2 తిమోతికి 3:1-17
2 తిమోతికి 3:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అంత్యదినాలలో భయంకరమైన కాలాలు వస్తాయని నీవు తెలుసుకో. ఎందుకంటే, ప్రజలు స్వార్థపరులుగా, ధనాన్ని ప్రేమించేవారిగా, గొప్పలు చెప్పుకునేవారిగా, అహంకారులుగా, దూషించేవారిగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, కృతజ్ఞతలేనివారిగా, అపవిత్రులుగా, ప్రేమలేనివారిగా, క్షమించలేనివారిగా, అపనిందలు వేసేవారిగా, స్వీయ నియంత్రణ లేనివారిగా, క్రూరులుగా, మంచితనాన్ని ప్రేమించలేనివారిగా, ద్రోహులుగా, మొండివారిగా, అహంకారులుగా, దేవునికి బదులు సుఖానుభవాన్ని ప్రేమించేవారిగా, దైవభక్తి కలిగి ఉన్నా దాని శక్తిని నమ్మనివారిగా ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండు. అలాంటివారు, పాపంతో నిండిన అన్ని రకాల దురాశలకు బానిసలైన మోసపూరిత స్త్రీల ఇళ్ళలో చొరబడి వారిని లోబరుచుకుంటారు. ఈ స్త్రీలు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు కాని సత్యాన్ని ఎన్నడు గ్రహించలేరు. యన్నే, యంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్లే ఈ బోధకులు కూడా సత్యాన్ని ఎదిరిస్తున్నారు. వారికున్న దుష్టహృదయాన్ని బట్టి విశ్వాస విషయంలో తృణీకరించబడ్డారు. అయినా వారు ముందుకు సాగలేరు ఎందుకంటే, ఆ ఇద్దరికి జరిగినట్లే, వీరి మూర్ఖత్వం అందరికి స్పష్టమవుతుంది. అయితే, నా బోధల గురించి, నా జీవిత విధానం, నా ఉద్దేశాలు, విశ్వాసం, ఓర్పు, ప్రేమ, దీర్ఘశాంతం, హింసలు, శ్రమలు అంటే, అంతియొకయలో, ఈకొనియలో, లుస్త్ర ప్రాంతాల్లో నాకు కలిగిన హింసను నేను ఎలా సహించానో అన్ని నీకు తెలుసు. అయితే ప్రభువు వాటన్నిటి నుండి నన్ను తప్పించారు. నిజానికి, క్రీస్తు యేసులో భక్తిగల జీవితాన్ని జీవించాలనుకొనే వారందరు హింసకు గురి అవుతారు. అయితే దుష్టులు, వంచకులు ఇతరులను మోసం చేస్తూ తామే మోసపోతూ మరింతగా చెడిపోతారు. కాని నీవైతే, నీవు నేర్చుకున్న వాటిని, నీవు నమ్మి విశ్వసించిన వాటిలో స్థిరంగా కొనసాగు ఎందుకంటే, నీవు ఎవరినుండి వాటిని నేర్చుకున్నావో నీకు తెలుసు. క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా కలుగు రక్షణ గురించిన జ్ఞానాన్ని నీకు కలుగజేయడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండే నీకు తెలుసు. ప్రతి లేఖనం దేవుని ప్రేరణ చేతనే కలిగింది, అది బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, నీతిలో నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఈ లేఖనాలను బట్టి, దేవుని సేవకుడు ప్రతి సత్కార్యం చేయడానికి పూర్తిగా సిద్ధపడి ఉండాలి.
2 తిమోతికి 3:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చివరి దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయని నీవు గ్రహించాలి. మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు, బొత్తిగా సహజ ప్రేమ లేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనివారు, దుర్భాషలాడేవారు, నిగ్రహం లేనివారు, క్రూరులు, మంచిని ద్వేషించేవారు. వారు ద్రోహులు, తలబిరుసు మనుషులు, గర్వాంధులు, దేవునికంటే శరీర సౌఖ్యాన్నే ఎక్కువగా ప్రేమించేవారు. వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గానీ దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు. ఇలాంటి వారు బలహీన మనస్తత్వం గల స్త్రీల ఇళ్ళలోకి చొరబడి వారిని వశం చేసుకుంటారు. ఈ స్త్రీలు అపరాధ భావనలతో కుంగిపోయి రకరకాల వాంఛలతో కొట్టుకు పోయేవారుగా ఉంటారు. వాక్యాన్ని అస్తమానం నేర్చుకుంటూనే ఉన్నా వీరు సత్యం విషయమైన జ్ఞానాన్ని పొందలేరు. యన్నే, యంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు వీరు కూడా చెడిపోయిన మనసు కలిగి విశ్వాసం విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరిస్తారు. అయితే వారిద్దరి అవివేకం ఏ విధంగా బయటపడిందో ఆలాగే వీరిది కూడా అందరికీ వెల్లడి అవుతుంది కాబట్టి వీరు ఇంకా ముందుకి సాగలేరు. నీవు మాత్రం నా బోధనూ, ప్రవర్తననూ, ఉద్దేశాన్నీ, విశ్వాసాన్నీ, సహనాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ అనుకరించావు. అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అనే పట్టణాల్లో నేను అనుభవించిన హింసలనూ ప్రమాదాలనూ ఎరిగే నన్ను వెంబడించావు. అలాంటి హింసలు నేను సహించాను గాని, వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు. క్రీస్తు యేసులో సద్భక్తితో జీవించాలని కోరేవారంతా హింస పొందుతారు. అయితే చెడ్డ వారూ, వంచకులూ ఇతరులను మోసపరుస్తూ తాము కూడా మోసపోతూ అంతకంతకూ చెడిపోతారు. కానీ నీవు మాత్రం కచ్చితంగా తెలుసుకున్న వాటిని ఎవరి ద్వారా నేర్చుకున్నావో గ్రహించి వాటిలో నిలకడగా సాగిపో. ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు. దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.
