అపొస్తలుల కార్యములు 5:1-42
అపొస్తలుల కార్యములు 5:1-42 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అననీయ అనేవాడు తన భార్యయైన సప్పీరాతో కలిసి తన పొలాన్ని అమ్మాడు. అతడు తన భార్యకు తెలిసే ఆ అమ్మిన డబ్బు నుండి కొంత దాచుకొని, మిగిలిన దానిని తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురు, “అననీయా, పొలాన్ని అమ్మిన డబ్బులో కొంత నీవు దాచుకొని పరిశుద్ధాత్మతో అబద్ధమాడడానికి ఎలా సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు? అమ్మక ముందు అది నీదే కాదా? దానిని అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! అలాంటప్పుడు ఇలాంటి పని చేయాలని నీవు ఎలా ఆలోచించావు? నీవు మనుష్యులతో కాదు కాని దేవునితోనే అబద్ధమాడావు” అన్నాడు. అననీయ ఆ మాటలు విని, వెంటనే క్రిందపడి చనిపోయాడు. జరిగిన విషయాన్ని విన్నవారందరిలో గొప్ప భయం పుట్టింది. అప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అతని శరీరాన్ని బట్టలతో చుట్టి, మోసుకువెళ్లి పాతిపెట్టారు. మూడు గంటల తర్వాత, జరిగిన సంగతి తెలియని అతని భార్య లోపలికి వచ్చింది. పేతురు ఆమెను, “నీవు అననీయ కలిసి ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాకు చెప్పు” అని అడిగాడు. అందుకు ఆమె, “అవును, ఇంతకే అమ్మాం” అని జవాబిచ్చింది. అందుకు పేతురు ఆమెతో, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరు ఎందుకు ఒక్కటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారి పాదాలు గుమ్మం దగ్గరే ఉన్నాయి, వారు నిన్ను కూడా మోసుకుపోతారు” అన్నాడు. ఆ క్షణమే ఆమె అతని పాదాల దగ్గర పడి చనిపోయింది. అప్పుడు ఆ యువకులు లోపలికి వచ్చి, ఆమె చనిపోయిందని చూసి, ఆమె శరీరాన్ని మోసుకుపోయి తన భర్త ప్రక్కనే ఆమెను పాతిపెట్టారు. సంఘంలో మరియు ఈ సంగతులను విన్నవారందరిలో గొప్ప భయం పుట్టింది. అపొస్తలులు ప్రజల మధ్యలో అనేక సూచక క్రియలను, అద్బుతాలను చేశారు. విశ్వసించిన వారందరు సొలొమోను మండపంలో కలుసుకొనేవారు. ప్రజలు వారిని చాలా గౌరవించినప్పటికి, ఎవరు వారితో కలిసే ధైర్యం చేయలేకపోయారు. అయినా, మరి ఎక్కువ సంఖ్యలలో స్త్రీలు మరియు పురుషులు ప్రభువును నమ్ముకొని విశ్వాసుల గుంపులో చేరారు. అపొస్తలుల కార్యాలను బట్టి అనేకమంది రోగులను మంచాల మీద తీసుకొనివచ్చి, పేతురు వెళ్లేటప్పుడు అతని నీడ పడినా చాలని భావించి వీధులలో పరుపు మీద పడుకోబెట్టారు. యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్న పట్టణపు ప్రజలు తీసుకొని వచ్చిన రోగులు మరియు అపవిత్రాత్మలతో పీడింపడే వారందరు కూడా స్వస్థపడ్డారు. ప్రధాన యాజకుడు మరియు అతనితో పాటు ఉన్నవారంతా, అనగా సద్దూకయ్యుల తెగవారు అసూయతో నిండుకొన్నారు. కనుక వారు అపొస్తలులను పట్టుకొని పట్టణపు చెరసాలలో వేయించారు. కానీ ప్రభువు దూత ఆ రాత్రి వేళ చెరసాల తలుపులు తెరచి, వారిని బయటికి తీసుకువచ్చి, “వెళ్లి, దేవాలయ ఆవరణంలో నిలబడి ఈ జీవం గురించి ప్రజలందరికి బోధించండి” అని వారితో చెప్పాడు. తమకు చెప్పిన ప్రకారం తెల్లవారగానే వారు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లి ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు. ప్రధాన యాజకుడు అతని సహచరులు రాగానే, యూదా న్యాయసభ వారిని పిలిపించి, అపొస్తలులను చెరసాల నుండి తీసుకురమ్మని అధికారులను పంపించారు. వారు చెరసాలకు వచ్చి చూసినపుడు వారక్కడ కనబడలేదు. ఆ అధికారులు తిరిగి వెళ్లి న్యాయసభ వారికి, “మేము వెళ్లినప్పుడు చెరసాల జాగ్రత్తగానే తాళం వేయబడి కాపలావారు తలుపుల దగ్గర నిలబడే ఉన్నారు; కానీ మేము తలుపులు తెరిచినప్పుడు, లోపల మాకు ఎవరు కనబడలేదు” అని చెప్పారు. ఆ మాటలు విని, దేవాలయ కాపలా అధికారి మరియు ప్రధాన యాజకులు కలవరంతో, ఇది దేనికి దారితీస్తుందో అని ఆందోళన చెందారు. అప్పుడు ఒకడు వచ్చి, “చూడండి, మీరు చెరసాలలో పెట్టినవారు దేవాలయ ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు. వెంటనే కాపలా అధికారి తన సేవకులతో వెళ్లి, అపొస్తలులను తీసుకువచ్చారు. ప్రజలు తమను రాళ్లతో కొడతారేమో అని భయపడి, వారు బలప్రయోగం చేయలేదు. ప్రధాన యాజకుడు ప్రశ్నించాలని అపొస్తలులను న్యాయసభ ముందు నిలబెట్టారు. అప్పుడు ప్రధాన యాజకుడు, “ఈ పేరట బోధించకూడదు అని మీకు మేము ఖచ్చితంగా ఆదేశించాము, అయినాసరే మీ బోధలతో యెరూషలేమును నింపి ఈ మనుష్యుని హత్యచేసిన నేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని అన్నాడు. అందుకు పేతురు మరియు ఇతర అపొస్తలులు, “మేము మనుష్యుల కన్నా దేవునికే లోబడాలి కదా! మీరు సిలువ మీద వ్రేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు సజీవంగా లేపారు. ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలకు పశ్చాత్తాపాన్ని, పాపక్షమాపణను దయచేయడానికి, దేవుడు ఆయనను అధిపతిగా రక్షకునిగా తన కుడి చేతి వైపుకు హెచ్చించారు. మేము, అలాగే దేవునికి లోబడిన వారికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులము.” న్యాయసభ వారు ఈ మాటలను విని మరింత కోపం తెచ్చుకొని వారిని చంపాలని అనుకున్నారు. అయితే న్యాయసభలోని ఒకడు, ప్రజలందరి చేత గౌరవించబడే పరిసయ్యుడైన గమలీయేలు అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, వారిని కొంతసేపు బయట ఉంచమని ఆదేశించాడు. తర్వాత న్యాయసభతో, “ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యులకు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దాని గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంత కాలం క్రిందట థూదా అనే ఒకడు, తాను గొప్పవానినని చెప్పుకొన్నాడు, ఇంచుమించు నాలుగు వందల మంది అతన్ని అనుసరించారు. అతడు చంపబడిన తర్వాత, అతని అనుచరులు చెదరిపోయారు, ఏమి మిగలకుండా పోయింది. అతని తర్వాత, జనాభా లెక్కలను వ్రాసే రోజులలో గలిలయుడైన యూదా అనేవాడు లేచి ప్రజలను తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు. అతడు కూడా చంపబడ్డాడు, అతని అనుచరులు కూడా చెదరిపోయారు. కాబట్టి ప్రస్తుత ఈ పరిస్థితిలో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే: వారిని వదిలేయండి! వారిని వెళ్లనివ్వండి. వారి ఉద్దేశాలు లేదా క్రియలు మనుష్యుల వలన వచ్చినవైతే అవే ఆగిపోతాయి. కాని అది దేవుని నుండి అయితే, వారిని మీరు ఆపలేరు; మీరు దేవునితో పోరాడుతున్నట్లే అని మీరు తెలుసుకుంటారు” అన్నాడు. అతని మాటలను వారు అంగీకరించారు, కనుక అపొస్తలులను లోపలికి పిలిచి వారిని కొట్టించారు. తర్వాత యేసు పేరట మాట్లాడకూడదని వారిని ఆదేశించి పంపించారు. ఆ నామంను బట్టి అవమానం పొందడానికి తగినవారిగా ఎంచడంతో సంతోషిస్తూ అపొస్తలులు న్యాయసభ నుండి బయటకు వెళ్లిపోయారు. వారు ప్రతీ రోజు మానక దేవాలయ ఆవరణాలలో మరియు ఇంటింట సువార్తను బోధిస్తూ “యేసే క్రీస్తు” అని ప్రకటించుచున్నారు.
అపొస్తలుల కార్యములు 5:1-42 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు. భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు. అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది విన్న వారందరికీ చాలా భయం వేసింది. అప్పుడు కొందరు యువకులు వచ్చి అతణ్ణి గుడ్డలో చుట్టి మోసుకుపోయి పాతిపెట్టారు. సుమారు మూడుగంటల తరువాత అతని భార్య ఏం జరిగిందో తెలియక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, “మీరు ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాతో చెప్పు” అని ఆమెనడిగాడు. అందుకామె, “అవును, యింతకే అమ్మాము” అని చెప్పింది. అందుకు పేతురు, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరెందుకు ఒకటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారింకా లోపలికైనా రాలేదు. వారు నిన్నూ మోసికుని పోతారు” అని ఆమెతో చెప్పాడు. వెంటనే ఆమె అతని కాళ్ళ దగ్గర పడి ప్రాణం విడిచింది. ఆ యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూసి ఆమెనూ మోసికొనిపోయి, ఆమె భర్త పక్కనే పాతిపెట్టారు. సంఘమంతటికీ, ఇంకా ఈ సంగతులు విన్న వారందరికీ చాలా భయం వేసింది. ప్రజల మధ్య అపొస్తలుల ద్వారా అనేక సూచకక్రియలూ అద్భుతాలూ జరుగుతూ ఉన్నాయి. నమ్మిన వారంతా కలిసి సొలొమోను మంటపంలో కలుసుకుంటూ ఉన్నారు. తక్కిన వారిలో ఎవరికీ వారితో కలిసే ధైర్యం లేదు. అయితే సామాన్య ప్రజలు వారిని గౌరవిస్తూ ఉన్నారు. చాలా మంది స్త్రీ పురుషులు విశ్వసించి ప్రభువు పక్షాన చేరారు. పేతురు వస్తూ ఉంటే ప్రజలు రోగులను వీధుల్లోకి తెచ్చి, వారి మీద అతని నీడ అయినా పడాలని మంచాల మీదా పరుపుల మీదా వారిని ఉంచారు. యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు, రోగులనూ దురాత్మల చేత బాధల పాలౌతున్న వారిని తీసుకొచ్చారు. వారంతా బాగుపడ్డారు. ప్రధాన యాజకుడూ అతనితో పాటు ఉన్నవారంతా, అంటే సద్దూకయ్యుల తెగ వారంతా అసూయతో నిండిపోయి అపొస్తలులను పట్టుకుని పట్టణంలోని చెరసాల్లో వేశారు. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, “మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవాన్ని గూర్చిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పండి” అని వారితో అన్నాడు. వారా మాట విని, ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుడూ, అతనితో ఉన్నవారూ వచ్చి, మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారిని తీసుకు రమ్మని మనుషులను చెరసాలకు పంపారు. భటులు అక్కడికి వెళ్ళి, వారు చెరసాలలో కనబడక పోయేసరికి తిరిగి వచ్చి “చెరసాల చాలా భద్రంగా మూసి ఉంది. కావలివారు తలుపుల ముందు నిలబడి ఉండడం చూశాం గానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకెవరూ కనబడలేదు” అని వారికి చెప్పారు. దేవాలయం అధికారీ, ప్రధాన యాజకులూ ఆ మాట విని ‘ఇది ఏమవుతుందో’ అని వారి విషయమై అయోమయంలో పడిపోయారు. అప్పుడొకడు వచ్చి, “మీరు జైల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలబడి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు” అని చెప్పాడు. అప్పుడు అధికారి సైనికులతో కూడా పోయి, ప్రజలు రాళ్లతో కొడతారేమోనని భయపడి, సౌమ్యంగానే వారిని తీసుకుని వచ్చి మహాసభ ముందుంచాడు. ప్రధాన యాజకుడు వారితో, “ఈ నామంలో బోధించవద్దని మేము మీకు కచ్చితంగా ఆజ్ఞాపించాము గదా. అయినా మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, ఈ వ్యక్తి హత్యానేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని చెప్పాడు. అందుకు పేతురు, మిగిలిన అపొస్తలులు ఇలా జవాబిచ్చారు, “మనుషులకు కాక, దేవునికే మేము లోబడాలి గదా. మీరు మానుకు వేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. ఇశ్రాయేలుకు హృదయ పరివర్తన, పాప క్షమాపణ దయచేయడానికి దేవుడాయన్ని అధికారిగా, రక్షకునిగా తన కుడి వైపున ఉండే స్థాయికి హెచ్చించాడు. మేమూ, దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మా, ఈ సంగతులకు సాక్షులం.” వారీమాట విని తీవ్ర కోపంతో వీరిని చంపాలని చూశారు. అప్పుడు అందరి గౌరవం చూరగొన్న ధర్మశాస్త్ర బోధకుడు గమలీయేలు అనే ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి అపొస్తలులను