అపొస్తలుల కార్యములు 19:21-41
అపొస్తలుల కార్యములు 19:21-41 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇదంతా జరిగిన తర్వాత పౌలు మాసిదోనియ అకాయ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ యెరూషలేముకు వెళ్లాలి అని నిర్ణయించుకొన్నాడు. “నేను అక్కడికి వెళ్లిన తర్వాత రోమా పట్టణాన్ని కూడా దర్శించాలి” అనుకున్నాడు. అతడు తిమోతి ఎరస్తు అనే ఇద్దరు తన తోటి పరిచారకులను మాసిదోనియాకు పంపి, అతడు ఆసియా ప్రాంతంలో కొంతకాలం ఉండిపోయాడు. ఆ సమయంలో ప్రభువు మార్గం గురించి అక్కడ చాలా అల్లరి చెలరేగింది. అది ఎలాగంటే, దేమేత్రి అనే ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేస్తూ, అక్కడి పనివారికి వ్యాపారంలో మంచి ఆదాయం కల్పించేవాడు. అతడు ఆ వ్యాపార సంబంధమైన పని వారందరిని పిలిపించి, ఈ విధంగా చెప్పాడు, “నా స్నేహితులారా, ఈ వ్యాపారం ద్వారా మనకు మంచి ఆదాయం వస్తుందని మీకు అందరికి తెలుసు. అయితే పౌలు అనే ఇతడు ఎఫెసు ఆసియా ప్రాంతాలన్నింటిలో చాలామంది ప్రజలను ఎలా ఒప్పించి దారి తప్పిస్తున్నాడో మీరు చూస్తున్నారు వింటున్నారు. మానవుల చేతులతో తయారుచేసిన దైవాలు అసలు దైవాలే కావు అని ఇతడు అంటున్నాడు. దీని వలన మన వ్యాపారానికి ఉన్న మంచి పేరు పోవడమే కాకుండా గొప్ప అర్తెమి దేవి గుడికి ఉన్న ఘనత కూడా పోతుంది; ఆసియా ప్రాంతాల్లోనూ లోకమంతటను ఆమెకు ఉన్న దివ్యఘనత తగ్గిపోతుంది.” అది విన్న వారు కోపంతో, “ఎఫెసీయుల అర్తెమి దేవి గొప్పది!” అని బిగ్గరగా కేకలు వేశారు. దానితో పట్టణంలో అల్లరి చెలరేగింది. పౌలుతో మాసిదోనియ నుండి ప్రయాణం చేసి వచ్చిన గాయి అనే అరిస్తర్కును పట్టుకుని, వారందరు ఒకేసారి నాటకశాలలోనికి ఈడ్చుకు వెళ్లారు. పౌలు ఆ జనసమూహానికి కనిపించాలి అనుకున్నాడు, కాని శిష్యులు అతన్ని వెళ్లనివ్వలేదు. అంతేకాక కొందరు ఆసియా దేశ అధికారులు, పౌలు మిత్రులు, అతన్ని నాటకశాలలోనికి వెళ్లవద్దని బ్రతిమాలుతూ వర్తమానం పంపించారు. సభ అంతా గందరగోళంగా మారింది: కొందరు ఒకదాని గురించి కేకలు వేస్తుంటే, మరికొందరు మరొకదాని గురించి. అక్కడ ఉన్నవారిలో చాలామందికి తాము అక్కడ ఎందుకు ఉన్నారో కూడా తెలియలేదు. ఆ జనసమూహంలోని యూదులు అలెగ్జాండరును ముందుకు త్రోసి, అతన్ని జనుల ముందు నిలబెట్టి వారు కేకలు వేశారు. కాబట్టి అతడు ప్రజల ముందు సమాధానం చెప్పడానికి నిలబడి నిశ్శబ్దంగా ఉండండి అని సైగ చేశాడు. కానీ అతడు యూదుడు అని తెలుసుకొని వారు సుమారు రెండు గంటల సేపు ఏకకంఠంతో, “ఎఫెసీయుల అర్తెమి దేవి గొప్పది!” అని బిగ్గరగా కేకలు వేశారు. ఆ నగర గుమస్తా ఆ ప్రజలను శాంతపరస్తూ వారితో ఇలా అన్నాడు: “తోటి ఎఫెసీయులారా, అర్తెమి దేవి గుడికి, ఆకాశం నుండి పడిన ఆమె ప్రతిమకు ఎఫెసు పట్టణం సంరక్షణ అని లోకమంతటికి తెలియదా? ఈ సంగతులు త్రోసిపుచ్చలేని నిజాలు కాబట్టి, మీరు శాంతించాలి, తొందరపడి ఏమి చేయకూడదు. అయితే మీరు తీసుకుని వచ్చిన వీరు మన గుడిని దోచుకోలేదు, మన దేవతను దూషించలేదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేమేత్రికి అతని తోటి పనివారికి ఎవరి మీద ఆరోపణలు ఉన్నా, వారి కోసం న్యాయస్థానాలు తెరిచి ఉన్నాయి, అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి వారు అక్కడికి వెళ్లి వీరి మీద ఫిర్యాదు చేసుకోవాలి. మీకు ఏ విషయమైనా తెలియచేయాలని అనుకుంటే వాటిని క్రమపద్ధతిలో న్యాయసభలో సరిచేసుకోవాలి. అయితే ఈ రోజు జరిగిన అల్లరి గురించి అధికారులు మనపై విచారణ చేసే ప్రమాదం ఉంది. ఏ కారణం లేకుండా కలిగిన ఈ అల్లరికి మనం ఏ కారణం ఇవ్వగలమని” వారితో అన్నాడు. అతడు ఈ మాటలను చెప్పి ప్రజలను పంపేశాడు.
