అపొస్తలుల కార్యములు 2:6-12

అపొస్తలుల కార్యములు 2:6-12 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

వారు ఈ శబ్దం విన్నప్పుడు, ప్రజలు కలవరంతో ఒక్క చోటికి గుంపుగా వచ్చారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ స్వంత భాష మాట్లాడడం విన్నారు. వారు ఎంతగానో ఆశ్చర్యపడి, “మాట్లాడుతున్న వీరందరు గలిలయులు కారా? అయితే మనలో ప్రతి ఒక్కరూ మన మాతృభాషలో వారు మాట్లాడటాన్ని ఎలా వింటున్నాం? అని చెప్పుకొన్నారు. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతమియ నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియ, పంఫులియా, ఈజిప్టు, కురేనే దగ్గరి లిబియ ప్రాంతాలకు చెందినవారు, రోమా నుండి వచ్చిన కొంతమంది సందర్శకులు అనగా యూదులు, యూదా మతంలోనికి మారిన వారు; క్రేతీయులు, అరబీయులు మొదలైన వారందరు విస్మయపడి ఆశ్చర్యంతో, వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యాలను ప్రకటించడాన్ని మనం వింటున్నాం.” దీని భావం ఏంటి? అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.

అపొస్తలుల కార్యములు 2:6-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఈ శబ్దం విన్న జన సందోహం కూడి వచ్చి, ప్రతి వాడూ తన సొంత భాషలో మాట్లాడడం విని కలవరపడ్డారు. వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతూ, “మాట్లాడే వీరంతా గలిలయ వారే గదా. మనలో ప్రతివాడి మాతృభాషలో వీరు మాట్లాడడం మనం వింటున్నామేంటి? పార్తీయులూ మాదీయులూ ఏలామీయులూ, మెసపటేమియా యూదయ కప్పదొకియ పొంతు ఆసియ ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అనే దేశాల వారూ, కురేనేలో భాగంగా ఉన్న లిబియ ప్రాంతాలవారూ, రోమ్ నుండి సందర్శకులుగా వచ్చిన యూదులూ, యూదామతంలోకి మారినవారూ, క్రేతీయులూ అరబీయులూ మొదలైన మనమంతా వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యాలను చెబుతుంటే వింటున్నాము” అనుకున్నారు. అందరూ ఆశ్చర్యచకితులై ఎటూ తోచక, “ఇదేమిటో” అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు.

అపొస్తలుల కార్యములు 2:6-12 పవిత్ర బైబిల్ (TERV)

ఆ మాటల శబ్దం విని ఒక పెద్ద ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. గుంపులోని ప్రతి ఒక్కడూ తన స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం విని దిగ్భ్రాంతి చెందాడు. వాళ్ళు దిగ్భ్రాంతి చెంది, “మాట్లాడుతున్న వాళ్ళందరూ గలిలయ ప్రాంతపు వాళ్ళే కదా? అలాంటప్పుడు, మాలోని ప్రతి ఒక్కడూ, అతని స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం ఎట్లా వింటున్నాడు? మేము, అంటే ‘పార్తీయ’ దేశంవాళ్ళు, ‘మాదీయ’ దేశంవాళ్ళు, ‘ఏలామీ’ దేశంవాళ్ళు, ‘మెసొపొతమియ’ నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియ నివాసులు, ఫ్రుగియ, పంఫులియ, ఈజిప్టు ప్రాంతాలవాళ్ళు, ‘లిబియ’లోని ‘కురేనే’ దగ్గరున్న ప్రాంతాలనుండి వచ్చినవాళ్ళు, రోమా నగరంనుండి వచ్చినవాళ్ళు, యూదులు, యూద మతంలో చేరినవాళ్ళు, క్రేతీయులు, అరబీయులు, వాళ్ళు దేవుని మహిమల్ని గురించి మా స్వంత భాషలో చెప్పటం వింటున్నామే!” అని అన్నారు. దిగ్భ్రాంతి చెందటం వల్ల, జరిగిన విషయాలు అర్థం కాకపోవటం వల్ల, “దీని అర్థమేమిటి” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు.

అపొస్తలుల కార్యములు 2:6-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతిమనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి–ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి? పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అను దేశములయందలివారు, కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

అపొస్తలుల కార్యములు 2:6-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

వారు ఈ శబ్దం విన్నప్పుడు, ప్రజలు కలవరంతో ఒక్క చోటికి గుంపుగా వచ్చారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ సొంత భాష మాట్లాడడం విన్నారు. వారు ఎంతగానో ఆశ్చర్యపడి, “మాట్లాడుతున్న వీరందరు గలిలయులు కారా? అయితే మనలో ప్రతి ఒక్కరూ మన మాతృభాషలో వారు మాట్లాడటాన్ని ఎలా వింటున్నాం? అని చెప్పుకొన్నారు. పార్తీయులు, మెదీయ వారు, ఎలామీయులు, మెసొపొటేమియా నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియ, పంఫులియా, ఈజిప్టు, కురేనే దగ్గరి లిబియా ప్రాంతాలకు చెందినవారు, రోమా నుండి వచ్చిన కొంతమంది సందర్శకులు అనగా యూదులు, యూదా మతంలోనికి మారిన వారు; క్రేతీయులు, అరబీయులు మొదలైన వారందరు విస్మయపడి ఆశ్చర్యంతో, వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యాలను ప్రకటించడాన్ని మనం వింటున్నాము.” దీని భావం ఏంటి? అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.