దానియేలు 4:1-36

దానియేలు 4:1-36 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

లోకమంతటిలో నివసించే అన్ని దేశాల ప్రజలకు, వివిధ భాషలు మాట్లాడే వారికి రాజైన నెబుకద్నెజరు ఇలా రాస్తున్నాడు. “మీకందరికీ పూర్ణ క్షేమం కలుగు గాక. సర్వశక్తిమంతుడైన దేవుడు నా విషయంలో జరిగించిన అద్భుతాలను, సూచక క్రియలను మీకు తెలియజేయాలని నా మనస్సుకు తోచింది. ఆయన చేసే సూచక క్రియలు బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యం శాశ్వతంగా ఉండేది. ఆయన అధికారం తరతరాలకు నిలుస్తుంది.” నెబుకద్నెజరు అనే నేను నా నగరంలో క్షేమంగా, నా ఇంట్లో ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక రాత్రి నాకు భయంకరమైన కల వచ్చింది. ఆ కల వల్ల మంచం మీద పండుకుని ఉన్న నా మనస్సులో పుట్టిన ఆలోచనలు నన్ను కలవరపెట్టాయి. కాబట్టి ఆ కలకు అర్థం చెప్పడానికి బబులోనులో ఉన్న జ్ఞానులనందరినీ నా దగ్గరికి పిలిపించాలని ఆజ్ఞ ఇచ్చాను. శకునాలు చెప్పేవాళ్ళు, గారడీవిద్యలు చేసేవాళ్ళు, మాంత్రికులు, జ్యోతిష్యులు నా సమక్షానికి వచ్చినప్పుడు నాకు వచ్చిన కల గురించి వాళ్లకు చెప్పాను కానీ ఎవ్వరూ దానికి అర్థం చెప్పలేకపోయారు. చివరకు దానియేలు నా దగ్గరికి వచ్చాడు. మా దేవుడి పేరునుబట్టి అతనికి బెల్తెషాజరు అనే మారుపేరు పెట్టాము. పరిశుద్ధ దేవుని ఆత్మ అతనిలో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను అతనికి నాకు వచ్చిన కలను వివరించాను. ఎలాగంటే “భవిషత్తు చెప్పేవాళ్ళకు అధిపతివైన బెల్తెషాజర్, నువ్వు పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగి ఉన్నావనీ, ఎలాంటి నిగూఢమైన విషయం నిన్ను కలవరపెట్టదనీ నాకు తెలుసు. కాబట్టి నాకు వచ్చిన కలను, ఆ కల భావాన్నీ నాకు వివరించు.” “నేను నా మంచం మీద పండుకుని నిద్ర పోతున్నప్పుడు నాకు ఈ దర్శనాలు వచ్చాయి. ఆ దర్శనంలో నేను చూస్తూ ఉండగా, భూమి మధ్యలో చాలా ఎత్తయిన ఒక చెట్టు కనబడింది. ఆ చెట్టు క్రమంగా పెరుగుతూ బ్రహ్మాండంగా వృద్ది చెందింది. దాని కొమ్మలు ఆకాశాన్ని అందుకునేటంత ఎత్తుగా ఉన్నాయి. దాని ఆకారం భూమి అంత విశాలం అయ్యింది. దాని ఆకులు అందంగా, దాని పండ్లు విస్తారంగా కనబడ్డాయి. ఆ పండ్లు జీవకోటి అంతటికీ ఆహారం కోసం సరిపోతాయి. అడవి జంతువులన్నీ ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆ చెట్టు కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చుని ఉన్నాయి. సమస్తమైన ప్రజలకూ సరిపడినంత ఆహారం ఆ చెట్టు నుండి లభ్యమౌతుంది.” “నేనింకా మంచం మీదే ఉండి నాకు కలుగుతున్న దర్శనాలు చూస్తూ ఉన్నప్పుడు పవిత్రుడైన ఒక మేల్కొలుపు దూత ఆకాశం నుండి దిగి వచ్చాడు. అతడు బిగ్గరగా ఇలా ప్రకటించాడు, ఈ చెట్టును నరికివేయండి. దాని కొమ్మలు, ఆకులు కొట్టివేసి, దాని పండ్లను పారవేయండి. చెట్టు నీడలో ఉన్న పశువులను తోలివేయండి. పక్షులన్నిటినీ కొమ్మల నుండి ఎగురగొట్టండి. అయితే దాని మొద్దును ఇనుముతో, ఇత్తడితో కట్టి పొలం గడ్డిలో విడిచిపెట్టండి. దాని వేళ్ళు భూమిలో ఉండిపోనివ్వండి. అతడు ఆకాశం నుండి కురిసే మంచుకు తడుస్తూ జంతువులాగా భూమిలో ఉన్న పచ్చికలో నివసించేలా వదిలిపెట్టండి.” “మానవ మనస్సుకు బదులు పశువు మనస్సు కలిగి ఏడు కాలాలు గడిచేదాకా అతడు అదే స్థితిలో ఉండిపోవాలి. ఈ ఆజ్ఞ మేల్కొలుపు దూతలు ఈ విధంగా ప్రకటించారు. ఈ తీర్పు పరిశుద్ధుల ప్రకటన ననుసరించి విధించబడింది. