అపొస్తలుల కార్యములు 4:7-31
అపొస్తలుల కార్యములు 4:7-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు పేతురును యోహానునుమధ్యను నిలువబెట్టి– మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను –ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసినదేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామ ముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను. మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితోకూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు –సభ వెలుపలికి పొండని వారికాజ్ఞాపించి తమలోతాము ఆలోచనచేసి –ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై– ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి–మీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారినిచూచి–దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవునిదృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి; మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి; ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి. స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు. వారు విడుదల నొంది తమ స్వజనులయొద్దకు వచ్చి, ప్రధానయాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటల నన్నిటిని వారికి తెలిపిరి. వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. –నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు. –అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభువు మీదను ఆయన క్రీస్తుమీదను భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా , ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములనుచేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.
అపొస్తలుల కార్యములు 4:7-31 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు పేతురు యోహానులను తీసుకొనివచ్చి వారి ముందు నిలబెట్టి, “మీరు ఈ పనిని ఏ అధికారంతో ఏ పేరిట చేశారు?” అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని, వారితో, “అధికారులారా, ప్రజా నాయకులారా! మేము కుంటివానిపట్ల చూపించిన దయను బట్టి వాడు ఎలా స్వస్థత పొందాడో ప్రశ్నించడానికి నేడు మేము పిలువబడినట్లైతే, మీరు మరియు ఇశ్రాయేలు ప్రజలందరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు ఎవరిని సిలువ వేసారో, దేవుడు మరణం నుండి ఎవరిని తిరిగిలేపారో, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామంను బట్టే, ఇతడు స్వస్థపడి మీ ముందు నిలబడ్డాడు. లేఖనాల్లో వ్రాయబడినట్లు, “ ‘ఇండ్లు కట్టే మీరు తృణీకరించిన రాయి అయిన యేసు, మూలరాయి అయ్యారు.’ కనుక మరి ఎవరి వలన రక్షణ పొందలేము, ఎందుకంటే ఆకాశం క్రింద మనుష్యులకు రక్షణ పొందడానికి మరి ఏ ఇతర పేరులేదు” అన్నాడు. వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వీరు విద్యలేని మామూలు మనుషులని తెలుసుకొని ఆశ్చర్యపడి, వీరు యేసుతోపాటు ఉన్నవారని గుర్తించారు. కానీ ఆ స్వస్థపడినవాడు వీరితో కూడా నిలబడి ఉండడం చూసి మరి ఏమి చెప్పలేకపోయారు. కనుక వారు వీరిని న్యాయసభ నుండి బయటకు వెళ్లమని ఆదేశించి, తమలో తాము చర్చించుకొంటూ, “ఈ మనుష్యులను మనం ఏమి చేద్దాం? యెరూషలేములో నివసించే ప్రతి ఒక్కరికి వీరు ఈ గొప్ప సూచక క్రియను చేశారని తెలుసు, కనుక అది జరగలేదని చెప్పలేము. అయినా ఈ సంగతిని ప్రజలలో మరింతగా వ్యాపించకుండా ఆపడానికి, ఈ పేరట మరి ఎవరితో మాట్లాడకుండా వారిని మనం బెదిరిద్దాం” అని అనుకున్నారు. మరల ఆ అపొస్తలులను లోపలికి పిలిచి యేసు పేరట ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధించకూడదు అని ఆదేశించారు. అందుకు పేతురు యోహానులు, “దేవుని దృష్టిలో మీ మాట వినడం న్యాయమా లేక దేవుని మాట వినడం న్యాయమా? మీరే న్యాయం చెప్పండి. మా మట్టుకైతే, మేము చూసినవాటిని మరియు విన్నవాటిని గురించి మేము మాట్లాడకుండా ఉండలేము” అని బదులిచ్చారు. ప్రజలందరు జరిగినదాని గురించి దేవుని స్తుతిస్తున్నారు, అందుకని వీరిని ఎలా శిక్షించాలో నిర్ణయించలేకపోయారు. కనుక వారిని మరింత బెదిరించి విడిచిపెట్టారు. అద్బుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు. పేతురు యోహానులు విడుదల పొందిన తర్వాత, వారి సహవిశ్వాసుల దగ్గరకు వెళ్లి ప్రధాన యాజకులు మరియు యూదా నాయకులు తమతో చెప్పిన వాటన్నింటి గురించి వారికి చెప్పారు. అది విన్న వెంటనే, వారందరు ఏక మనస్సుతో బిగ్గరగా దేవునికి ఈ విధంగా ప్రార్థించారు, “సర్వాధికారియైన ప్రభువా, మీరు ఆకాశాలను, భూమిని సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించారు. చాలా కాలం ముందే నీ సేవకుడు, మా పితరుడైన దావీదు ద్వారా పరిశుద్ధాత్మ పలికించిన మాటలు: “ ‘ఆయన యొక్క క్రీస్తుకు మరియు ప్రభువుకు వ్యతిరేకంగా ఎందుకు భూలోక రాజులు లేస్తారు? అధికారులు ఒక్కటిగా చేరతారు? జనులు ఎందుకు అల్లరి రేపుతున్నారు? ప్రజలు ఎందుకు వ్యర్థంగా కుట్రపన్నుతున్నారు?’ నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా, యూదులు కాని జనులతో మరియు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి హేరోదు మరియు పొంతి పిలాతు ఈ పట్టణంలో కుట్ర చేశారు. ఏమి జరగాలని నీ శక్తి మరియు నీ చిత్తం ముందుగానే నిర్ణయించిందో అలాగే వారు చేశారు. ప్రభువా, ఇప్పుడు, వీరి బెదరింపుల మధ్య మీ సేవకులకు మీ మాటలను చెప్పడానికి గొప్ప ధైర్యం ఇవ్వండి. మీ పరిశుద్ధ సేవకుడైన యేసు పేరట స్వస్థపరచడానికి, సూచక క్రియలు, అద్బుతాలు చేయడానికి మీ హస్తాన్ని చాపండి.” వారు ప్రార్థించిన తర్వాత, వారు ఉన్న స్ధలం కంపించింది. వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
అపొస్తలుల కార్యములు 4:7-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు పేతురు యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, “మీరు ఏ అధికారంతో ఏ నామంలో దీన్ని చేశారు?” అని అడిగారు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇలా అన్నాడు, “ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. మీరూ, ఇశ్రాయేలు ప్రజలంతా తెలుసుకోవలసింది ఏమంటే, మీరు సిలువ వేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే వీడు బాగుపడి మీ ముందు నిలుచున్నాడు. ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది. ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.” వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలుసుకుని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు. బాగుపడ్డ ఆ వ్యక్తి వారితోపాటు నిలబడడం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అధికారులు సభాస్థలం నుంచి బయటికి వెళ్ళండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకుని, ‘ఈ మనుషులను మనమేం చేద్దాం? వారిద్వారా గొప్ప అద్భుతం జరిగిందని యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలుసు, అది జరగలేదని చెప్పలేం. అయినా ఇది జనాల్లోకి యింకా వ్యాపించకుండా, ఇకనుండి ఈ నామంతో ఎవరితోనూ మాట్లాడవద్దని మనం వారిని బెదిరిద్దాం’ అని చెప్పుకున్నారు. అప్పుడు వారిని పిలిపించి, “మీరు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు” అని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి. మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము” అని వారికి జవాబిచ్చారు. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని కొనియాడుతున్నారు కాబట్టి సభవారు వీరిని ఎలా శిక్షించాలో తెలియక గట్టిగా బెదరించి విడుదల చేశారు. అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే. పేతురు యోహానులు విడుదలై తమ సొంతవారి దగ్గరికి వచ్చి, ప్రధాన యాజకులూ పెద్దలూ తమతో చెప్పిన మాటలన్నీ వారికి చెప్పారు. వారు విని, ఒకే మనసుతో దేవునికిలా గొంతెత్తి మొరపెట్టారు. ‘ప్రభూ, నీవు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్నీ కలుగజేశావు. యూదేతరులు ఎందుకు అల్లరి చేశారు? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు? ప్రభువు మీదా ఆయన క్రీస్తు మీదా భూరాజులు లేచారు, అధికారులు ఏకమయ్యారు అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, నీ సేవకుడూ, మా తండ్రీ అయిన దావీదుతో చెప్పించావు. ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో, వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఈ పట్టణంలో ఒక్కటయ్యారు. ప్రభూ, వారి బెదరింపులు గమనించి రోగులను బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చెయ్యి చాపి ఉండగా, నీ సేవకులు బహు ధైర్యంగా నీ వాక్కు బోధించేలా అనుగ్రహించు.’ వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
అపొస్తలుల కార్యములు 4:7-31 పవిత్ర బైబిల్ (TERV)
పేతురును, యోహానును వీళ్ళ ముందుకు పిలుచుకు వచ్చారు. “ఏ అధికారంతో, ఎవరి పేరిట మీరాపని చేసారు?” అని వాళ్ళు ప్రశ్నించటం మొదలు పెట్టారు. అదే సమయంలో, పేతురు పవిత్రాత్మతో నిండినవాడై వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ప్రజా నాయకులారా! పెద్దరాలా! ఒక కుంటివానికి చేసిన ఉపకారాన్ని గురించి మమ్మల్ని ప్రశ్నించాలనుకొంటున్నారా? అతనికి ఎవరు నయం చేసారని తెలుసుకోవాలనుకొంటున్నారా? అలాగైతే మీరు, ఇశ్రాయేలు ప్రజలు ఇది తెలుసుకోవాలి. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట ఈ కుంటివాడు పూర్తిగా నయమై మీ ముందు నిలుచున్నాడు. మీరు యేసును సిలువకు వేసి చంపినా దేవుడాయన్ని బ్రతికించాడు. ‘ఇల్లు కట్టువాళ్ళైన మీరు పారవేసిన రాయి ఈ యేసే! ఇప్పుడది మూలకు తలరాయి అయింది.’ రక్షణ యింకెవరి ద్వారా లభించదు. ఎందుకంటే, రక్షణ పొందటానికి ఈ పేరు (యేసు క్రీస్తు) తప్ప మరే పేరును దేవుడు మానవులకు తెలుపలేదు. ఈ పేరుకు తప్ప ఆ శక్తి ప్రపంచంలో మనుష్యులకివ్వబడిన మరే పేరుకు లేదు.” పేతురు, యోహాను చదువురాని మామూలు మనుష్యులని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళ ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. అప్పుడా సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్నవాళ్ళని గ్రహించారు. కాని నయమైన మనిషి వాళ్ళతో నిలిచి ఉండటం చూసి యింకే ఆక్షేపణలు చెయ్యలేక పోయారు. వాళ్ళను మహాసభనుండి వెళ్ళమని ఆజ్ఞాపించి పరస్పరం యిలా చర్చించుకొన్నారు: “వీళ్ళనేం చెయ్యాలి? యెరూషలేము నివాసులందరికి వీళ్ళు అద్భుతమైన మహిమ చేసారని బాగా తెలుసు. మనం దాన్ని కాదనలేం. కాని యిది ప్రజల్లో యింకా ఎక్కువగా వ్యాపించక ముందే యిక మీదట అతని పేరిట ఎవరితో ఏమీ మాట్లాడవద్దని వాళ్ళను వారించాలి.” వాళ్ళను మళ్ళీ పిలిచి యేసు పేరిట బోధించకూడదని, ఆయన గురించి మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు. కాని పేతురు, యోహాను వాళ్ళకు సమాధానం చెబుతూ, “మీరు చెప్పింది చెయ్యాలో, లేక దేవుడు చెప్పింది చెయ్యాలో, దేవుని దృష్టిలో ఏది న్యాయమో మీలో మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే మేము చూసినదాన్ని, విన్నదాన్ని గురించి ప్రజలకు చెప్పకుండా వుండలేము” అని అన్నారు. వాళ్ళు పేతురును, యోహానును యింకా కొంచెం భయపెట్టి వదిలేసారు. దేవుని మహిమవల్ల నయమైన వ్యక్తి నలభై ఏండ్లు దాటినవాడు. ఈ జరిగిన సంఘటనవల్ల ప్రజలంతా కలిసి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. అందువలన వీళ్ళను ఏ విధంగా శిక్షించాలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు. విడుదలయ్యాక పేతురు, యోహాను తమ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రధానయాజకులు, పెద్దలు చెప్పినదంతా చెప్పారు. ఇది విన్నాక వాళ్ళంతా కలిసి ఒకే ధ్యేయంతో దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు: “మహా ప్రభూ! నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సకల వస్తువుల్ని సృష్టించావు. నీవు పవిత్రాత్మ ద్వారా నీ సేవకుడు, మా తండ్రి అయిన దావీదు నోటినుండి యిలా పలికించావు: ‘జనాంగములు ఎందుకు రెచ్చుతున్నాయి? ప్రజలెందుకు వృథాగా పన్నాగాలు పన్నుతున్నారు? ‘రాజులు, పాలకులు కలిసి ప్రభువును, ఆయన క్రీస్తును ఎందుకు ఎదిరిస్తున్నారు?’ హేరోదు మరియు పొంతి పిలాతు ఇశ్రాయేలు ప్రజలతో మరియు యితర దేశ ప్రజలతో కలిసారు. అంతా కలిసి పవిత్రతగల నీ సేవుకుణ్ణి, నీవు క్రీస్తుగా నియమించిన యేసును నిజంగానే ఎదిరించారు. ఏది జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయించావు. వాళ్ళు నీవు నిర్ణయించినట్లే చేసారు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెడ్తున్నారు, చూడు ప్రభూ! నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు యివ్వు! యేసు పవిత్రమైనవాడు, నీ సేవకుడు. ఆయన పేరిట రోగుల్ని నయం చెయ్యటానికి, అద్భుతాలు, మహత్యాలు చెయ్యటానికి నీ అభయ హస్తాన్ని చాపి మాకు శక్తినివ్వు!” వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవసందేశాన్ని ధైర్యంగా చెప్పటం మొదలు పెట్టారు.
