అపొస్తలుల కార్యములు 4:1-12
అపొస్తలుల కార్యములు 4:1-12 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతున్నపుడు యాజకులు దేవాలయ కాపలావారి అధిపతి మరియు సద్దూకయ్యులు వారి దగ్గరకు వచ్చారు. అపొస్తలులు ప్రజలకు యేసును గురించి బోధిస్తూ, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని ప్రకటించడం విని వారు చాలా కలవరపడ్డారు. వారు పేతురు యోహానులను పట్టుకొని, సాయంకాలం కావడంతో, మరుసటిరోజు వరకు వారిని చెరసాలలో బంధించారు. కానీ సువార్తను విన్న అనేకమంది నమ్మారు; ఆ విధంగా నమ్మినవారిలో పురుషుల సంఖ్య సుమారు ఐదువేల వరకు పెరిగింది. మరుసటిరోజు అధికారులు, యూదా నాయకులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేములో కలుసుకొన్నారు. ముఖ్య యాజకుడు అన్నా, అతని అల్లుడు కయప, యోహాను, అలెగ్జాండరు మరియు ప్రధాన యాజకుని ఇతర కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. వారు పేతురు యోహానులను తీసుకొనివచ్చి వారి ముందు నిలబెట్టి, “మీరు ఈ పనిని ఏ అధికారంతో ఏ పేరిట చేశారు?” అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని, వారితో, “అధికారులారా, ప్రజా నాయకులారా! మేము కుంటివానిపట్ల చూపించిన దయను బట్టి వాడు ఎలా స్వస్థత పొందాడో ప్రశ్నించడానికి నేడు మేము పిలువబడినట్లైతే, మీరు మరియు ఇశ్రాయేలు ప్రజలందరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు ఎవరిని సిలువ వేసారో, దేవుడు మరణం నుండి ఎవరిని తిరిగిలేపారో, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామంను బట్టే, ఇతడు స్వస్థపడి మీ ముందు నిలబడ్డాడు. లేఖనాల్లో వ్రాయబడినట్లు, “ ‘ఇండ్లు కట్టే మీరు తృణీకరించిన రాయి అయిన యేసు, మూలరాయి అయ్యారు.’ కనుక మరి ఎవరి వలన రక్షణ పొందలేము, ఎందుకంటే ఆకాశం క్రింద మనుష్యులకు రక్షణ పొందడానికి మరి ఏ ఇతర పేరులేదు” అన్నాడు.
అపొస్తలుల కార్యములు 4:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నపుడు యాజకులూ, ద్వారపాలకుల అధికారీ, సద్దూకయ్యులూ వారి దగ్గరికి వచ్చారు. వారు యేసుని గూర్చి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించడం విని కలవరపడ్డారు. వారిని బలవంతంగా పట్టుకుని, సాయంకాలం అయిందని మరునాటి వరకూ వారిని ఖైదులో ఉంచారు. కానీ వాక్కు విన్న వారిలో చాలామంది నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య దాదాపు ఐదు వేలు. మరుసటి రోజు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ యెరూషలేములో సమావేశమయ్యారు. ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో ఉన్నారు. వారు పేతురు యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, “మీరు ఏ అధికారంతో ఏ నామంలో దీన్ని చేశారు?” అని అడిగారు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇలా అన్నాడు, “ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. మీరూ, ఇశ్రాయేలు ప్రజలంతా తెలుసుకోవలసింది ఏమంటే, మీరు సిలువ వేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే వీడు బాగుపడి మీ ముందు నిలుచున్నాడు. ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది. ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.”
