అపొస్తలుల కార్యములు 2:5-39
అపొస్తలుల కార్యములు 2:5-39 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ రోజుల్లో ఆకాశం క్రింద ఉన్న దేశాలన్నింటి నుండి వచ్చిన దైవభక్తి కలిగిన యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు. వారు ఈ శబ్దం విన్నప్పుడు, ప్రజలు కలవరంతో ఒక్క చోటికి గుంపుగా వచ్చారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ స్వంత భాష మాట్లాడడం విన్నారు. వారు ఎంతగానో ఆశ్చర్యపడి, “మాట్లాడుతున్న వీరందరు గలిలయులు కారా? అయితే మనలో ప్రతి ఒక్కరూ మన మాతృభాషలో వారు మాట్లాడటాన్ని ఎలా వింటున్నాం? అని చెప్పుకొన్నారు. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతమియ నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియ, పంఫులియా, ఈజిప్టు, కురేనే దగ్గరి లిబియ ప్రాంతాలకు చెందినవారు, రోమా నుండి వచ్చిన కొంతమంది సందర్శకులు అనగా యూదులు, యూదా మతంలోనికి మారిన వారు; క్రేతీయులు, అరబీయులు మొదలైన వారందరు విస్మయపడి ఆశ్చర్యంతో, వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యాలను ప్రకటించడాన్ని మనం వింటున్నాం.” దీని భావం ఏంటి? అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. అయితే కొందరు, “వీరు క్రొత్త మద్యాన్ని చాలా ఎక్కువగా త్రాగారు” అంటూ వారిని హేళన చేశారు. అప్పుడు పేతురు ఆ పదకొండు మందితో పాటు నిలబడి, బిగ్గరగా ఆ జనసమూహంతో ఇలా అన్నాడు: “తోటి యూదులారా మరియు యెరూషలేములో ఉంటున్నవారలారా, నేను మీకు దీని గురించి వివరిస్తాను; నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరందరు అనుకుంటున్నట్లు, వీరు మద్యం త్రాగిన మత్తులో లేరు. ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటలు అవుతుంది! యోవేలు ప్రవక్త ఇలా చెప్పాడు: “ ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజులలో, నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనస్థులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద, నా ఆత్మను కుమ్మరిస్తాను, అప్పుడు వారు ప్రవచిస్తారు, నేను పైన ఆకాశంలో నా అద్బుతాలను, క్రింద భూమి మీద నా సూచక క్రియలను, రక్తం, అగ్ని, పొగ మేఘాన్ని చూపిస్తాను. మహా మహిమ గల ప్రభువు దినము రావడానికి సూర్యుడు చీకటిగా మరియు చంద్రుడు రక్తంగా మారుతాడు. అయితే ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.’ “తోటి ఇశ్రాయేలీయులారా, ఇది వినండి: మీ కొరకు దేవుని నుండి అధికారం పొందిన నజరేయుడైన యేసు ద్వారా అద్బుతాలను, మహత్కార్యాలను, సూచక క్రియలను దేవుడే మీ మధ్యలో చేయించారని మీకు కూడ తెలుసు. దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తును మీకు అప్పగించారు; అయితే మీరు, దుష్టుల సహాయంతో, ఆయనను సిలువకు మేకులు కొట్టి చంపారు. కానీ మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం, కనుక దేవుడు ఆయనను మరణ వేదన నుండి విడిపించి, మృతులలో నుండి లేపారు. దావీదు ఆయన గురించి ఇలా అన్నారు: “ ‘ఎల్లప్పుడు నేను నాయెదుట నా ప్రభువును చూస్తున్నాను. నా ప్రభువు, నా కుడి ప్రక్కనే ఉన్నారు, కనుక నేను కదల్చబడను. కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది; నా శరీరం కూడా నిరీక్షణలో విశ్రమిస్తుంది, ఎందుకంటే నీవు నా అంతరాత్మను మృతుల రాజ్యంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళి పోనీయవు. నీవు నాకు జీవ మార్గాన్ని తెలిపావు; నీ సన్నిధిలోని ఆనందంతో నన్ను నింపుతావు.’ “తోటి ఇశ్రాయేలీయులారా, నేను మీతో ధైర్యంగా చెప్పగలను, మీ పితరుడైన దావీదు చనిపోయి పాతిపెట్టబడ్డాడు, అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. అతడు ఒక ప్రవక్త మరియు దేవుడు అతని సంతానంలోని ఒకనిని అతని సింహాసనం మీద కూర్చోపెడతానని ఒట్టుపెట్టుకొని తనకు ప్రమాణం చేశాడని దావీదుకు తెలుసు. రాబోయేదాన్ని చూసిన ఆయన క్రీస్తు పునరుత్థానం గురించి మాట్లాడుతూ, ఆయన మృతుల రాజ్యంలో విడిచిపెట్టబడలేదని, ఆయన శరీరం కుళ్ళి పోవడం చూడలేదని చెప్పారు. దేవుడు యేసును జీవంతో లేపారు, దీనికి మేమంతా సాక్షులం. దేవుని కుడి చేతి వైపుకు ఎత్తబడి, తండ్రి చేసిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మను పొందుకొని ఇప్పుడు మీరు చూస్తూ వింటున్న దానిని మీ మీద కుమ్మరించారు. దావీదు పరలోకానికి ఎక్కి పోలేదు అయినా ఇలా చెప్పాడు, “ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు “నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’ “కనుక ఇశ్రాయేలు ప్రజలందరు ఖచ్చితంగా తెలుసుకోవలసింది ఏంటంటే: మీరు సిలువ వేసిన ఈ యేసునే, దేవుడు ప్రభువుగా మరియు క్రీస్తుగా చేశారు.” ప్రజలు ఈ మాటలు విని, మనస్సులో బాధపడి పేతురు, ఇతర అపొస్తలులతో, “సహోదరులారా, మేము ఏమి చేయాలి?” అని అన్నారు. అందుకు పేతురు, “మీలో ప్రతి ఒక్కరు, మీ పాపాల క్షమాపణ కొరకు పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకొంటారు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు మరియు దూరంగా ఉన్నవారందరికి అనగా, మన ప్రభువైన దేవుడు పిలిచే వారందరికి చెందుతుంది” అని వారితో చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 2:5-39 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ రోజుల్లో ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రాంతపు జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు. ఈ శబ్దం విన్న జన సందోహం కూడి వచ్చి, ప్రతి వాడూ తన సొంత భాషలో మాట్లాడడం విని కలవరపడ్డారు. వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతూ, “మాట్లాడే వీరంతా గలిలయ వారే గదా. మనలో ప్రతివాడి మాతృభాషలో వీరు మాట్లాడడం మనం వింటున్నామేంటి? పార్తీయులూ మాదీయులూ ఏలామీయులూ, మెసపటేమియా యూదయ కప్పదొకియ పొంతు ఆసియ ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అనే దేశాల వారూ, కురేనేలో భాగంగా ఉన్న లిబియ ప్రాంతాలవారూ, రోమ్ నుండి సందర్శకులుగా వచ్చిన యూదులూ, యూదామతంలోకి మారినవారూ, క్రేతీయులూ అరబీయులూ మొదలైన మనమంతా వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యాలను చెబుతుంటే వింటున్నాము” అనుకున్నారు. అందరూ ఆశ్చర్యచకితులై ఎటూ తోచక, “ఇదేమిటో” అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు. కొందరైతే వీరు కొత్త సారా తాగి ఉన్నారని ఎగతాళి చేశారు. అయితే పేతురు ఆ పదకొండు మందితో లేచి నిలబడి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు, “యూదయ ప్రజలారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియాలి. నా మాటలు జాగ్రత్తగా వినండి. “మీరనుకున్నట్టు వీరు మద్యపానం చేయలేదు. ఇప్పుడు ఉదయం తొమ్మిదయినా కాలేదు. యోవేలు ప్రవక్త చెప్పిన సంగతి ఇదే, ‘అంత్యదినాల్లో నేను మనుషులందరి మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులూ కుమార్తెలూ ప్రవచిస్తారు. మీ యువకులు దర్శనాలు చూస్తారు. మీ వృద్ధులు కలలు కంటారు, ఆ రోజుల్లో నా దాసుల మీదా దాసీల మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు. పైన ఆకాశంలో మహత్కార్యాలనూ కింద భూమ్మీద సూచకక్రియలనూ రక్తం, అగ్ని, పొగ, ఆవిరినీ చూపిస్తాను. ప్రభువు ప్రత్యక్షమయ్యే మహిమాయుక్తమైన ఆ మహాదినం రాక ముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారతారు. ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారంతా పాప విమోచన పొందుతారు’ అని దేవుడు చెబుతున్నాడు. “ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకే తెలుసు. దేవుని స్థిరమైన ప్రణాళికనూ ఆయనకున్న భవిష్య జ్ఞానాన్నీ అనుసరించి ఆయనను అప్పగించడం జరిగింది. ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం కాబట్టి దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు. “ఆయన గూర్చి దావీదు ఇలా అన్నాడు, ‘నేనెప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను, ఆయన నా కుడి పక్కనే ఉన్నాడు కాబట్టి ఏదీ నన్ను కదల్చదు. నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక ఆనందించింది. నా శరీరం కూడా ఆశాభావంతో నిశ్చింతగా ఉంటుంది. ఎందుకంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియ్యవు. నాకు జీవమార్గాలు తెలిపావు. నీ ముఖదర్శనంతో నన్ను ఉల్లాసంతో నింపుతావు.’ “సోదరులారా, పూర్వికుడైన దావీదును గురించి మీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. అతడు చనిపోయి సమాధి అయ్యాడు. అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. అతడు ప్రవక్త కాబట్టి ‘అతని గర్భఫలం నుంచి ఒకడిని అతని సింహాసనం మీద కూర్చోబెడతాను’ అని “దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా శపథం చేసిన సంగతి అతనికి తెలుసు. క్రీస్తు పాతాళంలో నిలిచి ఉండి పోలేదనీ, ఆయన శరీరం కుళ్ళి పోలేదనీ దావీదు ముందే తెలుసుకుని ఆయన పునరుత్థానాన్ని గూర్చి చెప్పాడు. “ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం. కాబట్టి ఆయనను దేవుడు తన కుడి స్థానానికి హెచ్చించాడు. ఆయన తన తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఆయన వలన పొంది, మీరు చూస్తున్న, వింటున్న ఈ కుమ్మరింపును జరిగించాడు. దావీదు పరలోకానికి ఆరోహణం కాలేదు. అయితే అతడిలా అన్నాడు, ‘నేను నీ శత్రువులను నీ పాదాల కింద పాదపీఠంగా ఉంచే వరకూ నీవు నా కుడి పక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు.’ “మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు జాతి అంతా కచ్చితంగా తెలుసుకోవాలి.” వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 2:5-39 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు ఈ యెరూషలేము పట్టణంలో అన్ని దేశాలకు చెందిన దైవభక్తిగల యూదులు ఉండినారు. ఆ మాటల శబ్దం విని ఒక పెద్ద ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. గుంపులోని ప్రతి ఒక్కడూ తన స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం విని దిగ్భ్రాంతి చెందాడు. వాళ్ళు దిగ్భ్రాంతి చెంది, “మాట్లాడుతున్న వాళ్ళందరూ గలిలయ ప్రాంతపు వాళ్ళే కదా? అలాంటప్పుడు, మాలోని ప్రతి ఒక్కడూ, అతని స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం ఎట్లా వింటున్నాడు? మేము, అంటే ‘పార్తీయ’ దేశంవాళ్ళు, ‘మాదీయ’ దేశంవాళ్ళు, ‘ఏలామీ’ దేశంవాళ్ళు, ‘మెసొపొతమియ’ నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియ నివాసులు, ఫ్రుగియ, పంఫులియ, ఈజిప్టు ప్రాంతాలవాళ్ళు, ‘లిబియ’లోని ‘కురేనే’ దగ్గరున్న ప్రాంతాలనుండి వచ్చినవాళ్ళు, రోమా నగరంనుండి వచ్చినవాళ్ళు, యూదులు, యూద మతంలో చేరినవాళ్ళు, క్రేతీయులు, అరబీయులు, వాళ్ళు దేవుని మహిమల్ని గురించి మా స్వంత భాషలో చెప్పటం వింటున్నామే!” అని అన్నారు. దిగ్భ్రాంతి చెందటం వల్ల, జరిగిన విషయాలు అర్థం కాకపోవటం వల్ల, “దీని అర్థమేమిటి” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు. “బాగా మద్యం త్రాగి మత్తులో ఉన్నారు” అని కొందరు వాళ్ళనెగతాళి చేసారు. ఇది విని పేతురు పదకొండుగురితో లేచి, పెద్ద గొంతుతో ప్రజల్ని సంబోధిస్తూ, “తోటి యూదా సోదరులారా! యెరూషలేంలో నివసిస్తున్న సమస్త ప్రజలారా! నన్ను దీన్ని గురించి మీకు చెప్పనివ్వండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరనుకొన్నట్లు వీళ్ళు