కొలొస్సయులకు 1:12-29
కొలొస్సయులకు 1:9-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము. ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను. ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను. ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. మరియు గతకాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్‌క్రియలవలన మీ మనస్సులో విరోధభావముగలవారునైయుండిన మిమ్మును కూడ తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి యుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్నశ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచార కుడనైతిని. అన్యజనులలో ఈ మర్మముయొక్క మిహ మైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీయందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతిమనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతిమనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతిమనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.
కొలొస్సయులకు 1:12-29 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వెలుగు రాజ్యంలో పరిశుద్ధ ప్రజల స్వాస్థ్యంలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని ఎన్నికచేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపించి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంలోనికి మనల్ని తీసుకువచ్చారు. ఆ కుమారుని ద్వారా మనకు విడుదల, పాపక్షమాపణ కలుగుతుంది. కుమారుడు అదృశ్య దేవుని స్వరూపము, సృష్టంతటి కంటే మొదట జన్మించిన వాడు. ఎందుకనగా, ఆయనలోనే సమస్తం సృష్టించబడ్డాయి, అనగా: ఆకాశంలో ఉన్నవి, భూమిపై ఉన్నవి, కంటికి కనబడేవి కనబడనివి, సింహాసనాలైనా లేక ప్రభుత్వాలైనా లేక పాలకులైనా లేక అధికారులైనా, సమస్తం ఆయన ద్వారానే ఆయన కొరకే సృష్టించబడ్డాయి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న వాడు, సమస్తానికి ఆయనే ఆధారం. ఆయనే సంఘమనే శరీరానికి శిరస్సు, ఆయనకు అన్నిటిలో సర్వాధికారం కలిగివుండడానికి ఆయనే ఆరంభము, మృతులలో నుండి లేచుటలో ప్రథముడయ్యారు. ఆయనలో దేవుని సంపూర్ణత నివసించాలని తండ్రి యొక్క దేవుని ఉద్దేశం. ఆయన ద్వారా సమస్తాన్ని అనగా, భూమిపై ఉన్న లేదా పరలోకంలో ఉన్న, అన్నిటిని, క్రీస్తు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీపరచి, క్రీస్తు ద్వారా తనలో సమాధానపరచుకోవడం తండ్రికి ఇష్టమయ్యింది. ఒకప్పుడు మీరు దేవుని నుండి దూరం అయ్యారు, మీ దుష్ట ప్రవర్తన వలన మీ మనస్సులో విరోధులయ్యారు. అయితే, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా తన సన్నిధిలో నిలబెట్టడానికి యేసు యొక్క భౌతికమైన శరీరం మరణించుట ద్వారా ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచారు. అందువల్ల మీరు విశ్వాసంలో కొనసాగుతూ స్థిరంగా నిలబడి, సువార్తలో చెప్పబడిన నిరీక్షణలో నుండి తొలగిపోకుండా ఉండండి. మీరు విన్న ఈ సువార్త, ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడుతుంది, పౌలు అనే నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను. మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలలో ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను, సంఘమనే ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన బాధలలో మిగిలి వున్న వాటిలో నా వంతును, నా శరీరంలో పూర్తి చేస్తున్నాను. మీకు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా తెలియజేయడానికి, దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను బట్టి సంఘానికి సేవకుడినయ్యాను. దేవుని వాక్యం అనగా గత అనేక యుగాలుగా తరాలుగా మరుగు చేయబడిన మర్మం, కాని ఇది ఇప్పుడు ప్రభువు యొక్క ప్రజలకు తెలియచేయబడింది. యూదేతరుల మధ్యలో నుండి దేవుడు ఎన్నికచేసిన వారికి ఈ మర్మం యొక్క సంపూర్ణ మహిమైశ్వర్యం ఎలాంటిదో, అనగా మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై ఉన్నారనే విషయం తెలియచేయబడింది. మేము ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా క్రీస్తులో నిలబెట్టడానికి సమస్త జ్ఞానంతో ప్రతి ఒక్కరికి ఆయన గురించే ప్రకటిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము, బోధిస్తున్నాము. నాలో బలంగా పని చేస్తున్న క్రీస్తు శక్తి అంతటిని బట్టి, ఇప్పటి వరకు నేను ప్రయాసపడి పనిచేస్తున్నాను.
కొలొస్సయులకు 1:12-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వెలుగు నివాసులుగా తనకోసం ప్రత్యేకించబడిన వారి వారసత్వంలో భాగం పంచుకోడానికి మనలను అర్హులుగా చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఆయన మనలను చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుడి రాజ్యంలోకి తరలించాడు. ఆ కుమారుడిలోనే మనకు పాప క్షమాపణా విమోచనా ఉన్నాయి. కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన ప్రముఖుడు. ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి. ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి. సంఘం అనే శరీరానికి ఆయనే తల. సర్వాధికారానికీ మూలకేంద్రం ఆయనే. అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం కలిగేటందుకు చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేవడంలో ఆయన ప్రథముడు. ఆయనలో దైవత్వం సర్వసంపూర్ణత నివసించాలనీ, కుమారుడి ద్వారా సమస్తాన్నీ తనతో రాజీ చేసుకోవాలనీ దేవుడు ఇష్టపడ్డాడు. ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న వాటినన్నిటినీ తన కుమారుడు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీ చేసుకోవడం ద్వారా ఆయన ఈ కార్యం చేశాడు. ఒకప్పుడు మీరు కూడా దేవునికి పరాయివారుగా ఉన్నారు. మీ ఆలోచనల్లోనూ మీరు చేసిన దుష్క్రియల వలనా దేవునికి శత్రువులుగా ఉన్నారు. అయితే రక్త మాంసాలున్న క్రీస్తు శరీరంలో మరణం వల్ల ఆయన మిమ్మల్ని తనతో రాజీ చేసుకున్నాడు. తన ఎదుట మిమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా నిలబెట్టుకోడానికి ఆయన ఇలా చేశాడు. ఇది జరగాలంటే మీరు దృఢంగా విశ్వాసంలో సుస్థిరంగా నిలిచి ఉండి, ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికీ, మీకూ ప్రకటించిన సువార్త వల్ల కలిగిన నిబ్బరం నుండి తొలగిపోకుండా ఉండాలి. ఈ సువార్తకు పౌలు అనే నేను సేవకుణ్ణి అయ్యాను. ఇప్పుడు మీ కోసం నేను పడుతున్న హింసల్లో సంతోషిస్తున్నాను. సంఘం అనే తన శరీరం కోసం క్రీస్తు పడిన యాతనల్లో కొదువగా ఉన్న వాటిని నా వంతుగా నా శరీరంలో సంపూర్ణం చేస్తున్నాను. రహస్య సత్యంగా ఉన్న దేవుని వాక్కును సంపూర్ణంగా తెలియజేయడానికి దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ప్రకారం నేను సంఘానికి సేవకుణ్ణి అయ్యాను. ఈ రహస్యం యుగయుగాలుగా తరతరాలుగా మర్మంగా ఉంది కానీ ఇప్పుడు దేవుడు తన పవిత్రులకు దాన్ని తెలియజేశాడు. అన్యజనుల్లో ఈ మర్మం అనే దివ్య సంపదను తెలియజేయాలని దేవుడు తలంచాడు. ఈ మర్మం మీలో ఉన్న యేసు క్రీస్తే. ఆయనే మహిమను గూర్చిన ఆశాభావం. మేము ప్రకటిస్తున్నది ఈయననే. ప్రతి వ్యక్తినీ క్రీస్తులో పరిపూర్ణుడిగా చేసి దేవుని ముందు నిలబెట్టాలి. ఈ ఉద్దేశంతోనే మేము సమస్త జ్ఞానంతో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నాం బోధిస్తున్నాం. దీని కోసం నేను శ్రమిస్తూ ఉన్నాను. నాలో బలంగా పని చేస్తున్న ఆయన మహత్తర శక్తిని నేను వినియోగించుకుంటూ ప్రయాసపడుతున్నాను.