అపొస్తలుల కార్యములు 4:1-12 పవిత్ర బైబిల్ (TERV)
యాజకులు, మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, సద్దూకయ్యులు కలిసి పేతురు, యోహాను ఉన్న చోటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ప్రజలకు ఉపదేశిస్తూ ఉన్నారు. ఆ అపొస్తలులు ప్రజలకు ఉపదేశించటం, యేసును ఉదాహరణగా తీసుకొని చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారని ప్రకటించటం విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు పేతురును, యోహానును బంధించారు. అప్పటికే సాయంకాలమై ఉండటం వల్ల మరుసటి రోజు దాకా వాళ్ళను బంధించి ఉంచారు. వాళ్ళ సందేశాన్ని విని అనేకులు విశ్వాసులయ్యారు. ఆ విశ్వాసుల సంఖ్య సుమారు అయిదు వేలదాకా పెరిగిపోయింది. మరుసటి రోజు నాయకులు, పెద్దలు, పండితులు యెరూషలేములో సమావేశం అయ్యారు. “అన్న” అనే ప్రధాన యాజకుడు, కయప, యోహాను, అలెక్సంద్రు, ప్రధాన యాజకుని కుటుంబానికి చెందినవాళ్ళంతా ఆ సమావేశంలో ఉన్నారు. పేతురును, యోహానును వీళ్ళ ముందుకు పిలుచుకు వచ్చారు. “ఏ అధికారంతో, ఎవరి పేరిట మీరాపని చేసారు?” అని వాళ్ళు ప్రశ్నించటం మొదలు పెట్టారు. అదే సమయంలో, పేతురు పవిత్రాత్మతో నిండినవాడై వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ప్రజా నాయకులారా! పెద్దరాలా! ఒక కుంటివానికి చేసిన ఉపకారాన్ని గురించి మమ్మల్ని ప్రశ్నించాలనుకొంటున్నారా? అతనికి ఎవరు నయం చేసారని తెలుసుకోవాలనుకొంటున్నారా? అలాగైతే మీరు, ఇశ్రాయేలు ప్రజలు ఇది తెలుసుకోవాలి. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట ఈ కుంటివాడు పూర్తిగా నయమై మీ ముందు నిలుచున్నాడు. మీరు యేసును సిలువకు వేసి చంపినా దేవుడాయన్ని బ్రతికించాడు. ‘ఇల్లు కట్టువాళ్ళైన మీరు పారవేసిన రాయి ఈ యేసే! ఇప్పుడది మూలకు తలరాయి అయింది.’ రక్షణ యింకెవరి ద్వారా లభించదు. ఎందుకంటే, రక్షణ పొందటానికి ఈ పేరు (యేసు క్రీస్తు) తప్ప మరే పేరును దేవుడు మానవులకు తెలుపలేదు. ఈ పేరుకు తప్ప ఆ శక్తి ప్రపంచంలో మనుష్యులకివ్వబడిన మరే పేరుకు లేదు.”
అపొస్తలుల కార్యములు 4:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును వారు ప్రజ లకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్యయించుమించు అయిదువేలు ఆయెను. మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి. ప్రధానయాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితోకూడ ఉండిరి. వారు పేతురును యోహానునుమధ్యను నిలువబెట్టి– మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను –ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసినదేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామ ముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను. మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
అపొస్తలుల కార్యములు 4:1-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతున్నపుడు యాజకులు దేవాలయ కావలివారి అధిపతి సద్దూకయ్యులు వారి దగ్గరకు వచ్చారు. అపొస్తలులు ప్రజలకు యేసును గురించి బోధిస్తూ, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని ప్రకటించడం విని వారు చాలా కలవరపడ్డారు. వారు పేతురు యోహానులను పట్టుకుని, సాయంకాలం కావడంతో, మరుసటిరోజు వరకు వారిని చెరసాలలో బంధించారు. కానీ సువార్తను విన్న అనేకమంది నమ్మారు; ఆ విధంగా నమ్మినవారిలో పురుషుల సంఖ్య సుమారు అయిదువేల వరకు పెరిగింది. మరుసటిరోజు అధికారులు, యూదా నాయకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేములో కలుసుకొన్నారు. ముఖ్య యాజకుడు అన్నా, అతని అల్లుడు కయప, యోహాను, అలెగ్జాండరు ప్రధాన యాజకుని ఇతర కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. వారు పేతురు యోహానులను తీసుకువచ్చి వారి ముందు నిలబెట్టి, “మీరు ఈ పనిని ఏ అధికారంతో ఏ పేరిట చేశారు?” అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని, వారితో, “అధికారులారా, ప్రజా నాయకులారా! మేము కుంటివానిపట్ల చూపించిన దయను బట్టి వాడు ఎలా స్వస్థత పొందాడో ప్రశ్నించడానికి నేడు మేము పిలువబడినట్లైతే, మీరు ఇశ్రాయేలు ప్రజలందరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు ఎవరిని సిలువ వేశారో, దేవుడు మరణం నుండి ఎవరిని తిరిగిలేపారో, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామాన్ని బట్టే, ఇతడు స్వస్థపడి మీ ముందు నిలబడ్డాడు. యేసు గురించి, “ ‘ఇల్లు కట్టే మీరు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది’ అని వ్రాయబడింది. కాబట్టి మరి ఎవరి వలన రక్షణ పొందలేము, ఎందుకంటే ఆకాశం క్రింద మనుష్యులకు రక్షణ పొందడానికి మరి ఏ ఇతర పేరులేదు” అన్నాడు.