దానియేలు 4:1-3
దానియేలు 4:1-3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రాజైన నెబుకద్నెజరు, లోకంలో జీవించే వివిధ భాషలు గల దేశాలకు, ప్రజలకు ఇలా తెలియజేస్తున్నాడు: మీకు గొప్పగా అభివృద్ధి కలుగును గాక! సర్వోన్నతుడైన దేవుడు నా పట్ల చేసిన అద్భుతమైన సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు మీకు చెప్పడం నాకు ఎంతో ఆనందము. ఆయన సూచకక్రియలు ఎంతో గొప్పవి, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి! ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం; ఆయన అధికారం తరతరాలకు నిలిచి ఉంటుంది.
దానియేలు 4:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
లోకమంతటిలో నివసించే అన్ని దేశాల ప్రజలకు, వివిధ భాషలు మాట్లాడే వారికి రాజైన నెబుకద్నెజరు ఇలా రాస్తున్నాడు. “మీకందరికీ పూర్ణ క్షేమం కలుగు గాక. సర్వశక్తిమంతుడైన దేవుడు నా విషయంలో జరిగించిన అద్భుతాలను, సూచక క్రియలను మీకు తెలియజేయాలని నా మనస్సుకు తోచింది. ఆయన చేసే సూచక క్రియలు బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యం శాశ్వతంగా ఉండేది. ఆయన అధికారం తరతరాలకు నిలుస్తుంది.”
దానియేలు 4:1-3 పవిత్ర బైబిల్ (TERV)
రాజైన నెబుకద్నెజరు తన లేఖను ప్రపంచంలో అన్ని జనాంగాలకు, ఇతర భాషలు మాటలాడే దేశాలకు, ప్రజలకు ఇలా వ్రాయించాడు: మీ అందరికీ సమాధాన మగుగాక! అత్యున్నతుడైన దేవుడు, నా కోసం చేసిన అద్భుత విషయాలు, అద్భుత సంఘటనల గురించి చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని సూచనలు, అద్భుతాలు మహాగొప్పవి, శక్తివంతమైనవి. దేవుని రాజ్యం శాశ్వతమైనది. దేవుని ప్రభుత్వం అన్ని తరాలు కొనసాగుతుంది.
దానియేలు 4:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది.