అపొస్తలుల కార్యములు 5:19-21
అపొస్తలుల కార్యములు 5:19-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కానీ ప్రభువు దూత ఆ రాత్రివేళ చెరసాల తలుపులు తెరచి, వారిని బయటకు తీసుకువచ్చి, “వెళ్లి, దేవాలయ ఆవరణంలో నిలబడి ఈ జీవం గురించి ప్రజలందరికి బోధించండి” అని వారితో చెప్పాడు. తమకు చెప్పిన ప్రకారం తెల్లవారగానే వారు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లి ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు. ప్రధాన యాజకుడు అతని సహచరులు రాగానే, యూదా న్యాయసభ వారిని పిలిపించి, అపొస్తలులను చెరసాల నుండి తీసుకురమ్మని అధికారులను పంపించారు.
అపొస్తలుల కార్యములు 5:19-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, “మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవాన్ని గూర్చిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పండి” అని వారితో అన్నాడు. వారా మాట విని, ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుడూ, అతనితో ఉన్నవారూ వచ్చి, మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారిని తీసుకు రమ్మని మనుషులను చెరసాలకు పంపారు.
అపొస్తలుల కార్యములు 5:19-21 పవిత్ర బైబిల్ (TERV)
కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చాడు. వాళ్ళతో, “వెళ్ళి మందిర ఆవరణంలో నిలుచొని ఈ క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు చెప్పండి” అని చెప్పాడు. దేవదూత చెప్పినట్లు విని వాళ్ళు తెల్లవారుతుండగా మందిరం యొక్క ఆవరణంలో ప్రవేశించి ప్రజలకు బోధించటం మొదలు పెట్టారు. ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు ఇశ్రాయేలు ప్రజల పెద్దలందర్ని సమావేశపరిచి మహాసభను ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అపొస్తలులను పిలుచుకు రమ్మని కొందర్ని కారాగారానికి పంపారు.
అపొస్తలుల కార్యములు 5:19-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని వచ్చి–మీరు వెళ్లి దేవాలయములో నిలువబడి ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధానయాజకుడును అతనితోకూడ నున్నవారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించి –వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి.