దానియేలు 1:3-7

దానియేలు 1:3-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తరువాత రాజు తన దేశంలోని ముఖ్య అధికారి అష్పెనజుతో మాట్లాడాడు. బందీలుగా తెచ్చిన ఇశ్రాయేలు రాజు కుటుంబానికీ, రాజవంశాలకు చెంది, ఎలాంటి లోపాలు లేకుండా అందం, తెలివితేటలు, జ్ఞాన వివేకాలు కలిగి ఉన్నవాళ్ళను తెమ్మని చెప్పాడు. అతడు వాళ్ళకు ప్రావీణ్యత కలిగేలా కల్దీయ భాష, సాహిత్యం నేర్పించాలి. రాజు “వారికి ప్రతి రోజూ నేను తినే ఆహారం, తాగే ద్రాక్షారసం ఇవ్వండి. ఆ విధంగా మూడు సంవత్సరాలపాటు వాళ్ళకు శిక్షణ ఇచ్చిన తరువాత వారు నా కొలువులో సేవకులుగా ఉండాలి.” బందీలుగా వెళ్ళిన యూదుల్లో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనే యువకులు ఉన్నారు. నపుంసకుల అధికారి దానియేలుకు బెల్తెషాజరు అనీ, హనన్యాకు షద్రకు అనీ, మిషాయేలుకు మేషాకు అనీ, అజర్యాకు అబేద్నెగో అనీ పేర్లు మార్చాడు.

షేర్ చేయి
Read దానియేలు 1

దానియేలు 1:3-7 పవిత్ర బైబిల్ (TERV)

తర్వాత నెబుకద్నెజరు అష్పెనజుకు (అష్పెనజు రాజు కొలువులోని నపుంసకులలో ప్రముఖుడు), “కొందరు యూదులను తన ఇంటికి తీసుకు రమ్మని” చెప్పాడు. కొన్ని ప్రసిద్ధ కుటుంబాలనుంచి, ఇశ్రాయేలీయుల రాజకుటుంబంనుంచి ఆరోగ్యవంతులైన యౌవన యూదులను తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఎలాంటి లోపము తమ దేహాలమీద లేనివారు, అందమైన, చురుకైనవారు, తేలికగా విషయాలు నేర్చుకునేవారు, రాజగృహములో సేవ చేయ సామర్థ్యముగల యువకులను ఎన్నుకోమన్నాడు. ఆ ఇశ్రాయేలు యువకులకు కల్దీయుల భాషను, వ్రాతలను నేర్పుమని రాజు అష్పెనజుకు ఆజ్ఞాపించాడు. నెబుకద్నెజరు ఆ యువకులకు ప్రతిరోజు రాజు తిని, త్రాగే ఆహారము, ద్రాక్షామద్యం ఇప్పించాడు. ఇశ్రాయేలుకు చెందిన ఆ యువకులు మూడేళ్లపాటు తర్ఫీదు పొందాలని రాజు ఆదేశించాడు. మూడేళ్ల తర్వాత, వారు బబులోను రాజ నగరులో ప్రవీణులుగా ఉంటారు. ఆ యువకులలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు యూదా దేశానికి చెందినవారు. తర్వాత అష్పెనజు యూదానుంచి వచ్చిన ఆ యువకులకు బబులోనీయుల పేర్లు పెట్టాడు. దానియేలుకు బెల్తెషాజరు, మిషాయేలుకు మేషాకు, అజర్యాకు అబేద్నెగో, హనన్యాకు షద్రకు అని పేర్లు పెట్టాడు.

షేర్ చేయి
Read దానియేలు 1

దానియేలు 1:3-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను – ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి, తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములోనుండియు తాను పానముచేయు ద్రాక్షారసములోనుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలోనుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలోనుండిరి. నపుంస కుల యధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేళ్లు పెట్టెను.

షేర్ చేయి
Read దానియేలు 1

దానియేలు 1:3-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

రాజు, రాజ్య పరిచర్య చేయడానికి ఇశ్రాయేలీయులలో రాజకుటుంబానికి, రాజవంశాలకు చెందిన కొంతమందిని తీసుకురమ్మని తన ముఖ్య అధికారియైన అష్పెనజును ఆదేశించాడు. ఆ యువకులు ఏ శారీరక లోపం లేనివారై, అందంగా ఉండి, విద్యా ప్రావీణ్యత కలిగి తెలివి కలవారై, త్వరగా గ్రహించే వారై రాజభవనంలో సేవ చేయటానికి సామర్థ్యం కలిగి ఉండాలి. వారికి బబులోనీయుల భాష చదవడం వ్రాయడం నేర్పాలి. రాజు తన బల్ల నుండి వారి కోసం ఆహారం, ద్రాక్షరసం కొంత భాగాన్ని ప్రతిరోజు వారికి కేటాయించాడు. వారు మూడు సంవత్సరాలు శిక్షణ పొంది ఆ తర్వాత వారు రాజుకు సేవ చేయాలి. యూదా నుండి ఎంపిక చేసిన వారిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా ఉన్నారు. ప్రధాన అధికారి దానియేలుకు బెల్తెషాజరు అని, హనన్యాకు షద్రకు అని మిషాయేలుకు మేషాకు అని అజర్యాకు అబేద్నెగో అని క్రొత్త పేర్లు పెట్టాడు.

షేర్ చేయి
Read దానియేలు 1