దానియేలు 4:28-37

దానియేలు 4:28-37 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

పైన చెప్పిన విషయాలన్నీ రాజైన నెబుకద్నెజరుకు సంభవించాయి. ఒక సంవత్సర కాలం గడచిన తరువాత అతడు తన రాజధాని పట్టణం బబులోనులోని ఒక నగరంలో సంచరించాడు. అతడు దాన్ని చూస్తూ. “ఈ బబులోను నగరం మహా విశాలమైన పట్టణం. నా బలాన్ని, నా అధికారాన్ని, నా ప్రభావ ఘనతలను చూపించుకోవడానికి దీన్ని నా రాజధాని నగరంగా కట్టించుకున్నాను” అని తనలో తాను అనుకున్నాడు. ఈ మాటలు రాజు నోట్లో ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం “రాజువైన నెబుకద్నెజర్, ఈ ప్రకటన నీ కోసమే. నీ రాజ్యం నీ దగ్గర నుండి తొలగిపోయింది. రాజ్యంలోని ప్రజలు తమ దగ్గర నుండి నిన్ను తరుముతారు. నువ్వు అడవిలో జంతువుల మధ్య నివాసం చేస్తావు. పశువులాగా గడ్డి మేస్తావు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు అని నువ్వు తెలుసుకునే వరకూ ఏడు కాలాలపాటు నీ పట్ల ఇలా జరుగుతుంది” అని వినిపించింది. ఆ క్షణంలోనే ఆ మాట నెబుకద్నెజరు విషయంలో నెరవేరింది. ప్రజల్లో నుండి అతడు తరిమివేయబడ్డాడు. అతడు పశువుల వలె గడ్డిమేశాడు. ఆకాశం నుండి కురిసే మంచు అతని శరీరాన్ని తడిపింది. అతని తల వెంట్రుకలు గరుడ పక్షి రెక్కల ఈకలంత పొడవుగా, అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివిగా పెరిగాయి. ఆ రోజులు ముగిసిన తరువాత నెబుకద్నెజరు అనే నాకు తిరిగి మానవ బుద్ధి వచ్చింది. నా కళ్ళు ఆకాశం వైపు ఎత్తి, సర్వోన్నతుడు దేవుడు, శాశ్వత కాలం ఉండే దేవునికి స్తోత్రాలు చెల్లించి కీర్తించాను. ఆయన అధికారం కలకాలం నిలుస్తుంది. ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది. భూలోకంలోని ప్రజలంతా ఆయన దృష్టిలో శూన్యులు. ఆయన పరలోకంలోని సైన్యాల మీదా, భూలోకంలోని ప్రజల మీదా తన ఇష్టం వచ్చినట్టు జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని “నువ్వు చేస్తున్నదేమిటి?” అని అడిగే అధికారం ఎవ్వరికీ లేదు. ఆ సమయంలో నాకు మళ్ళీ బుద్ది వచ్చింది. నా రాజ్యానికి గత వైభవం కలిగేలా ముందున్న ఘనత, ప్రభావాలు నాకు మళ్ళీ చేకూరాయి. నా మంత్రులు, నా క్రింది అధికారులు నా దగ్గరికి వచ్చి సమాలోచనలు జరిపారు. నా రాజ్యంపై అధికారం నాకు స్థిరపడింది. గతంలో కంటే అధికమైన ఘనత నాకు దక్కింది. ఈ విధంగా నెబుకద్నెజరు అనే నేను, పరలోకపు రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఘనపరుస్తున్నాను. ఎందుకంటే ఆయన జరిగించే కార్యాలన్నీ సత్యం, ఆయన నడిపించే విధానాలు న్యాయం. ఆయన గర్వంతో ప్రవర్తించే వాళ్ళను అణిచివేసే శక్తి గలవాడు.

షేర్ చేయి
Read దానియేలు 4

దానియేలు 4:28-37 పవిత్ర బైబిల్ (TERV)

నెబుకద్నెజరు రాజుకు ఆ ఘటనలన్నీ జరిగాయి. కల వచ్చిన పన్నెండు నెలల తర్వాత, బబులోనులోని తన అంతఃపురం పైభాగాన నెబుకద్నెజరు నడుల్తూ ఉండగా రాజు బబులోనువైపు చూసి, “ఈ గొప్ప నగరాన్ని, ఈ గొప్ప అంతఃపురాన్ని నా శక్తివల్ల నిర్మించాను. నేనెంత గొప్పవాడనో తెలపటానికి ఈ అంతః పురాన్ని నిర్మించాను” అని తన మనస్సులో చెప్పుకొన్నాడు. అతని మాటలు ఇంకా అతని నోటిలోనే ఉండగా, ఆకాశమునుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “నెబుకద్నెజరు రాజా, ఈ మాటలు నీకోసమే. నీ వద్దనుంచి నీ అధికారం తీసివేయబడింది. ప్రజలనుండి నీవు తరిమి వేయబడతావు. భూజంతువులతో నీవు నివసించాల్సి వస్తుంది. ఎద్దువలె నీవు పచ్చిక మేస్తావు. నీవు గుణపాఠం నేర్చుకునేలోగా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు మనుష్యుల రాజ్యాలను సర్వోన్నతుడైన దేవుడు పరిపాలిస్తాడనీ, తనకు నచ్చిన వానికి రాజ్యాలు ఇస్తాడనీ నీవు తెలుసుకుంటావు.” ఆ విషయాలు వెంటనే జరిగాయి. నెబుకద్నెరును ప్రజలు తమ మధ్యనుండి తరిమివేశారు. అతడు ఎద్దువలె పచ్చిక మేయ సాగాడు. ఆకాశ మంచుచేత అతని దేహం తడిసింది. గ్రద్ద ఈకలవలె అతని వెండ్రుకలు పొడుగ్గా పెరిగాయి. పక్షుల గోళ్లవలె అతని గోళ్లు పొడుగ్గా పెరిగాయి. ఆ యేడేళ్ల కాలం పూర్తి కాగానే, నెబుకద్నెజరు అను నేను ఆకాశంవైపు కన్నెత్తి చూశాను. మళ్లీ నాకు మానవబుద్ధి లభించింది. అప్పుడు మహోన్నతుడైన దేవున్ని నేను కీర్తించాను. ఎల్లాకాలము నివసించే ఆయనను గౌరవించి, ఇలా ప్రశంసించాను: ఆయన పరిపాలన శాశ్వతమైనది, తరతరాలకు ఆయన రాజ్యం కొనసాగుతుంది. భూమిమీద మనుష్యులు ఆయన ఎదుట లెక్క లేనివారికి సమానము. దేవుడు పరలోకలమందలి సైన్యాలకు, భూమిమీది మనుష్యులకు తనకు ఇష్టము వచ్చినట్లు చేస్తాడు. ఎవ్వరూ ఆయన శక్తివంతమైన హస్తాన్ని ఆపలేరు. ఎవ్వరూ ఆయన చేసే పనుల్ని ప్రశ్నించలేరు. అప్పుడు, ఆ సమయాన, దేవుడు నాకు సరి అయిన బుద్ధిని ప్రసాదించాడు. రాజుగా అధిక గౌరవం, శక్తిని నాకు తిరిగి ఇచ్చాడు. మరల నా సలహాదారులు రాజపురుషులు నా సలహా అడగ సాగారు. నేను మళ్లీ రాజుని అయ్యాను. పూర్వం కంటె ఎక్కువ శక్తి ఎక్కువ గొప్పతనం నాకు వచ్చాయి. ఇప్పుడు, నెబుకద్నెజరు అను నేను పరలోక మందున్న రాజును కీర్తిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఆయన చేసే ప్రతిది సరి అయినదే. ఆయన ఎప్పుడూ న్యాయంగానే ఉంటాడు. గర్విష్ఠులను ఆయన అణగ ద్రొక్కుతాడు.

