దానియేలు 3:10-18
దానియేలు 3:10-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రాజా! మీరు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు వినబడిన వెంటనే ప్రజలందరు సాగిలపడి బంగారు విగ్రహాన్ని పూజించాలని, ఎవరైతే సాగిలపడి పూజించరో, వారిని మండుతున్న అగ్నిగుండంలో పడవేస్తారని శాసనం జారీ చేశారు. అయితే రాజా, మీరు బబులోను సామ్రాజ్య అధికారులుగా నియమించిన షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే యూదులు మిమ్మల్ని లెక్క చేయట్లేదు. వారు మీ దేవుళ్ళకు సేవ చేయడం లేదు, పూజించడం లేదు.” నెబుకద్నెజరు అతి కోపంతో మండిపోయి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు. కాబట్టి వారిని రాజు సముఖానికి తీసుకువచ్చారు. అప్పుడు నెబుకద్నెజరు వారితో, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవుళ్ళకు సేవ చేయలేదని, నేను నిలిపిన బంగారు విగ్రహాన్ని పూజించట్లేదనేది నిజమా? ఇప్పటికైనా మీరు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు విన్నప్పుడు నేను నిలబెట్టిన విగ్రహం ఎదుట సాగిలపడి పూజిస్తే మంచిది. ఒకవేళ మీరు దానిని పూజించకపోతే, మీరు మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. అప్పుడు ఏ దేవుడు మిమ్మల్ని నా చేతి నుండి రక్షిస్తాడు?” అన్నాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగో అతనికి జవాబిస్తూ, “నెబుకద్నెజరు రాజు, ఈ విషయంలో మేము మీ ఎదుట వివరం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మమ్మల్ని మండుతున్న అగ్నిగుండంలో పడవేసినా మేము సేవించే దేవుడు దాని నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు. రాజా, మీ చేతిలో నుండి ఆయన మమ్మల్ని రక్షిస్తారు. రాజా, ఆయన రక్షించకపోయినా సరే మీ దేవుళ్ళకు మేము సేవ చేయం, మీరు నిలబెట్టిన బంగారు విగ్రహాన్ని పూజించమని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాము” అన్నారు.
దానియేలు 3:10-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రాజా, తమరు ఒక కట్టుబాటు నియమించారు. అది ఏమిటంటే, బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు విన్న ప్రతి వ్యక్తీ ఆ బంగారు విగ్రహం ఎదుట సాష్టాంగపడి దానికి నమస్కరించాలి. ఎవరైతే సాష్టాంగపడి నమస్కరించలేదో వాణ్ణి మండుతూ ఉండే అగ్నిగుండంలో వేస్తారు. రాజా, తమరు షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ముగ్గురు యూదు యువకులను బబులోను దేశంలోని రాజ్య పరిపాలన వ్యవహారాలు నిర్వర్తించడానికి నియమించారు. ఆ ముగ్గురు వ్యక్తులు మీరు ఇచ్చిన ఆజ్ఞను గౌరవించక నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు మీ దేవుళ్ళను పూజించడం లేదు, తమరు నిలబెట్టించిన బంగారు విగ్రహం ఎదుట నమస్కరించడం లేదు.” రాజైన నెబుకద్నెజరు తీవ్ర కోపంతో మండిపడ్డాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను తన దగ్గరికి తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ ముగ్గురు వ్యక్తులను పట్టుకుని రాజ సన్నిధికి తీసుకువచ్చారు. అప్పుడు నెబుకద్నెజరు వాళ్ళతో “షద్రకూ, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతలను పూజించడం లేదనీ, నేను నిలబెట్టించిన బంగారు విగ్రహానికి నమస్కరించడం లేదనీ నాకు తెలిసింది. ఇది నిజమేనా? బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు మీకు వినబడినప్పుడు నేను చేయించిన విగ్రహానికి సాష్టాంగపడి దానికి నమస్కరించడానికి సిద్ధంగా ఉండండి. మీరు గనక నమస్కరించని పక్షంలో తక్షణమే మండుతున్న అగ్నిగుండంలో పడవేయిస్తాను. నా చేతిలో నుండి మిమ్మల్ని ఏ దేవుడూ కాపాడలేడు” అన్నాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుతో ఇలా చెప్పారు. “నెబుకద్నెజరూ, దీని విషయం నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము పూజిస్తున్న దేవుడు మండుతున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించగల సామర్థ్యం ఉన్నవాడు. నువ్వు విధించే శిక్ష నుండి ఆయన మమ్మల్ని కాపాడతాడు. రాజా, ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా నీ దేవుళ్ళను మాత్రం మేము పూజించం అనీ, నువ్వు నిలబెట్టిన బంగారు విగ్రహానికి నమస్కరించం అనీ తెలుసుకో.”
దానియేలు 3:10-18 పవిత్ర బైబిల్ (TERV)
రాజా! నీవొక ఆజ్ఞ విధించావు. కొమ్ము బూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు, మొదలైన వివిధ సంగీత వాద్యాల ధ్వనులు వినగానే అందరూ సాగిలపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలని నీవు చెప్పావు. ఎవరైనా బంగారు విగ్రహానికి బోర్లగాపడి నమస్కరించకపోతే, అతడు మండుచున్న కొలిమిలోకి త్రోయబడతాడని నీవు చెప్పావు. రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నడవని యూదులు కొందరున్నారు. బబులోను రాజ్యంలో ఆ యూదులను నీవు ముఖ్యోద్యోగులుగా నియమించావు. వారు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. వారు నీ దేవుళ్లను పూజించరు. నీవు ప్రతిష్ఠించిన ఆ బంగారు విగ్రాహాన్ని తలవంచి వారు పూజించలేదు.” నెబుకద్నెజరు చాలా ఉగ్రుడైనాడు. అతడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు. అందువల్ల వారిని అతని సమక్షానికి తీసుకు వచ్చారు. నెబుకద్నెజరు వారిని చూచి, “షద్రకు, మేషాకు, అబెద్నెగో! మీరు నా దేవుళ్లని పూజించని మాట నిజమేనా? పైగా నేను ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని పూజించని మాటకూడా నిజమేనా? కొమ్ముబూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు మొదలైన వాద్య ధ్వనులు వినగానే మీరు బోర్లగాపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే, అది మంచిది. మీరు పూజించకపోతే, మిమ్మును వెంటనే మండుచున్న కొలిమిలోకి తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారంనుంచి మిమ్మును కాపాడలేడు!” షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకు ఇలా ప్రత్యుత్తరమిచ్చారు: “నెబుకద్నెజరూ, ఈ విషయాలు మీకు మేము వివరించనవసరం లేదు. మీరు మమ్మును మండుచున్న కొలిమిలోకి తోసివేస్తే, మేము నమ్ముకొన్న మా దేవుడే మమ్ములను రక్షిస్తాడు. మరియు ఆయనకు ఇష్టం కలిగితే, మీ అధికారంనుంచి మమ్ములను కాపాడుతాడు. మా దేవుడు మమ్ములను రక్షించని పక్షంలో కూడా, రాజా, మేము నీ దేవుళ్లను కొలవమనే సంగతి నీవు తెలుసుకోవాలి. నీవు ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని మేము పూజించము.”
దానియేలు 3:10-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి; ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణెను వీణెను విపంచికను సుంఫోనీయను సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసికొని వచ్చిరి. అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను – షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను వీణెను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలోనుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు? షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి–నెబుకద్నెజరూ, యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.