ఆమోసు 5:4-15
ఆమోసు 5:4-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా ఇశ్రాయేలుతో చెప్పే మాట ఇదే: “నన్ను వెదికితే బ్రతుకుతారు. బేతేలును ఆశ్రయించకండి; గిల్గాలు క్షేత్రాలకు వెళ్లకండి, బెయేర్షేబకు ప్రయాణించకండి. గిల్గాలు ప్రజలు ఖచ్చితంగా బందీలుగా వెళ్తారు, విపత్తులతో బేతేలు శూన్యంగా మారుతుంది.” యెహోవాను వెదకండి మీరు బ్రతుకుతారు, లేదంటే యోసేపు గోత్రాల మీద ఆయన అగ్నిలా పడతారు; అది వారిని కాల్చివేస్తుంది బేతేలులో దాన్ని ఆర్పివేయగల వారెవరూ ఉండరు. వారు న్యాయాన్ని చేదుగా మార్చి నీతిని నేల మీద పడవేస్తారు. ఆయన సప్తర్షి నక్షత్రాలను మృగశీర్ష నక్షత్రాలను సృష్టించారు, ఆయన మధ్యరాత్రిని ఉదయంగా మారుస్తారు, పగటిని చీకటి చేస్తారు. ఆయన సముద్రంలోని నీటిని రప్పించి. భూమి మీద కుమ్మరిస్తారు ఆయన పేరు యెహోవా. ఆయన మెరుపు వేగంతో దుర్గాన్ని నాశనం చేస్తారు, వారి కోటగల పట్టణాన్ని నాశనం చేస్తారు. న్యాయస్థానంలో న్యాయం కోసం నిలబడే వారిని యథార్థంగా మాట్లాడేవారిని ద్వేషించేవారు మీలో ఉన్నారు. మీరు బీదలను అణగద్రొక్కుతూ, వారి ధాన్యం మీద పన్ను వేస్తారు. కాబట్టి మీరు రాళ్లతో భవనాలను కట్టుకున్నా, వాటిలో కాపురముండరు; అందమైన ద్రాక్షతోటలు నాటినా మీరు ఆ పండ్ల రసం త్రాగరు. ఎందుకంటే మీ అపరాధాలు ఎన్ని ఉన్నాయో మీ పాపాలు ఎంత ఘోరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని అమాయకులను బాధిస్తారు, న్యాయస్థానంలో వచ్చే బీదలకు న్యాయం జరగనివ్వరు. ఇది చెడుకాలం కాబట్టి, అలాంటి సమయాల్లో వివేకవంతులు మౌనంగా ఉంటారు. చెడును విడిచిపెట్టి మంచిని వెదకండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు ఆయన గురించి మీరనుకున్న విధంగా సైన్యాల యెహోవా దేవుడు మీతో ఉంటారు. చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి; న్యాయస్థానాల్లో న్యాయం జరిగించండి. బహుశ సైన్యాల యెహోవా దేవుడు, యోసేపు వంశంలో మిగిలి ఉన్నవారిపై దయ చూపిస్తారేమో.
ఆమోసు 5:4-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెబుతున్నాడు, “నన్ను వెతికి జీవించండి. బేతేలును ఆశ్రయించవద్దు. గిల్గాలులో అడుగు పెట్టవద్దు. బెయేర్షెబాకు పోవద్దు. గిల్గాలు వారు తప్పకుండా బందీలవుతారు. బేతేలుకు ఇక దుఖమే.” యెహోవాను ఆశ్రయించి జీవించండి. లేకపోతే ఆయన యోసేపు వంశం మీద నిప్పులాగా పడతాడు. అది దహించి వేస్తుంది. బేతేలులో ఎవరూ దాన్ని ఆర్పలేరు. వాళ్ళు న్యాయాన్ని భ్రష్టం చేసి, నీతిని నేలపాలు చేస్తున్నారు. ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు. చీకటిని తెలవారేలా చేసేవాడు. పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు. సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి భూమి మీద కుమ్మరిస్తాడు. ఆయన పేరు యెహోవా. బలవంతుల మీదికి ఆయన అకస్మాత్తుగా నాశనం రప్పిస్తే కోటలు నాశనమవుతాయి. పట్టణ గుమ్మం దగ్గర బుద్ధి చెప్పే వారిని వాళ్ళు అసహ్యించుకుంటారు. యథార్థంగా మాట్లాడే వారిని ఏవగించుకుంటారు. మీరు పేదలను అణగదొక్కుతూ ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు, కాబట్టి మీరు చెక్కిన రాళ్ళతో ఇళ్ళు కట్టుకున్నా వాటిలో నివసించరు. మీకు చక్కటి ద్రాక్ష తోటలు ఉన్నా ఆ ద్రాక్ష మద్యం తాగరు. మీ నేరాలెన్నో నాకు తెలుసు. మీ పాపాలు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని తప్పుచేయని వారిని బాధిస్తారు. ఊరి గుమ్మం దగ్గర పేదలను పట్టించుకోరు. అది గడ్డుకాలం గనక ఎలాంటి బుద్దిమంతుడైనా అప్పుడు ఊరుకుంటాడు. మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి. అలా చేస్తే మీరనుకున్నట్టు యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు తప్పకుండా మీతో ఉంటాడు. చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి. పట్టణ గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి. ఒకవేళ యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు యోసేపు వంశంలో మిగిలిన వారిని కనికరిస్తాడేమో.
ఆమోసు 5:4-15 పవిత్ర బైబిల్ (TERV)
ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెపుతున్నాడు: “నన్ను వెదుక్కుంటూ వచ్చి జీవించండి. కాని బేతేలులో వెదకవద్దు. గిల్గాలుకు వెళ్లవద్దు. సరిహద్దును దాటి బెయేర్షెబాకు వెళ్లకండి. గిల్గాలు ప్రజలు బందీలుగా తీసుకుపోబడతారు. బేతేలు నాశనం చేయబడుతుంది. యెహోవా దరిచేరి జీవించండి. మీరు యెహోవా వద్దకు వెళ్లకపోతే యోసేపు (పది వంశాలవారు) ఇంటిమీద నిప్పు పడుతుంది. ఆ అగ్ని యోసేపు ఇంటిని దగ్ధం చేస్తుంది. బేతేలులో చెలరేగిన ఆ అగ్నిని ఎవ్వరూ ఆపలేరు. మీరు యెహోవా కొరకు చూడండి. సప్త ఋషీ నక్షత్రాలను, మృగశీర్ష నక్షత్రాన్ని సృష్టించింది ఆయనే. చీకటిని ఉదయ కాంతిగా ఆయన మార్చుతాడు. పగటిని చీకటిగా ఆయన మార్చుతాడు. ఆయన సముద్ర జలాలను బయట నేలమీద కుమ్మరిస్తాడు. ఆయన పేరు యెహోవా! ఒక బలమైన నగరాన్ని ఆయన సురక్షితంగా ఉంచుతాడు. మరో బలమైన నగరం నాశనమయ్యేలా ఆయన చేస్తాడు.” ప్రజలారా! ఇది మీకు తగని పని. మీరు మంచిని విషంగా మార్చుతారు. న్యాయాన్ని హత్యచేసి నేలకు కూలేలా చేస్తారు. ప్రవక్తలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి, ప్రజలు చేసే చెడ్డపనులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుచేత ప్రజలా ప్రవక్తలను అసహ్యించుకుంటారు. ప్రవక్తలు మంచివైన సామాన్య సత్యాలను బోధిస్తారు. అందుచే ప్రజలు ఆ ప్రవక్తలను అసహ్యించుకుంటారు. మీరు ప్రజలనుండి అన్యాయంగా పన్నులు వసూలు చేస్తారు. మీరు పేదవారినుండి గోధుమ మోపులను తీసుకుంటారు. ఈ ధనంతో మీరు చెక్కిన రాళ్లతో అందమైన ఇండ్లు కట్టుకుంటారు. కాని మీరు ఆ ఇండ్లలో నివసించరు. మీరు అందమైన ద్రాక్షాతోటలను నాటుతారు. కాని మీరు వాటినుండి ద్రాక్షారసం తాగరు. ఎందుకంటే మీరు చేసిన అనేక పాపాలగురించి నాకు తెలుసు. మీరు నిజంగా కొన్ని ఘోరమైన పాపాలు చేశారు. మంచిపనులు చేసే ప్రజలను మీరు బాధించారు. చెడు చేయటానికి మీరు డబ్బు తీసుకుంటారు. బహిరంగ ప్రదేశాలలో పేదవారిని మీరు నెట్టివేస్తారు. ఆ సమయంలో తెలివిగల బోధకులు ఊరుకుంటారు. ఎందుకంటే అది చెడు కాలం గనుక. దేవుడు మీతోనే ఉన్నట్లు మీరు చెపుతారు. అందుచే మీరు మంచిపనులు చేయాలేగాని చెడు చేయరాదు. అప్పుడు మీరు బతుకుతారు. సర్వశక్తుడగు యెహోవా నిజంగా మీతోవుంటాడు. చెడును ద్వేషించు. మంచిని ప్రేమించు. న్యాయస్థానాలలో న్యాయాన్ని పునరుద్ధరించండి. అప్పుడు యోసేపు వంశంలో మిగిలినవారిమీద దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా కనికరం కలిగి ఉండవచ్చు.
ఆమోసు 5:4-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున దేమనగా–నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకుదురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండ అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతిమీదపడి దాని నాశనముచేయును. న్యాయమును అన్యాయమునకు మార్చి, నీతిని నేలను పడవేయువారలారా, ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారుచీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు. ఆయన పేరు యెహోవా; బలాఢ్యులమీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును. అయితే గుమ్మములో నిలిచి బుద్ధిచెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు. దోషనివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన మీ అపరాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్లరసము మీరు త్రాగరు. ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి; ఒక వేళ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించినవారియందు కనికరించును.