త్రాగలేదు. ఇప్పుడు ఇంకా ఉదయం తొమ్మిది గంటలే కదా! దీన్ని గురించి ప్రవక్త యోవేలు ఈ విధంగా వ్రాసాడు కనుక యివి జరుగుతున్నాయి: ‘దేవుడు ఈ విధంగా అంటున్నాడు: ఈ చివరి దినాల్లో నా ఆత్మను అందరిపై కురిపిస్తాను! మీ కుమారులు, కుమార్తెలు నా ప్రవచనాలు పలుకుతారు! మీ యువతరం దివ్యదర్శనాలు చూస్తుంది. వయస్సు మళ్ళిన మీవాళ్ళు కలలుగంటారు. ఆడా, మగా అనే భేదం లేకుండా నా సేవకులందరిపై ఆ దినాల్లో నా ఆత్మను కురిపిస్తాను. అప్పుడు వాళ్ళు నా ప్రవచనాలు చెబుతారు. పైన ఆకాశంలో నేను అద్భుతాలు చూపిస్తాను. క్రింద భూమ్మీద రుజువులు చూపిస్తాను. రక్తం, మంటలు, చిక్కటి పొగలు చెలరేగుతాయి. సూర్యుణ్ణి చీకటిగా మారుస్తాను. చంద్రుణ్ణి ఎర్రటి రక్తంలా మారుస్తాను. ఉత్కృష్టమైనటువంటి, తేజోవంతమైనటువంటి ప్రభువు యొక్క దినం రాక ముందే యిది జరుగుతుంది. అప్పుడు ఆయన నామంలో ప్రార్థించు ప్రతి ఒక్కణ్ణి ప్రభువు రక్షిస్తాడు.’ “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది వినండి. దేవుడు నజరేతు నివాసియైన యేసును, తాను ప్రత్యేకంగా నియమించాడన్న విషయం మీకు నిరూపించాలని ఆయన ద్వారా మహత్యాలు, అద్భుతాలు మీకోసం చేసాడు. సూచనలు చూపాడు. ఈ మహత్యాలు, అద్భుతాలు చేసినట్లు, సూచనలు చూపినట్లు మీకు ఇదివరకే తెలుసు. దైవ సంకల్పానుసారం ఆయన దివ్య జ్ఞానానుసారం యేసు మీకు అప్పగింపబడ్డాడు. ఆ తర్వాత మీరు దుర్మార్గుల సహాయంతో ఆయనను సిలువకు వేసి, మేకులు కొట్టి ఆయన్ని చంపారు. కాని దేవుడాయన్ని బ్రతికించాడు. ఆయనకు మరణవేదననుండి విముక్తి కలిగించాడు. మరణానికి ఆయన్ని బంధించి ఉంచటం చేతకాలేదు. దావీదు యేసును గురించి ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువును, నేను నా ముందు అన్ని వేళలా చూసాను. నన్ను రక్షించటానికి ప్రభువు నా వెంట ఉన్నాడు! అందుకే నా మాటల్లో ఆనందం నిండియున్నది. అందుకే నా దేహం ఆశతో జీవిస్తోంది. ఎందుకంటే, నా ఆత్మను నీవు చనిపోయిన వాళ్ళతో వదిలివేయవు నీవు నీ భక్తుని దేహాన్ని కుళ్ళనీయవు. నాకు జీవపు దారుల్ని చూపావు! నా వెంటే ఉండి నాకు ఆనందం కలిగించావు!’ “సోదరులారా! మన వంశీయుడైన దావీదును గురించి నేనిది ఖచ్చితంగా చెప్పగలను. అతడు చనిపొయ్యాడు. అతణ్ణి సమాధి చేసారు. ఆ సమాధి ఈ నాటికీ ఉంది. దావీదు ఒక ప్రవక్త. దావీదు వంశంలో పుట్టిన వాణ్ణొకణ్ణి సింహాసనంపై కూర్చోబెడ్తానని దేవుడు అతనికి ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసాడు. ఇది దావీదుకు తెలుసు. ఈ జరుగనున్న దాన్ని గురించి దావీదుకు ముందే తెలుసు. అందువల్లే అతడు క్రీస్తు బ్రతికి రావటాన్ని గురించి ఈ విధంగా అన్నాడు: ‘దేవుడు ఆయన్ని సమాధిలో వదిలివేయ లేదు. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు.’ క్రీస్తు సమాధినుండి లేచే విషయమై దావీదు మాటలాడుచూ ఉన్నాడు. కావున దేవుడు ఈ యేసునే మృత్యువునుండి బ్రతికించినాడు. దీనికి మేమంతా సాక్ష్యము. యేసు పరలోకానికి ఎత్తబడినాడు. ఇప్పుడు యేసు దేవునితో ఆయన కుడిప్రక్కన ఉన్నాడు. తండ్రి పరిశుద్ధాత్మను యేసుకు ఇచ్చాడు. దేవుడు ఇస్తానని వాగ్దానము చేసినది పరిశుద్ధాత్మయే. యేసు ఇప్పుడాయాత్మను ఇస్తున్నాడు. ఇదే మీరు వింటున్నది, చూస్తున్నది. యేసులా దావీదు పరలోకానికి వెళ్ళలేదు. అయినా, అతడీవిధంగా అన్నాడు: ‘ప్రభువు నా ప్రభువుతో, నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు నీవు నా కుడివైపు కూర్చో!’ “అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ యిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు, మీరు సిలువకు వేసి చంపిన ఈ యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు.” ఇది విని ప్రజల హృదయాలు కదిలిపొయ్యాయి. వాళ్ళు పేతురు మరియు యితర అపొస్తలులను, “సోదరులారా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు. పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు: “మీలో ప్రతి ఒక్కడూ పాప క్షమాపణ నిమిత్తం మారుమనస్సు కలిగి యేసు క్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీ పాపాలు క్షమించబడ్తాయి. మీకు పవిత్రాత్మ వరం లభిస్తుంది. దేవుడు ఈ వాగ్దానాన్ని మీకోసం, మీ సంతానాని కోసం, ప్రభువు ఆహ్వానించబోయే దూర ప్రాంతాల వాళ్ళకందరి కోసం చేసాడు.”