కొలొస్సయులకు 1:12-29 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు తన వెలుగు రాజ్యంలో, అంటే తన విశ్వాసుల కోసం ప్రత్యేకంగా ఉంచిన దానిలో మీకు భాగం లభించేటట్లు చేసాడు. దానికి మీరు తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉండండి. మనల్ని చీకటి రాజ్యం నుండి రక్షించి, తాను ప్రేమించే కుమారుని రాజ్యంలోకి రప్పించాడు. కుమారుడు మన పక్షాన మన పాపాల నిమిత్తం తన ప్రాణం చెల్లించాడు. కనుక ఆయన కారణంగా దేవుడు మనల్ని క్షమించాడు. క్రీస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు పునాది వేయుటకు ముందునుండి ఉన్నవాడు. క్రీస్తు అన్నిటినీ సృష్టించాడు. పరలోకంలో ఉన్న వాటిని, భూమ్మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని, సింహాసనాలను, ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను, అన్నిటినీ ఆయనే సృష్టించాడు. అన్నీ తన కోసం సృష్టించుకొన్నాడు. క్రీస్తు ఆదినుండి ఉన్నాడు. ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి. సంఘం ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు. ఆయనే అన్నిటికీ మూలం. చనిపోయి తిరిగి బ్రతికినవాళ్ళలో ఆయన మొదటివాడు. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలని దేవుడు యిలా చేసాడు. దేవుడు తనలో ఉన్న పరిపూర్ణత ఆయనలో ఉండటానికి ఆనందంగా అంగీకరించాడు. దేవుడు అన్నిటినీ, అంటే భూమ్మీద ఉన్నవాటినీ, పరలోకంలో ఉన్నవాటిని, కుమారుని ద్వారా తిరిగి తనలో చేర్చుకోవాలనుకొన్నాడు. తన కుమారుడు సిలువపై చిందించిన రక్తం ద్వారా ఈ సంధి కలగాలని ఆయన ఉద్దేశ్యం. మీ దుష్ప్రవర్తనలవల్ల, మీ మనస్సులో ఉన్న దురాలోచనలవల్ల ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా ఉండి, ఆయనకు శత్రువులుగా జీవించారు. కాని ప్రస్తుతం తన కుమారుని భౌతిక మరణం ద్వారా మీతో సంధి చేసి, మిమ్మల్ని పవిత్రం చేసి, మిమ్మల్ని నిష్కళంకులుగా, నిరపరాధులుగా తన ముందు నిలబెట్టుకోవాలని ఆయన ఉద్దేశ్యం. మీరు విన్న సువార్త వలన రక్షణ కలుగుతుందన్న ఆశ మీలో కలిగింది. దాన్ని పోగొట్టుకోకుండా, దృఢంగా, స్థిరంగా ఆయన్ని విశ్వసిస్తూ ఉంటేనే అది సంభవిస్తుంది. మీరు విన్న ఈ సువార్త ఆకాశం క్రింద ఉన్న ప్రతీ జీవికి ప్రకటింపబడింది. నేను ఈ సందేశానికి సేవకుణ్ణి అయ్యాను. మీ కొరకు నేను కష్టాలు అనుభవించినందుకు యిప్పుడు నాకు ఆనందం కలుగుతోంది. ఎందుకంటే క్రీస్తు సంఘం అనబడే తన శరీరం ద్వారా అనుభవించవలసిన కష్టాలు నా దేహం అనుభవించి పూర్తి చేస్తోంది. తన సందేశాన్ని మీకు సంపూర్ణంగా ఉపదేశించమని దేవుడు నన్ను నియమించాడు. తత్కారణంగా నేను క్రీస్తు సంఘానికి సేవకుణ్ణి అయ్యాను. యుగయుగాలనుండి, తరతరాలనుండి రహస్యంగా దాచబడిన ఈ దైవసందేశం ప్రస్తుతం భక్తులకు చెప్పబడింది. భక్తులకు ఈ రహస్యంలోని గొప్ప మహత్యాన్ని తెలియచేసి, యూదులు కానివాళ్ళకు చూపాలని ఆయన ఉద్దేశ్యం. మీలో ఉన్న “క్రీస్తే” ఆ రహస్యం. ఆయన వల్ల మహిమను తప్పక పొందుతామనే ఆశ మనలో ఉంది. ఆయన్ని గురించి మేము ప్రకటిస్తున్నాము. మాలో ఉన్న జ్ఞానాన్నంతా ఉపయోగించి ప్రతి ఒక్కరికీ బోధిస్తున్నాము. సలహాలిస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరినీ క్రీస్తు ద్వారా దేవుని ముందు ఆధ్యాత్మికతలో పరిపూర్ణత పొందినవాళ్ళలా నిలబెట్టాలని మా ఉద్దేశ్యము. దీన్ని సాధించటానికి నేను నా శక్తినంతా ఉపయోగించి కష్టపడి పని చేస్తున్నాను. నాలో ఉన్న ఈ బలవత్తరమైన శక్తి క్రీస్తు నాలో ఉండి పని చేయటం వల్ల కలుగుతోంది.