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు. ఆయన మనుషులందరిలో అల్పులను వివిధ రాజ్యాలపై అధిపతులుగా నియమిస్తాడని మనుష్యులంతా తెలుసుకొనేలా ఇది జరుగుతుంది.” “బెల్తెషాజరు, నెబుకద్నెజరనే నాకు వచ్చిన దర్శనం ఇదే. నువ్వు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానీ దాని భావం నాకు చెప్పలేడు. నీలో పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నువ్వే దాన్ని చెప్పగల సమర్థుడివి” అన్నాను. బెల్తెషాజరు అనే పేరున్న దానియేలు ఒక గంట సేపు ఎంతో ఆశ్చర్యానికి లోనై తన మనస్సులో తీవ్రమైన కలవరం చెందాడు. అప్పుడు రాజు “బెల్తెషాజర్, ఈ దర్శనం గురించి గానీ, దాని భావం గురించి గానీ నువ్వు కంగారు పడవద్దు” అన్నాడు. బెల్తెషాజర్ జవాబిస్తూ “ప్రభూ, ఇలాంటి దర్శనం, దాని భావం మీ శత్రువులకు, మిమ్మల్ని ద్వేషించే వాళ్లకు వచ్చి ఉంటే సమంజసంగా ఉండేది.” “రాజా, మీరు చూసిన చెట్టు క్రమంగా పెరుగుతూ బ్రహ్మాండంగా వృద్ది చెందింది. దాని కొమ్మలు ఆకాశాన్ని అందేటంత ఎత్తుగా ఉన్నాయి. దాని ఆకారం భూమి అంత విశాలం అయ్యింది. దాని ఆకులు అందంగా, దాని పండ్లు విస్తారంగా కనబడ్డాయి. ఆ పండ్లు సమస్త జీవకోటి ఆహారం కోసం సరిపోతాయి. అడవి జంతువులన్నీ ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆ చెట్టు కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చుని ఉన్నాయి గదా రాజా, ఆ చెట్టు నీకు సూచనగా ఉంది. నువ్వు వృద్ధిచెంది గొప్ప బల ప్రభావాలు గలవాడివయ్యావు. నీ ప్రఖ్యాతి ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. నీ రాజ్యం లోకమంతా వ్యాపించింది.” “ఈ చెట్టును నరికివేయండి. దాని కొమ్మలు, ఆకులు కొట్టివేసి, దాని పండ్లను పారవేయండి. చెట్టు నీడలో ఉన్న పశువులను తోలివేయండి. పక్షులన్నిటినీ కొమ్మల నుండి ఎగరగొట్టండి. అయితే దాని వేరులతో ఉన్న మొద్దును ఇనుముతో, ఇత్తడితో కట్టి పొలం గడ్డిలో విడిచిపెట్టండి. దాని వేళ్ళు భూమిలో ఉండిపోనివ్వండి, అని మేల్కొలుపు దూత పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించడం నువ్వు విన్నావు గదా.” “రాజా, ఈ దర్శనం అర్థం ఏమిటంటే, సర్వోన్నతుడైన దేవుడు రాజువైన నిన్ను గూర్చి ఈ విధంగా తీర్మానం చేశాడు. ప్రజలు తమ దగ్గర ఉండకుండా నిన్ను తరుముతారు. నువ్వు అడవి జంతువుల మధ్య నివసిస్తూ పశువులాగా గడ్డి తింటావు. ఆకాశం నుండి పడే మంచు నిన్ను తడుపుతుంది. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు, అని నువ్వు తెలుసుకునే వరకూ ఏడు కాలాలపాటు నీ పట్ల ఇలా జరుగుతుంది. చెట్టు మొద్దును ఉండనియ్యమని దూతలు చెప్పారు గదా. ఇందునుబట్టి సర్వోన్నతుడైన దేవుడు సమస్తానికి అధికారి అని నువ్వు గ్రహించిన తరువాత నీ రాజ్యం నీకు కచ్చితంగా లభిస్తుందని తెలుసుకో. రాజా, నేను చెప్పేది మీకు అంగీకారంగా ఉండు గాక. నీ పాపాలు విడిచిపెట్టి నీతి న్యాయాలు అనుసరించు. నువ్వు హింసించిన వాళ్ళ పట్ల కనికరం చూపించు. అప్పుడు నీకున్న క్షేమం ఇకపై అలాగే కొనసాగుతుంది” అని దానియేలు జవాబిచ్చాడు. పైన చెప్పిన విషయాలన్నీ రాజైన నెబుకద్నెజరుకు సంభవించాయి. ఒక సంవత్సర కాలం గడచిన తరువాత అతడు తన రాజధాని పట్టణం బబులోనులోని ఒక నగరంలో సంచరించాడు. అతడు దాన్ని చూస్తూ. “ఈ బబులోను నగరం మహా విశాలమైన పట్టణం. నా బలాన్ని, నా అధికారాన్ని, నా ప్రభావ ఘనతలను చూపించుకోవడానికి దీన్ని నా