కాసేపు బయట ఉంచమని ఆజ్ఞాపించి వారితో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలీయులారా, ఈ మనుషులకు మీరేమి చేయాలని చూస్తున్నారో జాగ్రత్త సుమా. కొంతకాలం క్రితం థూదా లేచి తాను గొప్పవాడినని చెప్పుకున్నాడు. సుమారు నాలుగు వందల మంది అతనితో కలిశారు. అతడు హతుడయ్యాడు. అతనిని అనుసరించిన వారంతా చెల్లా చెదరై పోయారు. అతని తరువాత జనాభా లెక్కలు తీసే రోజుల్లో గలిలయవాడైన యూదా అనేవాడు లేచి, కొంతమందిని తన వైపుకు ఆకర్షించాడు. వాడు కూడా నశించిపోయాడు, వాణ్ణి అనుసరించిన వారంతా చెదరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పేది ఏమంటే ఈ మనుషుల జోలికి వెళ్ళకుండా వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన గానీ వారి పని గానీ మనుషుల వలన కలిగినదైతే, అది వ్యర్థమై పోతుంది. దేవుని వలన కలిగినదైతే వారిని మీరు ఓడించలేరు. మీరొకవేళ దేవునితో పోరాడే వారవుతారేమో సుమా.” వారతని మాటకు అంగీకరించి, అపొస్తలులను పిలిపించి వారిని కొట్టించి, యేసు నామంలో బోధించ వద్దని ఆజ్ఞాపించి విడుదల చేశారు. ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి పాత్రులని దేవుడు తమను ఎంచినందుకు అపొస్తలులు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్ళిపోయారు. ప్రతిరోజూ దేవాలయంలో, ఇంటింటా మానకుండా బోధిస్తూ, యేసే క్రీస్తని ప్రకటిస్తూ వచ్చారు.
అపొస్తలుల కార్యములు 5:1-42 పవిత్ర బైబిల్ (TERV)
“అననీయ” అనబడే ఒక వ్యక్తి, అతని భార్య “సప్పీరా” కలిసి తమ భూమి అమ్మేసారు. “అననీయ” తన కొరకు కొంత డబ్బు దాచుకొన్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. “అననీయ” మిగతా డబ్బు తెచ్చి అపొస్తలుల కాళ్ళ ముందుంచాడు. అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా, నీ మనస్సులో సాతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేసావు? అది అమ్మక ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్యటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది? నీవు మనుష్యులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.” ఈ మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనని విన్నవాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది. కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ దేహాన్ని ఒక వస్త్రంలో చుట్టి మోసుకెళ్ళి సమాధి చేసారు. మూడు గంటల తర్వాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేదీ ఆమెకు తెలియదు. పేతురు, “మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు యింతేనా? చెప్పు!” అని ఆమెను అడిగాడు. “ఔను! అంతే డబ్బు లభించింది” అని ఆమె సమాధానం చెప్పింది. పేతురు ఆమెతో, “నీవు, నీ భర్త కలిసి ప్రభువు ఆత్మను పరీక్షించాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? ఆ తలుపు దగ్గరనుండి వస్తున్న అడుగుల చప్పుడు విను! అవి నీ భర్తను సమాధి చేసినవాళ్ళవి. వాళ్ళు నిన్ను కూడా మోసుకు వెళ్తారు” అని అన్నాడు. తక్షణమే ఆమె అతని పాదాలముందు పడి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్ళి ఆమె భర్త ప్రక్కన సమాధి చేసారు. సంఘానికి, ఈ సంఘటనలు విన్నవాళ్ళకు పెద్ద భయం పట్టుకుంది. అపొస్తలులు, విశ్వాసులు ఉమ్మడిగా సొలొమోను మండపంలో సమావేశమౌతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రజల్లో ఎన్నో అద్భుతాలు, మహత్యాలు చేసారు. ప్రజలు అపొస్తలుల్ని పొగుడుతూ ఉన్నప్పటికీ మిగతావాళ్ళు వాళ్ళతో చేరడానికి తెగించలేదు. చాలా మంది స్త్రీలు, పురుషులు ప్రభువును విశ్వసించారు. ప్రభువు వాళ్ళను సంఘంలో చేర్చాడు. ఇవి చూసిన ప్రజలు జబ్బుతో ఉన్నవాళ్ళను