అపొస్తలుల కార్యములు 19:21-41 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పౌలు ఎఫెసులో పరిచర్య ముగించిన తరువాత మాసిదోనియ, అకయ దేశాల మార్గంలో యెరూషలేము వెళ్ళాలని ఆత్మలో ఉద్దేశించి ‘నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమ్ నగరాన్ని కూడా చూడాలి’ అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు తన పరిచారకుల్లో తిమోతి, ఎరస్తు అనే ఇద్దరిని మాసిదోనియ పంపించి తాను మాత్రం ఆసియలో కొంతకాలం నిలిచిపోయాడు. ఆ రోజుల్లో క్రీస్తు మార్గం గురించి అక్కడ చాలా అల్లరి చెలరేగింది. ఎలాగంటే, దేమేత్రి అనే ఒక కంసాలి డయానా దేవతకు వెండి విగ్రహాలను చేయిస్తూ అక్కడి పనివారికి మంచి ఆదాయం కల్పించేవాడు. అతడు వారిని, ఆ వృత్తిలో ఉన్న ఇతరులను పోగుచేసి వారితో, “ఈ పని ద్వారా మనకి మంచి ఆదాయం వస్తూ మన జీవనోపాధి బాగా జరుగుతూ ఉందని మీకు తెలుసు. అయితే ఈ పౌలు, చేతులతో చేసిన విగ్రహాలు నిజమైన దేవుళ్ళు కారని బోధించి, ఎఫెసులో మాత్రమే కాక మొత్తం ఆసియా అంతట చాలామంది ప్రజలను పెడదారి పట్టించాడని మీరు విన్నారు, చూశారు కూడా. పైగా మన వృత్తి మీద శ్రద్ధ తగ్గిపోవడమే కాక, డయానా దేవస్థానం కూడ నిర్లక్షానికి గురై, ఆసియా అంతటా, ఇంకా భూలోకమంతటా పూజలందుకుంటున్న ఈమె ప్రభావం తగ్గిపోతుందేమో అని నాకు భయం వేస్తున్నది” అని వారితో చెప్పాడు. వారు అది విని ఉగ్రులైపోయి, “ఎఫెసీయుల డయానా మహాదేవి” అని కేకలు వేశారు. దానితో పట్టణం బహు గందరగోళంగా తయారైంది. వెంటనే వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియాకు చెందిన గాయి, అరిస్తార్కులను పట్టుకుని దొమ్మీగా అక్కడి నాటక ప్రదర్శనశాలలోకి ఈడ్చుకు పోయారు. పౌలు ఆ జనసమూహం పోగైన సభ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు గాని, శిష్యులు అతనిని వెళ్ళనియ్యలేదు. అంతేగాక ఆసియా దేశాధికారుల్లో అతని స్నేహితులు కొందరు అతనికి కబురు పంపి, “నీవు నాటక ప్రదర్శనశాలలోకి వెళ్ళవద్దు” అని నచ్చజెప్పారు. ఆ సభ గందరగోళంగా ఉంది. కొందరు ఒక రకంగా, మరికొందరు మరో రకంగా కేకలు వేస్తున్నారు. అసలు తామెందుకు అక్కడ గుమిగూడామో చాలా మందికి తెలియనే లేదు. అప్పుడు యూదులు అలెగ్జాండరును ముందుకు తోసి అతనిని జనం ఎదుటికి తెచ్చారు. అలెగ్జాండర్ చేతితో సైగ చేసి ఆ ప్రజలకు వివరణ ఇవ్వాలని చూశాడు. అయితే అతడు యూదుడని వారికి తెలిసి అందరూ మూకుమ్మడిగా రెండు గంటల సేపు ‘ఎఫెసీయుల డయానా మహాదేవి’ అని నినాదాలు చేశారు. అప్పుడు ఊరి కరణం సమూహాన్ని సముదాయించి, “ఎఫెసు వాసులారా, ఎఫెసు పట్టణం డయానా మహాదేవికీ ఆకాశం నుండి పడిన పవిత్ర శిలకూ ధర్మకర్త అని తెలియని వారెవరు? ఈ సంగతులు తిరుగులేనివి కాబట్టి మీరు శాంతం వహించి ఏ విషయంలోనూ తొందరపడకపోతే మంచిది. మీరు ఈ వ్యక్తులను తీసికొచ్చారు గదా, వీరు గుడిని దోచుకున్న వారా? మన దేవతను దూషించారా? దేమేత్రికీ అతనితో ఉన్న కంసాలులకూ వీరి మీద ఆరోపణలు ఏవైనా ఉంటే న్యాయసభలు జరుగుతున్నాయి, అధికారులు ఉన్నారు కాబట్టి వారు ఒకరిపై ఒకరు వ్యాజ్యం వేయవచ్చు. అయితే మీరు ఇతర సంగతులను గురించి విచారణ చేయాలనుకుంటే అవి క్రమమైన సభలోనే పరిష్కారమవుతాయి. మనం ఈ గందరగోళం గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేదు గనక, ఈ రోజు జరిగిన అల్లరిని గురించి అధికారులు మనపై విచారణ జరుపుతారేమో అని భయంగా ఉంది. ఈ విధంగా గుంపు కూడడానికి తగిన కారణం ఏం చెబుతాం?” అని వారితో అన్నాడు. అతడలా చెప్పి సభను ముగించేశాడు.