అపొస్తలుల కార్యములు 2:5-39 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతిమనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి–ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి? పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అను దేశములయందలివారు, కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే–వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను–యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్ప బడిన సంగతి యిదే, ఏమనగా –అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మ ను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మ ను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీమధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబర చెను; ఇది మీరే యెరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను –నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువు ను చూచు చుంటిని ఆయన నా కుడిపార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు. నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను; అతని సమాధి నేటివరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తయైయుండెను గనుక –అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టుపెట్టుకొనిన సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమునుగూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మనుగూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించియున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను– నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠ ముగా ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని –సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.
అపొస్తలుల కార్యములు 2:5-39 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఆ రోజుల్లో ఆకాశం క్రింద ఉన్న దేశాలన్నింటి నుండి వచ్చిన దైవభక్తి కలిగిన యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు. వారు ఈ శబ్దం విన్నప్పుడు, ప్రజలు కలవరంతో ఒక్క చోటికి గుంపుగా వచ్చారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ సొంత భాష మాట్లాడడం విన్నారు. వారు ఎంతగానో ఆశ్చర్యపడి, “మాట్లాడుతున్న వీరందరు గలిలయులు కారా? అయితే మనలో ప్రతి ఒక్కరూ మన మాతృభాషలో వారు మాట్లాడటాన్ని ఎలా వింటున్నాం? అని చెప్పుకొన్నారు. పార్తీయులు, మెదీయ వారు, ఎలామీయులు, మెసొపొటేమియా నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియ, పంఫులియా, ఈజిప్టు, కురేనే దగ్గరి లిబియా ప్రాంతాలకు చెందినవారు, రోమా నుండి వచ్చిన కొంతమంది సందర్శకులు అనగా యూదులు, యూదా మతంలోనికి మారిన వారు; క్రేతీయులు, అరబీయులు మొదలైన వారందరు విస్మయపడి ఆశ్చర్యంతో, వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యాలను ప్రకటించడాన్ని మనం వింటున్నాము.” దీని భావం ఏంటి? అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. అయితే కొందరు, “వీరు క్రొత్త మద్యాన్ని చాలా ఎక్కువగా త్రాగారు” అని అంటూ వారిని హేళన చేశారు. అప్పుడు పేతురు ఆ పదకొండు మందితో పాటు నిలబడి, బిగ్గరగా ఆ జనసమూహంతో ఇలా అన్నాడు: “తోటి యూదులారా యెరూషలేములో ఉంటున్నవారలారా, నేను మీకు దీని గురించి వివరిస్తాను; నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరందరు అనుకుంటున్నట్లు, వీరు మద్యం త్రాగిన మత్తులో లేరు. ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటలు అవుతుంది! యోవేలు ప్రవక్త ఇలా చెప్పాడు: “ ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజుల్లో, నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యువకులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచిస్తారు, నేను పైన ఆకాశంలో అద్భుతాలను క్రింద భూమి మీద నా సూచకక్రియలను, రక్తం అగ్ని గొప్ప పొగను చూపిస్తాను. మహా మహిమగల ప్రభువు దినం రాకముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారుతాడు. అయితే ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.’ “తోటి ఇశ్రాయేలీయులారా, ఇది వినండి: మీ కోసం దేవుని నుండి అధికారం పొందిన నజరేయుడైన యేసు ద్వారా అద్భుతాలను, మహత్కార్యాలను, సూచకక్రియలను దేవుడే మీ మధ్యలో చేయించారని మీకు కూడ తెలుసు. దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్నిబట్టి నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం యేసు క్రీస్తును మీకు అప్పగించారు; అయితే మీరు, దుష్టుల సహాయంతో, ఆయనను సిలువకు మేకులు కొట్టి చంపారు. కానీ మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం, కాబట్టి దేవుడు ఆయనను మరణ వేదన నుండి విడిపించి, మృతులలో నుండి లేపారు. దావీదు ఆయన గురించి ఇలా అన్నారు: “ ‘ఎల్లప్పుడు నేను నా ఎదుట నా ప్రభువును చూస్తున్నాను. నా ప్రభువు, నా కుడి ప్రక్కనే ఉన్నారు, కాబట్టి నేను కదల్చబడను. కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది; నా శరీరం కూడా నిరీక్షణలో విశ్రమిస్తుంది, ఎందుకంటే నీవు నా ఆత్మను మృతుల రాజ్యంలో విడిచిపెట్టరు, మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు. మీరు నాకు జీవమార్గాలను తెలిపారు; మీ సన్నిధిలోని ఆనందంతో నన్ను నింపుతారు.’ “తోటి ఇశ్రాయేలీయులారా, నేను మీతో నిస్సందేహంగా చెప్పగలను, మీ పితరుడైన దావీదు చనిపోయి పాతిపెట్టబడ్డాడు, అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. అతడు ఒక ప్రవక్త దేవుడు అతని సంతానంలో ఒకనిని అతని సింహాసనం మీద కూర్చోబెడతానని ఒట్టు పెట్టుకుని తనకు ప్రమాణం చేశాడని దావీదుకు తెలుసు. రాబోయేదాన్ని చూసిన ఆయన క్రీస్తు పునరుత్థానం గురించి మాట్లాడుతూ, ఆయన మృతుల రాజ్యంలో విడిచిపెట్టబడలేదని, ఆయన శరీరం కుళ్ళి పోవడం చూడలేదని చెప్పారు. దేవుడు యేసును జీవంతో లేపారు, దీనికి మేమంతా సాక్షులము. దేవుని కుడిచేతి వైపుకు ఎత్తబడి, తండ్రి చేసిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మను పొందుకొని ఇప్పుడు మీరు చూస్తూ వింటున్న దానిని మీమీద కుమ్మరించారు. దావీదు పరలోకానికి ఎక్కి పోలేదు అయినా ఇలా చెప్పాడు, “ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు “నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’ “కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరు ఖచ్చితంగా తెలుసుకోవలసింది ఏంటంటే: మీరు సిలువ వేసిన ఈ యేసునే, దేవుడు ప్రభువుగా క్రీస్తుగా చేశారు.” ప్రజలు ఈ మాటలు విని, మనస్సులో బాధపడి పేతురు, ఇతర అపొస్తలులతో, “సహోదరులారా, మేము ఏమి చేయాలి?” అని అన్నారు. అందుకు పేతురు, “మీలో ప్రతి ఒక్కరు, మీ పాపాల క్షమాపణ కోసం పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకొంటారు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరంగా ఉన్నవారందరికి అనగా, మన ప్రభువైన దేవుడు పిలిచే వారందరికి చెందుతుంది” అని వారితో చెప్పాడు.