షేర్ చేయి
Read దానియేలు 4

దానియేలు 4:28-37 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

పైన జెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను. పండ్రెండు నెలలు గడచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు–బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. రాజు నోట ఈ మాట యుండగా ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగా–రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన– నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను. తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువులమధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారి యైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే ఆలాగున నెబుకద్నెజరునకు సంభవించెను; మానవులలోనుండి అతని తరిమిరి, అతడు పశువులవలె గడ్డిమేసెను, ఆకాశపుమంచు అతని దేహమును తడపగా అతని తలవెండ్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెలవంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివియు నాయెను. ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల మానవబుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశముతట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను; నా మంత్రులును నా క్రిందియధిపతులును నాయొద్ద ఆలోచన చేయ వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు, ఆయనను స్తుతించుచుకొనియాడుచు ఘన పరచుచు నున్నాను.

షేర్ చేయి
Read దానియేలు 4

దానియేలు 4:28-37 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఇదంతా నెబుకద్నెజరుకు రాజుకు జరిగింది. పన్నెండు నెలల తర్వాత, రాజు బబులోను రాజభవనం పైకప్పు మీద నడుస్తూ, “నా రాజ నివాసంగా నేను కట్టుకున్న ఈ మహా బబులోను పట్టణం నా బలప్రభావంతో నా వైభవాన్ని కనుపరచడానికి కట్టుకుంది కాదా?” అని తనలో తాను అనుకున్నాడు. ఆ మాటలు తన పెదవుల మీద ఉండగానే, ఆకాశం నుండి ఓ స్వరం వినిపించింది, “రాజైన నెబుకద్నెజరూ, నీకోసం ఇలా ప్రకటించబడింది: నీ రాజ్యాధికారం నీ నుండి తీసివేయబడింది. నీవు ప్రజల నుండి తొలగించబడతావు, నీవు ప్రజల్లో నుండి తరమబడి అడవి జంతువులతో నివసిస్తావు; ఎద్దులా నీవు గడ్డి మేస్తావు. సర్వోన్నతుడు భూరాజ్యాల మీద అధికారి అని, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి వాటిని ఇస్తారని నీవు గ్రహించే వరకు నీవు ఏడు కాలాలు గడుపుతావు.” వెంటనే నెబుకద్నెజరు గురించి చెప్పబడింది నెరవేరింది. అతడు ప్రజల నుండి తరమబడి, ఎద్దులా గడ్డి మేశాడు. అతని తలవెంట్రుకలు గ్రద్ద ఈకల్లా, అతని గోళ్ళు పక్షి గోళ్ళలా పెరిగే వరకు, అతని శరీరం ఆకాశం నుండి పడే మంచుకు తడిసిపోయింది. ఆ కాలం గడిచిన తర్వాత నెబుకద్నెజరు అనే నేను ఆకాశం వైపు నా తలెత్తి చూశాను, అప్పుడు నా మానవ బుద్ధి తిరిగి వచ్చింది. అప్పుడు నేను సర్వోన్నతున్ని స్తుతించాను; నిత్యం జీవించే ఆయనను ఘనపరిచాను, మహిమపరిచాను. ఆయన అధికారం శాశ్వత అధికారం; ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది. ఆయన దృష్టిలో భూప్రజలు శూన్యులు. పరలోక శక్తుల పట్ల భూప్రజల పట్ల ఆయనకు నచ్చింది చేస్తారు. ఆయనను ఎవరూ ఆపలేరు. “మీరు చేసింది ఏంటి?” అని ఆయనను అడగలేరు. నా మానవ బుద్ధి తిరిగి ఇవ్వబడిన ఆ సమయంలోనే, నా రాజ్య మహిమ కోసం నా ఘనత, నా వైభవం నాకు తిరిగి ఇవ్వబడ్డాయి. నా సలహాదారులు, నా ఘనులు నా దగ్గరకు వచ్చారు, నేను నా సింహాసనం మీద మరలా కూర్చున్నాను, మునుపటి కంటే ఇంకా గొప్పవాడిగా అయ్యాను. ఇప్పుడు నెబుకద్నెజరు అనే నేను పరలోక రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతున్నాను, ఎందుకంటే ఆయన చేసే ప్రతిదీ సత్యమైనది, ఆయన విధానాలన్నీ న్యాయమైనవి. గర్వంతో జీవించేవారిని ఆయన అణచివేయగలడు.

షేర్ చేయి
Read దానియేలు 4