రాజధాని నగరంగా కట్టించుకున్నాను” అని తనలో తాను అనుకున్నాడు. ఈ మాటలు రాజు నోట్లో ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం “రాజువైన నెబుకద్నెజర్, ఈ ప్రకటన నీ కోసమే. నీ రాజ్యం నీ దగ్గర నుండి తొలగిపోయింది. రాజ్యంలోని ప్రజలు తమ దగ్గర నుండి నిన్ను తరుముతారు. నువ్వు అడవిలో జంతువుల మధ్య నివాసం చేస్తావు. పశువులాగా గడ్డి మేస్తావు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు అని నువ్వు తెలుసుకునే వరకూ ఏడు కాలాలపాటు నీ పట్ల ఇలా జరుగుతుంది” అని వినిపించింది. ఆ క్షణంలోనే ఆ మాట నెబుకద్నెజరు విషయంలో నెరవేరింది. ప్రజల్లో నుండి అతడు తరిమివేయబడ్డాడు. అతడు పశువుల వలె గడ్డిమేశాడు. ఆకాశం నుండి కురిసే మంచు అతని శరీరాన్ని తడిపింది. అతని తల వెంట్రుకలు గరుడ పక్షి రెక్కల ఈకలంత పొడవుగా, అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివిగా పెరిగాయి. ఆ రోజులు ముగిసిన తరువాత నెబుకద్నెజరు అనే నాకు తిరిగి మానవ బుద్ధి వచ్చింది. నా కళ్ళు ఆకాశం వైపు ఎత్తి, సర్వోన్నతుడు దేవుడు, శాశ్వత కాలం ఉండే దేవునికి స్తోత్రాలు చెల్లించి కీర్తించాను. ఆయన అధికారం కలకాలం నిలుస్తుంది. ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది. భూలోకంలోని ప్రజలంతా ఆయన దృష్టిలో శూన్యులు. ఆయన పరలోకంలోని సైన్యాల మీదా, భూలోకంలోని ప్రజల మీదా తన ఇష్టం వచ్చినట్టు జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని “నువ్వు చేస్తున్నదేమిటి?” అని అడిగే అధికారం ఎవ్వరికీ లేదు. ఆ సమయంలో నాకు మళ్ళీ బుద్ది వచ్చింది. నా రాజ్యానికి గత వైభవం కలిగేలా ముందున్న ఘనత, ప్రభావాలు నాకు మళ్ళీ చేకూరాయి. నా మంత్రులు, నా క్రింది అధికారులు నా దగ్గరికి వచ్చి సమాలోచనలు జరిపారు. నా రాజ్యంపై అధికారం నాకు స్థిరపడింది. గతంలో కంటే అధికమైన ఘనత నాకు దక్కింది.

షేర్ చేయి
Read దానియేలు 4

దానియేలు 4:1-36 పవిత్ర బైబిల్ (TERV)

రాజైన నెబుకద్నెజరు తన లేఖను ప్రపంచంలో అన్ని జనాంగాలకు, ఇతర భాషలు మాటలాడే దేశాలకు, ప్రజలకు ఇలా వ్రాయించాడు: మీ అందరికీ సమాధాన మగుగాక! అత్యున్నతుడైన దేవుడు, నా కోసం చేసిన అద్భుత విషయాలు, అద్భుత సంఘటనల గురించి చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని సూచనలు, అద్భుతాలు మహాగొప్పవి, శక్తివంతమైనవి. దేవుని రాజ్యం శాశ్వతమైనది. దేవుని ప్రభుత్వం అన్ని తరాలు కొనసాగుతుంది. నెబుకద్నెజరు అను నేను నా అంతఃపురాన ఉన్నాను. నేను సుఖంగా సంతోషంగా ఉన్నాను. అప్పుడు నన్ను భయంగొలిపే కల ఒకటి వచ్చింది. నేను నా పడకమీద ఉన్నాను. నా మనస్సులోని ఆలోచనలు నన్ను భయపెట్టాయి. అందువల్ల బబులోనులోని వివేకవంతులందరినీ నావద్దకు తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఎందుకంటే వారు నా కలయొక్క అర్థం చెప్పగలరని. ఇంద్రజాలికులు, కల్దీయులు వచ్చారు. రాగానే వారితో కల వృత్తాంతం చెప్పాను. కాని దాని అర్థమేమిటో వారు చెప్పలేకపోయారు. చివరికి దానియేలు వచ్చాడు. (నా దేవుని గౌరవించే నిమిత్తం నేను దానియేలుకు బెల్తెషాజరు అని పేరుపెడితిని. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ అతనిలో వుంది.) నా కల గురించి దానియేలుతో చెప్పాను. నేను ఈ విధంగా చెప్పాను: “బెల్తెషాజరూ! ఇంద్రజాలికులందరిలో నీవు చాలా ముఖ్యుడివి. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ నీలో ఉన్నట్లు నాకు తెలుసు. ఏ రహస్యమూ తెలుసుకోవడం నీకు కష్టం కాదు. ఇది నేను కన్నకల. దాని అర్థమేమిటో చెప్పు. నేను నా పడక మీద ఉండగా ఈ దర్శనం నేను చూశాను. నా యెదుట భూమి మధ్యలో ఒక వృక్షం ఉంది. అది చాలా ఎత్తైనది. ఆ చెట్టు ఏపుగా దృఢంగా పెరిగింది. ఆ చెట్టు పైభాగం ఆకాశాన్ని అంటిందా అన్నట్లుంది. భూమిమీద ఎక్కడినుంచయినా ఆ చెట్టుని చూడవచ్చు. ఆ చెట్టు ఆకులు చాలా అందమైనవి. దాని మీద చాలా పళ్లు ఉన్నాయి. అవి అందరికీ ఆహారంగా ఉన్నాయి. భూజంతువులకు చెట్టుక్రింద నీడ లభించింది. దాని కొమ్మలలో పక్షులు ఉన్నాయి. ప్రతీ జీవి ఆ చెట్టునుండి పోషించబడింది. “నేను నా పడక మీదనే పడుకొని, నా దర్శనంలో కావలివానివలె పరలోకంనుంచి ఒక పవిత్రుడు క్రిందికి రావడం చూశాను. అతను చాలా బిగ్గరగా మాట్లాడాడు. ‘చెట్టును నరికి వేయండి. చెట్టుకొమ్మల్ని నరికి వేయండి. దాని ఆకుల్ని, దాని పండ్లని త్రుంచి పారవేయండి. చెట్టుకిందవున్న జంతువుల్ని తోలివేయండి. దాని కొమ్మలమీద వున్న పక్షుల్ని ఎగిరి పోనివ్వండి. కాని దాని మొద్దును వేళ్లతోసహా భూమిలోనే ఉండనివ్వండి. దాని చుట్టూ ఇనుము, కంచు కలిసిన ఒక బద్దీ వేయండి. చెట్టుమొద్దు, వ్రేళ్లు పొలంలో పెరిగే గడ్డి మధ్యలో భూమిలోనే ఉండనివ్వండి. మంచుచేత దాన్ని తడవనివ్వండి. ఇక మీదట అతను మనిషిలా ఆలోచించడు. అతనికి జంతువుల బుద్ధి వస్తుంది. ఏడు కాలాలు (సంవత్సరాలు) అలా గడుస్తాయి’ అని అతను చెప్పాడు. “కావలి దూత ద్వారా ఈ ఆజ్ఞ జారీ అయింది. పరిశుద్ధుల ద్వారా నిర్ణయం జరిగింది. ఇది అంతం వరకు ఉంటుంది. మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడని భూమిమీద నివసించే మనుష్యులందరు తెలుసుకొనేందుకు వీలవుతుంది. ఆయనకు నచ్చిన ఎవరికైనా దేవుడు ఆ రాజ్యాలను ఇచ్చి వేస్తాడు. ఆ రాజ్యాలను పాలించేందుకు వినయ విధేయతలుగల వారిని దేవుడు ఎన్నుకుంటాడు! “ఇదే నెబుకద్నెజరు రాజునైన నేను కన్నకల. ఇప్పుడు, బెల్తెషాజరూ (దానియేలూ)! ఈ కల అర్థం చెప్పు. నా రాజ్యంలోని వివేకవంతు లెవ్వరూ నాకు ఆ కల అర్థం చెప్పలేరు. కాని బెల్తెషాజరూ, నీవు ఆ కల గురించి చెప్పగలవు. ఎందుకంటే నీలో పరిశుద్ధ దేవతల ఆత్మవుంది.” తర్వాత దానియేలు (బెల్తెషాజరు) కొంచెంసేపు చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆలోచిస్తున్న విషయాలు అతన్ని కలత పరచాయి. అందువల్ల రాజు, “బెల్తెషాజరూ (దానియేలూ)! ఆ కలగాని, ఆ కలయొక్క అర్థంగాని, నిన్ను కలత చెందనీయకుండును గాక” అని చెప్పాడు. తర్వాత బెల్తెషాజరు (దానియేలు) రాజుతో ఇలా అన్నాడు: “నా రాజా! ఆ కల నీ విరోధులకు జరుగునుగాక! నీ శత్రువులకు ఆ కలయొక్క అర్థము నెరవేరును గాక! కలలో నీవొక వృక్షాన్ని చూశావు. అది ఏపుగా దృఢంగా పెరిగింది. దాని పైభాగం ఆకాశాన్ని అంటినట్లుగా ఉంది. భూమిమీద ఎక్కడినుంచియైనా దానిని చూడవచ్చు. దాని ఆకులు అందంగా ఉన్నాయి. ఫలసమృద్ధి కూడా ఉంది. ఆ పళ్లు ప్రతివారికీ సమృద్థిగా ఆహారం సమకూర్చాయి. అది అడవి మృగాలకు ఆశ్రయం. దాని కొమ్మలేమో పక్షుల నివాసస్థానం. అలాంటి వృక్షమే నీవు చూసింది. రాజా, నీవే ఆ వృక్షానివి. నీవు మహా శక్తిమంతుడవయ్యావు. ఆకాశాన్ని అంటిన ఉన్నత వృక్షంవంటి వాడవు నీవు. నీ అధికారం భూమిమీద దూర భాగాలకు కూడా వ్యాపించింది.” “రాజా, పరలోకంనుంచి ఒక పవిత్ర కావలి దేవదూత క్రిందికి రావడం నీవు చూశావు. అతడు ఇలా అన్నాడు: ‘చెట్టుని నరికివేయి; నాశనం చేయిము. ఇనుము, కంచు బద్దీతో కట్టబడి, పొలంలోని గడ్డిమధ్య నాటబడిన ఆ మొద్దును వ్రేళ్ళతోసహా భూమిలోనే విడిచిపెట్టు. ఏడు కాలాలు (సంవత్సరాలు) అతను మంచుకు తడుస్తూ మృగంవలె జీవిస్తాడు.’ “రాజా, కలయొక్క అర్థం ఇదే. మహోన్నతుడైన దేవుడు ఇవి జరుగుతాయని నా రాజువైన నీకు ఆజ్ఞాపించాడు. నెబుకద్నెజరు రాజా, నీ ప్రజలనుంచి దూరంగా నీవు తరుమబడతావు. భూజంతువుల మధ్య నీవు నివసిస్తావు. ఎద్దువలె నీవు పచ్చిక తింటావు. నీవు మంచుచేత తడుస్తావు. అలా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు నీవీపాఠం నేర్చుకుంటావు-మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడనీ, తనకు నచ్చిన ఎవనికైనా రాజ్యాలను ఇచ్చివేస్తాడనీ నీవు తెలుసుకుంటావు. “చెట్టు మొద్దును, వ్రేళ్లను నేలలోనే ఉంచుము అని ఇవ్వబడిన ఆజ్ఞకు అర్థమిది: మహోన్నతుడైన ఆ దేవుడే మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడన్న విషయం నీవు తెలుసుకున్నప్పుడు, నీ రాజ్యం నీకు ఇవ్వబడుతుంది. అందువల్ల, రాజా, నా సలహాను స్వీకరించుము. పాపం చేయడం ఆపివేయి. సరియైనదేదో అదే జరిగించు. చెడు విషయాలు చేయడం ఆపివేయి. బీదవారిపట్ల దయగలిగి ఉండుము. అప్పుడు నీవు క్రమంగా విజయాన్ని పొందగలవు.” నెబుకద్నెజరు రాజుకు ఆ ఘటనలన్నీ జరిగాయి. కల వచ్చిన పన్నెండు నెలల తర్వాత, బబులోనులోని తన అంతఃపురం పైభాగాన నెబుకద్నెజరు నడుల్తూ ఉండగా రాజు బబులోనువైపు చూసి, “ఈ గొప్ప నగరాన్ని, ఈ గొప్ప అంతఃపురాన్ని నా శక్తివల్ల నిర్మించాను. నేనెంత గొప్పవాడనో తెలపటానికి ఈ అంతః పురాన్ని నిర్మించాను” అని తన మనస్సులో చెప్పుకొన్నాడు. అతని మాటలు ఇంకా అతని నోటిలోనే ఉండగా, ఆకాశమునుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “నెబుకద్నెజరు రాజా, ఈ మాటలు నీకోసమే. నీ వద్దనుంచి నీ అధికారం తీసివేయబడింది. ప్రజలనుండి నీవు తరిమి వేయబడతావు. భూజంతువులతో నీవు నివసించాల్సి వస్తుంది. ఎద్దువలె నీవు పచ్చిక మేస్తావు. నీవు గుణపాఠం నేర్చుకునేలోగా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు మనుష్యుల రాజ్యాలను సర్వోన్నతుడైన దేవుడు పరిపాలిస్తాడనీ, తనకు నచ్చిన వానికి రాజ్యాలు ఇస్తాడనీ నీవు తెలుసుకుంటావు.” ఆ విషయాలు వెంటనే జరిగాయి. నెబుకద్నెరును ప్రజలు తమ మధ్యనుండి తరిమివేశారు. అతడు ఎద్దువలె పచ్చిక మేయ సాగాడు. ఆకాశ మంచుచేత అతని దేహం తడిసింది. గ్రద్ద ఈకలవలె అతని వెండ్రుకలు పొడుగ్గా పెరిగాయి. పక్షుల గోళ్లవలె అతని గోళ్లు పొడుగ్గా పెరిగాయి. ఆ యేడేళ్ల కాలం పూర్తి కాగానే, నెబుకద్నెజరు అను నేను ఆకాశంవైపు కన్నెత్తి చూశాను. మళ్లీ నాకు మానవబుద్ధి లభించింది. అప్పుడు మహోన్నతుడైన దేవున్ని నేను కీర్తించాను. ఎల్లాకాలము నివసించే ఆయనను గౌరవించి, ఇలా ప్రశంసించాను: ఆయన పరిపాలన శాశ్వతమైనది, తరతరాలకు ఆయన రాజ్యం కొనసాగుతుంది. భూమిమీద మనుష్యులు ఆయన ఎదుట లెక్క లేనివారికి సమానము. దేవుడు పరలోకలమందలి సైన్యాలకు, భూమిమీది మనుష్యులకు తనకు ఇష్టము వచ్చినట్లు చేస్తాడు. ఎవ్వరూ ఆయన శక్తివంతమైన హస్తాన్ని ఆపలేరు. ఎవ్వరూ ఆయన చేసే పనుల్ని ప్రశ్నించలేరు. అప్పుడు, ఆ సమయాన, దేవుడు నాకు సరి అయిన బుద్ధిని ప్రసాదించాడు. రాజుగా అధిక గౌరవం, శక్తిని నాకు తిరిగి ఇచ్చాడు. మరల నా సలహాదారులు రాజపురుషులు నా సలహా అడగ సాగారు. నేను మళ్లీ రాజుని అయ్యాను. పూర్వం కంటె ఎక్కువ శక్తి ఎక్కువ గొప్పతనం నాకు వచ్చాయి.