దారి మీదికి తెచ్చి పరుపుల మీద చాపల మీద పడుకోబెట్టారు. పేతురు ఆ దారి మీదుగా నడిచినప్పుడు అతని నీడ కొందరి మీదనన్నా పడుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాలనుండి గుంపులు గుంపులుగా వచ్చారు. తమలో జబ్బుతో ఉన్నవాళ్ళను, దయ్యాలు పట్టి బాధపడ్తున్నవాళ్ళను తీసుకు వచ్చారు. వాళ్ళందరికీ నయమైపోయింది. సద్దూకయ్యుల తెగకు చెందిన ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు అసూయతో నిండిపోయారు. వాళ్ళు అపొస్తలులను బంధించి కారాగారంలో వేసారు. కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చాడు. వాళ్ళతో, “వెళ్ళి మందిర ఆవరణంలో నిలుచొని ఈ క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు చెప్పండి” అని చెప్పాడు. దేవదూత చెప్పినట్లు విని వాళ్ళు తెల్లవారుతుండగా మందిరం యొక్క ఆవరణంలో ప్రవేశించి ప్రజలకు బోధించటం మొదలు పెట్టారు. ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు ఇశ్రాయేలు ప్రజల పెద్దలందర్ని సమావేశపరిచి మహాసభను ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అపొస్తలులను పిలుచుకు రమ్మని కొందర్ని కారాగారానికి పంపారు. భటులు కారాగారానికి వచ్చారు. కాని వాళ్ళకు అపొస్తలులు కనపడలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళి, “మేము కారాగారపు ద్వారాలు భద్రంగా తాళం వేయబడి ఉండటం చూసాము. ద్వారపాలకులు ద్వారాల దగ్గర ఉండటం చూసాము. కాని ద్వారాలు తెరిచి చూస్తే అపొస్తలులు లేరు” అని చెప్పారు. ఈ సంగతి విని మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, ప్రధాన యాజకులు వాళ్ళు ఏమై ఉంటారా? అని ఆశ్చర్యపడ్డారు. ఇంతలో ఒకడు వచ్చి, “మీరు కారాగారంలో ఉంచినవాళ్ళు మందిరం యొక్క ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు. ఇది విని ద్వారపాలకుల అధిపతి భటులను వెంట తీసుకొని వాళ్ళను పట్టుకు రావటానికి వెళ్ళాడు. ప్రజలు తమను రాళ్ళతో కొడతారనే భయం వాళ్ళలో ఉంది. కనుక అపొస్తలులపై వాళ్ళు ఏ దౌర్జన్యం చేయలేదు. అపొస్తలుల్ని పిలుచుకు వచ్చి మహాసభ ముందు నిలుచోబెట్టారు. ప్రధాన యాజకుడు విచారణ చేస్తూ, “మీ యేసు పేరిట బోధించవద్దని మేము యిది వరకే ఖచ్చితంగా ఆజ్ఞాపించాము. అయినా యెరూషలేమంతా మీ బోధలతో నింపివేసారు. అంతేకాక అతని మరణాన్ని మాపై మోపాలని చూస్తున్నారు” అని అన్నాడు. పేతురు, మిగతా అపొస్తలులు యిలా అన్నారు: “మేము దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నాము, మానవుల ఆజ్ఞల్ని కాదు. మీరు సిలువకు వ్రేలాడదీసి చంపిన యేసును మా పూర్వికుల దేవుడు బ్రతికించాడు. దేవుడు ఆయనకు తన కుడి వైపుననున్న స్థానాన్నిచ్చాడు. ఆయన్ని ఒక అధిపతిగా, రక్షకుడిగా నియమించాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపం పొందే అవకాశము, తమ పాపాలకు క్షమాపణ పొందే అవకాశము కలగాలని ఆయన ఉద్దేశ్యం. వీటికి మేము సాక్షులము. దేవుడు తన ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళకిచ్చిన పవిత్రాత్మ కూడా దీనికి సాక్షి.” ఇది విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు అపొస్తలులను చంపాలనుకున్నారు. కాని “గమలీయేలు” అనే పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలుచొని అపొస్తలుల్ని కొంతసేపు అవతలకు తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గమలీయేలు ధర్మశాస్త్ర పండితుడు. ప్రజల గౌరవం పొందినవాడు. అతడు వాళ్ళని సంబోధిస్తూ, “ఇశ్రాయేలు ప్రజలారా! వీళ్ళను ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించండి! ఇదివరలో థూదా కనిపించి తానొక గొప్పవాణ్ణని చెప్పుకున్నాడు. సుమారు నాలుగువందలమంది అతణ్ణి అనుసరించారు. అతడు