కొలొస్సయులకు 2:16-23

కొలొస్సయులకు 2:16-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

కాబట్టి, మీరు తిని త్రాగే వాటి గురించి గాని, మతపరమైన పండుగల గురించి అనగా అమావాస్య, సబ్బాతు దిన ఆచారాల గురించి గాని మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చనివ్వకండి. ఇవి రాబోవు వాటి ఛాయారూపమే, కానీ నిజమైన స్వరూపం క్రీస్తులోనే ఉన్నది. ఎవరైనా కపట వినయం ప్రదర్శిస్తూ, దేవదూతల పట్ల భక్తి కనుపరుస్తూ మిమ్మల్ని అనర్హులుగా చేయకుండా చూసుకోండి. అలాంటివారు తాము చూసినవాటిని గురించి గొప్పగా వివరిస్తూ ఉంటారు; తమ బుద్ధిహీనమైన మనస్సు వలన వ్యర్థమైన ఆలోచనలతో అతిశయపడతారు. వారు శిరస్సు నుండి సంబంధాన్ని పోగొట్టుకుంటారు; అయితే ఆ శిరస్సు వలన మొత్తం శరీరం కీళ్ళతో నరములతో ఒకటిగా అతుకబడి, దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతుంది. మీరు క్రీస్తుతో పాటు లోకం యొక్క మూల నియమాల విషయమై చనిపోయినవారైతే, లోకానికి చెందినవారిగా, “చేతితో పట్టుకోవద్దు! రుచి చూడవద్దు! ముట్టుకోవద్దు!” అనే వాటికి మీరు ఎందుకు లోబడుతున్నారు? ఉపయోగించి నశించడానికి నియమించబడిన ఈ నియమాలు కేవలం మానవ ఆజ్ఞలు, బోధలపై ఆధారపడినవి. అలాంటి నియమాలు, వారి స్వయంకృత ఆరాధన విషయంలో, అతి వినయం విషయంలో, శరీరాన్ని హింసించుకోవడం జ్ఞానంగా అనిపించవచ్చు, కాని శారీరక ఆశలను చంపుకోవడంలో అలాంటి నియమాలకు ఎలాంటి విలువలేదు.

కొలొస్సయులకు 2:16-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కాబట్టి తినే విషయంలోనూ తాగే విషయంలోనూ, పండగ రోజులూ, అమావాస్య, విశ్రాంతి దినం వంటి విషయాల్లోనూ ఎవరూ మిమ్మల్ని విమర్శించకుండా చూసుకోండి. ఇవన్నీ జరగబోతున్న వాటికి నీడల్లాంటివి. వాటి నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఎవరైనా కపట వినయం ప్రదర్శిస్తూ, దేవదూతల పట్ల భక్తి కనపరుస్తూ మీరు మీ బహుమానం పోగొట్టుకొనేలా చేయకుండా జాగ్రత్త పడండి. అలాటివాడు తాను చూసిన విషయాలను అతిశయోక్తిగా చెప్పుకుంటాడు. వాడు తన శరీర సంబంధమైన ఆలోచన వల్ల కారణం లేకుండానే వాటి విషయంలో గర్విష్టి అవుతాడు. అలాంటి వాడు శిరస్సుగా ఉన్న క్రీస్తు యేసును అంటి పెట్టుకుని ఉండడు. ఆ శిరస్సు వల్లనే శరీరానికి పోషణ జరుగుతుంది. ఆ శిరస్సు వల్లనే కీళ్లతో, నరాలతో శరీరం ఒక్కటిగా ఉంటుంది. దేవుడు ప్రసాదించే ఎదుగుదలతో శరీరం అభివృద్ధి చెందుతుంది. ప్రాపంచిక మూల సూత్రాల విషయంలో మీరు క్రీస్తుతో కూడా మరణించారు కాబట్టి వాటి కిందనే ఇంకా బ్రతుకుతున్నట్టుగా ఆ నియమాలకు మీరెందుకు లోబడి ఉండాలి? “అది పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ఇది ముట్టుకోవద్దు” లాంటి మనుషుల ఆజ్ఞలను ఎందుకు లెక్క చేయాలి? ఈ ఆజ్ఞలూ, ఉపదేశాలూ అన్నీ, ఉపయోగించడం చేత నాశనమైపోయే విషయాల కోసం వ్యక్తులు చేసేవే. వీటిలో మానవ నిర్మితమైన మత విధానాల జ్ఞానమూ కపట వినయమూ శరీరాన్ని కఠినంగా అదుపులో పెట్టుకోవడం వంటివి ఉన్నాయి. కానీ శరీర కోరికలను నియంత్రించుకునే విషయంలో అవి ఎందుకూ కొరగానివి.

కొలొస్సయులకు 2:16-23 పవిత్ర బైబిల్ (TERV)

అందువల్ల అన్నపానాల విషయంలో గాని, మత సంబంధమైన పండుగ విషయాల్లో గాని, అమావాస్య పండుగ విషయంలో గాని, యూదుల విశ్రాంతి రోజు విషయంలో కాని యితరులు మీపై తీర్పు చెప్పకుండా జాగ్రత్తపడండి. ఇవి నీడలా రానున్న వాటిని సూచిస్తున్నాయి. కాని సత్యం క్రీస్తులో ఉంది. కొందరు తాము దివ్యదర్శనం చూసామని, కనుక తాము గొప్ప అని చెప్పుకొంటారు. అతి వినయం చూపుతూ దేవదూతల్ని పూజిస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని అయోగ్యులుగా పరిగణించకుండా జాగ్రత్తపడండి. వాళ్ళు ప్రాపంచిక దృష్టితో ఆలోచిస్తారు. కనుక, నిష్కారణంగా గర్విస్తూ ఉంటారు. శిరస్సు కారణంగా కీళ్ళు, నరాలు దేహాన్ని ఒకటిగా ఉంచి ఆ దేహానికి శక్తిని కలిగిస్తున్నాయి. శిరస్సు కారణంగా దేవుని ఆదేశానుసారం ఆ దేహం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాంటి శిరస్సుతో వాళ్ళు సంబంధం తెంచుకొన్నారు. మీరు క్రీస్తుతో మరణించినప్పుడే ఈ ప్రపంచం యొక్క ప్రాథమిక నియమాల నుండి స్వేచ్ఛను పొందారు. మరి అలాంటప్పుడు ఈ ప్రపంచానికి చెందినవాళ్ళైనట్లు, ఆ ప్రాథమిక నియమాలను ఎందుకు పాటిస్తున్నారు? “ఇది వాడకు, దాన్ని రుచి చూడకు, ఇది ముట్టుకోకు.” ఈ నియమాలు మానవుల ఆజ్ఞలతో, బోధలతో సృష్టింపబడినవి కనుక అవి వాడుక వల్ల నశించిపోయే వస్తువుల్లాంటివి. ఇలాంటి నియమాలు పైకి తెలివైనవిగా కనిపిస్తాయి. అవి దొంగపూజలకు, దొంగవినయం చూపటానికి, దేహాన్ని అనవసరంగా, కఠినంగా శిక్షించటానికి ఉపయోగపడవచ్చు. కాని శారీరక వాంఛల్ని అదుపులో పెట్టుకోవటానికి పనికి రావు.

కొలొస్సయులకు 2:16-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అతి వినయాసక్తుడై దేవదూతా రాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచినవాటినిగూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరములచేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి–చేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు.