దానియేలు 6:15-18

దానియేలు 6:15-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ మనుష్యులు దీని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి–రాజా, రాజు స్థిరపరచిన యే శాసనము గాని తీర్మానము గాని యెవడును రద్దుపరచజాలడు; ఇది మాదీయులకును పారసీకులకును విధియని తమరు తెలిసి కొనవలెననిరి. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజు–నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసికొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి; మరియు దానియేలునుగూర్చి రాజుయొక్క తీర్మానము మారునేమో యని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి. అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగ నియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను.

షేర్ చేయి
Read దానియేలు 6

దానియేలు 6:15-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇది గమనించిన ఆ వ్యక్తులు రాజ మందిరానికి గుంపుగా వచ్చి “రాజా, రాజు నియమించిన ఏ శాసనాన్ని గానీ, తీర్మానాన్ని గానీ ఎవ్వరూ రద్దు చేయకూడదు. ఇది మాదీయుల, పారసీకుల ప్రధాన విధి అని మీరు గ్రహించాలి” అని చెప్పారు. రాజు ఆజ్ఞ ఇవ్వగా సైనికులు దానియేలును పట్టుకుని సింహాల గుహలో పడవేశారు. అప్పుడు రాజు “నువ్వు ప్రతిరోజూ తప్పకుండా సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని దానియేలుతో చెప్పాడు. ఆ వ్యక్తులు ఒక పెద్ద రాయి తీసుకువచ్చి ఆ గుహ ద్వారం ఎదుట వేసి దాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో రాజు తన నిర్ణయం మార్చుకుంటాడేమోనని భావించి, గుహ ద్వారానికి రాజముద్రను, అతని రాజ ప్రముఖుల ముద్రలను వేశారు. తరువాత రాజు తన భవనానికి వెళ్ళాడు. ఆ రాత్రి ఆహారం తీసుకోకుండా వినోద కాలక్షేపాల్లో పాల్గొనకుండా ఉండిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు.

షేర్ చేయి
Read దానియేలు 6

దానియేలు 6:15-18 పవిత్ర బైబిల్ (TERV)

తర్వాత ఆ మనుష్యులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లారు. “రాజా, గుర్తుంచుకో. మాదీయుల, పారసీకుల చట్టం చెబుతున్నదేమనగా, రాజు చేసిన చట్టాన్ని మార్చుటకు, రద్దు చేయుటకు వీలులేదు” అని వారు చెప్పారు. అందువల్ల రాజైన దర్యావేషు ఆజ్ఞ ప్రకారం దానియేలును తీసుకొనివచ్చి, సింహాల గుహలోకి త్రోసివేశారు. రాజు దానియేలుతో ఇట్లన్నాడు: “నీవు నిరంతరం ఆరాధించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని భావిస్తున్నాను.” ఒక పెద్ద బండను తీసుకువచ్చి, దానిని సింహాల గుహ యొక్క ద్వారం మీద ఉంచారు. తర్వాత రాజు తన ఉంగరంతోను, మరియు తన ఉద్యోగుల ఉంగరాలతోను ఆ బండమీద ముద్రలు వేశారు. ఎవ్వరూ బండను తొలగించి, దానియేలును సింహాల గుహనుంచి వెలుపలికి తీసుకు రాకూడదని ఇలా చేశారు. తర్వాత దర్యావేషు రాజు తన ఇంటికి మరలి పోయాడు. ఆ రాత్రి రాజు భోజనం చేయలేదు. ఎవ్వరూ ఆ రాత్రి తనకు వినోదాన్ని కలిగించకూడదని ఆదేశించాడు. ఆ రాత్రంతా రాజు నిద్ర పోలేదు.

షేర్ చేయి
Read దానియేలు 6

దానియేలు 6:15-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అప్పుడు ఆ మనుష్యులు రాజైన దర్యావేషు దగ్గరకు గుంపుగా వెళ్లి, “రాజా! మాదీయ పర్షియా వారి చట్టం ప్రకారం రాజు చేసిన శాసనాన్ని గాని తీర్మానాన్ని గాని ఎవరు మార్చకూడదనే విషయాన్ని మీరు గుర్తుచేసుకోవాలి” అన్నారు. అప్పుడు రాజు ఆదేశం ఇవ్వగా, వారు దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలో పడవేశారు. రాజు దానియేలుతో, “నీవు నిత్యం సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని అన్నాడు. ఒక రాయి తీసుకువచ్చి దానితో గుహ ద్వారాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో నిర్ణయాన్ని మార్చుకోకుండ రాజు తన రాజ ముద్రను, ప్రముఖుల ముద్రలను రాతి మీద వేశాడు. తర్వాత రాజు భవనానికి వెళ్లి రాత్రంతా ఉపవాసం ఉండి వినోదాలను జరగనియ్యలేదు. అతనికి నిద్రపట్టలేదు.

షేర్ చేయి
Read దానియేలు 6