షేర్ చేయి
Read దానియేలు 4

దానియేలు 4:1-36 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. నెబుకద్నెజరను నేను నా యింట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనైయుండి యొక కల కంటిని; అది నాకు భయము కలుగజేసెను. నేను నా పడకమీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను. కావున ఆ స్వప్నభావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులనందరిని నా యెదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ నేనిచ్చితిని. శకునగాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతి ష్కులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేక పోయిరి. కడపట బెల్తెషాజరను నా దేవత పేరునుబట్టి బిరుదుపొందిన దానియేలను వాడు నా యెదుటికి వచ్చెను; పరిశుద్ధ దేవతల ఆత్మ అతనియందుండెను, కావున నేనతనికి నా కలను చెప్పితిని. ఎట్లనగా–శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరూ, పరిశుద్ధదేవతల ఆత్మ నీయందున్నదనియు, ఏ మర్మము నిన్ను కలతపెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియ జెప్పుము. నేను నా పడకమీద పరుండియుండగా నాకు ఈ దర్శనములు కలిగెను; నేను చూడగా భూమిమధ్యను మిగుల ఎత్తుగల యొక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకా శమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారముండెను; దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెను; సకల మనుష్యులకు చాలునంత ఆహారము దానియందుండెను. మరియు నేను నా పడక మీద పండుకొనియుండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా, జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశమునుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను –ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి; పశువులను దాని నీడనుండి తోలివేయుడి; పక్షులను దాని కొమ్మలనుండి ఎగురగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి, పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువుడి. ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవమనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును. బెల్తెషాజరూ, నెబుకద్నెజరను నాకు కలిగిన దర్శనము ఇదే; నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్ప నేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవేదానిని చెప్ప సమర్థుడ వంటిని. అందుకు బెల్తెషాజరను దానియేలు ఒక గంటసేపు అతి విస్మయమునొంది మనస్సునందు కలవరపడగా, రాజు–బెల్తెషాజరూ, యీ దర్శనమువలన గాని దాని భావము వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతట బెల్తె షాజరు–నా యేలినవాడా, యీ దర్శనఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక, తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకాశ మునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను, దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెనుగదా రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడ వైతివి; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది. –చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము; ఇనుము ఇత్తడి కలి సిన కట్టుతో ఏడు కాలములు గడచువరకు పొలములోని పచ్చికలో దాని కట్టించి, ఆకాశపుమంచుకు తడవనిచ్చి పశువులతో పాలుపొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకమునుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా. రాజా, యీ దర్శనభావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా యేలినవానిగూర్చి చేసిన తీర్మానమేదనగా తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువులమధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగుదేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడనియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును. చెట్టుయొక్క మొద్దునుండ నియ్యుడని వారు చెప్పిరిగదా దానివలన సర్వోన్నతుడు అధికారియని నీవు తెలిసికొనిన మీదట నీ రాజ్యము నీకు మరల ఖాయముగ వచ్చునని తెలిసికొమ్ము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక; ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న క్షేమము నీకికమీదటనుండునని దానియేలు ప్రత్యుత్తర మిచ్చెను. పైన జెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను. పండ్రెండు నెలలు గడచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు–బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. రాజు నోట ఈ మాట యుండగా ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగా–రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన– నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను. తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువులమధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారి యైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే ఆలాగున నెబుకద్నెజరునకు సంభవించెను; మానవులలోనుండి అతని తరిమిరి, అతడు పశువులవలె గడ్డిమేసెను, ఆకాశపుమంచు అతని దేహమును తడపగా అతని తలవెండ్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెలవంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివియు నాయెను. ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల మానవబుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశముతట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను; నా మంత్రులును నా క్రిందియధిపతులును నాయొద్ద ఆలోచన చేయ వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని.

