చేయలేదు గదా” అని జవాబిచ్చాడు. రాజు చాలా సంతోషించాడు. దానియేలును గుహలో నుండి పైకి తీయమని ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు దానియేలును బయటికి తీశారు. అతడు దేవునిపట్ల భయభక్తులు గలవాడు కావడం వల్ల అతనికి ఎలాంటి ఏ హానీ జరగలేదు. దానియేలు మీద నింద మోపిన ఆ వ్యక్తులను, వాళ్ళ భార్య పిల్లలను సింహాల గుహలో పడవేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు వాళ్ళను తీసుకువచ్చి సింహాల గుహలో పడవేశారు. వాళ్ళు ఇంకా గుహ అడుగు భాగానికి చేరక ముందే సింహాలు వాళ్ళను పట్టుకున్నాయి. ఎముకలు కూడా మిగలకుండా వాళ్ళను చీల్చిచెండాడాయి.
దానియేలు 6:19-24 పవిత్ర బైబిల్ (TERV)
ఆ మరునాటి ఉదయం రాజైన దర్యావేషు వెలుతురు వస్తూండగా సింహాల గుహవద్దకు పరుగెత్తుకు వెళ్లాడు. రాజు చింతాక్రాంతుడుగా సింహాల గుహవద్దకు వెళ్లి దానియేలును ఇలా పిలిచాడు: “సజీవుడగు దేవుని సేవకుడవైన దానియేలూ, నీవెప్పుడూ ఆరాధించే నీ దేవుడు నిన్ను సింహాల బారినుండి కాపాడగలిగెనా?” “రాజా, నీవు చిరకాలము వర్ధిల్లాలి! నా దేవుడు నన్ను రక్షించడానికి తన దూతను పంపి, సింహాల నోళ్లను మూసివేశాడు. నా దేవునికి నేను కళంకరహితుణ్ణి అని తెలుసు, కనుకనే సింహాలు నన్ను గాయపరచలేదు. రాజా, నీకెప్పుడూ నేను అన్యాయం చెయ్యలేదు” అని దానియేలు బదులు చెప్పాడు. దర్యావేషు రాజు చాలా సంతోషించాడు. సింహాల గుహనుండి దానియేలును పైకి తీయవలసిందిగా రాజు తన సేవకుల్ని ఆజ్ఞాపించాడు. వారు గుహనుండి దానియేలును పైకి తీయగా, వారతని దేహంమీద ఎలాంటి గాయాన్ని చూడలేదు. దానియేలు తన దేవున్ని విశ్వసించిన కారణంగా, అతనికి సింహాలవల్ల ఎలాంటి హాని జరగలేదు. తర్వాత దానియేలుని సింహాల గుహకు పంపడానికి కారణమైన ఆ మనుష్యుల్ని తీసుకురమ్మని రాజు ఆజ్ఞాపించాడు. సింహాల గుహలోకి ఆ మనుష్యులను, వారి భార్యలను, వారి సంతానాన్ని త్రోసివేయగా వారు సింహాల గుహ అడుగుభాగం తాకక ముందే సింహాలు వారి శరీరాలను కబళించి వారి ఎముకల్ని విరుగగొట్టాయి.
దానియేలు 6:19-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తెల్లవారు జామున రాజు వేగిరమే లేచి సింహముల గుహదగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహదగ్గరకు రాగానే, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి–జీవముగల దేవుని సేవ కుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని యతనిని అడిగెను. అందుకు దానియేలు–రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవునిదృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను. రాజు ఇందునుగూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగ లేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలుమీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొనివచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి, సింహములు వారి యెముకలను సహితము పగులగొరికి పొడిచేసెను.
దానియేలు 6:19-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తెల్లవారే సమయంలో రాజు లేచి, సింహాల గుహ దగ్గరకు త్వరగా వెళ్లాడు. రాజు సింహాల గుహ దగ్గరకు చేరుకుని దుఃఖ స్వరంతో, “దానియేలూ! సజీవ దేవుని సేవకుడా! నిత్యం నీవు సేవించే నీ దేవుడు సింహాల బారి నుండి నిన్ను రక్షించగలిగారా?” అని అన్నాడు. దానియేలు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక! నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్ళు మూయించారు. అవి నాకు హాని చేయలేదు, ఎందుకంటే ఆయన దృష్టిలో నేను నిర్దోషిని. రాజా! మీ ఎదుట కూడా నేను ఏ తప్పు చేయలేదు” అన్నాడు. రాజు ఎంతో సంతోషించి దానియేలును గుహలో నుండి బయటకు తీసుకురమ్మని ఆదేశించాడు. దానియేలు తన దేవున్ని నమ్మాడు కాబట్టి అతడు బయటకు వచ్చినప్పుడు, అతని మీద ఏ గాయం లేదు. రాజు ఆజ్ఞమేరకు, దానియేలు మీద తప్పుడు నేరం మోపిన వ్యక్తులను వారి భార్య పిల్లలతో పాటు సింహాల గుహలో పడవేశారు. వారు ఇంకా గుహ నేలను తాకకముందే సింహాలు వారిని చీల్చి, వారి ఎముకలన్నిటిని నలుగగొట్టాయి.