అపొస్తలుల కార్యములు 16:6-15
అపొస్తలుల కార్యములు 16:6-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పౌలు అతనితో ఉన్నవారు ఫ్రుగియ, గలతీయ ప్రాంతాల గుండా ప్రయాణం చేసి ఆసియా ప్రాంతంలో వాక్యం బోధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ వారిని బోధించనియ్యలేదు. ఆ తర్వాత వారు ముసియ ప్రాంత సరిహద్దు దగ్గరకు వచ్చి, బితూనియ ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు కానీ యేసు ఆత్మ వారిని వెళ్లనివ్వలేదు. కాబట్టి వారు ముసియ ప్రాంతాన్ని దాటి త్రోయ పట్టణానికి వెళ్లారు. రాత్రివేళలో కలిగిన దర్శనంలో మాసిదోనియకు చెందిన ఒక వ్యక్తి నిలబడి, “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయండి” అని తనను బ్రతిమాలుతున్నట్లు పౌలు చూశాడు. పౌలు ఆ దర్శనాని చూసిన తర్వాత, వారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని నిర్ణయించుకొని, వెంటనే మాసిదోనియ ప్రాంతానికి వెళ్లడానికి మేము సిద్ధపడ్డాము. మేము త్రోయ ప్రాంతాన్ని వదిలి ఓడ ఎక్కి నేరుగా సమొత్రాకే ద్వీపానికి వచ్చి, మరుసటిరోజు నెయపొలి ప్రాంతానికి వెళ్లాము. అక్కడినుండి మేము ప్రయాణం చేసి, రోమీయులున్న మాసిదోనియ ప్రాంతంలోని ముఖ్య పట్టణమైన ఫిలిప్పీకు వెళ్లాము. మేము అక్కడ చాలా రోజులు ఉన్నాము. ఒక సబ్బాతు దినాన ప్రార్థన స్థలమేదైనా ఉంటుందేమో చూద్దామని, పట్టణ ద్వారాన్ని దాటి నదీ తీరానికి వెళ్లాము, మేము ఒక చోటున కూర్చుని అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడడం ప్రారంభించాము. అక్కడ వింటున్న వారిలో తుయతైర పట్టణానికి చెందిన, ఊదా రంగు బట్టలను అమ్మే లూదియ అనే స్త్రీ ఉంది. ఆమె దేవుని ఆరాధించేది. పౌలు చెప్పిన మాటలకు స్పందించేలా ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచారు. కాబట్టి ఆమె ఇంటివారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆమె మాతో, “నేను ప్రభువు విశ్వాసినని మీరు భావిస్తే, నా ఇంటికి వచ్చి ఉండవలసిందే” అని తన ఇంటికి రమ్మని బ్రతిమాలి మమ్మల్ని ఆహ్వానించింది.
అపొస్తలుల కార్యములు 16:6-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆసియా ప్రాంతంలో వాక్కు చెప్పవద్దని పరిశుద్ధాత్మ వారిని వారించాడు, అప్పుడు వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరికి వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గానీ యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు. అప్పుడు మాసిదోనియ వాసి ఒకడు కనిపించి, ‘నీవు మాసిదోనియ వచ్చి మాకు సహాయం చెయ్యి’ అని అతనిని పిలుస్తున్నట్టు రాత్రి సమయంలో పౌలుకు దర్శనం వచ్చింది. అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము. మేము త్రోయ నుండి ఓడలో నేరుగా సమొత్రాకెకు, మరుసటి రోజు నెయపొలి, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చాము. మాసిదోనియ దేశంలో ఆ ప్రాంతానికి అది ముఖ్య పట్టణం, రోమీయుల వలస ప్రదేశం. మేము కొన్ని రోజులు ఆ పట్టణంలో ఉన్నాం. విశ్రాంతి దినాన ఊరి బయటి ద్వారం దాటి నదీ తీరాన ప్రార్థనాస్థలం ఉంటుందని అనుకున్నాము. మేము అక్కడ కూర్చుని, అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడాం. లూదియ అనే దేవుని ఆరాధకురాలు ఒకామె మా మాటలు విన్నది. ఆమె ఊదారంగు బట్టలు అమ్మేది. ఆమెది తుయతైర పట్టణం. పౌలు చెప్పే మాటలను శ్రద్ధగా వినేలా ప్రభువు ఆమె హృదయం తెరచాడు. ఆమె, ఆమె ఇంటివారూ బాప్తిసం పొందారు. “నేను ప్రభువులో విశ్వాసం గలదాన్ని అని మీరు భావిస్తే, నా ఇంటికి వచ్చి ఉండాలి,” అని ఆమె మమ్మల్ని బలవంతం చేసింది.
అపొస్తలుల కార్యములు 16:6-15 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళు ఆసియ ప్రాంతాలకు వెళ్ళి ఈ సందేశాన్ని బోధించాలనుకొన్నారు. కాని పరిశుద్ధాత్మ వాళ్ళను ఆపాడు. కనుక, వాళ్ళు ఫ్రుగియ, గలతీయలోని ప్రతి గ్రామానికి వెళ్ళారు. ముసియ పొలిమేరలకు వచ్చాక బితూనియకు వెళ్ళటానికి ప్రయత్నించారు. కాని యేసు ఆత్మ అందుకు అంగీకరించలేదు. ఆ కారణంగా వాళ్ళు ముసియ దాటి త్రోయకు వెళ్ళారు. మాసిదోనియ ప్రాంతం వాడొకడు, “మాసిదోనియకు వచ్చి మమ్మల్ని రక్షించండి” అని వేడుకొన్నట్లు ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనం కలిగింది. పౌలుకు దర్శనం కలిగాక మాసిదోనియ నివాసులకు సువార్త ప్రకటించటానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకొన్నాడని గ్రహించి తక్షణమే మేము అక్కడికి వెళ్ళటానికి సిద్ధం అయ్యాము. “త్రోయ” నుండి సముద్ర ప్రయాణం చేసి నేరుగా సమొత్రాకేకు వెళ్ళి మరుసటి రోజు నెయపొలి చేరుకొన్నాము. అక్కడినుండి ప్రయాణమై రోమా సామ్రాజ్యంలోని ఫిలిప్పీకి వెళ్ళాం. ఫిలిప్పీ మాసిదోనియలోని ప్రాంతంలో చాలా ముఖ్యమైన పట్టణం. మేము ఆ పట్టణంలో చాలా రోజులు గడిపాము. ఒక విశ్రాంతి రోజున ప్రార్థనలు చేయటానికి స్థలం దొరుకుతుందని ఆశిస్తూ ఊరి బయట ఉన్న నది దగ్గరకు వెళ్ళాము. అక్కడికి వచ్చిన ఆడవాళ్ళతో కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాము. మా మాటలు వింటున్న ఒకామె పేరు “లూదియ.” ఈమె తుయతైర గ్రామానికి చెందింది. ఊదారంగు పొడిని వ్యాపారం చేసే ఈ లూదియ భక్తురాలు. దేవుడు ఆమె మనస్సును మార్చి పౌలు సందేశం వినేటట్లు చేసాడు. ఆమె, ఆమె యింట్లో ఉన్న వాళ్ళంతా బాప్తిస్మము పొందాక మమ్మల్ని యింటికి ఆహ్వానించింది. “నేను నిజంగా ప్రభువు భక్తురాలననే నమ్మకం మీలో ఉన్నట్లయితే వచ్చి మా యింట్లో ఉండండి” అని మమ్మల్ని వేడుకొని చాలా బలవంతం చేసింది.
అపొస్తలుల కార్యములు 16:6-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు. అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి–నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యపట్టణమును రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిదినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతిదినమున గవిని దాటి నదీతీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, కూడివచ్చిన స్త్రీలతో మాటలాడు చుంటిమి. అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగుపొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె–నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండు డని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.