అపొస్తలుల కార్యములు 15:36-41
అపొస్తలుల కార్యములు 15:36-41 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కొంత కాలం తర్వాత పౌలు, “మనం ప్రభువు వాక్యాన్ని ప్రకటించిన అన్ని పట్టణాలకు తిరిగి వెళ్లి, అక్కడి విశ్వాసులను కలుసుకొని వారి క్షేమ సమాచారాలను తెలుసుకొందాం” అని బర్నబాతో అన్నాడు. బర్నబా తమతో మార్కు అనబడే యోహానును తీసుకువెళ్లాలని భావించాడు. కాని పౌలు, పంఫులియాలో అతడు పరిచర్యకు రాకుండా తమను విడిచిపెట్టి వెళ్లిపోయాడు కనుక అతన్ని తీసుకొని వెళ్లడం మంచిది కాదని తలంచాడు. ఆ విషయాన్ని బట్టి వారిద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారిద్దరు వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్ర ద్వీపానికి వెళ్లాడు. విశ్వాసులు పౌలును ప్రభువు కృపకు అప్పగించినప్పుడు అతడు సీలను ఎంచుకొని అక్కడ నుండి బయలుదేరాడు. వారు సంఘాలను విశ్వాసంలో బలపరస్తు సిరియ కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశారు.
అపొస్తలుల కార్యములు 15:36-41 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొన్ని రోజులైన తరువాత పౌలు “ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్కు ప్రకటించామో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి, వారెలా ఉన్నారో చూద్దాం” అని బర్నబాతో అన్నాడు. అప్పుడు మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. అయితే పౌలు పంఫులియలో పరిచర్యకు తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వాణ్ణి వెంటబెట్టుకుని పోవడం భావ్యం కాదని తలంచాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. బర్నబా, మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి సైప్రస్ వెళ్ళాడు. పౌలు సీలను ఎంపిక చేసుకుని, సోదరులు తనను ప్రభువు కృపకు అప్పగించగా బయలుదేరి, సంఘాలను బలపరుస్తూ సిరియా కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశాడు.
అపొస్తలుల కార్యములు 15:36-41 పవిత్ర బైబిల్ (TERV)
కొంతకాలం తర్వాత పౌలు బర్నబాతో, “ప్రభువు సందేశాన్ని ఉపదేశించిన ప్రతి పట్టణానికి, మనం మళ్ళీ వెళ్దాం. అక్కడి సోదరుల్ని కలుసుకొని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో చూసి వద్దాం” అని అన్నాడు. బర్నబా, మార్కు అని పిలివబడే యోహానును కూడా తమ వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు. కాని తమతో పని చెయ్యకుండా తమను పంఫూలియలో వదిలి వేసాడు కాబట్టి పౌలు అతణ్ణి పిలుచుకు వెళ్ళటం మంచిది కాదనుకొన్నాడు. బర్నబా, పౌలు మధ్య తీవ్రమైన వివాదము కలగటం వల్ల వాళ్ళు విడిపోయారు. బర్నబా మార్కును తన వెంట పిలుచుకొని ఓడలో సైప్రసుకు వెళ్ళాడు. పౌలు, సీలను తన వెంట పిలుచుకొని వెళ్ళాడు. అక్కడున్న సోదరులు అతనికి ప్రభువు అనుగ్రహం కలగాలని దీవించి ప్రభువుకు అప్పగించారు. అతడు సిరియ, కిలికియ పట్టణాల ద్వారా ప్రయాణం చేసి అక్కడి సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరిచాడు.
అపొస్తలుల కార్యములు 15:36-41 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కొన్ని దినములైన తరువాత–ఏ యే పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులయొద్దకు తిరిగి వెళ్లి, వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను. అయితే పౌలు, పంఫూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందునవారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను; పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి, సంఘములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను.
అపొస్తలుల కార్యములు 15:36-41 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కొంతకాలం తర్వాత పౌలు, “మనం ప్రభువు వాక్యాన్ని ప్రకటించిన అన్ని పట్టణాలకు తిరిగివెళ్లి, అక్కడి విశ్వాసులను కలుసుకొని వారి క్షేమ సమాచారాలను తెలుసుకుందాం” అని బర్నబాతో అన్నాడు. బర్నబా తమతో మార్కు అనబడే యోహానును తీసుకెళ్లాలని భావించాడు. కాని పౌలు, పంఫులియాలో అతడు పరిచర్యకు రాకుండా తమను విడిచిపెట్టి వెళ్లిపోయాడు కాబట్టి అతన్ని తీసుకుని వెళ్లడం మంచిది కాదని తలంచాడు. ఆ విషయాన్ని బట్టి వారిద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారిద్దరు వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్ర ద్వీపానికి వెళ్లాడు. విశ్వాసులు పౌలును ప్రభువు కృపకు అప్పగించినప్పుడు అతడు సీలను ఎంచుకుని అక్కడినుండి బయలుదేరాడు. వారు సంఘాలను విశ్వాసంలో బలపరస్తు సిరియా కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశారు.