దానియేలు 2:13-19

దానియేలు 2:13-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇట్టి శాసనము బయలుదేరుటవలన జ్ఞానులు చంపబడవలసియుండగా, వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహసంరక్షకుల యధిపతియగు అర్యోకుదగ్గరకు పోయి, జ్ఞానయుక్తముగా మనవిచేసెను –రాజు నొద్దనుండి ఈ యాజ్ఞ యింత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజుయొక్క అధిపతియైన అర్యోకు నడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియ జెప్పుటకై తనకు సమయము దయచేయుమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన యింటికి పోయి తన స్నేహితు లైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులును బబులోనులో తక్కిన జ్ఞానులతోకూడ నశింపకుండునట్లు ఆ కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను.

షేర్ చేయి
Read దానియేలు 2

దానియేలు 2:13-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

జ్ఞానులను హతమార్చాలని రాజు ఇచ్చిన ఆజ్ఞను అమలు చేయడానికి సైనికులు బయలుదేరారు. ఆ క్రమంలో దానియేలును, అతని స్నేహితులను కూడా చంపాలని వెదుకుతున్నారు. బబులోనులో ఉన్న జ్ఞానులను చంపడానికి బయలుదేరిన సైనిక దళం అధిపతి అర్యోకు దగ్గరికి దానియేలు వెళ్ళాడు. అతనితో జ్ఞానయుక్తంగా మాట్లాడాడు. రాజు ఇలాంటి ఆజ్ఞ ఇంత త్వరగా ఎందుకు జారీ చేశాడని అడిగాడు. అర్యోకు జరిగిన విషయమంతా దానియేలుకు వివరించాడు. దానియేలు రాజుకు వచ్చిన కల భావం తెలియజేయడానికి తనకు కొంత గడువు ఇవ్వమని రాజు దగ్గర అనుమతి తీసుకున్నాడు. తరువాత దానియేలు తన ఇంటికి వెళ్ళి తన స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు విషయం తెలియజేశాడు. తనకు, తన స్నేహితులకు, బబులోనులో ఉన్న మిగిలిన జ్ఞానులకు రాబోతున్న ఆపద తప్పిపోయేలా రాజుకు వచ్చిన కల, ఆ కల భావం తెలియడానికి పరలోకంలో ఉన్న దేవుని నుండి దయ కలిగేలా దేవుణ్ణి వేడుకొమ్మని వాళ్ళను హెచ్చరించాడు. ఆ రాత్రి సమయంలో దానియేలుకు దర్శనంలో ఆ కల, కల అర్థం వెల్లడైనాయి. దీన్నిబట్టి దానియేలు పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఈ విధంగా స్తుతించాడు

షేర్ చేయి
Read దానియేలు 2

దానియేలు 2:13-19 పవిత్ర బైబిల్ (TERV)

నెబుకద్నెజరు వివేకవంతులందరు చంపబడాలని ఆజ్ఞ ప్రకటించగా రాజు మనుష్యులు దానియేలు మరియు అతని మిత్రుల్ని చంపడానికి వెళ్లారు. అర్యోకు రాజరక్షకభటుల అధిపతి. బబులోనులోని వివేకవంతుల్ని చంపడానికి అతడు బయలు దేరాడు. కాని దానియేలు అతనితో తెలివిగా మాట్లాడాడు. దానియేలు రాజరక్షకభటుల అధిపతియైన అర్యోకుని ఇలా అడిగాడు: “రాజు ఎందుకు ఇంత కఠినమైన శిక్షను విధించాడు?” అప్పుడు అర్యోకు రాజు కలయొక్క వృత్తాంతము నంతటిని దానియేలుకు వివరించాడు. దానియేలు అది విని, సంగతి తెలుసుకొన్నాడు. అతను నెబుకద్నెజరు రాజు వద్దకు వెళ్లి, తనకు మరికొంత సమయం ఇమ్మని, అప్పుడు తను కలను, కలయొక్క అర్థాన్ని చెప్పగలనని అడిగాడు. దానియేలు తన ఇంటికి వెళ్లి మిత్రులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు పూర్తి సంగతిని వివరించాడు. తమ పాలిట దేవుడు దయకలిగి ఆ రహస్యమును తెలుపుటకు పరలోకమందున్న దేవుని ప్రార్థించుమని దానియేలు తన మిత్రుల్ని కోరాడు. ఎందుకనగా దానియేలు మరియు అతని మిత్రులు బబులోనులోని యితర వివేకవంతులతో కలిసి నాశనమవ్వకూడదు. ఆ రాత్రి, దేవుడు ఆ రహస్యమును దానియేలుకి దర్శనములో వివరించాడు. అప్పుడు పరలోక మందున్న దేవున్ని దానియేలు స్తుతించాడు.

షేర్ చేయి
Read దానియేలు 2

దానియేలు 2:13-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

జ్ఞానులను చంపమని శాసనం జారీ అయ్యింది, కాబట్టి దానియేలును అతని స్నేహితులను చంపాలని మనుష్యులు వారిని వెదకడానికి వెళ్లారు. రాజుకు ప్రధాన రక్షక భటుడైన అర్యోకు బబులోనులోని జ్ఞానులను చంపడానికి వెళ్లినప్పుడు, దానియేలు జ్ఞానంతో, యుక్తితో అతనితో మాట్లాడాడు. “రాజు దగ్గర నుండి ఇలాంటి కఠినమైన ఆజ్ఞ ఇంత త్వరగా రావడమేంటి?” అని రాజాధికారిని అతడు అడిగాడు. అప్పుడు అర్యోకు దానియేలుకు విషయాన్ని వివరించాడు. వెంటనే దానియేలు రాజు దగ్గరకు వెళ్లి, ఆ కల భావాన్ని వివరించడానికి కొంత సమయం ఇవ్వమని కోరాడు. తర్వాత దానియేలు ఇంటికి వెళ్లి తన స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు ఆ సంగతి వివరించాడు. దానియేలు, అతని స్నేహితులు, బబులోనులో ఉన్న ఇతర జ్ఞానులతో పాటు చంపబడకుండునట్లు, పరలోక దేవుడు ఆ మర్మాన్ని తెలియజేసేలా ఆయన కరుణ కోసం ప్రాధేయపడమని వారిని బలవంతం చేశాడు. ఆ రాత్రివేళ దానియేలుకు దర్శనం ద్వారా ఆ మర్మం తెలియజేయబడింది. అప్పుడు దానియేలు పరలోక దేవున్ని స్తుతిస్తూ

షేర్ చేయి
Read దానియేలు 2