అపొస్తలుల కార్యములు 27:13-17

అపొస్తలుల కార్యములు 27:13-17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

దక్షిణపు గాలి మెల్లగా వీయడం మొదలు పెట్టేటప్పటికి, వారికి అవకాశం ఉన్నట్టు అనిపించింది; కనుక లంగరు పైకెత్తి క్రేతు తీరం వైపు ఓడను నడిపించారు. ఎక్కువసేపు అవ్వక ముందే, ఈశాన్యగాలి అని పిలువబడే, పెనుగాలి బలంగా వీయడంతో, ద్వీపం నుండి దూరంగా కొట్టుకొని పోయాం. ఓడ తుఫానులో చిక్కుకొని గాలికి ఎదురు ప్రయాణించలేక పోయింది; కనుక మేము ఆగాలి వీస్తున్న వైపుకు కొట్టుకొని పోయాం. కౌద అనే చిన్న ద్వీపం వైపు మేము వెళ్లినప్పుడు, చాలా కష్టంగా ఓడకు కట్టిన రక్షక పడవను కాపాడుకోగలిగాం. వాటిని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళను ఓడ అడుగు నుండి తీసి, రెండింటిని కలిపి గట్టిగా బిగించారు. తాము సూర్తి అనే ఇసుకదిబ్బలను గుద్దుకొంటామేమో అని భయపడి, ఓడ లంగరును క్రిందికి దించి, గాలితో ఓడ కొట్టుకొని పోయేలా చేశారు.

అపొస్తలుల కార్యములు 27:13-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అంతేగాక దక్షిణపు గాలి మెల్లగా విసరడంతో వారు తమ ఆలోచన సరైందని భావించి ఫీనిక్సు చేరి, క్రేతు తీరంలో ఓడను నడిపించారు. కొంచెం సేపటికి ఊరకులోను అనే పెనుగాలి క్రేతు మీద నుండి విసిరింది. ఓడ దానిలో చిక్కుకుపోయి గాలికి ఎదురు నడవలేక పోయింది. ఇక ఎదురు నడిపించడం మాని, గాలికి కొట్టుకుపోయాం. తరువాత కౌద అనే ఒక చిన్న ద్వీపం చాటుగా ఓడ నడిపించాం. బహు కష్టంగా ఓడకు కట్టిన పడవను కాపాడుకోగలిగాం. దాన్ని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకుని ఓడ చుట్టూ బిగించి కట్టారు. ఓడ సూర్తిస్ అనే ఇసుకతిప్పకు తగిలి పగిలిపోతుందేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకుపోయారు.

అపొస్తలుల కార్యములు 27:13-17 పవిత్ర బైబిల్ (TERV)

దక్షిణ గాలి వీచగానే తమకు కావలసింది దొరికిందని వాళ్ళనుకున్నారు. లంగరు తీసి, ఓడను క్రేతు తీరం ప్రక్కగా నడుపుతూ ప్రయాణం సాగించారు. అంతలోనే, ఊరకులోను అనబడే తీవ్రమైన తుఫాను గాలి క్రేతు ద్వీపం మీదుగా వీచటం మొదలైంది. ఓడ ఆ తుఫానుగాలికి కొట్టుకొని పోయింది. ఎదురు గాలివల్ల మా ఓడ ముందుకు పోలేక పోయింది. మేమేమీ చెయ్యలేక పోయాము. గాలి వీచిన వైపు మా ఓడ కొట్టుకొని పోయింది. “కౌద” అనబడే చిన్న ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని దాని ప్రక్కగా ప్రయాణం సాగించాము. ఓడకు కట్టబడిన పడవను చాలా కష్టంగా కాపాడగలిగాము. దానిని ఓడమీదకి ఎక్కించిన తర్వాత త్రాళ్ళు బిగించి ఓడను గట్టిగా కట్టారు. ఓడ “సూర్తిస్” ప్రాంతంలోని యిసుక తిప్పల మీదికి వెళ్తుందని భయపడ్డారు. కనుక తెరచాపలు దించి ఓడను గాలి వీచే వైపు పోనిచ్చారు.

అపొస్తలుల కార్యములు 27:13-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమ కూడినదని తలంచి లంగరెత్తి, క్రేతు దరిని ఓడ నడిపించిరి. కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీదనుండి విసరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతిమి. తరువాత కౌద అన బడిన యొక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్ట తరమాయెను. దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసి కొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుకతిప్పమీద పడుదుమేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయిరి.

అపొస్తలుల కార్యములు 27:13-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

దక్షిణపు గాలి మెల్లగా వీయడం మొదలు పెట్టేటప్పటికి, వారికి అవకాశం ఉన్నట్లు అనిపించింది; కాబట్టి లంగరు పైకెత్తి క్రేతు తీరం వైపు ఓడను నడిపించారు. ఎక్కువసేపు అవ్వక ముందే, ఈశాన్యగాలి అని పిలువబడే, పెనుగాలి బలంగా వీయడంతో, ద్వీపం నుండి దూరంగా కొట్టుకొని పోయాము. ఓడ తుఫానులో చిక్కుకొని గాలికి ఎదురు నడిపించలేక మేము గాలికి కొట్టుకుపోయాము. కౌద అనే చిన్న ద్వీపం వైపు మేము వెళ్లినప్పుడు, చాలా కష్టంగా ఓడకు కట్టిన రక్షక పడవను కాపాడగలిగాము. వాటిని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళను ఓడ అడుగు నుండి తీసి, రెండింటిని కలిపి గట్టిగా బిగించారు. తాము సూర్తి అనే ఇసుకదిబ్బలను గుద్దుకొంటామేమో అని భయపడి, ఓడ లంగరును క్రిందికి దించి, గాలితో ఓడ కొట్టుకొని పోయేలా చేశారు.