అపొస్తలుల కార్యములు 4:7-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
వారు పేతురు యోహానులను తీసుకువచ్చి వారి ముందు నిలబెట్టి, “మీరు ఈ పనిని ఏ అధికారంతో ఏ పేరిట చేశారు?” అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని, వారితో, “అధికారులారా, ప్రజా నాయకులారా! మేము కుంటివానిపట్ల చూపించిన దయను బట్టి వాడు ఎలా స్వస్థత పొందాడో ప్రశ్నించడానికి నేడు మేము పిలువబడినట్లైతే, మీరు ఇశ్రాయేలు ప్రజలందరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు ఎవరిని సిలువ వేశారో, దేవుడు మరణం నుండి ఎవరిని తిరిగిలేపారో, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామాన్ని బట్టే, ఇతడు స్వస్థపడి మీ ముందు నిలబడ్డాడు. యేసు గురించి, “ ‘ఇల్లు కట్టే మీరు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది’ అని వ్రాయబడింది. కాబట్టి మరి ఎవరి వలన రక్షణ పొందలేము, ఎందుకంటే ఆకాశం క్రింద మనుష్యులకు రక్షణ పొందడానికి మరి ఏ ఇతర పేరులేదు” అన్నాడు. వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వీరు విద్యలేని సామాన్య మనుష్యులని తెలుసుకొని ఆశ్చర్యపడి, వీరు యేసుతో పాటు ఉన్నవారని గుర్తించారు. కానీ ఆ స్వస్థపడినవాడు వీరితో కూడా నిలబడి ఉండడం చూసి మరి ఏమి చెప్పలేకపోయారు. కాబట్టి వారు వీరిని న్యాయసభ నుండి బయటకు వెళ్లమని ఆదేశించి, తమలో తాము చర్చించుకొంటూ, “ఈ మనుష్యులను మనం ఏమి చేద్దాం? యెరూషలేములో నివసించే వారందరికి వీరు ఈ గొప్ప సూచకక్రియను చేశారని తెలుసు, కాబట్టి అది జరగలేదని చెప్పలేము. అయినా ఈ సంగతిని ప్రజల్లో మరింతగా వ్యాపించకుండా ఆపడానికి, ఈ పేరట మరి ఎవరితో మాట్లాడకుండా వారిని మనం బెదిరిద్దాం” అని అనుకున్నారు. మరల ఆ అపొస్తలులను లోపలికి పిలిచి యేసు పేరట ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధించకూడదు అని ఆదేశించారు. అందుకు పేతురు యోహానులు, “దేవుని దృష్టిలో మీ మాట వినడం న్యాయమా లేదా దేవుని మాట వినడం న్యాయమా? మీరే న్యాయం చెప్పండి. మా మట్టుకైతే, మేము చూసినవాటిని విన్నవాటిని గురించి మేము మాట్లాడకుండా ఉండలేము” అని బదులిచ్చారు. ప్రజలందరు జరిగినదాని గురించి దేవుని స్తుతిస్తున్నారు, అందుకని వీరిని ఎలా శిక్షించాలో నిర్ణయించలేకపోయారు. కాబట్టి వారిని మరింత బెదిరించి విడిచిపెట్టారు. అద్భుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు. పేతురు యోహానులు విడుదల పొందిన తర్వాత, వారి సహవిశ్వాసుల దగ్గరకు వెళ్లి ముఖ్య యాజకులు యూదా పెద్దలు తమతో చెప్పిన వాటన్నింటి గురించి వారికి చెప్పారు. అది విన్న వెంటనే, వారందరు ఏకమనస్సుతో బిగ్గరగా దేవునికి ఈ విధంగా ప్రార్థించారు, “సర్వాధికారియైన ప్రభువా, మీరు ఆకాశాలను, భూమిని సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించారు. చాలా కాలం ముందే మీ సేవకుడు, మా పితరుడైన దావీదు ద్వారా పరిశుద్ధాత్మ పలికించిన మాటలు: “ ‘దేశాలు ఎందుకు కోపంతో ఉన్నాయి ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు? ప్రభువుకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచారు అధికారులు ఏకమయ్యారు.’ నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా, యూదేతరులతో ఇశ్రాయేలు ప్రజలతో కలిసి హేరోదు పొంతి పిలాతు ఈ పట్టణంలో కుట్ర చేశారు. ఏమి జరగాలని నీ శక్తి నీ చిత్తం ముందుగానే నిర్ణయించిందో అలాగే వారు చేశారు. ప్రభువా, ఇప్పుడు, వీరి బెదిరింపుల మధ్య మీ సేవకులకు మీ మాటలను చెప్పడానికి గొప్ప ధైర్యం ఇవ్వండి. మీ పరిశుద్ధ సేవకుడైన యేసు పేరట స్వస్థపరచడానికి, సూచకక్రియలు, అద్భుతాలు చేయడానికి మీ హస్తాన్ని చాపండి.” వారు ప్రార్థించిన తర్వాత, వారు ఉన్న స్ధలం కంపించింది. వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.