కొలొస్సయులకు 1:12-29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
వెలుగు రాజ్యంలో పరిశుద్ధ ప్రజల స్వాస్థ్యంలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని ఎన్నికచేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపించి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంలోనికి మనల్ని తీసుకువచ్చారు. ఆ కుమారుని ద్వారా మనకు విడుదల, పాపక్షమాపణ కలుగుతుంది. కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం, సృష్టంతటి కంటే మొదట జన్మించిన వాడు. ఎందుకనగా, ఆయనలోనే సమస్తం సృష్టించబడ్డాయి, అనగా: ఆకాశంలో ఉన్నవి, భూమిపై ఉన్నవి, కంటికి కనబడేవి కనబడనివి, సింహాసనాలైనా లేదా ప్రభుత్వాలైనా లేదా పాలకులైనా లేదా అధికారులైనా, సమస్తం ఆయన ద్వారానే ఆయన కొరకే సృష్టించబడ్డాయి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆయనే ఆధారము. సంఘమనే శరీరానికి ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో సర్వాధికారం కలిగి ఉండడానికి ఆయనే ఆరంభం, మృతులలో నుండి లేచుటలో ప్రథముడయ్యారు. ఆయనలో దేవుని సంపూర్ణత నివసించాలని తండ్రి యొక్క దేవుని ఉద్దేశం. ఆయన ద్వారా సమస్తాన్ని అనగా, భూమిపై ఉన్న లేదా పరలోకంలో ఉన్న, అన్నిటిని, క్రీస్తు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీపరచి, క్రీస్తు ద్వారా తనలో సమాధానపరచుకోవడం తండ్రికి ఇష్టమైనది. ఒకప్పుడు మీరు దేవుని నుండి దూరం అయ్యారు, మీ దుష్ట ప్రవర్తన వలన మీ మనస్సులో విరోధులయ్యారు. అయితే, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా తన సన్నిధిలో నిలబెట్టడానికి యేసు యొక్క భౌతికమైన శరీరం మరణించుట ద్వారా ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచారు. అందువల్ల మీరు విశ్వాసంలో కొనసాగుతూ స్థిరంగా నిలబడి, సువార్తలో చెప్పబడిన నిరీక్షణలో నుండి తొలగిపోకుండా ఉండండి. మీరు విన్న ఈ సువార్త, ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడుతుంది, పౌలు అనే నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను. మీ కోసం నేను అనుభవిస్తున్న శ్రమలలో ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను, సంఘమనే ఆయన శరీరం కోసం క్రీస్తు పడిన బాధల్లో మిగిలి ఉన్న వాటిలో నా వంతును, నా శరీరంలో పూర్తి చేస్తున్నాను. మీకు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా తెలియజేయడానికి, దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను బట్టి సంఘానికి సేవకుడినయ్యాను. దేవుని వాక్యం అనగా గత అనేక యుగాలుగా తరాలుగా మరుగుచేయబడిన మర్మం, కాని ఇది ఇప్పుడు పరిశుద్ధులకు తెలియజేయబడింది. యూదేతరుల మధ్యలో నుండి దేవుడు ఎన్నికచేసిన వారికి ఈ మర్మం యొక్క సంపూర్ణ మహిమైశ్వర్యం ఎలాంటిదో, అనగా మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై ఉన్నారనే విషయం తెలియజేయబడింది. మేము అందరిని సంపూర్ణులుగా క్రీస్తులో నిలబెట్టడానికి సమస్త జ్ఞానంతో అందరికి ఆయన గురించే ప్రకటిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము, బోధిస్తున్నాము. నాలో బలంగా పని చేస్తున్న క్రీస్తు శక్తి అంతటిని బట్టి, ఇప్పటివరకు నేను ప్రయాసపడి పని చేస్తున్నాను.