షేర్ చేయి
Read దానియేలు 4

దానియేలు 4:1-36 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

రాజైన నెబుకద్నెజరు, లోకంలో జీవించే వివిధ భాషలు గల దేశాలకు, ప్రజలకు ఇలా తెలియజేస్తున్నాడు: మీకు గొప్పగా అభివృద్ధి కలుగును గాక! సర్వోన్నతుడైన దేవుడు నా పట్ల చేసిన అద్భుతమైన సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు మీకు చెప్పడం నాకు ఎంతో ఆనందము. ఆయన సూచకక్రియలు ఎంతో గొప్పవి, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి! ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం; ఆయన అధికారం తరతరాలకు నిలిచి ఉంటుంది. నెబుకద్నెజరు అనే నేను, నా రాజభవనంలో హాయిగా, క్షేమంగా ఉన్నాను. నాకు ఒక కల వచ్చింది, అది నన్ను భయపెట్టింది. నేను మంచం మీద పడుకుని ఉన్నప్పుడు, నా మనస్సులోనికి వచ్చిన దృశ్యాలు, దర్శనాలు నన్ను భయపెట్టాయి. కాబట్టి ఆ కల భావం చెప్పడానికి బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ నా ఎదుటకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాను. మాంత్రికులు, శకునగాళ్లు, కల్దీయ జ్యోతిష్యులు, సోదె చెప్పేవారు వచ్చినప్పుడు నా కల వారికి చెప్పాను. కాని వారు దాని భావం చెప్పలేకపోయారు. చివరికి, దానియేలు నా దగ్గరకు వచ్చాడు (నా దేవుని పేరైన బెల్తెషాజరు అని అతనికి పేరు పెట్టాను, ఎందుకంటే అతనిలో పవిత్ర దేవుళ్ళ ఆత్మ ఉంది) అతనికి నా కల చెప్పాను. నేను అతనితో, “శకునగాండ్రకు అధిపతివైన బెల్తెషాజరూ, పవిత్ర దేవుళ్ళ ఆత్మ నీలో ఉందని, మర్మం ఏదైనా నీకు కష్టం కాదని నాకు తెలుసు. ఇదిగో నా కల; దాని భావం నాకు చెప్పు. నా పడకలో నేను పడుకుని ఉన్నప్పుడు నేను చూసిన దర్శనాలు ఇవి: నేను చూడగా, భూమి మధ్యలో ఒక చెట్టు కనిపించింది, దాని ఎత్తు చాలా ఎక్కువ. ఆ చెట్టు ఎత్తుగా, బలంగా పెరిగింది. దాని కొమ్మ ఆకాశాన్ని అంటుకుంది; భూమి అంచుల వరకు అది కనిపించింది. దానికి అందమైన ఆకులు సమృద్ధిగా ఫలాలు ఉన్నాయి. అందరికి సరిపడా ఆహారం దాని మీద ఉంది. అడవి జంతువులు దాని నీడలో ఉన్నాయి, పక్షులు దాని కొమ్మల్లో నివసించాయి; ప్రతి జీవి దాని నుండి పోషించబడింది. “నేను మంచం మీద పడుకుని ఉన్నప్పుడు నా దర్శనాలలో పరలోకం నుండి ఒక పరిశుద్ధుడు, ఒక దూత రావడం చూశాను. అతడు ఇలా బిగ్గరగా అన్నాడు: ‘ఈ చెట్టును నరికివేయండి, కొమ్మలను కత్తిరించండి; దాని ఆకులను తీసివేసి దాని పండ్లను చెదరగొట్టండి. దాని క్రిందనుండి జంతువులు, దాని కొమ్మల నుండి పక్షులు పారిపోవాలి. అయితే దాని మొద్దును దాని వేర్లను ఇనుముతో ఇత్తడితో కట్టి పొలంలోని గడ్డిలో నేలపై విడిచిపెట్టండి. “ ‘అతడు ఆకాశ మంచులో తడిసిపోవాలి, అతడు జంతువులతో, భూమిమీది మొక్కలతో నివసించాలి. అతనికి ఏడు కాలాలు గడిచేవరకు, అతనికి మానవ మనస్సుకు బదులు జంతువు మనస్సు ఉండాలి. “ ‘ఈ నిర్ణయం దేవదూతలు ప్రకటించారు, పరిశుద్ధులు ఈ తీర్పును ప్రకటించారు, తద్వారా సర్వోన్నతుడు, సమస్త మానవ రాజ్యాల మీద ప్రభువని, ఆయన కోరుకున్న వారెవరికైన ఇస్తారని, ఆయన మనుష్యుల్లో అల్పులైనవారికి వాటి మీద అధికారమిస్తారని మనుషులంతా తెలుసుకుంటారు.’ “బెల్తెషాజరూ, నెబుకద్నెజరు రాజునైన నాకు వచ్చిన కల ఇది. బెల్తెషాజరూ, దాని అర్థమేంటో నాకు చెప్పు, నా రాజ్యంలో ఏ జ్ఞాని దీని భావం చెప్పలేదు. అయితే పవిత్ర దేవుళ్ళ ఆత్మ నీలో ఉంది కాబట్టి నీవు చెప్పగలవు” అని అన్నాడు. అప్పుడు దానియేలు (బెల్తెషాజరు అని కూడా పిలువబడ్డాడు) కొంత సమయం కలవరపడ్డాడు, అతని తలంపులు అతనికి భయం కలిగించాయి. అప్పుడు రాజు అన్నాడు, “బెల్తెషాజరూ, ఈ కలకు గాని దాని భావానికి కలవరపడవద్దు.” బెల్తెషాజరు జవాబిస్తూ అన్నాడు, “నా ప్రభువా, ఆ కల మీ శత్రువులకు, దాని