2 సమూయేలు 7:18-22
2 సమూయేలు 7:18-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్ళి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు. “నా ప్రభూ యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేనెంతటివాణ్ణి? నా వంశం ఏపాటిది? నన్ను ఇంతగా హెచ్చించి నాకు చేసినదంతా నీకు స్వల్పమైన విషయం. నీ దాసుడనైన నా వంశానికి భవిషత్తులో కలగబోయే ఉన్నతిని గూర్చి నాకు వెల్లడించావు. యెహోవా, నా ప్రభూ, దావీదు అనే నేను ఇక నీతో ఏమి చెప్పుకొంటాను? యెహోవా నా ప్రభూ, నీ దాసుడనైన నా గురించి నీకు తెలుసు. నీ మాటను బట్టి నీ చిత్తం చొప్పున ఈ గొప్ప కార్యాలు జరిగించి అవి నీ దాసుడనైన నాకు తెలియజేశావు. దేవా, యెహోవా, నువ్వు అనంతమైన ప్రభావం గలవాడివి. మేము విన్నదాన్ని బట్టి చూసినప్పుడు నీవు తప్ప దేవుడెవరూ లేడు.
2 సమూయేలు 7:18-22 పవిత్ర బైబిల్ (TERV)
పిమ్మట దావీదు రాజు లోనికి వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు ప్రార్థనా పూర్వకంగా యెహోవాతో ఇలా విన్నవించుకున్నాడు, “యెహోవా, నా దేవా, నీకు నేనెందుకంత ముఖ్యుడనయ్యాను? నా కుటుంబం ఎందుకంత ప్రాముఖ్యం గలదయ్యింది? నన్నెందుకు అంత ముఖ్యమైన వాణ్ణిచేశావు? నేనొక సేవకుణ్ణి తప్ప మరేమీ కాను. కాని నీవు నా పట్ల చాలా కరుణతో వున్నావు. భవిష్యత్తులో నా కుటుంబానికి జరిగే కొన్ని మంచి విషయాలు కూడ చెప్పావు. యెహోవా, నా దేవా, నీవిలా ప్రజలతో ఎప్పుడూ మాట్లాడవు. మాట్లాడతావా? నేను నీతో ఎలా ఎల్లప్పుడూ మాట్లాడగలను? యెహోవా, నా దేవా, నేను కేవలం ఒక సేవకుడినని నీకు తెలుసు; ఈ అద్భుత కార్యాలన్నీ నీవు చేస్తానని అన్నావు గనుక జరిపి నిరూపించావు. పైగా నీవు చేయాలనుకున్న దానిలో ఇదొక పని! ఈ గొప్ప విషయాలన్నీ నాకు తెలపాలని నీవు నిశ్చయించావు. ఈ కారణంవలన నీవు గొప్పవాడవు, ఓ నా ప్రభువైన దేవా! యెహోవా నీకు నీవే సాటి. నీవంటి దేవుడు వేరొకరు లేరు. మాకై మేము ఇదంతా విన్నాము.
2 సమూయేలు 7:18-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను–నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నే నెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతినిబట్టి, బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవుదానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగియున్నావు. నీ వాక్కునుబట్టి నీ యిష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు.
2 సమూయేలు 7:18-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్లి, యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు: “ప్రభువైన యెహోవా! మీరు నన్ను ఈ స్థితిలోనికి తీసుకురావడానికి నేనెంతటివాన్ని? నా కుటుంబం ఏపాటిది? ప్రభువైన యెహోవా! మీ దృష్టిలో ఇది చాలదన్నట్టు మీ సేవకుని కుటుంబ భవిష్యత్తు గురించి కూడా తెలియజేశారు. ప్రభువైన యెహోవా! మామూలు మనుష్యుల పట్ల మీరు ఇంత కార్యం చేస్తారా? “దావీదు మీతో ఇంతకన్నా ఎక్కువ ఏమి చెప్పగలడు? ప్రభువైన యెహోవా! మీ సేవకుని గురించి మీకు తెలుసు. మీ మాట కోసం మీ చిత్తప్రకారం మీరు ఈ గొప్ప కార్యాన్ని చేసి మీ సేవకునికి తెలియజేశారు. “ప్రభువైన యెహోవా! మీరు ఎంత గొప్పవారు! మా చెవులతో మేము విన్నట్లుగా మీలాంటి వారు లేరు, మీరు తప్ప వేరే దేవుడు లేడు.