అపొస్తలుల కార్యములు 19:21-41 పవిత్ర బైబిల్ (TERV)
ఆ సంఘటనలు జరిగాక పౌలు మాసిదోనియ, అకయ ప్రాంతాల ద్వారా యెరూషలేము వెళ్ళాలని పరిశుద్ధాత్మ సహాయంతో నిశ్చయించుకున్నాడు. అక్కడికి వెళ్ళాక రోమా నగరాన్ని తప్పక దర్శించాలనుకున్నాడు. తనకు సహాయం చేసేవాళ్ళలో యిద్దర్ని మాసిదోనియకు పంపాడు. వాళ్ళ పేర్లు తిమోతి, ఎరస్తు. అతడు ఆసియ ప్రాంతంలో మరి కొంత కాలం గడిపాడు. ఆ రోజుల్లోనే ప్రభువు చూపిన మార్గాన్ని గురించి పెద్ద గొడవ జరిగింది. “దేమేత్రి” అనే ఒక కంసాలి ఉండేవాడు. ఇతడు అర్తెమి దేవత ఉండే మందిరం యొక్క ప్రతిరూపాలను వెండితో తయారు చేసి అమ్మేవాడు. తద్వారా తన క్రింద పని చేసేవాళ్ళకు చాలినంత డబ్బు సంపాదించేవాడు. తన పనివాళ్ళను, తనలాంటి వృత్తి చేసేవాళ్ళను సమావేశ పరిచి ఈ విధంగా అన్నాడు: “అయ్యలారా! మనమీ వ్యాపారంలో చాలా ధనం గడిస్తున్న విషయం మీకందరికీ తెలుసు. ఈ పౌలు అనేవాడు ఏం చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. ఇతడిక్కడ ఎఫెసులో, సుమారు ఆసియ ప్రాంతాలన్నిటిలో మానవుడు సృష్టించిన విగ్రహాలు దేవుళ్ళు కాదంటూ చాలా మంది ప్రజల్ని నమ్మించి తప్పుదారి పట్టిస్తున్నాడన్న విషయం మీరు విన్నారు. ఈ కారణంగా మన వ్యాపారానికున్న మంచి పేరు పోయే ప్రమాదం ఉంది. పైగా అర్తెమి మహాదేవి మందిరానికున్న విలువ పోతుంది. ఆసియ ప్రాంతాల్లోనే కాక ప్రపంచమంతా పూజింపబడుతున్న ఆ దేవత యొక్క గొప్పతనము కూడా నశించి పోతుంది.” ఈ మాటలు విన్న వాళ్ళకు చాలా ఉద్రేకం కలిగింది. వాళ్ళు బిగ్గరగా, “ఎఫెసు ప్రజల అర్తెమి దేవత గొప్పది!” అని నినాదం చెయ్యటం మొదలు పెట్టారు. ఈ అలజడి ఆ పట్టణమంతా వ్యాపించి పోయింది. మాసిదోనియకు చెందిన “గాయి, అరిస్తర్కు” అనే యిద్దరు వ్యక్తులు పౌలు వెంట ఉన్నారు. ప్రజలు వీళ్ళను బంధించి త్రోసుకొంటూ ఒక్క గుంపుగా పెద్ద నాటక శాలలోకి ప్రవేశించారు. పౌలు ప్రజల ముందుకు రావాలనుకొన్నాడు. కాని అనుచరులతన్ని వెళ్ళనివ్వలేదు. పౌలు స్నేహితులు కొందరు ఆ ప్రాంతాలకు పాలకులుగా ఉండేవాళ్ళు. నాటక శాలలోకి వెళ్ళవద్దని వేడుకుంటూ వీళ్ళు పౌలుకు ఒక ఉత్తరం పంపారు. ఆ సభ అంతా గందరగోళంగా ఉంది. కొందరు యిదని, కొందరు అదని బిగ్గరగా కేకలు వేసారు. కొందరికి తప్ప మిగతా వాళ్ళకెవ్వరికి తామక్కడికి ఎందుకు వచ్చింది తెలియదు. యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోసారు. కొందరు కేకలు వేస్తూ అతనికి ఏదో సలహా యిచ్చారు. అతడందర్నీ శాంతంగా ఉండమని సంజ్ఞ చేసి సమాధానంగా ఏదో చెప్పబోయాడు. అతడు కూడా ఒక యూదుడని తెలుసుకొన్నాక వాళ్ళంతా రెండు గంటల సేపు ఒకే గొంతుతో, “ఎఫెసు ప్రజల అర్తెమి దేవత చాలా గొప్పది” అని నినాదం చేసారు. ఆ గ్రామాధికారి ప్రజల్ని శాంతపరుస్తూ యిలా అన్నాడు: “ఎఫెసు ప్రజలారా! మహా దేవత అర్తెమి యొక్క మందిరాన్ని, స్వర్గంనుండి పడిన శిలా విగ్రహాన్ని చూసుకొనే బాధ్యత ఎఫెసు పట్టణంపై ఉంది. ఇది ప్రపంచానికంతా తెలుసు. దీన్ని ఎవరూ కాదనలేరు. కనుక మీరు ఆలోచించకుండా తొందర పడి ఏదీ చెయ్యకండి. శాంతంగా ఉండండి! “వీళ్ళు మన మందిరాన్ని దోచుకోలేదు. మన దేవతను దూషించ లేదు. అయినా మీరు వీళ్ళనిక్కడికి పట్టుకొని వచ్చారు. దేమేత్రికి లేక అతనితో కలిసి పని చేసేవాళ్ళకు వాళ్ళపై నేరం మోపాలని ఉంటే న్యాయస్థానాలు తెరిచి ఉన్నాయి. వాళ్ళ వాద వివాదాలు వినటానికి న్యాయాధిపతులున్నారు. “మీరింకేదైనా చెప్పుకోవాలనుకొంటే చట్ట ప్రకారం జరిగే ప్రజా సమావేశాల్లో చెప్పుకోండి. ఈనాడు జరిగిన సంఘటనవల్ల మనం తిరుగుబాటు చేసామని అధికారులు మనపై నేరం మోపే ప్రమాదం వుంది. అది జరిగితే ఈ అలజడికి ఏ కారణం లేదు కనుక మనం ఏ సమాధానమూ చెప్పలేము.” ఇలా చెప్పి అందర్నీ అక్కడినుండి వెళ్ళమన్నాడు.
అపొస్తలుల కార్యములు 19:21-41 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమునవచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మనస్సులో ఉద్దేశించి–నేనక్కడికి వెళ్లిన తరువాత రోమా కూడ చూడవలెనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమునుగూర్చి చాల అల్లరి కలిగెను. ఏలాగనగా – దేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుటవలన ఆ పనివారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుకూర్చి–అయ్యలారా, యీ పనివలన మనకు జీవనము బహు బాగుగా జరుగు చున్నదని మీకు తెలియును. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు. మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయేగాక, మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియయందంతటను భూలోకమందును పూజింపబడుచున్న యీమెయొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచు చున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారై–ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి; పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసి దోనియవారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను, గాని శిష్యులు వెళ్లనియ్యలేదు. మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహి తులైయుండి అతనియొద్దకు వర్తమానము పంపి–నీవు నాటక శాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున, కొందరాలాగున కేకలువేసిరి; తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలమందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములోనుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను. అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటలసేపు–ఎఫెసీయుల అర్తెమి దేవి మహాదేవి అని కేకలువేసిరి. అంతట కరణము సమూహమును సముదాయించి–ఎఫెసీయులారా, ఎఫె సీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము. మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు. దేమేత్రికిని అతనితోకూడనున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒక రితో ఒకరు వ్యాజ్యె మాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులనుగూర్చి యేమైనను విచారణ చేయవలెనని యుంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలినిగూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడీలాగు చెప్పి సభను ముగించెను.