అర్థం మీ విరోధులకు చెందితే ఎంత బాగుండేది! మీరు చూసిన చెట్టు పెద్దగా, బలంగా పెరుగుతూ, ఆకాశాన్ని తాకుతూ, లోకమంతట కనిపిస్తుంది, దాని ఆకులు అందంగా, ఫలాలు సమృద్ధిగా ఉంటూ, అందరికి ఆహారాన్ని ఇస్తూ, అడవి జంతువులకు ఆశ్రయాన్ని ఇస్తూ, పక్షులు గూళ్ళు కట్టుకునే స్థలం కలిగి ఉంది రాజా! ఆ చెట్టు మీరే! మీరు గొప్పగా, బలవంతునిగా అయ్యారు; మీ గొప్పతనం ఆకాశాన్ని తాకే అంతగా, మీ అధికారం భూదిగంతాల వరకు విస్తరించింది. “రాజా! పరలోకం నుండి పరిశుద్ధుడు, ఒక దేవదూత వచ్చి, ‘చెట్టును నరికి దానిని నాశనం చేయాలి, కాని మొద్దును ఇనుముతో, ఇత్తడితో కట్టి పొలం గడ్డి మధ్యలో విడిచిపెట్టాలి, దాని వేర్లు భూమిలో ఉండాలి. అతడు ఆకాశ మంచులో తడిసిపోవాలి; అతడు ఏడు కాలాలు దాటే వరకు అడవి జంతువుల మధ్యలో నివసించాలి’ అని ప్రకటించడం మీరు చూశారు. “రాజా! ఆ కల భావం ఇదే, సర్వోన్నతుడైన దేవుడు నా ప్రభువైన రాజుకు జారీ చేసిన ఆదేశం ఇది: మీరు ప్రజల నుండి తరిమివేయబడి, అడవి జంతువుల మధ్య నివసిస్తారు; ఎద్దులా గడ్డి మేస్తూ ఆకాశపు మంచుకు తడిసిపోతారు. సర్వోన్నతుడు భూమిపై ఉన్న రాజ్యాలకు ప్రభువని, ఆయన వాటిని ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తారని మీరు గుర్తించేవరకు మీకు ఏడు కాలాల వరకు ఇలా జరుగుతుంది. చెట్టు మొద్దు, వేర్లు అలానే విడిచిపెట్టమని ఇచ్చిన ఆజ్ఞకు అర్థం ఏంటంటే, మీరు పరలోకం పరిపాలిస్తుందని గ్రహించినప్పుడు, మీ రాజ్యం తిరిగి మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి రాజా! నా సలహాను ఇష్టంతో అంగీకరించండి: సరియైనది చేస్తూ మీ పాపాలను విడిచిపెట్టండి, బాధల్లో ఉన్నవారికి దయ చూపిస్తూ మీ చెడుతనాన్ని మానేయండి. అప్పుడు మీ అభివృద్ధి కొనసాగుతుంది.” ఇదంతా నెబుకద్నెజరుకు రాజుకు జరిగింది. పన్నెండు నెలల తర్వాత, రాజు బబులోను రాజభవనం పైకప్పు మీద నడుస్తూ, “నా రాజ నివాసంగా నేను కట్టుకున్న ఈ మహా బబులోను పట్టణం నా బలప్రభావంతో నా వైభవాన్ని కనుపరచడానికి కట్టుకుంది కాదా?” అని తనలో తాను అనుకున్నాడు. ఆ మాటలు తన పెదవుల మీద ఉండగానే, ఆకాశం నుండి ఓ స్వరం వినిపించింది, “రాజైన నెబుకద్నెజరూ, నీకోసం ఇలా ప్రకటించబడింది: నీ రాజ్యాధికారం నీ నుండి తీసివేయబడింది. నీవు ప్రజల నుండి తొలగించబడతావు, నీవు ప్రజల్లో నుండి తరమబడి అడవి జంతువులతో నివసిస్తావు; ఎద్దులా నీవు గడ్డి మేస్తావు. సర్వోన్నతుడు భూరాజ్యాల మీద అధికారి అని, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి వాటిని ఇస్తారని నీవు గ్రహించే వరకు నీవు ఏడు కాలాలు గడుపుతావు.” వెంటనే నెబుకద్నెజరు గురించి చెప్పబడింది నెరవేరింది. అతడు ప్రజల నుండి తరమబడి, ఎద్దులా గడ్డి మేశాడు. అతని తలవెంట్రుకలు గ్రద్ద ఈకల్లా, అతని గోళ్ళు పక్షి గోళ్ళలా పెరిగే వరకు, అతని శరీరం ఆకాశం నుండి పడే మంచుకు తడిసిపోయింది. ఆ కాలం గడిచిన తర్వాత నెబుకద్నెజరు అనే నేను ఆకాశం వైపు నా తలెత్తి చూశాను, అప్పుడు నా మానవ బుద్ధి తిరిగి వచ్చింది. అప్పుడు నేను సర్వోన్నతున్ని స్తుతించాను; నిత్యం జీవించే ఆయనను ఘనపరిచాను, మహిమపరిచాను. ఆయన అధికారం శాశ్వత అధికారం; ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది. ఆయన దృష్టిలో భూప్రజలు శూన్యులు. పరలోక శక్తుల పట్ల భూప్రజల పట్ల ఆయనకు నచ్చింది చేస్తారు. ఆయనను ఎవరూ ఆపలేరు. “మీరు చేసింది ఏంటి?” అని ఆయనను అడగలేరు. నా మానవ బుద్ధి తిరిగి ఇవ్వబడిన ఆ సమయంలోనే, నా రాజ్య మహిమ కోసం నా ఘనత, నా వైభవం నాకు తిరిగి ఇవ్వబడ్డాయి. నా సలహాదారులు, నా ఘనులు నా దగ్గరకు వచ్చారు, నేను నా సింహాసనం మీద మరలా కూర్చున్నాను, మునుపటి కంటే ఇంకా గొప్పవాడిగా అయ్యాను.

షేర్ చేయి
Read దానియేలు 4