చంపబడ్డాడు. ఆ తర్వాత అతని అనుచరులు చెదిరిపోయారు. చివరకు ఏమీ మిగల్లేదు. అతని తర్వాత జనాభా లెక్కల కాలంలో యూదా అనే వాడు వచ్చి ప్రజల్ని చేరదీసి తిరుగుబాటు చేసాడు. ఇతడు గలిలయవాడు. ఇతడు కూడా చంపబడ్డాడు. అతని అనుచరులందరూ చెదిరిపోయారు. అందువల్ల వాళ్ళ విషయంలో నా సలహా ఇది: వాళ్ళ విషయం పట్టించుకోకండి! వాళ్ళను వదిలివేయండి! వాళ్ళ కార్యము, వాళ్ళ ఉద్దేశ్యము మానవుడు సృష్టించినదైతే అది నశిస్తుంది. అలా కాకుండా అది దైవేచ్ఛ వలన అయితే మీరు వాళ్ళను ఆపలేరు. అలా చేస్తే మీరు దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళౌతారు” అని అన్నాడు. సభ్యులు అతడు చెప్పినట్లు విన్నారు. అపొస్తలుల్ని పిలిపించి కొరడా దెబ్బలు కొట్టించారు. ఆ తర్వాత, యేసు పేరిట మాట్లాడవద్దని వారించి వదిలి వేసారు. అపొస్తలులు యేసు కోసం అవమానింపబడటానికి తాము అర్హులైనందుకు సంతోషిస్తూ మహాసభనుండి వెళ్ళిపోయారు. ప్రతి రోజూ మందిరంలో, ఇంటింటా “యేసే క్రీస్తు” అని ప్రకటించారు. ఈ సువార్త ప్రకటించటం మానుకోలేదు.
అపొస్తలుల కార్యములు 5:1-42 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్యయెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను. అప్పుడు పేతురు –అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారికందరికిని మిగుల భయము కలిగెను; అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి. ఇంచుమించు మూడు గంటల సేపటికి వానిభార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు–మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె–అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు–ప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదములయొద్దపడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను. ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహ త్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కు వగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి. ప్రధానయాజకుడును అతనితోకూడ ఉన్నవారందరును, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని వచ్చి–మీరు వెళ్లి దేవాలయములో నిలువబడి ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధానయాజకుడును అతనితోకూడ నున్నవారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించి –వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి. బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగివచ్చి –చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతట దేవాలయపు అధిపతియు ప్రధానయాజకులును ఆ మాటలు విని–ఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి. అప్పుడు ఒకడు వచ్చి–ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రౌతులతోకూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను. వారిని తీసికొనివచ్చి సభలో నిలువబెట్టగా ప్రధానయాజకుడు వారిని చూచి–మీరు ఈ నామమునుబట్టి బోధింప కూడ దని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. అందుకు పేతురును అపొస్తలులును–మనుష్యు లకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించియున్నాడు. మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొనివీరిని చంప నుద్దేశించగా సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి–ఈ మనుష్యులను కొంత సేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను –ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్తసుమండి. ఈ దినములకుమునుపు థూదా లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసి కొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతోకూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడు కూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరి పోయిరి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా–ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును. దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ. వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించి–యేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందునవారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.
అపొస్తలుల కార్యములు 5:1-42 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అననీయ అనేవాడు తన భార్యయైన సప్పీరాతో కలిసి తన పొలాన్ని అమ్మాడు. అతడు తన భార్యకు తెలిసే ఆ అమ్మిన డబ్బు నుండి కొంత దాచుకొని, మిగిలిన దానిని తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురు, “అననీయా, పొలాన్ని అమ్మిన డబ్బులో కొంత నీవు దాచుకొని పరిశుద్ధాత్మతో అబద్ధమాడడానికి ఎలా సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు? అమ్మక ముందు అది నీదే కాదా? దానిని అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! అలాంటప్పుడు ఇలాంటి పని చేయాలని నీవు ఎలా ఆలోచించావు? నీవు మనుష్యులతో కాదు కాని దేవునితోనే అబద్ధమాడావు” అన్నాడు. అననీయ ఆ మాటలు విని, వెంటనే క్రిందపడి చనిపోయాడు. జరిగిన విషయాన్ని విన్నవారందరిలో గొప్ప భయం పుట్టింది. అప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అతని శరీరాన్ని బట్టలతో చుట్టి, మోసుకువెళ్లి పాతిపెట్టారు. మూడు గంటల తర్వాత, జరిగిన సంగతి తెలియని అతని భార్య లోపలికి వచ్చింది. పేతురు ఆమెను, “నీవు అననీయ కలిసి ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాకు చెప్పు” అని అడిగాడు. అందుకు ఆమె, “అవును, ఇంతకే అమ్మాము” అని జవాబిచ్చింది. అందుకు పేతురు ఆమెతో, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరు ఎందుకు ఒక్కటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారి పాదాలు గుమ్మం దగ్గరే ఉన్నాయి, వారు నిన్ను కూడా మోసుకుపోతారు” అన్నాడు. ఆ క్షణమే ఆమె అతని పాదాల దగ్గర పడి చనిపోయింది. అప్పుడు ఆ యువకులు లోపలికి వచ్చి, ఆమె చనిపోయిందని చూసి, ఆమె శరీరాన్ని మోసుకుపోయి తన భర్త ప్రక్కనే ఆమెను పాతిపెట్టారు. సంఘంలో ఈ సంగతులను విన్నవారందరిలో గొప్ప భయం పుట్టింది. అపొస్తలులు ప్రజల మధ్యలో అనేక సూచకక్రియలను, అద్భుతాలను చేశారు. విశ్వసించిన వారందరు సొలొమోను మండపంలో కలుసుకొనేవారు. ప్రజలు వారిని చాలా గౌరవించినప్పటికి, ఎవరు వారితో కలిసే ధైర్యం చేయలేకపోయారు. అయినా, మరి ఎక్కువ సంఖ్యలలో స్త్రీలు పురుషులు ప్రభువును నమ్ముకొని విశ్వాసుల గుంపులో చేరారు. అపొస్తలుల కార్యాలను బట్టి అనేకమంది రోగులను మంచాల మీద తీసుకువచ్చి, పేతురు వెళ్లేటప్పుడు అతని నీడ పడినా చాలని భావించి వీధుల్లో పరుపు మీద పడుకోబెట్టారు. యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్న పట్టణపు ప్రజలు తీసుకుని వచ్చిన రోగులు అపవిత్రాత్మలతో పీడింపడే వారందరు కూడా స్వస్థపడ్డారు. ప్రధాన యాజకుడు అతనితో ఉన్నవారంతా, అనగా సద్దూకయ్యుల తెగవారు అసూయతో నిండుకొన్నారు. కాబట్టి వారు అపొస్తలులను పట్టుకుని పట్టణపు చెరసాలలో వేయించారు. కానీ ప్రభువు దూత ఆ రాత్రివేళ చెరసాల తలుపులు తెరచి, వారిని బయటకు తీసుకువచ్చి, “వెళ్లి, దేవాలయ ఆవరణంలో నిలబడి ఈ జీవం గురించి ప్రజలందరికి బోధించండి” అని వారితో చెప్పాడు. తమకు చెప్పిన ప్రకారం తెల్లవారగానే వారు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లి ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు. ప్రధాన యాజకుడు అతని సహచరులు రాగానే, యూదా న్యాయసభ వారిని పిలిపించి, అపొస్తలులను చెరసాల నుండి తీసుకురమ్మని అధికారులను పంపించారు. వారు చెరసాలకు వచ్చి చూసినపుడు వారక్కడ కనబడలేదు. ఆ అధికారులు తిరిగివెళ్లి న్యాయసభ వారికి, “మేము వెళ్లినప్పుడు చెరసాల జాగ్రత్తగానే తాళం వేయబడి కావలివారు తలుపుల దగ్గర నిలబడే ఉన్నారు; కానీ మేము తలుపులు తెరిచినప్పుడు, లోపల మాకు ఎవరు కనబడలేదు” అని చెప్పారు. ఆ మాటలు విని, దేవాలయ కాపలా అధికారి ముఖ్య యాజకులు కలవరంతో, ఇది దేనికి దారితీస్తుందో అని ఆందోళన చెందారు. అప్పుడు ఒకడు వచ్చి, “చూడండి, మీరు చెరసాలలో పెట్టినవారు దేవాలయ ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు. వెంటనే కాపలా అధికారి తన సేవకులతో వెళ్లి, అపొస్తలులను తీసుకువచ్చారు. ప్రజలు తమను రాళ్లతో కొడతారేమో అని భయపడి, వారు బలప్రయోగం చేయలేదు. ప్రధాన యాజకుడు ప్రశ్నించాలని అపొస్తలులను న్యాయసభ ముందు నిలబెట్టారు. అప్పుడు ప్రధాన యాజకుడు, “ఈ పేరట బోధించకూడదు అని మీకు మేము ఖచ్చితంగా ఆదేశించాము, అయినాసరే మీ బోధలతో యెరూషలేమును నింపి ఈ మనుష్యుని హత్యచేసిన నేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని అన్నాడు. అందుకు పేతురు ఇతర అపొస్తలులు, “మేము మనుష్యుల కన్నా దేవునికే లోబడాలి కదా! మీరు సిలువ మీద వ్రేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు సజీవంగా లేపారు. ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలకు పశ్చాత్తాపాన్ని, పాపక్షమాపణను దయచేయడానికి, దేవుడు ఆయనను అధిపతిగా రక్షకునిగా తన కుడిచేతి వైపుకు హెచ్చించారు. మేము, అలాగే దేవునికి లోబడిన వారికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులము.” న్యాయసభ వారు ఈ మాటలను విని మరింత కోపం తెచ్చుకుని వారిని చంపాలని అనుకున్నారు. అయితే న్యాయసభలోని ఒకడు, ప్రజలందరి చేత గౌరవించబడే పరిసయ్యుడైన గమలీయేలు అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, వారిని కొంతసేపు బయట ఉంచమని ఆదేశించాడు. తర్వాత న్యాయసభతో, “ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యులకు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దాని గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంతకాలం క్రిందట థూదా అనే ఒకడు, తాను గొప్పవానినని చెప్పుకొన్నాడు, ఇంచుమించు నాలుగువందలమంది అతన్ని అనుసరించారు. అతడు చంపబడిన తర్వాత, అతని అనుచరులు చెదరిపోయారు, ఏమి మిగలకుండా పోయింది. అతని తర్వాత, జనాభా లెక్కలను వ్రాసే రోజుల్లో గలిలయుడైన యూదా అనేవాడు లేచి ప్రజలను తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు. అతడు కూడా చంపబడ్డాడు, అతని అనుచరులు కూడా చెదరిపోయారు. కాబట్టి ప్రస్తుత ఈ పరిస్థితిలో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే: వారిని వదిలేయండి! వారిని వెళ్లనివ్వండి. వారి ఉద్దేశాలు లేదా క్రియలు మనుష్యుల వలన వచ్చినవైతే అవే ఆగిపోతాయి. కాని అది దేవుని నుండి అయితే, వారిని మీరు ఆపలేరు; మీరు దేవునితో పోరాడుతున్నట్లే అని మీరు తెలుసుకుంటారు” అన్నాడు. అతని మాటలను వారు అంగీకరించారు, కాబట్టి అపొస్తలులను లోపలికి పిలిచి వారిని కొట్టించారు. తర్వాత యేసు పేరట మాట్లాడకూడదని వారిని ఆదేశించి పంపించారు. ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి తగినవారిగా ఎంచడంతో సంతోషిస్తూ అపొస్తలులు న్యాయసభ నుండి బయటకు వెళ్లిపోయారు. వారు ప్రతీ రోజు మానక దేవాలయ ఆవరణాల్లో ఇంటింట సువార్తను బోధిస్తూ “యేసే క్రీస్తు” అని ప్రకటించుచున్నారు.