2 తిమోతికి 3:1-17 పవిత్ర బైబిల్ (TERV)
ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. చివరి రోజులు ఘోరంగా ఉంటాయి. మనుష్యుల్లో స్వార్థం, ధనంపై ఆశ, గొప్పలు చెప్పుకోవటం, గర్వం, దూషణ, తల్లితండ్రుల పట్ల అవిధేయత, కృతఘ్నత, అపవిత్రత, ప్రేమలేని తనం, క్షమించలేని గుణం, దూషించే గుణం, మనోనిగ్రహం లేకుండుట, మంచిని ప్రేమించకుండటం, ద్రోహబుద్ధి, దురుసుతనం, అహంభావం, దేవునికంటె సుఖాన్ని ప్రేమించటం. పైకి భక్తిపరుల్లా ఉండి దాని శక్తిని అంగీకరించకుండటం ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండు. వాళ్ళు ఇళ్ళల్లోకి చొరబడి, దురాశల్లో చిక్కుకు పోయి, పాపాలతో జీవిస్తున్న బలహీనమైన మనస్సుగల స్త్రీలను లోబరచుకొంటారు. ఈ స్త్రీలు ఎప్పుడూ నేర్చుకొంటారు. కాని, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. యన్నే మరియు యంబ్రే అనువారు మోషేను ఎదిరించిన విధంగా వీళ్ళ బుద్ధులు పాడై సత్యాన్ని ఎదిరిస్తున్నారు. మనం నమ్ముతున్న సత్యాన్ని వీళ్ళు నమ్మలేకపోతున్నారు. వీళ్ళు ముందుకు పోలేరు. మోషేను ఎదిరించినవాళ్ళలాగే వీళ్ళ అవివేకం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాని, నీకు నా ఉపదేశాలు, నా జీవితం, నా ఉద్దేశ్యం, నా విశ్వాసం, నా శాంతం, నా ప్రేమ, నా సహనం, అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర పట్టణాల్లో నేను అనుభవించిన హింసలు, నా బాధలు, ఇవన్ని పూర్తిగా తెలుసు. ఇన్ని జరిగినా దేవుడు నన్ను వీటినుండి రక్షించాడు. యేసు క్రీస్తులో ఆధ్యాత్మికంగా జీవించాలనుకొన్న ప్రతీ ఒక్కడూ హింసింపబడతాడు. దుష్టులు, వేషధారులు, మోసంచేస్తూ, మోసపోతూ ఉంటారు. ఇది రోజు రోజుకూ అధికమవుతుంది. కాని, నీవు ఎవరినుండి నేర్చుకొన్నావో తెలుసు. కనుక, నీవు నేర్చుకొన్నవాటిని, విశ్వసించినవాటిని పాటిస్తూ ఉండు. అంతే కాక, నీవు నీ చిన్ననాటినుండి పవిత్ర గ్రంథాలు తెలిసినవాడవు. అవి నీలో జ్ఞానం కలిగించి యేసు క్రీస్తు పట్ల నీకున్న విశ్వాసం మూలంగా రక్షణను ప్రసాదించాయి. లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపింపబడినవి. నీతిని బోధించటానికి, గద్దించటానికి, సరిదిద్దటానికి, నీతి విషయం తర్బీదు చేయటానికి ఉపయోగపడతాయి. వీటి ద్వారా దైవజనుడు ప్రతి మంచి కార్యాన్ని చేయటానికి సంపూర్ణంగా తయారుకాగలడు.
2 తిమోతికి 3:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహం కారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము. పాపభరితులై నానావిధములైన దురాశలవలన నడిపింప బడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలయొక్క యిండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసవిషయములో భ్రష్టులై సత్యమును ఎది రింతురు. అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో ఆలాగే వీరిది కూడ అందరికి తేటపడును గనుక వీరు ఇకముందుకు సాగరు. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును, అంతి యొకయ ఈకొనియ లుస్త అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడైవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు. అయితే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంత కంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసి కొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.