అపొస్తలుల కార్యములు 8:30-35

అపొస్తలుల కార్యములు 8:30-35 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అప్పుడు ఫిలిప్పు పరుగెత్తి రథం దగ్గరకు వెళ్లినప్పుడు అతడు యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతుంటే విని, “నీవు చదివేది నీకు అర్థమవుతుందా?” అని ఫిలిప్పు అడిగాడు. అతడు, “ఎవరు వివరించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది?” అని చెప్పి, ఫిలిప్పును తన రథమెక్కి తనతో కూర్చోమని పిలిచాడు. ఆ నపుంసకుడు చదువుతున్న లేఖనభాగం ఇది: “ఆయన వధించబడడానికి తేబడిన గొర్రెవలె బొచ్చు కత్తిరించే వాని దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన తన నోటిని తెరవలేదు. తన దీనత్వాన్ని బట్టి ఆయన న్యాయాన్ని కోల్పోయాడు. ఆయన సంతానం గురించి మాట్లాడేవారు ఎవరు? ఎందుకంటే భూమి మీద నుండి ఆయన ప్రాణం తీసివేయబడింది.” ఆ నపుంసకుడు ఫిలిప్పును, “ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు, తన గురించా లేక ఇంకొకరి గురించా? దయచేసి, నాకు చెప్పండి” అని అడిగాడు. అందుకు ఫిలిప్పు ఆ లేఖనభాగం నుండి మొదలుపెట్టి యేసు మొదలుపెట్టి యేసు గురించి సువార్తను అతనికి బోధించాడు.

అపొస్తలుల కార్యములు 8:30-35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఫిలిప్పు పరుగెత్తుకుంటూ వెళ్ళి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథం చదువుతుంటే విని, “మీరు చదివేది మీకు అర్థమవుతుందా?” అని అడిగాడు. అతడు, “నాకెవరైనా వివరించకపోతే ఎలా అర్థమవుతుంది” అని చెప్పి, రథమెక్కి తన దగ్గర కూర్చోమని ఫిలిప్పును బతిమాలాడు. ఇతియోపీయుడు చదివే లేఖనభాగం ఏదంటే, ఆయనను గొర్రెలా వధకు తెచ్చారు. బొచ్చు కత్తిరించే వాడి దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టే, ఆయన నోరు తెరవలేదు. ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం దొరకలేదు. ఆయన సంతతి గురించి ఎవరు వివరిస్తారు? ఎందుకంటే ఆయన ప్రాణాన్ని లోకం నుండి తీసేసారు. అప్పుడు ఆ నపుంసకుడు, “ప్రవక్త చెప్పేది ఎవరి గురించి? తన గురించా లేక వేరొక వ్యక్తిని గురించా? దయచేసి చెప్పు” అని ఫిలిప్పును అడిగాడు. ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసును గూర్చిన సువార్తను అతనికి బోధించాడు.

అపొస్తలుల కార్యములు 8:30-35 పవిత్ర బైబిల్ (TERV)

ఫిలిప్పు రథం దగ్గరకు పరుగెత్తుతూ యెషయా గ్రంథాన్ని ఆ కోశాధికారి చదవటం విన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ కోశాధికారిని, “నీవు చదువుతున్నది అర్థమౌతోందా?” అని అడిగాడు. “ఎవరైనా నాకు విడమర్చి చెబితే తప్ప ఎట్లా అర్థమౌతుంది” అని కోశాధికారి అన్నాడు. అతడు ఫిలిప్పును రథమెక్కి కూర్చోమని చెప్పాడు. ఆ కోశాధికారి ధర్మశాస్త్రంలోని ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు: “చంపటానికి తీసుకు వెళ్ళుతున్న గొఱ్ఱెలా ఆయన నడిపించబడ్డాడు బొచ్చును కత్తిరిస్తున్న గొఱ్ఱెపిల్ల మౌనం వహించినట్లుగా ఆయన మాట్లాడ లేదు! ఆయన దీనత్వాన్ని చూసి అన్యాయం జరిగించారు. ఆయన జీవితాన్ని భూమ్మీదనుండి తొలగించారు. ఆయన సంతతిని గురించి యిక మాట్లాడేదెవరు?” ఆ కోశాధికారి ఫిలిప్పును, “ఈ ప్రవక్త ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక మరొకర్ని గురించా? దయచేసి చెప్పు” అని అడిగాడు. ఫిలిప్పు ప్రవచనాల్లోని ఆ వాక్యాలతో మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 8:30-35 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా విని–నీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగ మేదనగా– ఆయన గొఱ్ఱెవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకక పోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు – ప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.

అపొస్తలుల కార్యములు 8:30-35 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అప్పుడు ఫిలిప్పు పరుగెత్తి రథం దగ్గరకు వెళ్లినప్పుడు అతడు యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతుంటే విని, “నీవు చదివేది నీకు అర్థమవుతుందా?” అని ఫిలిప్పు అడిగాడు. అతడు, “ఎవరు వివరించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది?” అని చెప్పి, ఫిలిప్పును తన రథమెక్కి తనతో కూర్చోమని వేడుకున్నాడు. ఆ నపుంసకుడు చదువుతున్న లేఖనభాగం ఇది: “ఆయన వధించబడడానికి తేబడిన గొర్రెవలె బొచ్చు కత్తిరించే వాని దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన తన నోరు తెరవలేదు. తన దీనత్వాన్ని బట్టి ఆయన న్యాయాన్ని కోల్పోయాడు. ఆయన సంతానం గురించి మాట్లాడేవారు ఎవరు? ఎందుకంటే భూమి మీద నుండి ఆయన ప్రాణం తీసివేయబడింది.” ఆ నపుంసకుడు ఫిలిప్పును, “ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు, తన గురించా లేదా ఇంకొకరి గురించా? దయచేసి, నాకు చెప్పండి” అని అడిగాడు. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనంతో ప్రారంభించి, యేసును గురించిన సువార్తను అతనికి చెప్పాడు.